పవన్ కు బీజేపీ ఆఫర్.. కలిసి నడిస్తే చిరంజీవికి రాజ్యసభ?
posted on Jul 31, 2023 @ 2:51PM
ఏపీ రాజకీయాలలో ఇప్పుడు విచిత్ర పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం ఏ తీరానికి చేరుతుందా అన్న స్పష్టత రాలేదు. జనసేన పార్టీ ఇప్పటికే బీజేపీకి మిత్రపక్షంగా ఉంది. అదే సమయంలో టీడీపీతో కూడా కలిసి వెళ్లాలని ఆలోచన చేస్తున్నది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన వైఖరిని చాలాసార్లు ఓపెన్ గానే చెప్పేశారు. అయితే, బీజేపీ నుండి ఇప్పటికిప్పుడు టీడీపీతో కలిసి వెళ్లాలా అనే దానిపై ఇంకా సందిగ్దత కొనసాగుతున్నది. మరోవైపు టీడీపీ కూడా జనసేనతో అయితే ఒకే కానీ.. బీజేపీతో అవసరమా అన్నట్లుగా ముభావంగా ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ బీజేపీకి రాంరాం చెప్పేసి టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తారని కూడా పెద్దగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల పవన్ ఢిల్లీలో ఎన్డీఏ సమావేశానికి హాజరై బీజేపీతోనే ప్రయాణం అన్న స్పష్టత ఇచ్చేశారు.
అదే సమయంలో ఏపీలో ప్రస్తుతం బీజేపీ కలిసి వస్తే సరే లేకుంటే తెలుగుదేశం-జనసేన కలిసి వెళ్తాయనే ప్రచారం గట్టిగానే జరుగుతుంది. అందుకే బీజేపీ ముందుగానే మేల్కొని సరికొత్త ప్రతిపాదనలతో రాజకీయం మొదలు పెట్టినట్లుగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. టీడీపీని కాదని తనతో కలిసి ఉండేలా బీజేపీ పవన్ కళ్యాణ్ కు కొన్ని ఆఫర్లు ప్రకటించినట్టు తెలుస్తోంది. తమతో జనసేన కలిసి నడిస్తే.. పవన్ సోదరుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవిని మరోసారి రాజ్యసభకు పంపిస్తామని బీజేపీ పవన్ కళ్యాణ్ కు అఫర్ చేసినట్లుగా సోషల్ మీడియాతో పాటు రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతున్నది.
చిరంజీవి గతంలో తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి తరువాత కాంగ్రెస్ తరఫున ఒకసారి రాజ్యసభకు వెళ్లి మంత్రిగా కూడా పనిచేశారు. అయితే, ఈసారికి బీజేపీ ఆయనను రాజ్యసభకు పంపే ఆలోచన చేస్తున్నదని, అందుకు ఏపీలో జనసేన తమ పార్టీతో కలిసి నడవాలన్న కండీషన్ పెట్టిందని అంటున్నారు.
నిజానికి తెలుగుదేశం పార్టీని కాదని జనసేన బీజేపీతో ఎన్నికలకు వెళ్తే ఆ రెండు పార్టీల కూటమి పెర్ఫార్మెన్స్ ప్లాప్ కాక తప్పదన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో బలంగా వ్యక్తం అవుతోంది. బీజేపీ ఏపీలో ఒక్క శాతం ఓట్లు దక్కించుకుంటే అదే బ్రహ్మాండం. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ తన హీరో ఇమేజ్ ను ఎంతవరకు ఓట్లుగా మలచుకోగలరన్నది ఆయన రాజకీయ ప్రవేశం చేసి ఇన్నేళ్లైనా ఎలాంటి క్లారిటీ లేకుండానే మిగిలిపోయింది.
అదే టీడీపీతో కలిసి వెళ్తే పవన్ ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టడంతో పాటు ఎంతో కొంత మంది జనసేన పార్టీ అభ్యర్థులను కూడా గెలిపించుకోగలరని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తన సోదరుడికి రాజ్యసభ సభ్యత్వం అన్న ఒకే ఒక్క ఆఫర్ ను అంగీకరించి బీజేపీతోనే ప్రయాణిస్తారా అంటే నమ్మశక్యంగా లేదని పరిశీలకులు అంటున్నారు.
మరోవైపు బీజేపీ ఏపీలో పాగా వేయడానికి ఎన్నాళ్ళుగానో ఆరాటపడుతున్నది. అందులో భాగంగానే పవన్ ద్వారా మెగా ఫ్యామిలీని గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నదంటున్నారు. ఇప్పటికే నందమూరి కుటుంబం నుండి పురంధేశ్వరికి బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. గతంలో అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయి ఏవో చర్చలు జరిపారు. తమకు మద్దతు ఇవ్వాలని అమిత్ షా కోరగా జూనియర్ ఎన్టీఆర్ సున్నితం తిరస్కరించినట్లుఅప్పట్లో ప్రచారం జరిగింది.
ఇలా మొత్తంగా ఏదో ఒక మార్గాన ఏపీలో జెండా ఎగరేయాలని బీజేపీ తహతహలాడుతున్నది. అందులో భాగంగానే టీడీపీ నుండి పవన్ ను దూరం చేసి తద్వారా రెండు పార్టీలనూ బలహీనం చేయడం ద్వారా రాష్ట్రంలో తన పెత్తనానికి ఢోకా లేకుండా చూసుకోవాలన్నది బీజేపీ వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ నేతృత్వంలోని వైసీపీ బీజేపీ బంధిత పార్టీయే అంటూ వారు వివరిస్తున్నారు.