అవిశ్వాస తీర్మానం ఫలితం తెలిసిందే ... అయినా ఆసక్తి
మణిపూర్ హింసాకాండపై పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయాల్సిందేనని పట్టుబట్టి, ఐదు రోజులుగా సభా కార్యక్రమాలను స్తంబింప చేసిన విపక్ష కూటమి, ఐఎన్డీఐఎ (ఇండియా), ఆఖరి అస్త్రాన్ని సంధించింది. ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు అవిశ్వాస తీర్మానం అస్త్రాన్ని ప్రయోగించింది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ ఇచ్చిన నో కాన్ఫిడెన్స్ నోటీసును స్పీకర్ ఆమోదించారు. అన్ని పార్టీలతో చర్చించి అవిశ్వాస తీర్మానం పై చర్చకు తేదీని ఖరారు చేస్తారు. అయితే, పార్టీల సంఖ్యా బలాలను బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన తీర్మానం వీగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
లోక్ సభలో ఎన్డీఎకు 332 మంది సభ్యుల బలముంది. ఎన్డీఎ సఖ్యా బలంలో సగం సంఖ్యా బలం అయినా లేని ఐఎన్డీఐఎ కూటమి ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడం ఖాయమనేది అందరికీ తెలిసిన నిజం. మరో వంక 22 మంది సభ్యులున్న వైసీపీ ఇప్పటికే, ఎన్డీఎకు మద్దతు ప్రకటించింది. అందుకే అవిశ్వాస తీర్మానం వీగిపోవడం ఖాయమనే విషయం నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సహా, కూటమి భాగస్వామ్య పార్టీల నేతలకు కూడా తెలుసు. నిజానికి, ఇండియాగా పిలుచుకుంటున్న విపక్ష ఐఎన్డీఐఎ కూటమిలో 26 పార్టీలు ఉన్నా, కూటమి ఎంపీల సంఖ్య 140 దాటదు. సో ... కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోతుంది. ఈ విషయం కాంగ్రెస్ సహా కూటమి నేతలు అందరికీ తెలిసిందే అయినా, అవిశ్వాస తీర్మానం ద్వారా మణిపూర్ హింసాకాండతో పాటుగా మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది.
అదలా ఉంటే, కాంగ్రెస్ సభ్యుడు గోగోయ్ నోటీసు ఇచ్చేందే తడవుగా స్పీకర్ ఆమోదం తెలపడంలో మతలబు ఏమిటనే ప్రశ్న ఇప్పడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకిస్తోంది. విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ఆలోచన చేస్తున్నాయని తెలిసిన వెంటనే, బీజేపీ కోర్ కమిటీ సమావేశమై విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడితే అనుసరించవలసిన వ్యూహం పై క్షుణ్ణంగా చర్చిన్నట్లు తెలుస్తోంది. అన్ని కోణాలలో ఆలోచించిన తర్వాతనే విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడితే, ఏమి చేయాలనే విషయంలో ప్రభుత్వం, అధికార కూటమి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే, కాంగ్రెస్ సభ్యుడు నోటీసు ఇచ్చిందే తడవుగా స్పీకర్ ఆమోదం తెలిపారని అంటున్నారు.
మణిపుర్ సహా ఈశాన్య భారతంలో పరిస్థితుల పూర్వపరాలను, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన హింసాత్మక సంఘటలను సవివరంగా దేశం ముందుంచడంతో పాటుగా విపక్ష కూటమి భాగస్వామ్య పార్టీల ఏలుబడిలోని రాష్ట్రాలలో, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ తదితర రాష్ట్రాలలో జరుగతున్న పరిణామాలను ఎండగట్టి తద్వారా విపక్ష కూటమి భాగస్వామ్య పార్టీలను ఇరకాటంలోకి నెట్టే వ్యూహంతోనే బీజేపీ అవిశ్వాస తీర్మానాన్ని స్వాగతిస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మరో వంక విపక్ష కూటమి కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే.. మణిపూర్ హింసపై ప్రధాని మోదీ తప్పనిసరిగా మాట్లాడాల్సి వస్తుందని, తమకూ పలు అంశాలను లేవనెత్తడానికి అవకాశం లభిస్తుందని యోచిస్తోంది. అందుకే, ప్రతిపక్షాలు ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
అదలా ఉంటే 2019 ఎన్నికలకు ముందు 2018లో యూపీఏ కూటమి మద్దతుతో ఏపీకి నిధుల విషయంలో టీడీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఎన్డీఎకు 325 మంది, విపక్షాలకు 126 మంది మద్దతు ఇవ్వడంతో మోదీ ప్రభుత్వం సంఖ్యాబలాన్ని చాటుకుంది. ఇప్పడు మళ్ళీ మరో మారు ఎన్నికలకు సంవత్సరం ముందు మోదీ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవడం యాదృచ్చికమే అయినా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా, అవిశ్వాస తీర్మానం పై చర్చలో ఎవరిది పైచేయి అవుతుంది అనేది మరింత ఆసక్తి రేకిస్తోంది. అలాగే విపక్ష కూటమికి ఇది మరో పరీక్ష కానుందనే అభిప్రాయం కుడా రాజకీయ వరగాల్లో వినవస్తోంది.
మరో వంక ఇదే అంశంపై విపక్ష కూటమిలో లేని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు కూడా నోటీసు ఇచ్చారు. అంతే కాదు, కాంగ్రెస్ తీర్మానానికి తమ మద్దతు లేదని కూడా ప్రకటించారు. రాష్ట్రపతి, ఉప రాష్టపతి ఎన్నికల్లో కాంగ్రెస్ తో చేతులు కలిపిన బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ కు దూరంగా ఉన్నట్లు చెప్పుకునేందుకు... ప్రత్యేకంగా నోటీసు ఇచ్చింది అంటున్నారు. ఏది ఏమైనా అవిశ్వాస తీర్మానం అవుట్ కం ఏమిటనేది క్లిస్టర్ క్లియర్’గా అద్దంలో ప్రతిబింబంలా స్పష్టంగా కనిపిస్తున్నా కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడం, దాన్ని ప్రభుత్వం ఆమోదించి, చర్చకు సై అనడం దేశంలో రాజకీయ వేడిని, ఆసక్తిని రేకెత్తిస్తోందని చెప్పవచ్చును.