ఇటు అవిశ్వాసం అటు ఆర్డినెన్సు.. వచ్చే వారం కేంద్రానికి గడ్డు కాలమే

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు  ప్రారంభం మొదలు, మణిపుర్ అంశం చుట్టూనే తిరుగుతున్నాయి. మణిపుర్ హింసపై ప్రధాని నరేంద్ర మోీ సభలో ప్రకటన చేయాలని పట్టుబడుతున్న ప్రతిపక్ష పార్టీలు వరసగా రెండవ వారం కూడా పార్లమెంట్ ఉభయ సభలను  స్తంబింప చేశాయి. ఈ రెండు వారాలలో ప్రభుత్వం, విపక్షాలు కొనాగిస్తున్న నిరసనల మధ్యే ఏవో కొన్ని బిల్లులు ఆమోదం పొందాయి. అంతకు మించి, మణిపుర్ సహా,ఏ అంశంపైనా చర్చ జరగలేదు. మరోవంక ఇటీవల  ఐఎన్డీఐఎ (ఇండియ) గా నామకరణం చెసుకున ప్రతిపక్ష పార్టీల కూటమి ప్రదాని మోడీ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం నోటీసును ఇచ్చాయి. అవిశ్వాస తీర్మానం నిబంధనలను అనుసరించి స్పీకర్ ఆమోదించారు. కాగా, విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై  పై  ఆగస్టు 2 లేదా 3 తేదీల్లో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు చర్చ తేదీని,  సోమవారం (జులై 31) ఖరారు చేసే అవకాశం ఉంది. నిజానికి లోక్ సభలో అధికార ఎన్డీఎ కూటమికి సంపూర్ణ మెజారిటీ ఉన్న నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం ఖాయంగా వీగిపోతుంది.అందులో సందేహం లేదు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు విపక్షాలు సిద్దమవుతున్నాయి. అలాగే  అధికార కూటమి విపక్షాల విమర్శలను, ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు సిద్దమవుతోంది. అలాగే ఢిల్లీ సర్వీసులకు సంబంధించిన ఆర్డినెన్స్‌ స్థానంలో ప్రవేశ పెట్టే బిల్లు కూడా  దిగువ సభలో సునాయాసంగా నెగ్గుతుంది. సో .. మూడవ వారంలోనూ దిగువ సభకు సంబంధించినంత వరకు సర్కార్ కు చిక్కులేమీ లేవు.   అయితే  వచ్చేవారం అటు అధికార కూటమి ఇటు విపక్ష కూటమి అసలు సవాలును పెద్దల సభలో ఎదురు కానుంది. పెద్దల సభలో అధికార కూటమికి పూర్తి మెజారిటీ లేదు. విపక్ష కూటమి ఇండియా పరిస్థితీ అదే.  తటస్థులు ఎటు మొగ్గితే అటు అనుకూల ఫలితం వస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే వారం జరిగే సమావేశాలు ప్రభుత్వానికి అత్యంత కీలకమైనవి. ప్రతిపక్షాల  తీరుచూస్తుంటే వచ్చే వారం సభ అత్యంత ఆసక్తిగా సాగే అవకాశం కనిపిస్తోంది. సో.. ఆగస్టు 11 వరకు కొనసాగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో వచ్చే వారం సర్కార్  కు గడ్డు కాలం కాగలదని పరిశీలకులు భావిస్తున్నారు.  రాజ్యసభలో  పార్టీల బలాబలాలు ఇలా ఉన్నాయి. రాజ్య సభలో మొత్తం సభ్యుల సంఖ్య 243 అయితే ప్రస్తుతం ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి, రాజ్య సభ  ప్రస్తుత సభ్యుల సంఖ్య 238.. బిల్లు నెగ్గాలంటే 118 మంది మద్దతు అవసరం. కాగా, ఎన్డీఏ కూటమికి 109 మంది ఎంపీలున్నారు. కాంగ్రెస్‌కు 31 మంది సభ్యులు ఉన్నారు. ఇతర విపక్ష పార్టీలకు చెందిన 70 మంది సభ్యుల మద్దతును ఆప్‌ కూడగట్టింది. బిల్లును అడ్డుకోవాలంటే ఈ సంఖ్య సరిపోదు. విపక్ష పార్టీలు ఆప్‌ (10), టీఎంసీ (12), డీఎంకే (10), బీఆర్‌ఎస్‌ (7), ఆర్జేడీ (6), సీపీఐ(ఎం) (6), జేడీయూ (5), ఎన్సీపీ (4), శివసేన -యూబీటీ (3), ఎస్పీ (3), సీపీఐ (2), జేఎంఎం (2), ఐయూఎంఎల్‌, ఆర్‌ఎల్డీ నుంచి ఒక్కో సభ్యులు ఆప్‌కు మద్దతు ఇస్తున్నారు. విపక్ష సభ్యుల సంఖ్య 101 మాత్రమే ఉంటుంది. దీంతో తటస్థంగా ఉన్న బీజేడీ (9), వైసీపీ (9)ల మద్దతు ఎంతో కీలకంగా మారింది.

తెలంగాణలో బీఆర్ఎస్ కు ఎదురీతే.. ఇండియా టీవీ, సీఎన్ఎక్స్ సర్వే వెల్లడి

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏ ముహూర్తాన టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చి జాతీయ పార్టీగా ప్రకటించారో కానీ.. ఆ క్షణం నుంచీ పార్టీకీ, ఆయనకు వరుస కష్టాలు తప్పడం లేదు. జాతీయ స్థాయిలో సత్తా సంగతేమిటో కానీ  రాష్ట్రంలో ఆ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధిస్తుందా అంటే పరిశీలకులు మాత్రం అనుమానమనే అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇండియా టీవీ, సీఎన్ఎక్స్ సంస్థలు కలిపి ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో తెలంగాణలో అధికార బీఆర్ఎస్ గ్రాఫ్ వేగంగా పడిపోతున్నదని తేలింది. ఆ సర్వే పూర్తిగా లోక్ సభ నియోజకవర్గాలలో ఏ పార్టీకి విజయావకాశాలు అన్న విషయానికే పరిమితమైంది. ఆ  సర్వేలో తెలంగాణలో  ఉన్న 17 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ సగానికి పైగా సీట్లలో గడ్డుపరిస్థితి ఎదుర్కొంటున్నదని తెలింది. ప్రస్తుతం బీఆర్ఎస్ కు లోక్ సభలో తొమ్మిది స్థానాలు ఉన్నాయి. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఆ స్థానాలలో కొన్నిటిని బీఆర్ఎస్ కోల్పోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సర్వే పేర్కొంది. అదే సమయంలో బీజేపీ గెయిన్  అవుతుందని సర్వే తెలపింది. ప్రస్తుతం బీజేపీకి లోక్ సభలో నాలుగు స్థానాలు ఉంటే.. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో అదనంగా మరో రెండు లేదా మూడు స్థానాలలో గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని సదరు సర్వే పేర్కొంది.  ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న మూడు స్థానాలను నిలుపుకోవడం ఒకింత కష్టమేనని పేర్కొంది. మజ్లిస్ పార్టీకి తెలంగాణలో ఉన్న ఏకైక లోక్ సభ స్థానాన్ని నిలుపుకుంటుందని సర్వే తేల్చింది.  తెలంగాణలో  గతంలో కంటే ఎక్కువ లోక్ సభ స్థానాలలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ కు ఈ సర్వే ఫలితం ఒక రకంగా షాక్ అనే చెప్పవచ్చు. తెలంగాణలో మరింత బలపడి, మహారాష్ట్రలో కూడా గణనీయంగా లోక్ సభ స్థానాలను గెలుచుకుని జాతీయ స్థాయిలో  సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న బీఆర్ఎస్ కు ఇండియా టీవీ, సీఎన్ఎక్స్ సంయుక్తంగా జరిపిన సర్వే ఫలితం కంగుతినిపించేలాగే ఉందని చెప్పడానికి సందేహం అవసరం లేదు. లోక్ సభ స్థానాలలో ఓటమి ఆ నిష్పత్తిలో అసెంబ్లీ స్థానాలలో ఓటమికి సూచనగా పరిశీలకులు చెబుతున్నారు.  కేంద్రంలో ఈసారి ఏ కూటమి నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నా బీఆర్ఎస్ మద్దతు అనివార్యమని, కేసీఆర్ చక్రం తిప్పడం ఖాయమని మంత్రి హరీశ్‌రావు ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి విదితమే.అయితే తాజా సర్వేలో కేసీఆర్ కు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత పెద్దగా ఉండే అవకాశం లేదని తేటతెల్లమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

మంత్రి అంబటికి స్థానభ్రంశం తప్పదా?

మంత్రి అంబటి రాంబాబు పరిచయం అక్కర్లేని పేరు. నిత్యం వివాదాలలో, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలలో ఉంటారు. ఆయన సత్తెనపల్లి ఎమ్మెల్యే కూడా. అయితే వచ్చే ఎన్నికలలో జగన్ పార్టీ నుంచి ఆయనకు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీకి టికెట్ దొరికే అవకాశాలు అంతంత మాత్రమే అంటున్నారు. నియోజకవర్గంపై పట్టు సాధించినా అంబటిని అక్కడ నుంచి మార్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే అలా మార్చడానికి కారణం జగన్ సొంతంగా చేయించుకున్న సర్వేలలో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందని వచ్చిన రిపోర్టు మాత్రం కాదని అంటున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ గా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చార్జ్ తీసుకోవడమే అంబటి స్థానభ్రంశానికి కారణమని అంటున్నారు. ఇదేమిటి.. తెలుగుదేశం ఇన్ చార్జ్ గా కన్నా లక్ష్మీనారాయణను ఆ పార్టీ నియమిస్తే.. వైసీపీ ఎమ్మెల్యే మంత్రి అంబటి టికెట్ కు ఎసరేమిటని అనుకుంటున్నారా? అక్కడే ఉంది రాజకీయం. ఏపీ రాజకీయాలలో  రాయపాటి  సాంబశివరావుకు ఉన్న ప్రాధాన్యత పెద్దగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ కన్నాను సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ చార్జ్ గా తెలుగుదేశం అధిష్ఠానం నిర్ణయించడంతో రాయపాటి అలిగారు.  ఎందుకంటే కన్నా లక్ష్మినారాయణ రాయపాటికి చిరకాల ప్రత్యర్థి. అటువంటి కన్నాను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడమే కాకుండా,  సత్తెనపల్లి టికెట్‌ ఖరారు చేస్తూ ఆ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా నియమించడంతో  రాయపాటికి ఆగ్రహం వచ్చింది. ఈసారి తన కుమారుడికి,  మరో ఇద్దరికీ తాను సూచించిన చోట తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకుంటే తానే రంగంలోకి దిగుతానని రాయపాటి ప్రకటించారు.   అయితే ఆయన హెచ్చరిక లాంటి ప్రకటనను పార్టీ అధినేత చంద్రబాబు ఇసుమంతైనా పట్టించుకోలేదు. దీంతో రాయపాటి అలిగారని అంటున్నారు. రాయపాటి  అసంతృప్తిని గమనించిన వైసీపీ వెంటనే రంగంలోకి దిగి  గుంటూరు లోక్‌సభ, సత్తెనపల్లి శాసనసభ సీటు ఆఫర్ చేసిన్నట్లు తెలుస్తోంది. గుంటూరు నుంచి లోక్‌సభకు రాయపాటి, సత్తెనపల్లి నుంచి శాసనసభకు ఆయన కుమారుడు పోటీ చేసే అవకాశం ఇస్తామన్నది వైసీపీ ఆఫర్ గా చెబుతున్నారు. ఆ ఆఫర్ ను రాయపాటి అంగీకరించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఒక వేళ అదే జరిగితే ప్రస్తుతం సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి  ప్రాతినిథ్యం వహిస్తున్న అంబటికి స్థానభ్రంతం తప్పదని అంటున్నారు.   సత్తెనపల్లిలో బలమైన తెలుగుదేశం అభ్యర్థి కన్నాకు దీటుగా నిలవాలంటే అక్కడ రాయపాటి సాంబశివరావు అండ తప్పదని వైసీపీ హై కమాండ్ భావిస్తోందని చెబుతున్నారు.  అందుకే ఆయనకు లోక్ సభ, ఆయన కుమారుడికి అసెంబ్లీ   సీట్లు ఇచ్చేందుకు వైసీపీ రెడీ అయ్యిందని అంటున్నారు.  దీంతో జగన్ ప్రాపకం కోసం విపక్ష నేతలపై ఎంతగా నోరు చేసుకున్నా పాపం అంబటి రాంబాబుకు నియోజకవర్గం మారకతప్పని పరిస్థితి ఎదురైందని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. 

భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ.. తెలుగువన్ పోల్ సర్వే లో వెల్లడి

వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారం దక్కించుకుంటుందా? ఐఎన్డీఐఏ కూటమి విజయకేతనం ఎగరేస్తుందా? మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని పీఠాన్ని దక్కించుకొని హ్యాట్రిక్ కొడతారా? కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? రాహుల్ గాంధీ పీఎం అవుతారా? తనపై ఉన్న వ్యతిరేకతను పోల్ మేనేజ్మెంట్ తో అధిగమించి బీజేపీ మరోసారి చక్రం తిప్పుతుందా? కర్ణాటకలో ఫలితాలను దేశమంతా విస్తరించేలా కాంగ్రెస్ చేపడుతున్న ప్రణాళికలు సక్సెస్ అవుతాయా? అసలు ఈసారి   భారత దేశానికి కాబోయే ప్రధాన మంత్రి ఎవరు? ఇదే ఇప్పుడు సగటు రాజకీయాలలో ఆసక్తిగా సాగుతున్న చర్చ.  బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమికి అధికారం దక్కితే నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కావడం గ్యారంటీ. అదే సమయంలో ఐఎన్డీఐఏ కూటమికి అధికారం దక్కితే ప్రధాని ఎవరన్నది ఇంకా తేలాల్సిన ప్రశ్న. అయితే.. ఈ కూటమిలో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్సే కనుక రాహుల్ గాంధీకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది.  ఈ క్రమంలో నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీలలో ఈసారి ప్రధాని కాబోయే వ్యక్తి ఎవరు అని తెలుగు వన్ ఆన్ లైన్ పోల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మెజారిటీ నెటిజన్లు రాహుల్ గాంధీయే ప్రధాని కావచ్చని ఓట్లేయడం విశేషం. తెలుగు వన్ సర్వేలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని 66 శాతం మంది ఓట్లేస్తే.. ప్రధాని మోడీ మరోసారి పీఎం అవుతారని కేవలం 34 శాతం మాత్రమే మంది మాత్రమే ఓట్లేశారు. స్వల్ప వ్యవధిలోనే 34 వేల మంది పాల్గొన్న ఈ సర్వేలో 66 శాతం మంది రాహుల్ గాంధీ జై కొట్టడం విశేషం.     కాగా, ఈ ఆన్ లైన్ సర్వేలో నరేంద్ర మోడీ వెనకబడడం వెనక అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలపై బీజేపీ సర్కార్ చూపిస్తున్న సవతి ప్రేమ ప్రధాన కారణంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్టాల అభివృద్ధిని పట్టించుకోకపోవడం, రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, ప్రభుత్వ సంస్థలు.. ఆస్తులను ప్రైవేట్ పరం చేయడం, సాగు నీటి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకపోవడం వంటి ఎన్నో కారణాలు ఉన్నట్లు భావించాల్సి ఉంటుంది. వీటితో పాటు సాధారణంగానే దక్షణాది రాష్ట్రాలలో బీజేపీ పట్ల ఆసక్తి తక్కువగా ఉంటుంది. అందునా మన తెలుగు రాష్టాలలో బీజేపీకి స్వల్ప ఓటు బ్యాంక్ మాత్రమే ఉంది. ఇక ఏపీలో అయితే కేవలం ఒకటి శాతం కంటే తక్కువ ఓటింగ్ ఉంది.  ఇక మణిపూర్ హింసాకాండ, మహారాష్ట్ర లో దొడ్డిదారిన అధికారంలోకి రావడం వంటి కారణాలు కూడా జనంలో మోడీ వ్యతిరేకతకు దోహదం చేశాయి.   ఇక రాహుల్ గాంధీ విషయానికి వస్తే.. భారత్ జోడో యాత్ర తరువాత నుంచీ రాహుల్ పట్ల జనబాహుల్యంలో సానుకూలత వ్యక్తమౌతోంది.  ఆ యాత్ర రాహుల్ ను దేశ ప్రజలకు  సరికొత్తగా పరిచయం చేసింది.  రాహుల్ గాంధీకి జనం నీరాజనాలు పలికారు. ఈ విషయాన్ని అప్పట్లో రాహుల్ గాంధీ ఓపెన్ గానే చెప్పేశారు.  పరిణితి చెందిన రాజకీయవేత్తగా జనం ఆయనను గుర్తిస్తున్నారు. 

విజయశాంతి.. బీజేపీలో అశాంతి

విజయశాంతి పరిచయం అక్కర్లేని పేరు. సినీ  పరిశ్రమలో లేడీ అమితాబ్ గా గుర్తింపు పొందిన  నటి. హీరోలకే ప్రాధాన్యముండే ఆ  రంగంలో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే  కాదు.. అప్పట్లో అగ్రహీరోలతో సమానంగా  రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటి. అనంతరం  ఆమె రాజకీయ రంగ ప్రవేశం  చేశారు. రాజకీయాలలో కూడా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు.   తెలంగాణ రాజకీయాలలో  ఆమె ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. కేసీఆర్ విజయశాంతిని తనకు  దేవుడిచ్చిన చెల్లిగా  పేర్కొన్నారు.  అయితే చెల్లి అన్నంత మాత్రాన ఆమె విధానాలతో రాజీపడి ఆగిపోలేదు.  కేసీఆర్‌పై తిరుగుబావుటా ఎగురవేశారు. కేసీఆర్ తో విభేదించిన తరువాత తెలంగాణ ప్రయోజనాల  పరిరక్షణే ధ్యేయమంటూ కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ  పార్టీలో కూడా తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ విషయంలో పెద్దగా పోరాడలేమని భావించిన ఆమె బీజేపీలో చేరారు. అక్కడా ఆమెకు సరైన గుర్తింపు దక్కలేదు.. కేవలం పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఓ పదవి కట్టబెట్టి పక్కన పెట్టేశారు.  అయితే విజయశాంతి రాజీపడి సర్దుకు పోయే రకం కాదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యత స్వీకరణ కార్యక్రమానికి హాజరై అక్కడ తెలంగాణ ఉద్యమ సమయంలో కరుడుగట్టిన సమైక్యవాది అయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వేదికపై ఉండటాన్ని సహించలేక మధ్యలోనే వెళ్లిపోయారు. ఆ విషయాన్ని ఆమె దాపరికం లేకుండా మీడియా ముందు కుండ బద్దలు కొట్టారు. అసలు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీలో చోటు ఇవ్వడమే కరెక్ట్ కాదని చెప్పారు. ఒక వేళ పార్టీలో చేర్చుకున్నా ఆయనను ఆంధ్రా వ్యవహారాలకు పరిమితం చేయాలని విశయశాంతి ఎలాంటి మొహమాటాలకూ తావు లేకుండా చెప్పేశారు.   తెలంగాణ ఆవిర్భావాన్ని గట్టిగా వ్యతిరేకించిన   ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ముఖ్యమంత్రి  నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని.. తెలంగాణ పార్టీ ఆఫీసులో జరిగిన సభకు ఆహ్వానించడమేమిటని నిరసన గళం వినిపించారు. ఆయన ఉన్న వేదికపై ఉండటం ఇష్టంలేకే ఆ కార్యక్రమం నుంచి మధ్యలోనే వెళ్లిపోయాను అంటూ ఆమె చేసిన ట్వీట్ బీజేపీకి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లుగా మారిందనడంలో సందేహం లేదు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మనే కాదు.. అందుకు సహకరించిన ఈ చిన్నమ్మను కూడా గుర్తు పెట్టుకోండంటూ నాడు.. అంటే తెలంగాణ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందిన రోజు  సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలను విజయశాంతి ట్వీట్ తెలంగాణ వాదులందరికీ గుర్తు చేసింది. తెలంగాణ కోసం బీజేపీ అన్ని విధాలుగా అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ కు సహకరించిందని ఆ పార్టీ ఇప్పటికీ చెప్పుకుంటుంటుంది. మరి అటువంటి పార్టీ తెలంగాణను వ్యతిరేకించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఎలా అక్కున చేర్చుకుంటోందని తెలంగాణ వాసులు బీజేపీని నిలదీస్తున్నారు. విజయశాంతి తన ట్వీట్ ద్వారా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించినట్లేననీ, ఆయనకు తన నిరసనగళాన్ని గట్టిగా వినిపించినట్లేనని పరిశీలకులు అంటున్నారు.  ఇక ఆ తరువాత మణిపూర్ లో మహిళలపై జరుగుతున్న దారుణాలను గట్టిగా ప్రశ్నించారు. తద్వారా కేంద్రంలోని మోడీ సర్కార్ నిష్క్రియాపరత్వాన్ని నిలదీశారని పరిశీలకులు అంటున్నారు. ఈశాన్య రాష్ట్రాల ఇన్ చార్జ్ మంత్రిగా ఉన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మణిపూర్ విషయాలు తనను ఎందుకు అడుగుతారంటూ మీడియా ఎదుట అసహనం వ్యక్తం చేసిన సమయంలోనే విజయశాంతి ధైర్యంగా మణిపూర్ ఘటనలపై కేంద్రం వైఖరిని తప్పుపడుతూ ట్వీట్ చేశారు.   మొత్తంగా విజయశాంతి కమలం పార్టీకి దూరం అవుతున్నారన్న సంకేతాలైతే బలంగా వస్తున్నప్పటికీ ఆ విషయంలో విజయశాంతి నుంచి అయితే అధికారికంగా ఎటువంటి ప్రకటనా రాలేదు. తన అసంతృప్తిని దాచుకోకుండా బాహాటంగానే వెలిబుచ్చుతున్న విజయశాంతిపై చర్య  తీసుకునే ధైర్యం బీజేపీ చేయలేకపోవడానికి కారణం ఆమె వ్యక్తిత్వమేనని అంటున్నారు పరిశీలకులు. విజయశాంతి తన అసంతృప్తిని బాహాటంగా వెలిబుచ్చుతున్నారు. అదే సమయంలో ఆమెలాగే రాష్ట్ర పార్టీలో అసంతృప్తితో ఉన్న అనేక మంది సమయం కోసం ఎదురు చూస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా బీజేపీ రాష్ట్ర శాఖలో పరిస్థితి బద్దలవ్వడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉందని అంటున్నారు. 

జమిలి ఎన్నికలు..మోడీ సర్కార్ కు తత్వం బోధపడిందా?

గంపగుత్తగా కేంద్రంతో పాటు రాష్ట్రాలలోనూ అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే జమిలి ఎన్నికలు మాత్రమే శరణ్యం అనుకున్న మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జమిలి గురించే మాట్లాడుతూ వస్తోంది. ఒక దశలో  2024 సార్వత్రిక ఎన్నికలను ఒకింత ముందుకు జరిపి.. వాటితో పాటు జరగాల్సిన అసెంబ్లీలకు కూడా ముందస్తుగా ఎన్నికలు నిర్వహించడం ద్వారా మినీ సార్వత్రికానికి తెరతీయాలని మోడీ యోచించినట్లుగా వార్తలు గట్టిగా వినిపించాయి. అసలు జమిలి ఎన్నికల వల్ల చాలా ఉపయోగాలున్నాయని,   జమిలి ఎన్నికల వల్ల సమయం, శ్రమ, వ్యయం వంటివి బాగా కలిసి వస్తాయనీ, అయినా దేశంలో ఏడాది పొడవునా ఎక్కడో ఓ చోట ఎన్నికలు జరుగుతూనే ఉండే పరిస్థితి వల్ల ప్రగతి కుంటుపడుతుందనీ ఒకటేమిటి జమిలికి మద్దతుగా కేంద్రంలోని మోడీ సర్కార్, బీజేపీ అగ్రనేతలో బోలెడు కారణాలు చెప్పారు.  అయితే  జమిలి ఎన్నికల నిర్వహణ కష్టమని నిపుణులు చెబుతూనే వచ్చారు.  జమిలి ఎన్నికలు అన్నది ఒక నినాదంగా చెప్పుకోవడానికి ఉపయోగపడుతుందే తప్ప ఆచరణలో అసాధ్యమని నిపుణులు ఎంతగా చెప్పినా మోడీ పట్టించుకోలేదు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ ఆకర్షణీయమైన స్లోగన్ ఇస్తూ.. అందుకు అనుగుణంగా ప్రజా మద్దతును కూడగట్టేందుకు చేయగలిగిన ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.  జమిలి సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి కమిటీలు వేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ విషయంలో రాజకీయ పార్టీలతో ఒకటికి రెండు సార్లు సమావేశమైంది. దీంతో దేశంలో జమిలి ఎన్నికల దిశగా పెద్ద ఎత్తున కసరత్తు కూడా జరుగుతోందన్న బిల్డప్ ను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది.  ఇంత హడావుడి చేసిన తరువాత... జమిలి ఎన్నికల నిర్వహణ అసాధ్యమని కేంద్రం గ్రహించింది. ఈ విషయాన్ని  కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్ వాల్ ప్రకటించారు. జమిలి ఎన్నికల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఆచరణ సాధ్యం కాదని కేంద్రం గ్రహించిందని  ఆయన సెలవిచ్చారు. ఆ విషయం గ్రహించడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి రమారమి ఐదేళ్లు పట్టింది. కానీ నిపుణులు మాత్రం మోడీ జమిలి ఎన్నికల ప్రస్తావన చేసిన తొలి రోజునే పలు ప్రశ్నలు సంధించారు. దేశంలో రాష్ట్రాల అసెంబ్లీలకు, పార్లమెంటుకూ ఒకే సారి ఎన్నికలు నిర్వహిచడం వరకూ ఓకే..  సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో  పార్లమెంటులో మెజారిటీ కోల్పోయి మధ్యంతర ఎన్నికలు వెళ్లాల్సి వస్తే.. అప్పుడు అసెంబ్లీలను కూడా రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారా?  అలాగే ఒకవేళ ఏదైనా రాష్ట్రంలో అసెంబ్లీ రద్దయి మధ్యంతర ఎన్నికల్లో లేకపోతే ముందస్తు ఎన్నికలో నిర్వహించాల్సొస్తే అప్పుడు  ఏం చేస్తారు?  అసెంబ్లీ గడువు పూర్తయ్యే వరకూ ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారా? అంటూ నిపుణులు పలు ప్రశ్నలు సంధించారు. వాస్తవానికి మోడీ చెప్పాల్సిన అవసరం లేకుండానే దేశంలో 1962 వరకు  జమిలి ఎన్నికలే జరిగాయి. అయితే తర్వాత  మారిన రాజకీయాల కారణంగా ఆ పరిస్థితి మారింది.  ప్రధాని మోడీ దేశ రాజకీయ చరిత్రపై అవగాహన లేకుండా జమిలి నినాదంతో  అనవసర ఆర్భాటం చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 కొత్తగూడెం ఎమ్మెల్యే విషయంలో కెసీఆర్ కు తలనొప్పి

కొత్త గూడెం ఎమ్మెల్యే వనమా  వెంకటేశ్వర రావ్ ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు నిచ్చిన నేపథ్యంలో బిఆర్ఎస్ అధిష్టానానికి కొత్త చిక్కులు మొదలయ్యాయి. మరో వైపు జలగం వెంకట్రావ్ కాళ్లకు బొంగరం కట్టుకుని తిరుగుతున్నారు.  తీర్పును అమలు చేయాలని ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల ప్రదానాధికారి, ముఖ్యమంత్రిని వేడుకుంటున్నారు. వనమా వెంకటేశ్వర రావ్, జలగం వెంకట్రావ్ ఇద్దరూ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు. ఒకరు ఎమ్మెల్యే.. ఆయన నియామకం చెల్లదని కోర్టు తీర్పు చెప్పి మరొకర్ని ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఇప్పుడు ఇద్దరూ కలిసి న్యాయం మీరే చెప్పాలని కేసీఆర్ దగ్గరకు వెళ్తున్నారు. ఎవరి వైపు నిలబడితే మరొకరు అసంతృప్తి కి గురవుతారు. అందుకే… ఏటూ తేల్చుకోలేకపోతున్నారు. 2014 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో  బీఆర్ఎస్ తరపున పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు లేకపోతే.. జలగం వెంకట్రావు ముందుకు వచ్చి పోటీ చేశారు. బీఆర్ఎస్‌కు బలం ఏమీ లేనప్పుడు వ్యక్తిగత బలంతో ఎమ్మెల్యేగా గెలిచారు. జిల్లా నుంచి ఒక్కరే గెలిచినా కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వలేదు. అయినా జలగం పట్టించుకోలేదు. 2018 ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. వనమా గెలిచారు. తర్వాత వనమాను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. జలగం ను పట్టించు లేదు. కానీ వనమా ఎన్నిక అక్రమం అని జలగం కోర్టు గడప తొక్కారు. విచారణ జరిపి అసలు 2018 నుంచే జలగంను ఎమ్మెల్యేగా పరిగణించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పు నేపథ్యంలో అమలు చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై  పడింది. తీర్పు కాపీ పట్టుకుని వెంటనే జలగం.. సీఎస్‌ శాంత కుమారిని కలిశారు. ఎన్నికల ప్రధానిధికారిని కూడా  కలిశారు.  తనతో ప్రమాణ స్వీకారం చేయించాలని స్పీకర్ ను కూడా కోరారు. కానీ స్పీకర్ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. వనమా.. తీర్పు అమలుపై స్టే ఇవ్వాలని పిటిషన్ వేశారు. కానీ తీర్పు రిజర్వ్ అయింది. వనమా కాంగ్రెస్ లోనే ఉంటే… జలగంతో ఈ పాటికి ప్రమాణం చేయించేవారు. కానీ ఆయన కూడా బీఆర్ఎస్ లో ఉన్నారు. జలగం కావాలా… వనమా కావాలో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో బీఆర్ఎస్ హైకమాండ్ పడిపోయింది. తాను బీఆర్ఎస్ లోనే ఉంటానని జలగం  వెంకట్రావ్  చెబుతున్నారు.

మంత్రి గుడివాడతో ముద్రగడ భేటీ..వైసీపీలోకి కన్ఫర్మ్?

ఏపీ రాజకీయాలు ఎప్పటికప్పుడు సెగలు రేపుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పై చేయి సాధించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. సామజిక వర్గాల లెక్కలేసుకొని  మరీ రాజకీయంగా అడుగులేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో ఇప్పుడు కాపు సామజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకొనేందుకు తెలుగుదేశం, వైసీపీ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం-జనసేన పొత్తుగా వెళ్తాయనే ప్రచారం గట్టిగా జరుగుతున్న  సంగతి తెలిసిందే. అధికారికంగా ఈ వ్యవహారం ఇంకా తేలలేదు కానీ.. అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీ వర్గాలు పొత్తు ఖరారైనట్లేనని భావిస్తున్నాయి. ఇరు పార్టీల శ్రేణులూ క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పని చేస్తున్నాయి కూడా.  దీంతో వైసీపీ కాపు సామాజిక వర్గాన్ని టీడీపీ-జనసేన వైపు వెళ్లకుండా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నది. ఈ ప్రయత్నంలో భాగమే ముద్రగడ పద్మనాభంను మళ్ళీ ఫోకస్ లోకి తేవడం. కాపు రిజర్వేషన్ల సాధన సమితి నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈ మధ్య కాలంలో మళ్ళీ యాక్టివ్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో గోదావరి జిల్లాలలో పర్యటిస్తున్నప్పుడు ముద్రగడ పద్మనాభం తీవ్రంగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. పిఠాపురం నుంచి నాతో పోటీ చెయ్ అని పవన్ కు ముద్రగడ సవాల్ కూడా విసిరారు. ఇక రెండు సార్లు బహిరంగ లేఖలు  రాసారు. ముద్రగడ వ్యాఖ్యలు, లేఖలపై విరుచుకుపడిన జనసేన కార్యకర్తలు, కాపు సామాజికవర్గ ప్రజలు ముద్రగడ మీద తీవ్ర విమర్శలు గుపపించారు. అంతేకాదు  కాపు ఉద్యమం సమయంలో ద్వారంపూడి టిఫిన్లు పెట్టించారని ముద్రగడ పేర్కొంటే.. జనసేన కార్యకర్తలు ఇదిగో మీ ఉప్మా డబ్బులు అంటూ మనీ ఆర్డర్లు చేసి మరీ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వారాహి యాత్ర మొదలు పెట్టారో ముద్రగడ అటాక్ అప్పుడే మొదలైంది. ముద్రగడ వాయిస్ ఎప్పుడైతే రైజ్ చేయడం మొదలు పెట్టారో.. వైసీపీ నేతలు ముద్రగడతో సమావేశమవ్వడం మొదలు పెట్టారు. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వైసీపీ నేతల తాకిడి ఎక్కువైంది. ఇప్పటికే వైసీపీ నేతలు ఎంపీ మిధున్ రెడ్డి, కాకినాడ  ఎంపీ వంగా గీత, స్థానిక ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు వంటి నేతలు ముద్రగడను కలవగా.. ఇప్పుడు హఠాత్తుగా విశాఖకు వచ్చిన ముద్రగడ.. గాజువాకలో మంత్రి గుడివాడ అమరనాధ్ తో భేటీ అయ్యారు. అమరనాధ్ తో ముద్రగడ భేటీ వివరాలేవీ వైసీపీ నేతలు  బయటకి రాకుండా గోప్యంగా ఉంచుతున్నారు. అయితే ఈ భేటీ వెనక ముద్రగడ రాజకీయ పునఃప్రవేశం, వచ్చే ఎన్నికలలో వైసీపీ నుండి పోటీకి దిగడం వంటి రాజకీయాలు అంశాలే ఉన్నాయని రాజకీయ వర్గాలలో ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతున్నది.  ముద్రగడ తెలుగుదేశం హయాం నుంచే వైసీపీకి టచ్ లో ఉన్నట్లు గోదావరి జిల్లా రాజకీయాలలో ఎప్పటి నుండో వినిపిస్తున్న టాక్ కాగా.. ఇక ఇప్పుడు ఆయన  ఓపెన్ అయిపోయారనీ, ఇక  వైసీపీలోకి జంప్ చేయడానికి రెడీ అయిపోయారనీ తెలుస్తున్నది. ఇప్పటికే ముద్రగడను కలిసిన వైసీపీ నేతలు ఈ మేరకు రాయబారం కూడా నడిపినట్లు చెబుతున్నారు. ఇప్పుడు గుడివాడ అమర్నాధ్ తో భేటీ వెనక కూడా కారణం ఇదే అయి ఉండవచ్చని చర్చ జరుగుతున్నది. నిజానికి ముద్రగడ,గుడివాడ కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్ళుగా సాన్నిహిత్యం ఉంది. అప్పట్లో కాపు ఉద్యమానికి మద్దతుగా గుడివాడ అమరనాధ్ తండ్రి, మాజీ మంత్రి దివంగత గుడివాడ గురునాధరావు నిలిచారు. ఆయనకూ ముద్రగడకు మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉండేవి. ఈ నేపథ్యంలో స్నేహితుని కుమారుడు మంత్రి అయిన గుడివాడను ఇప్పుడు ముద్రగడ కలిశారు. ఇక ముద్రగడ వైసీపీలోకి వస్తే పిఠాపురం సీటు ఇస్తారని తెలుస్తున్నది. ఎలాగో పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబుకు ప్రజలలో పెద్దగా పాజిటివ్  ఇమేజ్ లేదనీ,  దీంతో ఆయన్ని సైడ్ చేసి ముద్రగడని నిలబెడతారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. పిఠాపురం కాకపోతే  కాకినాడ నియోజకవర్గం నుంచి ముద్రగడను ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దించే అవకాశం కూడా ఉందని అంటున్నారు.   ఒకవేళ ముద్రగడ పోటీ కి విముఖత చూపితే.. కుమారుడిని రంగంలోకి దింపే అవకాశాలున్నాయని అంటున్నారు.  మొత్తానికి ముద్రగడ వైసీపీలోకి రావడం ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

బీజేపీకి మద్దతు విషయంలో జగన్ తహతహ ఎందుకంటే?

ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కూడా అంత తొందరపడటం లేదు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలా, వ్యతిరేకంగా ఓటు వేయాలా అన్న విషయంలో జగన్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. కనీసం పార్టీ ఎంపీల సమావేశం ఏర్పాటు చేసి వారితో చర్చించలేదు. అంతెందుకు ఇంకా కేంద్రం వైసీపీని కానీ, జగన్ ను కానీ, వైసీపీని కానీ కోరనే లేదు. అయినా జగన్ ఎక్కడ లేని తొందర  ప్రదర్శించారు. అవిశ్వాస తీర్మానానికి  వ్యతిరేకంగా ఓటు వేయాలని పార్టీ ఎంపీలకు ఆదేశాలు జారీ చేసేశారు. అంతేనా ఢిల్లీలో అధికారాల నియామక నియంత్రణను లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు అప్పగిస్తూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ ను చట్టబద్ధం చేసేందుకు ఈ సమావేశాలలో ప్రవేశ పెట్టనున్న బిల్లుకు కూడా వైసీపీ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించేశారు. కనీసం కేంద్రం కోరే వరకూ కూడా ఎదురు చూడలేదు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ విధానాలపై కేంద్రం పెద్దలు, బీజేపీ రాష్ట్ర నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నా పట్టించుకోవడం లేదు.. తనను కాదు అన్నట్లుగా దులిపేసుకుంటున్నారు. పై రెండు విషయాలలో జగన్ కేంద్రం వద్ద దాసోహం అన్నట్లుగా వ్యవహరించిన తీరును బట్టి చూస్తే కామన్ సివిల్ కోడ్ బిల్లు విషయంలో కూడా జగన్ బేషరతు మద్దతు ఇచ్చేందుకు ఒక్క క్షణమైనా ఆలస్యం చేయరని అవగతమైపోతోందని పరిశీలకులు విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాధినేతగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రానికి ఒక్క విజ్ణప్తి అయినా చేసేందుకు ధైర్యం చేయని జగన్ కేంద్రం కోరకుండానే మద్దతు ప్రకటించడం చూస్తుంటే.. ఆయనలోని బెదురు అవగతమౌతోందని అంటున్నారు. ఆ బెదురు కేంద్రానికి ఆగ్రహం వస్తే తనపై కేసుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుందనేనని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నా జగన్ పట్టించుకోవడం లేదు.  ఇక బీజేపీ విషయానికి వస్తే ఆ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందన్న విషయాన్ని కూడా గుర్తిస్తున్నట్ల కనిపించదు.  తాను తనా అంటే తందానా అనే వ్యక్తి నేతృత్వంలో ఏపీలో ఉన్న ప్రభుత్వాన్ని గుర్తించాల్సిన అవసరం ఏముందన్నట్లుగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీరు ఉంది. ఇన్నేళ్లలో అంటే ఈ నాలుగేళ్ల కాలంలో బీజేపీ ఒక్క రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా తప్ప మరే సందర్భంలోనూ జగన్ సర్కార్ మద్దతు కోరింది లేదు. అయితే బీజేపీ నోరెత్తి అడగాలా? నేను లేనూ అన్నట్లుగా జగన్ ప్రతి సందర్భంలోనూ  ప్రకటిస్తూ వస్తున్నారు.  ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పి మరీ ఉపసంహరించుకున్న రైతు చట్టాలకూ జగన్ బేషరతుగా మద్దతు ఇచ్చారు.   వ్యవసాయ విద్యుత్ మోటార్ల విషయంలోనూ అంతే. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ముందుగానే జగన్ పాలిత ఏపీలో ఆ విధానాన్ని అత్యుత్సాహంగా అమలులోనికి తీసుకువచ్చి స్వామి భక్తిని చాటుకున్నారు. ఇప్పుడు ఢిల్లీ ఆర్డినెన్స్‌ విషయంలో కూడా అంతే మద్దతు కోసం బీజేపీ వైసీపీని కోరలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈ బిల్లు వల్ల భవిష్యత్ లో తమ రాష్ట్రానికి ఏమైనా ఇబ్బందులు వస్తాయా అన్న ఆలోచనలో ఉన్నాయి. కానీ జగన్ కు అటువంటి ఆలోచన, ఆందోళనా ఇసుమంతైనా లేదు. మోడీ నిర్ణయించారు. నేను సరే అన్నాను అంతే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. విపక్ష కూటమి ఇండియా   పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించాలని బీజేపీ ఇంకా అడగనైనా లేదు.. మీరు అడగాలా.. నాకు తెలియదూ అన్నట్లు జగన్ వైసీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేస్తారని ప్రకటించేశారు. ఏపీలో జనసేన జగన్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.  అంతే కాదు ఆ పార్టీ బీజేపీకి మిత్రపక్షం.  కేంద్రం నుంచి ఏపీ పర్యటనకు వచ్చిన అమిత్ షా, జేపీ నడ్డా కూడా ఏపీలో ఉన్నది అవినీతి ప్రభుత్వమని విమర్శలు గుప్పించారు.  పార్లమెంటు వేదికగా  రాష్ట్రానికి ఇచ్చేదేమీ లేదని కేంద్ర మంత్రులు కుండబద్దలు కొట్టేశారు. వైసీపీని కేంద్రం ప్రతి విషయంలోనూ కూరలో కరివేపాకులా తీసి పారేస్తున్నా.. జగన్ కు చీమ కుట్టినట్లైనా ఉండటం లేదు. అవసరానికి అప్పు... కేసుల నుంచి రక్షణ ఉంటే చాలు రాష్ట్రం ఏ గంగలో మునిగితే  నాకేం అన్నట్లుగా జగన్ తీరు ఉంది. 

జగన్ విధానాలన్నీ రాజ్యాంగ ఉల్లంఘనలే: రఘురామ కృష్ణం రాజు

 జగన్  ప్రభుత్వ విధానాలన్నీ నేరపూరితమైనవే.. రాజ్యాంగ ఉల్లంఘనలే. కార్పొరేషన్ల పేరిట ప్రభుత్వం తీసుకున్న రుణాలన్నీ నిభందనలకు విరుద్ధమే. జగన్ ముఖ్యమంత్రిగా అనుసరించిన విధానాలను వ్యాపారులెవరైనా చేసి ఉంటే వారు జైలుకెళ్లి ఉండేవారు.  ఇందుకు గాను వారికి పదేళ్లకు తక్కువకాకుండా శిక్ష పడేది.  ఈ మాటలు అన్నది ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు . జగన్ ప్రభుత్వం రుణాల పేరిట చేస్తున్నదంతా పెద్ద మోసం అంటూ  వివరించారు. రచ్చబండలో భాగంగా మీడియా సమావేశంలో రఘురామకృష్ణంరాజు ఏపీ సీఎం జగన్ ను ఆర్థిక అక్రమార్కుడిగా అభివర్ణించారు.  జగన్ రాజ్యాంగంలోని 266/1, 293/3 అధికరణలను అతిక్రమించారని అన్నారు.  భవిష్యత్ ఆదాయంపై ఇప్పుడే ఈ స్థాయిలో భారీ అప్పులు చేస్తే భవిష్యత్ తరాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.   రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చేస్తున్న అప్పులపై తాను గతంలోనే ప్రధానమంత్రికి, ఆర్థిక శాఖ మంత్రి కి, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి లేఖలు రాసినట్లు చెప్పిన రఘురామకృష్ణం రాజు దురదృష్ట వశాత్తూ కేంద్రం తన లేఖలను పట్టించుకోలేదన్నారు. దీంతో తాను కోర్టును ఆశ్రయించాననీ, అయితే కోర్టుకు వెళ్లడంలో జాప్యం జరిగిందంటూ కేసు కొట్టేసిందని వివరించారు.  ఆంధ్ర ప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ పేరిట గతంలో 38.142 వేల కోట్ల రూపాయల అప్పులను చేసిన రాష్ట్ర ప్రభుత్వం, తన  పిటిషన్ ను కోర్టు కొట్టివేసిన 48 గంటల వ్యవధిలో మరో 12 వేల కోట్ల రూపాయల అప్పు తీసుకునేందుకు రెడీ అయ్యిందన్నారు.  ఎక్సైజ్ టాక్స్ పేరిట కొత్త టాక్స్ వేసి మరీ ఏపీ ఎస్ డి సి పేరిట జగన్ సర్కార్ పాతిక వేల కోట్ల రూపాయల రుణం తీసుకున్నదన్నారు.  జగన్ విధానాల కారణంగా వచ్చే ఎన్నికలలో ఆయన ప్రభుత్వం దిగిపోయి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా  ఆ ప్రభుత్వానికి మద్యం ధరలను తగ్గించే అవకాశం ఉండదని రఘురామకృష్ణం రాజు అన్నారు.   బటన్ నొక్కి సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని చెప్పుకుంటున్న జగన్ వాస్తవానికి చేస్తున్నది దోపిడీ మాత్రమేనని విమర్శించారు.  భవిష్యత్తులో మద్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది లేదు. ప్రజలకు సంక్షేమ పథకాల పేరిట జగన్మోహన్ రెడ్డి నగదు ఇచ్చేదీ లేదన్నది జనం గ్రహించాలని చెప్పారు. 

తెలంగాణలో బీజేపీ ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు

తెలంగాణలో బీజేపీ పరిస్థితి బావిలో కప్ప మాదిరిగా తయారైంది. రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న ఆ పార్టీ ఆకాంక్ష మేరకు పార్టీ అధిష్ఠానం చేస్తున్న ప్రయత్నాలు ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతున్నాయి. అసలు తెలంగాణలో బీజేపీ అధికారం కోసం పోటీ పడుతోందన్నంతగా జోష్ పెంచుకోవడానికి కారణం ఎవరు ఔనన్నా కాదన్నా ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ అనడంలో సందేహం లేదు. అయితే బండి స్పీడ్, జోరు అందుకోలేని కొందరు ఆయనకు వ్యతిరేకంగా కేంద్రం వద్ద ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశారు. వీరిలో అత్యధికులు తొలి నంచీ పార్టీలో ఉన్న వారు కాకుండా.. మధ్యలో వారి వారి రాజకీయ అవసరాల కోసం పార్టీలోకి వచ్చి చేరిన వారేనని పరిశీలకులు అంటున్నారు. ఇక బీజేపీ అధిష్ఠానం కూడా ఎలాగోలా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే చాలన్న ఉద్దేశంతో సైద్ధాంతిక విలువలకు తిలోదకాలొదిలేసి పార్టీలోకి ఎవరు వస్తానన్నా ఓకే అన్నట్లుగా గేట్లు బార్లా తీసేసింది. దీంతో సిద్ధాంతాన్ని నమ్ముకుని   అధికారం సంగతి ఆలోచించకుండా పార్టీనే నమ్ముకుని ఉన్న వారికి ఈ పరిస్థితి రుచించలేదు. దాంతో వారు పార్టీలో క్రియాశీలంగా ఉండకుండా కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే పార్టీకి బలం పెరుగుతోందన్న బిల్డప్ అవ్వడానికి  ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారు నానా హడావుడీ చేశారు. అయితే బండి జోష్ వారికి ఇబ్బందికరంగా పరిణమించడంతో  ఫిర్యాదుల పర్వానికి తెరలేపారు. చేరికలపైనే విజయం ఆధారపడి ఉందని భావించిన  అధిష్ఠానం బండిని తప్పించి ఇప్పటికే  మూడు సార్లు రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన కేంద్రమంత్రి  కిషన్‌రెడ్డికి నాలుగోసారి  పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. మొదటి రెండు సర్లూ ఆయన ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు.  రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ బీజేపీకి ఆయనే తొలి అధ్యక్షుడు.  అయితే గత మూడు సందర్భాలలోనూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎలాంటి ప్రభావం చూపలేకపోయిన కిషన్ రెడ్డికి పార్టీ కీలక సమయంలో మరోసారి రాష్ట్ర అధ్యక్షపదవిని కట్టబెట్టడంపై పార్టీ వర్గాల్లోనూ ఒకింత అసంతృప్తి వ్యక్తమౌతున్నది.   ఇప్పుడు  తాజాగా మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డికి గతంలో కంటే క్లిష్ట పరిస్థితులు స్వాగతం పలుకుతున్నాయనడంలో సందేహం లేదు. పార్టీ మాజీ అధ్యక్షుడి అసంతృప్తి, అలాగే రాష్ట్ర అధ్యక్ష పగ్గాలను ఆశించిన ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నేతల సహాయ నిరాకరణ, కర్నాటక ఎన్నికల తరువాత  కాంగ్రెస్ లో పెరిగిన జోష్ తో డీలా పడిన  కమలం కార్యకర్తలు,  రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో కరవైన పార్టీ నిర్మాణం ఇవన్నీ కూడా కిషన్ రెడ్డికి సవాళ్లనే చెప్పాలి. పైగా పార్టీ హైకమాండ్ తిమ్మిని బమ్మి చేసైనా, బమ్మిని తిమ్మిని చేసైనా వచ్చే ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేయాలన్న పట్టుదలతో ఉన్న పరిస్థితుల్లో కిషన్ రెడ్డి రాష్ట్రంలో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెడతారన్న సందేహాలు పార్టీ శ్రేణుల్లో బలంగా వ్యక్తమౌతున్నాయి.  

బ్రేకింగ్.. బ్రేకింగ్... వరద ముంపులో మల్యాల, కొండాయి గ్రామాలు

 ఉభయ తెలుగు రాష్ట్రాలనూ భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వచ్చిన మెరుపు  వరదలతో తెలంగాణ   ఏటూరునాగారం మండలం కొండాయిలో జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. జంపన్న వాగు వరద ఉధృతికి కొండాయి, మల్యాల గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఏడుగురు గల్లంతయ్యారు.  ఇక  ఏపీలో మున్నేరు వాగు ఇంకా ఉద్ధృతంగానే ప్రవహిస్తుండడంతో కృష్ణా జిల్లా కీసర టోల్‌గేట్ నుంచి విజయవాడ వైపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వరద ఉద్ధృతి కారణంగా ఐతవరం వద్ద నిన్న సాయంత్రమే ట్రాఫిక్‌ను నిలిపివేశారు. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఈ ఉదయం కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. మున్నేరుకు ప్రస్తుతం 1,92,000 క్యూసెక్కుల వరద వస్తుండగా ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని  అధికారులు అంచనా వేస్తున్నారు.  మరోవైపు, నిన్న సాయంత్రం నుంచి వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బెస్ట్ లీడర్ నారా లోకేష్.. తెలుగువన్ ఆన్ లైన్ పోల్ సర్వే

ఏపీలో ఇప్పుడున్న ప్రథమ శ్రేణి రాజకీయ నేతలలో చంద్రబాబు అందరికంటే సీనియర్ అన్న సంగతి తెలిసిందే. ఆయన స్టేచర్, అనుభవం, దార్శనికతతో సాటి రాగల నేత ఏపీలో ఆయన వినా మరొకరు ఇప్పుడు లేరని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు.. ఇక, ఆయన తరువాత ఇప్పుడున్న నేతలలో సీఎం జగన్ మోహన్ రెడ్డి,  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంచు మించు సమకాలికులుగా చెప్పుకోవచ్చు. అందుకేఈ నేతలలో బెస్ట్ ఎవరన్నఅంశంపై తెలుగువన్  ఆన్ లైన్ పోల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి, సినీ హీరోగా భారీ ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ ను కాదని నెటిజన్లు నారా లోకేష్ కు ఓటేశారు. తెలుగువన్ ఆన్ లైన్ పోల్ సర్వేలో   నారా లోకేష్ ప్రజా నేతగా  అత్యధిక ఓట్లను దక్కించుకున్నారు.  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బెస్ట్ లీడర్ గా అత్యధికులు నారా లోకేష్ కు ఓటేశారు. ఈ సర్వేలో నారా లోకేష్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ అప్షన్లుగా ఇవ్వగా అత్యధిక శాతం మంది నారా లోకేష్ కు ఓటేశారు. బెస్ట్ లీడర్ గా నారా లోకేష్ కు 62 శాతం మంది ఓటేయగా.. 24 శాతం మంది పవన్ కళ్యాణ్ బెస్ట్ లీడర్ గా ఎన్నుకున్నారు. ఇక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెస్ట్ లీడర్ అంటూ కేవలం 14 శాతం మంది మాత్రమే ఓటేశారు. తెలుగు వన్ నిర్వహించిన ఆన్ లైన్ సర్వేలో స్వల్ప వ్యవధిలో 53 వేల మంది నెటిజన్లు పాల్గొన్నారు. దీంతో నెటిజన్లలో నారా లోకేష్ పట్ల నమ్మకం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. దాదాపుగా చదువుకున్న వాళ్ళు ఎక్కువగా డిజిటల్ మీడియాను ఫాలో అవుతారన్న సంగతి తెలిసిందే. అలాంటి వర్గంలో నారా లోకేష్ కరిష్మా ఏంటో ఈ సర్వే ద్వారా బయటపడుతుంది. ఈ సర్వేలో నారా లోకేష్ పట్ల నెటిజన్లు చూపిన నమ్మకం వెనక ప్రస్తుతం ఆయన సాగిస్తున్న యువగళం పాదయాత్ర కూడా ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఈ పాదయాత్ర ద్వారా లోకేష్ స్టామినా ఏంటో ఆంధ్ర ప్రజానీకానికి అర్థమైంది. అనితర సాధ్యం అనదగ్గ 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర   ప్రారంభించిన లోకేష్.. జగన్ సర్కార్ గుక్కతిప్పుకోలేని విధంగా విమర్శల బాణాలను సంధిస్తూ ప్రజలతో మమేకమై ముందుకు సాగుతున్నారు. ఈ పాదయాత్రకు ముందు లోకేష్ వేరు.. ఇప్పుడు లోకేష్ వేరు అనేలా ఆయన పొలిటికల్ గా మేకోవర్ అయ్యారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పనులను ప్రజలకు గుర్తు చేస్తూ.. ఇప్పుడు జగన్ సర్కార్ వైఫల్యాలను, అనుసరిస్తున్న కక్ష పూరిత వైఖరిని ప్రజలకు వివరిస్తూ లోకేష్ ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్నారు. దాని ఫలితమే ఇప్పుడు ఈ సర్వే రూపంలో బయటపడిందని చెప్పవచ్చు. అయితే, నారా లోకేష్ ఈ స్థాయికి ఎదగడం వెనక కఠోర శ్రమ ఉంది. సెల్ఫ్ డిసిప్లిన్ ఉంది. రాజకీయంగా లోకేష్ తొలి అడుగు వేయకుండానే ప్రత్యర్ధులు ఆయన వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కాదు. బాడీషేమింగ్, ఆయన నడక, మాట ఇలా   కాదేదీ అనర్హం అన్నట్లుగా ప్రత్యర్ధులు శృతి మించి ఆయన్ను తూలనాడారు. దానికి ఉల్లిక్కి పడని లోకేష్ ఇప్పుడు ఇలా పని తీరుతోనే సమాధానం చెప్పారు. ముందుగా తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తో మొదలు పెట్టిన లోకేష్.. గర్జించే సింహంలా ఇప్పుడు ఇలా లక్షల మంది ప్రజా సైనికుల ముందు బెరుకు లేకుండా ప్రత్యర్థులను సూటిగా చీల్చి చెండాడుతున్నారు. మొత్తంగా ఇదీ మీ లోకేష్ అంటూ ప్రజల మనసులను గెలుచుకుంటున్నారు. దాని ఫలితమే ఈ ఆన్ లైన్ సర్వేలో నెటిజన్లు జయహో లోకేష్ అని మద్దతు తెలిపారని చెప్పడానికి సందేహం అవసరం లేదు.

అసెంబ్లీ బరిలోకి లక్ష్మీ పార్వతి.. పోటీ ఎక్కడ నుంచంటే?

దివంగత సీఎం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ భార్యగా ల‌క్ష్మీపార్వ‌తి అందరికి సుపరిచితురాలే. ఎన్టీఆర్ ను ఆమె ఎలా పెళ్లి చేసుకున్నారు? ఆయనకు అసలు లక్ష్మీపార్వతి ఎలా దగ్గరయ్యారన్నది లోకానికి తెలిసిన కథే. అది పక్కన పెడితే ప్రస్తుతం ఆమె వైసీపీలో ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబుపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు.   ఎన్టీఆర్ జీవించి ఉన్న కాలంలోనే రాజ‌కీయాల్లో కాళ్ళూ, చేతులు పెట్టిన లక్ష్మీపార్వతి ప్రత్యక్ష రాజకీయాలలో కూడా పోటీ చేశారు. ఎన్టీఆర్ టీడీపీ పార్టీ నుండి పోటీ చేసిన లక్ష్మీ పార్వతిని ప్రజలు అప్పట్లో ఓడించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఇప్పటి వరకూ ఆమె ఎక్కడా పోటీలో నిలబడలేదు. అయితే వైసీపీ పంచన చేరి చంద్రబాబుపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆమె ఆ పార్టీలో చేరారు. ప్రస్తుతం  ఏపీ తెలుగు, సంస్కృత అకాడ‌మీ చైర్‌ప‌ర్స‌న్‌గా ఉన్నారు. ఇప్పటి వరకూ కేవలం చంద్రబాబు కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నందుకే ఆమెకి పదవి ఇచ్చారన్నది పరిశీలకుల విశ్లేషణ.  అయితే ఇప్పుడు   లక్ష్మి పార్వతి ప్రత్యక్ష రాజకీయాలలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒక్కసారైనా చట్టసభలకు వెళ్లాలన్నది ఆమె చిరకాల వాంఛ. ఈ క్ర‌మంలో  త‌న ఉద్దేశాన్ని సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర   ప్రస్తావించినట్లు చెబుతున్నారు. మొత్తానికి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి  ఆమెకు జగన్   గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. గ‌తంలో ఎన్టీఆర్ గెలిచిన స్థానాలలో ఎక్కడో ఒక చోట నుండి లక్ష్మీ పార్వతి పోటీ చేయాలని భావిస్తున్నారని అంటున్నారు.   ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా హిందూపురం నుంచి ఆమె పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.  ప్రస్తుతం హిందూపురం నుండి ఎన్టీఆర్ కుమారుడు  బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న సంగతి తెలిసిందే. వైసీపీ నుండి 2014లో నవీన్ నిశ్ఛల్, 2019లో ఇక్బాల్ బాలయ్యపై పోటీ చేసి ఓడిపోగా ఇప్పుడు ఇక్కడ నుండి లక్ష్మీ పార్వతిని రంగంలోకి దింపాలని వైసీపీ భావిస్తోందని అంటున్నారు.   ఈ మధ్యనే వైసీపీ హిందూపురం ఇంచార్జి పదవిని మహిళా నేత టీఎన్ దీపికకు అప్పగించింది. దీంతో బాలయ్య దీపికపై పోటీ చేయడం అవసరమా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే టీడీపీ కూడా ఇక్కడ మహిళా నేతనే దించాలని ఆలోచన చేస్తూ బాలయ్య కుమార్తె, చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణిని ఇక్కడ నుంచి రంగంలోకి దింపే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.  ఇప్పుడు వైసీపీ నుండి దీపికాను తప్పించి లక్ష్మీ పార్వతిని రంగంలోకి దించాలని వైసీపీ యోచిస్తోందంటున్నారు. అదే జరిగితే హిందూపురం   రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతుందనడంలో సందేహం లేదు. 

ఇండియా కూటమి కెప్టెన్ ఎవరు?

ఈ నెల 18న బెంగుళూరులో ఏర్పాటైన ఇండియా కూటమికి సారథ్యం వహించే నేత ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కాబట్టి యుపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ  పేరు వినిపిస్తున్నప్పటికీ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. 2004 నుంచి యుపీఏ చైర్ పర్సన్ గా ఉంటున్న సోనియాగాంధీ పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. గత పది  రోజుల నుంచి ఇండియా కూటమికి నేత ఎవరు అనే చర్చ కొనసాగుతోంది. యుపీఏ చైర్ పర్సన్ గా ఆమె సమర్ధవంతంగా పని చేశారు.2ేే004 నుంచి 2014 వరకు బలమైన ఎన్డిఏ  కూటమిని మట్టి కరిపించి రెండు పర్యాయాలు అధికారంలో తీసుకురావడంలో సోనియా గాంధీ ముఖ్య భూమిక  వహించిన సంగతి తెలిసిందే.కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా 26 ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. 'ఇండియా' పేరుతో ఏర్పడిన ఈ కూటమికి నాయకత్వం వహించేది ఎవరని రాజకీయ వర్గాలతో పాటు సామాన్యులలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రెండు మార్లు సమావేశం అయినప్పటికీ కూటమికి నాయకుడిని ఎన్నుకోవడంపై ప్రతిపక్షాలు ఓ నిర్ణయానికి రాలేదు. ప్రస్తుతం ఈ విషయంపైనే బీజేపీ సహా ఎన్డీయే కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిపక్షాల కూటమిని ముందుండి నడిపించే నాయకుడే లేడని ఎద్దేవా చేస్తున్నారు. తాజాగా ఇండియా కూటమికి నాయకుడు ఎవరన్న ప్రశ్నకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (ఉద్ధవ్) పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరే స్పందించారు. ఇండియా కూటమికి నాయకుడంటూ ఎవరూ లేరని ఉద్ధవ్ స్పష్టం చేశారు. అయితే, ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని రక్షించేందుకు తామంతా కూటమిగా ఏర్పడ్డామని, కూటమిలోని పార్టీల ఉమ్మడి లక్ష్యం అదేనని వివరించారు. కూటమికి నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం అంతగా లేదని చెప్పారు. జనాలకు పెద్దగా తెలియని వ్యక్తులు కూడా అవకాశం రాగానే తమలోని నాయకత్వ లక్షణాలను ప్రదర్శించి అందరి మెప్పును పొందారని చెప్పారు. చరిత్రలో ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయని ఉద్ధవ్ పేర్కొన్నారు. మాజీ ప్రధాని, దివంగత నేత పీవీ నరసింహారావు ఇందుకు చక్కని ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. రాజీవ్ గాంధీ హఠాన్మరణం తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారని ఉద్ధవ్ గుర్తుచేశారు.

స్నీడ్ న్యూస్ 2

కడెం ప్రాజెక్టుకు భారీగా వరద.. తెరుచుకోని నాలుగు గేట్లు 11.నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జలాశయం పూర్తి స్థాయి  700 అడుగులకు నీటి మట్టం చేరుకుంది.  ప్రాజెక్టుకు మొత్తంగా 18 వరద గేట్లు ఉండగా.. అందులో నాలుగు గేట్లు తెరుచుకోలేదు. దీంతో  14 గేట్ల ద్వారా వాటికి  నీటిని వదులుతున్నారు. వరద ఉధృతి మరింత పెరిగితే ముంపు తప్పదన్న ఆందోళన వ్యక్తమౌతోంది. ............................................................................................................................................................... శ్రీశైలం ప్రాజెక్టుకు పోెటెత్తుతున్న వరద 12.  విస్తారంగా కురుస్తున్న వర్షాలతో  శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. జూరాల ప్రాజెక్ట్‌ నుంచి 52,856 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 117 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ ఉదయానికి  816.20 అడుగులకు చేరుకుంది.  ............................................................................................................................................................ విశాఖలో భారీ వర్షాలు 13. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విశాఖ నగరం అతలాకుతలమైంది.    మున్సిపల్‌ స్టేడియం, పోర్టుకు వెళ్లే మార్గం జలమయమైంది  ఆ ప్రాంతంలో రోడ్డు పక్కన దుకాణాల్లోకి వర్షపు నీరు చేరింది. సమాన్లు నీటిలో కొట్టుకుపోయాయి.  ............................................................................................................................................................... సీతారాంపురంలో వరద 14.భద్రాద్రికొత్తగూడెం జిల్లా  సీతారాంపురం పంచాయతీ హార్జా తండా చప్టాపైనుంచి పారుతున్న వరద నీటిలో ఆటో కొట్టుకుపోయింది. ఈ ఆటో నీటి మధ్యలోకి వెళ్లిన తర్వాత సైలెన్సర్ లో కి నీరు పోయి ఆగిపోయింది.  ఆటో డ్రైవర్, అందులో ఉన్న ఇద్దరు ప్రయాణీకులు క్షేమంగా ఒడ్డుకు చేరారు. ఆటో మాత్రం కొట్టుకు పోయింది.  ................................................................................................................................................... ములుగులో వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు 15. ములుగు జిల్లాలో ఆర్టీసీ బస్సు వరదలో చిక్కుకుంది. హైదరాబాద్ నుంచి ములుగుకు వెడుతున్న బస్సుఈ ఉదయం ములుగు స‌మీపంలోని గట్టమ్మ జాకారం మధ్యలో భారీ వరద తాకిడికి కొంతదూరం కొట్టుకుపోయి పొలాల మధ్య లో నిలిచిపోయింది. బస్సులో 40 మంది ప్రయాణీకులు ఉన్నారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ................................................................................................................................................ ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం 16. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న  వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. పరకాల భూపాలపల్లి మధ్యలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే  హనుమకొండ ఎటురునాగారం ప్రధాని రహదారిపై రాకపెకలు స్తంభించిపోయాయి. ........................................................................................................................................................ భద్రాద్రి కొత్తగూడెంలో భారీ వర్షం 17. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.  ఏడూళ్ల బయ్యారం పెద్దవాగు పొంగి పొర్లడంతో  గ్రామంలోకి నీరు చేరింది. వరద నీరు ఊరును ముంచెత్తడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటు భయాందోళనకు గురవుతున్నారు. ......................................................................................................................................................... రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు విడుదల కాలేదు 18.కడప-బెంగళూరు కొత్త రైల్వే లైన్ నిర్మాణ పనులు ఆగిపోడానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా జమ చేయకపోవడమే కారణమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.  వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి బుధవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి  లిఖితపూర్వక సమాధానంలో  రాష్ట్ర ప్రభుత్వం  వాటా సొమ్ము ఇచ్చే వరకు ప్రాజెక్టు పనులు  సాగవని  స్పష్టం చేశారు. ............................................................................................................................................................... ఏపీలో భారీ వర్షాలు 19. ఏపీలోని ఆరు జిల్లాల్లో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ........................................................................................................................................... బిగ్ బాస్ కు సెన్సార్ 20. బిగ్‌బాస్‌ రియాల్టీ షో   ప్రసారానికి ముందు సెన్సార్‌  చేయకపోతే ఎలాగని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. ప్రశ్నించింది.   బిగ్‌బాస్‌ షో పై తెలుగు యువశక్తి అధ్యక్షుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దాఖలు చేసిన రెండుపిల్ లను విచారించిన హైకోర్టు  పూర్తి వివరాలతో కౌంటరు వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ   విచారణను   వాయిదా వేసింది.

వరాలతో బిఆర్ఎస్ ప్రభుత్వానికి నిధుల లేమి

ఎన్నికలు కూత వేటు దూరంలో ఉండటంతో  తెలంగాణాలో బిఆర్ఎస్ ప్రభుత్వం అప్రమత్తమైంది.   అనేక సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన పథకాలను అమలు చేసేందుకు ఉత్తర్వులిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వరాలు ప్రకటిస్తున్నారు. వారికిపెన్షన్లు పెంచుతున్నారు. తమ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని తగ్గించేందుకు తగిన  చర్యలు తీసుకుంటున్నారు. సంక్షేమ పథకాల వల్ల   తెలంగాణ ప్రభుత్వం నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోందిజ అప్పులు చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి  అవకాశాలు తక్కువ. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందడం లేదు. అందుకే కార్పొరేషన్ల నుంచి అదనపు అప్పుల కోసం ప్రయత్నిస్తోంది. రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఇటీవలె పలు మార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టారు.  అప్పుల కోసం అనుమతులు తెచ్చుకునేందుకు ప్రయత్నించారు. ఇప్పటికే ఆర్బీఐ ద్వారా ప్రతీ నెలా నాలుగైదు వేల కోట్లు బహిరంగ మార్కెట్ రుణం తీసుకుంటున్నారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ భూముల్ని విక్రయిస్తున్నారు. ఇవి చాలకపోవడంతో గ్యారంటీ అప్పులు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. దీనికి కేంద్రం, ఆర్బీఐ గత ఆర్థిక సంవత్సరం నుంచి కొన్నినియమ నిబంధనలను ప్రవేశ పెట్టాయి. గ్యారంటీ అప్పు ఎట్లా తీరుస్తారనేది నివేదిస్తేనే కొత్తగా అప్పులు తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి.  ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు సమీపించడం, నిధుల కొరత మొదలవడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. కనీసం గ్యారంటీ అప్పులనైనా పథకాలకు మళ్లించాలని చూస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కీములకు కూడా ప్రభుత్వ ఖజానాలో నిధులు లేవు. జూన్ మొదటి వారంలో అమలు చేయాల్సిన రైతుబంధు జులై నెల చివరి దశకు చేరుకున్నా పూర్తి కాలేదు. ఇప్పటి దాకా 5 ఎకరాల లోపు ఉన్న పట్టాదారులకు ఎకరాకు రూ.5 వేల పెట్టుబడి సాయం అందింది. ఇంకో రూ.2,500 కోట్లు అయితేనే రైతుబంధు పూర్తవుతుంది. ఇక జులైలోనే మొదలుపెడుతామని చెప్పిన దళితబంధు, గృహలక్ష్మి స్కీముల అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇంతవరకు ప్రారంభించలేదు. బీసీ చేతివృత్తుల వారికి రూ. లక్ష ఆర్థిక సాయం స్కీమ్ గందరగోళంగా మారింది. మొదటిదశలో నియోజకవర్గానికి కేవలం 50 మందికే ఇచ్చారు. బీసీ బంధు ప్రస్తుతానికి నిలిచిపోయింది. ఎమ్మెల్యేలకు, ప్రభుత్వాధికారుల మధ్య సఖ్యత కుదరక బీసీ బంధు నిలిచిపోయింది.  విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి ఆ ఉద్యోగులను మిషన్ భగీరథ ప్రాజెక్టు ఉద్యోగులుగా మార్చారు.  ప్రభుత్వ సంక్షేమ పథకాలతో బిఆర్ఎస్ ప్రభుత్వం నిధుల లేమికి గురైనట్లు తెలుస్తోంది.

తెలుగువన్ ఆన్ లైన్ పోల్ ..పోలవరం పూర్తి చేసేది తెలుగుదేశమే

పోలవరం ఎవరు పూర్తి చేస్తారు? అంటూ తెలుగువన్ ఆన్ లైన్ లో నిర్వహించిన పోల్ కు అద్భుత స్పందన లభించింది. కేవలం ఒక్క రోజు వ్యవధిలో  మొత్తం 63వేల మంది ఈ పోల్ లో పాల్గొనగా వారిలో 84 శాతం మంది పోలవరం పూర్తి చేయడం అన్నది తెలుగుదేశం వల్లే అవుతుందని నిర్ద్వంద్వంగా చెప్పారు. కేవలం 12 శాతం మంది వైసీపీ పోలవరం పూర్తి చేస్తుందన్నారు.  జాతీయ ప్రాజెక్టును బీజేపీయే పూర్తి చేస్తుందని 5శాతం మంది అభిప్రాయపడ్డారు. దార్శనికత ఉన్న నేత చంద్రబాబు మాత్రమే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయగరన్నది అత్యధిక ఆంధ్రుల అభిప్రాయమని తెలుగువన్ ఆన్ లైన్ పోల్ సర్వేలో అత్యధికులు అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టులైనా, ప్రగతి అయినా, పురోగతి అయినా ఒక్క చంద్రబాబు వల్లే సాధ్యమౌతుందన్నది ఏపీలో మెజారిటీ ప్రజల అభిప్రాయంగా ఈ ఆన్ లైన్ పోల్ సర్వేలో ద్వారా అత్యధికులు తమ అభిప్రాయాన్ని చెప్పారు. కేవలం పోలవరం తెలుగుదేశం మాత్రమే పూర్తి చేస్తుందంటూ టీడీపికీ టిక్ పెట్టడమే కాకుండా మెసేజీల ద్వారా తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు.   రాష్ట్రం ప్రగతి పథంలో నడవాలంటే మరోసారి చంద్రబాబు అధికారంలోకి రావాల్సిందేనన్నది మెజారిటీ ప్రజల అభిప్రాయంగా ఈ పోల్ లో తేలింది. అసలు పోలవరం పురోగతి మందగించడానికీ, ప్రాజెక్టు పరిస్థితి ఈ రోజిలా తయారవ్వడానికి వైసీపీయే కారణమని పలువురు మెసేజీల రూపంలో ఈ పోల్ లో కుండబద్దలు కొట్టిన చందంగా చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ పోలవరంను నిర్వీర్యం చేయడమే లక్ష్యమన్నట్లుగా వ్యవహరించారన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కొందరైతే ఒక అడుగు ముందుకేసి.. అభివృద్ధి కార్యక్రమాలను కచ్చితంగా, లోపరహితంగా చేయగల ఒకే ఒక్క దార్శనికుడు చంద్రబాబు మాత్రమేనని చెప్పడమే కాకుండా.. ఏపీ ప్రజలు ఇప్పటికైనా మేల్కోవాలని పేర్కొన్నారు.  రివర్స్ టెండరింగ్ వల్ల  పోలవరం సాగు నీటి ప్రాజెక్టు, జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులలో 628 కోట్ల రూపాయలు ఆదా చేశామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది.. కానీ జగన్ సర్కార్ ప్రతిదీ రివర్స్ లోనే చెప్పిందన్నది  కాంట్రాక్టు సంస్థ కోట్ చేసిన మొత్తానికి అదనంగా 500 కోట్ల రూపాయలు చెల్లించడంతోనే తేటతెల్లమైందంటున్నారు.  తెలుగుదేశం హయాంలో పోలవరం పనులు  చేపట్టినప్పుడు రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలులో ఉంది. కానీ రివర్స్ టెండరింగ్ అంటూ జగన్ సర్కార్ మరో సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించే సమయానికి జగన్ సర్కార్ తీసుకు వచ్చిన కొత్త ఇసుక విధానం మేరకు టన్ను ఇసుకకు 375 రూపాయల చొప్పున చెల్లించాలసి వచ్చింది. దీంతో రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా అన్న జగన్ సర్కార్ మాటలు డొల్లగానే మిగిలిపోయాయంటూ నెటిజన్లు పోలవరంపై తెలుగువన్ నిర్వహించిన ఆన్ లైన్ పోల్ లో పేర్కొన్నారు.  

 ఇండియా కూటమికి దగ్గరౌతున్న కెసీఆర్ 

కొన్ని రోజులుగా బిజెపికి బీ టీంగా పనిచేస్తున్న బిఆర్ఎస్  సడెన్ గా ప్లేట్ మార్చింది. విపక్ష కూటమి ఏర్పాటు చేసిన పాట్నా, బెంగుళూరు సమావేశాలకు దూరంగా ఉన్న బిఆర్ఎస్ ఎన్డియేపై అసమ్మతి నోటీసు ఇచ్చి కొత్త రాజకీయ సమీకరణాలకు ఆజ్యం పోసింది. ఐదేళ్ల క్రితం మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కెసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్  మోదీ వెంట ఉన్నారు. అప్పట్లో కాంగ్రెస్ ను వ్యతిరేకించిన కెసీఆర్ పార్టీ లోకసభలో ప్రవేశ పెట్టిన అసమ్మతి నోటీసుతో తిరిగి విపక్ష కూటమి ఇండియాకు చేరువ కావాలని చూస్తున్నారు. మణిపూర్ హింసను నిరసిస్తూ బిఆర్ఎస్  మోదీప్రభుత్వంపై అసమ్మతి నోటీసు ఇచ్చింది. బిఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు లోకసభలో అసమ్మతి నోటీసు జారీ చేశారు. ఆయన వెంట ఎంఐఎం కూడా ఉంది. ఇటీవలె బిఆర్ఎస్ కు దూరమైన ఎంఐఎం మణిపూర్ హింసపై ప్రవేశపెట్టే అసమ్మతి నోటీసుకు మద్దత్తుగా నిలిచింది.ఎంఐఎం కూడా అసమ్మతి నోటీసు ఇచ్చింది. ఎంఐఎం మాత్రం కాంగ్రెస్ కు బాసటగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.భాగ్యలక్ష్మి వివాదంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుపీఏ నుంచి ఎంఐఎం వైదొలగింది. ఎంఐఎం మొదటి నుంచి కాంగ్రెస్ కు దగ్గరగా ఉండేది. తిరిగి అదే సాంప్రదాయాన్ని కొనసాగించాలని చూస్తుంది. లిక్కర్ స్కాంలో కెసీఆర్ కూతురు కవిత పేరు ఉండటంతో కొన్ని రోజులుగా బిజెపిని కానీ, మోదీ ప్రభుత్వాన్ని కెసీఆర్ పల్లెత్తు మాట అనడం లేదు. బిజెపికి  బిఆర్ఎస్ బీటీంగా మారిపోయిందని ప్రచారం జరిగింది. కవిత అరెస్ట్ ను అడ్డుకోవడానికి కెసీఆర్ స్వయంగా బిజెపి అధిష్టానంతో రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్  ను మార్చడానికి ఎక్కువ దృష్టి పెట్టి సక్సెస్ అయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వంపై అసమ్మతి నోటీసు కెసీఆర్ హైడ్రామా అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఉత్తుత్తి అసమ్మతి నోటీసు అని రాజకీయ విశ్లేషకుడు ఒకరు అన్నారు.  దక్షిణాదిలో కర్ణాటక నుంచి  విక్టరీ సాధించిన కాంగ్రెస్ తెలంగాణలో కూడా గెలవవచ్చు అని పలు సర్వేలు చెబుతున్నాయి. కెసీఆర్ తెప్పించుకున్న సర్వేలో కూడా కాంగ్రెస్ విక్టరీ ఉండటంతో కర్ణాటక ఫలితాల తర్వాత కెసీఆర్ కు కాంగ్రెస్ భయం పట్టుకుంది. ప్రతీ సారీ కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారు. ప్రస్తుతం బిఆర్ఎస్ ఇండియా కూటమికి దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది.