హస్తినలో కాళ్ల బేరం.. ఏపీలో విమర్శల సమరం
posted on Jul 31, 2023 7:20AM
తప్పును తప్పు అని చెప్పడం.. పెద్ద తప్పైపోయినట్లు తయారైంది అధికార వైసీపీ నేతలకు అన్న చర్చ అయితే ఏపీ పోలిటికల్ సర్కిల్‌లో జోరందుకుంది. వైసీపీ అధినేత జగన్ గద్దెనెక్కిన తర్వాత.. ఈ నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరిగింది?... ఎంత మందికి సంక్షేమం చేరిందంటే ఆలోచించాల్సిందేనని పరిశీలకులు విశ్లేషిప్తున్నారు.
అలాంటి వేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఆ క్రమంలో గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం జోనల్ సమావేశాలు నిర్వహించారు. ఆ క్రమంలో జగన్ ప్రభుత్వ విధి విధానాలపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో దగ్గుబాటి పురందేశ్వరిని టార్గెట్‌గా చేసుకొని వైసీపీ కీలక నేత విజయ్ సాయిరెడ్డి సోషల్ మీడియా సాక్షిగా రెచ్చిపోతే.. ఇక రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా మీడియా సాక్షిగా.. అలాగే రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజినీ, ఉత్తరాంధ్ర పార్టీ ఇన్‌చార్జీ వైవీ సుబ్బారెడ్డి... ఒకే రోజు.. అలాగే ఒకే విధమైన ఆరోపణలు గుప్పించారు. అదీ కూడా కొన్ని గంటల వ్యవధిలోనే ఇలా విమర్శలు చేయడం సర్వత్రా విమర్శలకు దారితీస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కొత్త అధ్యక్షురాలు ఫ్లెక్సీలతో లేని హడావుడి చేసే బదులు...వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలనో, రైల్వే జోన్, ఇండస్ట్రియల్ కారిడార్ త్వరగా ఏర్పాటు చేయాలనో పోరాడొచ్చుగా! ప్రజలకు కాస్తయినా ప్రయోజనం ఉంటుంది. ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీకి పనిచేయడం ఎందుకు? అని పేర్కొన్నారు.
ఇక పురంధేశ్వరీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా లేక టీడీపీ అధ్యక్షురాలా అనే సందేహం వస్తోందని మంత్రి ఆర్కే రోజా తిరుపతిలో వ్యాఖ్యానించారు. టీడీపీ వాళ్లు ఏం మాట్లాడుతారో పురంధేశ్వరి కూడా అదే మాట్లాడుతున్నారన్నారు. పురందేశ్వరీ విభజన హామీలపై పోరాడితే బాగుంటుందని రోజా హితవు పలికారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి.. చంద్రబాబు ఇచ్చిన స్క్రిఫ్ట్ చదువుతున్నారని అనుమానంగా ఉందని విశాఖలో పేర్కొన్నారు. పురందేశ్వరి అవాస్తవాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. పురందేశ్వరి తప్పుడు లెక్కలు చెబుతున్నారు. విశాఖ అభివృద్ధి చూసి కూడా మాట్లాడుతున్నారంటే.. జగనన్న మీద కావాలనే ఆరోపణలు గుప్పిస్తున్నారన్నారు.
ఇక పురందేశ్వరీ వ్యాఖ్యలపై టీటీడీ బోర్డ్ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా తనదైన శైలిలో స్పందించారు. వైసీపీ ప్రభుత్వం మీద పురందేశ్వరి కావాలని అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులు దాచి పెట్టాల్సిన పని ఏమీ లేదని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో అన్ని విధాలా బీజేపీకి మద్దతిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మొత్తం మీద కేంద్రంలో బీజేపీకి అడగకుండానే మద్దతు ప్రకటిస్తున్న వైసీపీ నేతలు మాత్రం రాష్ట్రంలో బీజేపీ నేతలు నోరెత్తితేనే ఉలికిపాటుకు గురౌతున్నారని అర్ధమౌతోంది. కేంద్రంలో కాళ్ల బేరం రాష్ట్రంలో విమర్శల సమరం అన్నట్లుగా వైసీపీ తీరు ఉందని పరిశీలకులు అంటున్నారు.