ఏపీ రాజకీయాలలో రోజా ప్రస్థానం ముగిసిందా?
posted on Jul 31, 2023 @ 1:54PM
ఏపీ రాజకీయాలలో ఆమె పేరు ఎంత ప్రముఖమో అంత వివాదాస్పదం కూడా. ప్రత్యర్థులను తన విమర్శలతో చీల్చి చెండాడటం.. పంచ్ డైలాగులతో రెచ్చిపోవడంలో ఆమె సిద్ధహస్తురాలు. ఆమే రోజా. అయితే ఇప్పుడు రోజాకు ఏపీ రాజకీయాలలో మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. సొంత పార్టీలోనే ఆమె పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో ఆమె చూపు తమిళనాడు వైపు మళ్లింది. అసలు తెలుగు రాష్ట్రాలలో అటు సినీ పరిశ్రమలోనూ.. ఇటు రాజకీయ రంగంలోనూ పరిచయం అక్కర్లేని పేరు రోజా. సినీ నటిగా, రాజకీయ నాయకురాలిగా రెండు పడవల మీదా కాలేసి కూడా సక్సెస్ ఫుల్ గా రెండు రంగాలలోనూ రాణించిన రోజా.. రాజకీయాలలో మాత్రం ఎంతగా పాపులర్ అయ్యారో అంతగా వివాదాలలో కూడా నిలిచారు.
తెలుగుదేశంతో ప్రారంభమైన ఆమె పొలిటికల్ కెరీర్ వైసీపీలో చేరి మంత్రి అయ్యేవరకూ నిర్విఘ్నంగా సాగింది. ఆమె వాగ్ధాటి, ప్రత్యర్థులపై పంచ్ డైలాగులతో విరుచుకుపడే తీరు ఆమెకు అతి తక్కువ కాలంలోనే రాజకీయరంగంలో కూడా స్టార్ స్టేటస్ ను తెచ్చిపెట్టింది. తెలుగుదేశం తరఫున ఆమె పోటీ చేసి పరాజయం పాలైన తరువాత పార్టీ శ్రేణులే తన విజయాన్ని అడ్డుకున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసి ఆ పార్టీకి దూరమై వైసీపీలో చేరారు. మధ్యలో వైఎస్ రాజశేఖరరెడ్డిని కలిసి కాంగ్రెస్ గూటికి చేరదామనుకున్న ఆమెకు అప్పట్లో పరిస్థితులు పెద్దగా కలిసి రాలేదు. ఆయన మరణానంతరం జగన్ వైసీపీ పేరిట సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేయగానే రోజా ఆ పార్టీలో చేరిపోయారు.
వరుసగా 2014, 2019 ఎన్నికలలో నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. తొలి విడతలోనే మంత్రి పదవి ఆశించిన రోజాకు నిరాశే ఎదురైంది. ఆ తరువాత జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. దీంతో రెండో విడతలో రోజాను మంత్రి పదవి వరించింది. అయితే అప్పటి నుంచీ రోజాకు కష్టాలు మొదలయ్యాయనే చెప్పవచ్చు. సొంత నియోజకవర్గం నగరిలోనే ఆమెకు వ్యతిరేకత ఆరంభమైంది. జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి తో తొలి నుంచీ ఉన్న విభేదాలకు తోడు నగరి నియోజకవర్గంలో వైసీపీ శ్రేణుల నుంచీ వ్యతిరేకత ఎదురైంది. నియోజవర్గంలో జరిగే ప్రారంభోత్సవాలకు సైతం ఆమెకు ఆహ్వానం అందని పరిస్థితి. మరో వైపు వచ్చే ఎన్నికలలో విజయం సాధించి మరో సారి అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల పని తరు, ఆయా నియోజకవర్గాలలో వారికి ఉన్న సానుకూలత, ప్రతికూలత తదితర అంశాలపై పలు సర్వేలు నిర్వహించుకుని, నివేదికలు తెప్పించుకుని ఫిల్టర్ చేస్తున్నారని అంటున్నారు.
ఆ నివేదికలలో నియోజకవర్గంలో మంత్రి రోజాకు తీవ్ర వ్యతిరేకత ఉందని తేలడంతో వచ్చే ఎన్నికలలో ఆమెకు టికెట్ అనుమానమేనని పార్టీ శ్రేణుల నుంచే గట్టిగా వినిపిస్తోంది. అంతే కాకుండా మంత్రిగా రోజా తీరు పట్ల కూడా పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందంటున్నారు. క్యాష్ కౌంటర్ ఓపెన్ చేసి మరీ కలెక్షన్ క్వీన్ గా అవతరించారన్న విమర్శలూ వెల్లవెత్తుతున్నాయి. వీటన్నిటినీ గమనించి మంత్రి రోజా ఏపీ రాజకీయాలలో తనకు మనుగడ లేదన్న నిర్ణయానికి వచ్చేసి తమిళనాడు వైపు దృష్టి సారించారన్న వార్త రాజకీయ సర్కిల్స్ లో సర్క్యేలేట్ అవుతున్నారు. రోజాకు తమిళనాడులో కూడా నటిగా మంచి గుర్తింపు ఉంది. ఆమె భర్త సెల్వమణి తమిళనాడులో పేరెన్నికగన్నదర్శకుడు కూడా. ఈ నేపథ్యంలోనే ఆమె తమిళరాజకీయ రంగ ప్రవేశానికి మొగ్గు చూపుతున్నారని అంటున్నారు.
అందుకు తార్కానంగా కొంత కాలం కిందట ఆమె కాలునొప్పితో బాధపడుతూ చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ స్వయంగా ఫోన్ చేసి మరీ రోజా క్షేమ సమాచారాలు కనుక్కున్నారు. అలాగే సీనియర్ నటి రమ్యకృష్ణ ఇటీవల మంత్రి రోజాను కలిశారు? వీరి భేటీ కూడా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగునటి అయినా కూడా తమిళనాట రమ్యకృష్ణకు స్టార్ ఇమేజ్ ఉంది. ఆమె కూడా రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారనీ, తమిళనాట తనకు ఉన్న గుర్తింపు దృష్ట్యా ఆ రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరించాలని భావిస్తున్నారనీ ఎప్పటి నుంచో వినిపిస్తున్నది. రమ్యకృష్ణ డీఎంకేకు దగ్గర అన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రమ్యకృష్ణ రోజా భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. రోజా తమిళరాజకీయలపై కన్నేసిన నేపథ్యంలో రమ్యకృష్ణ ఆమెతో భేటీ కావడంతో ఇరువురూ ఆ రాష్ట్రంలో అధికార డీఎంకేకు గ్లామర్ స్టార్స్ గా రాజకీయ రంగ ప్రవేశం చేసి వచ్చే ఎన్నికలలో అక్కడ నుంచి పోలీ చేసే అవకాశాలు ఉన్నాయన్నది పరిశీలకుల విశ్లేషణ.