అంతా మా ఇష్టం అన్నట్లుగా బొత్స వ్యాఖ్యలు!
posted on Jul 31, 2023 7:31AM
రాజ్యాంగం అనేది ఒకటి ఉంటుంది.. మన దేశంలో అదే సుప్రీమ్. దాని ప్రకారమే కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు నడుచుకోవాలి. దేశంలో అన్ని వ్యవస్థలు ఎలా ఉండాలో రాజ్యాంగంలో పెద్దలు పొందుపరిచారు. ఒ రాజ్యాంగ అమలులో ఎలాంటి లోపాలు ఉన్నా న్యాయస్థానాలు కల్పించుకొని సరిదిద్దుతాయి. ముందుగా హెచ్చరించి అప్పటికీ వినకపోతే మొట్టికాయలు వేసి మరీ అమలు చేయాలని ఆదేశిస్తాయి. అయితే, అంతిమంగా ఆదేశాలు అమలు చేయాల్సింది మళ్ళీ ప్రభుత్వాలే. సరిగ్గా ఇక్కడే వైసీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఎన్నోసార్లు న్యాయస్థానాలలో మొట్టికాయలు తిన్నావైసీపీ నేతల తీరు మారడం లేదు. ఉన్నతాధికారులను సైతం బోనులలో నిలబెట్టి మొట్టికాయలు వేసి పంపింది. కానీ, తీరు మారనే లేదు.
తాజాగా హైకోర్టు మరోసారి ఏపీ ప్రభుత్వంలోని ఇద్దరు కీలక అధికారులకు కోర్టు ధిక్కార నోటీసులు పంపింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో సదరు అధికారులు హైకోర్టు మెట్లు ఎక్కాల్సి ఉంది. అయినా, ఇప్పటికీ ప్రభుత్వ పెద్దలు ఈ వ్యవహారంలో తామే కరెక్ట్ అని.. కోర్టులే తప్పని దబాయించడానికి ఇసుమంతైనా వెనుకాడటం లేదు. జగన్ సర్కార్ స్కూల్ విద్యార్థులకు ఏటా రూ.15 వేల రూపాయలు ఇస్తున్న సంగతి తెలిసిందే. పిల్లల తల్లుల ఖాతాలో ఈ డబ్బు జమ చేస్తూ వస్తున్నది. కాగా, ఈ ఏడాదికి సంబంధించిన నిధుల విడుదల కార్యక్రమం తాజాగా విజయనగరం జిల్లా కురుపాంలో జరిగింది. సీఎం వైఎస్ జగన్ పాల్గొన్న ఈ సభకు భారీ ఎత్తున స్కూలు విద్యార్దుల్ని, వారి తల్లితండ్రుల్ని తరలించారు. పెద్ద సంఖ్యలో పిల్లలు హాజరైన ఈ సభలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు.
ఒక రాజకీయ సభకు విద్యార్థులను తరలించడం రాజ్యాంగానికి విరుద్ధం. పైగా చిన్నారులు ఉన్న ఒక సభలో పెళ్లిళ్లు, కాపురాలు అంటూ చేసిన వ్యాఖ్యలు మరింత దారుణం. దీంతో ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజకీయ సభలకు విద్యార్ధుల్ని తరలించవద్దంటూ గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేయగా.. వీటిని ప్రభుత్వం ఉల్లంఘించిందని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. స్ధానిక విద్యాశాఖాధికారి సమాచార హక్కు చట్టం ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా దాఖలైన ఈ పిటిషన్ పై శుక్రవారం( జూలై 28) హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం విద్యార్థులను రాజకీయ సభలకు తరలించడం చట్టవిరుద్ధమని వ్యాఖ్యానించింది. ఏపీ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్, హోంశాఖ కార్యదర్శి దీనిపై వివరణ ఇవ్వాలని కూడా ఆదేశించింది.
దీనిపై స్పందించిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. అమ్మ ఒడి సభకు విద్యార్థులు, తల్లిదండ్రులు రావడం తప్పు కాదని.. ఇంకా చెప్పాలంటే అసలు ఇలాంటి సభలకు పిల్లలు కాకుంటే సినీ నటులు వస్తారా? అని వెటకారంగా మాట్లాడారు. దీంతో మరోసారి బొత్స వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.
అభం శుభం ఎరుగని అమాయక చిన్నారుల ముందు ఈ సిగ్గులేని రాజకీయాలు మాట్లాడకూడదని, ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థుల మెదళ్లలో ఈ కుళ్ళు రాజకీయాల బీజం పడకూడదనే.. రాజకీయ సభలకు విద్యార్థులను తరలించకూడదని కోర్టు చెప్పింది. కానీ, మన మంత్రి గారేమో చిన్నారులు కాకుండా సినీ స్టార్లు వస్తారా అని వెటకారంగా మాట్లాడడం చూస్తే వీళ్ళు మన రాజ్యాంగానికి ఏపాటి విలువ ఇస్తున్నారన్నది అవగతమౌతుంది. ఒకపక్క కోర్టులు ఇంతగా మొత్తుకుంటున్నా.. బోనులోకి పిలిచి వాయిస్తున్నా మాకు మేమే సుప్రీం, మేము రాసుకున్నదే రాజ్యాంగం అనేలా వైసీపీ నేతలు ప్రవర్తించడం సమాజానికే శ్రేయస్కరం కాదన్నది మేధావుల వాదన.