కల్వకుంట్లకు మహా కొలువు
posted on Jul 29, 2023 @ 1:10PM
అదొక కుటుంబ పార్టీ తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ పై ప్రతిపక్ష పార్టీలు చేసే ప్రధాన ఆరోపణల్లో అదొకటి. అలాగే బీఆర్ఎస్ కుటుంబ పాలన కుటుంబ అవినీతిపైన ప్రతిపక్ష పార్టీలు నిత్యం ఆరోపణలు, విమర్శలు చేస్తూనే ఉంటాయి. కల్వకుట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోందని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆరోపించని రోజంటూ లేదు. అయితే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు విపక్షాల విమర్శలను పెద్దగా పట్టించుకున్న దాఖలాలు పెద్దగా కనిపించవు.
అయితే ఒక్క కేసీఆర్ కుటుంబంలోనే ఐదుగురు పదవులు అనుభవిస్తున్న నేపధ్యంలో అవినీతి ఆరోపణలకు ఏదో విధంగా సమాధానం ఇచ్చుకున్నా, కుటుంబ పార్టీ విమర్శలను కాదనే పరిస్థితి లేదు. విపక్ష పార్టీలు మాత్రమే కాదు సామాన్య ప్రజలు కూడా బీఆర్ఎస్ అంటే కేసీఆర్ ఫ్యామిలీ పార్టీ అనే అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. ఒక విధంగా, బీఆర్ఎస్ ను ఫ్యామిలీ పార్టీగా కేటీఆర్ ను కేసీఆర్ వారసుడిగా అంగీకరిస్తున్నారు.
నిజానికి ఒకానొక సందర్భంలో మంత్రి కేటీఆర్ కూడా రాష్ట్ర శాసన సభలో కాదనకుండా, అవుననకుండా అవును మాది కుటుంబ పార్టీనే, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు మా కుటుంబం ..అంటూ తెలివిగా సమాధానమిచ్చారు. అంతే కాదు అనేక సందర్భాలలో బీఆర్ఎస్ నాయకులు, మంత్రులు కేటీఆర్ ను కాబోయే ముఖ్యమంత్రిగా చూస్తున్నారు, కొలుస్తున్నారు. రేపటి ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే, కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే విషయంలో బీఆర్ఎస్ నేతల్లో ఎవరికీ రెండో అభిప్రాయం లేదు.
అదలా ఉంటే ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కల్వకుట్ల ఫ్యామిలీ నుంచి మరొకరిని తెర పైకి తెచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత, ముఖ్యమంత్రి కుర్చీని కుమారుడు కేటీఆర్ కు ఇచ్చి తాను జాతీయ రాజకీయాల్లో కీలక పాత్రను పోషించేందుకు తెరవెనక సన్నాహాలు చేసుకుంటున్న అయన తమ అన్న కల్వకుంట్ల రంగారావు కుమారుడు కల్వకుంట్ల వంశీధర్‌రావును మహారాష్ట్ర బీఆర్‌ఎస్ ఇన్‌చార్జిగా నియమించారు.
గత కొద్ది నెలలుగా కేసీఆర్ మహారాష్ట్రలో పార్టీ నిర్మాణం దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయమం తెలిసిందే. అలాగే,2024 లోక్ సభ ఎన్నికల్లో అయన మహారాష్ట్ర నుంచి పోటీ చేస్తారనే మాట గట్టిగా వినిపిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా ఆయన తన అన్న కల్వకుంట్ల రంగారావు కుమారుడు కల్వకుంట్ల వంశీధర్‌రావును మహారాష్ట్ర బీఆర్‌ఎస్ ఇన్‌చార్జిగా నియమించారు.
వంశీధర్‌రావు గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. కొంతకాలం క్రియాశీలంగా ఉన్నారు. అనంతరం చాలాకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన, ఇటీవల కొంతకాలంగా కేసీఆర్‌కు దగ్గరగా మెలుగుతున్నారు. దీంతో ఆయనకు మహారాష్ట్ర బీఆర్‌ఎస్ ఇన్‌చార్జిగా కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
అదలా ఉంటే మహారాష్ట్ర బీఆర్‌ఎస్ కు ఇన్‌చార్జితో పాటు 15 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీని అధినేత కేసీఆర్ నియమించినట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ తెలిపారు. కమిటీ చైర్మన్‌గా కేసీఆర్ వ్యవహరించనున్నట్లు పేర్కొన్నారు.