కేంద్రానికి కనిపించదా ?
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థతి ఏమిటి? అంటే రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, ఆర్థిక పరిస్థితి అధ్వానం గా ఉందని చెప్పేందుకు ఇసుమంతైనా సంకోచించ వలసిన అవసరం లేదని ఎవరిని అడిగినా చెపుతారు. ఎవరి దాకానో ఎందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సహా కేంద్ర, రాష్ట్ర బీజేపీ నాయకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఆధ్వానంగా వుందో చెపుతూనే ఉన్నారు. ముఖ్యంగా కొత్తగా రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టిన పురందేశ్వరి రాష్ట్ర అప్పుల పరిస్థిపై గణాంక వివరాలతో సహా గంటకు పైగా వివరించారు. అంతే కాదు ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతరామన్ కు రాష్ట్ర అప్పుల చిట్టాను సమర్పించారు కూడా.
అయినా కేంద్ర ప్రభుత్వంలో కదలిక లేదు. అంతే కాదు అదే సమయంలో రాష్ట్ర అప్పుల పరిధి (ఎఫ్ఆర్బీఎం) విషయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఉభయ సభల్లో రెండు విభిన్న ప్రకటనలు చేసి వాస్తవ పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం లేకుండా చేశారు. దీంతో, రాష్ట్ర బీజేపీ నేతలు ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక, అప్పుల పరిస్థితిపై సవివరంగా విశ్లేషించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శలు ఎదుర్కొంటున్నారు.
నిజానికి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అడుగుపెట్టినప్పటి నుంచి ఆర్ధిక క్రమశిక్షణ గాడి తప్పింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తోలి క్షణం నుంచే సంక్షేమాన్ని గీత దాటించారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు సంక్షేమం ముసుగు కప్పి, మీటలు నొక్కడం మొదలెట్టారు. అంతే కాదు ఆర్థిక క్రమశిక్షణ అనే పదాన్ని ఏపీ సర్కార్ నిఘంటువు నుంచి తుడి చేశారు. అప్పులు చేసి మరీ ఓటు బ్యాంకు పథకాలతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు.
మరోవంక ప్రాధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఒక బాధ్యతగల ప్రతిపక్షంగా గాడి తప్పిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర దృష్టికి తీసుకు వెళుతూనే వుంది. అయినా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ వుందే కానీ పరిస్థితిని చక్క దిద్దే ప్రయతనం ఏదీ చేయలేదు. అంతే కాదు పెద్దల సభలో వైసీపీ మద్దతుతో కీలక బిల్లుల పాస్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాలను ఓ వంక విమర్శిస్తూనే, మరో వంక అప్పులు పెంచుకునే వెసులు బాటు కల్పించడంతో పాటుగా ఇంకా ఇంకా అప్పులు చేసి, రాష్ట్రాన్ని ఇంకా ఇంకా అధ్వాన స్థితికి చేర్చేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వానికి ‘హితోదిక’ సహాయం అందిస్తోంది.
దీంతో జగన్ రెడ్డి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అప్పులు చేయడమే కాదు కేంద్ర నిధులకూ కన్నం వేస్తోంది. అయితే ఇందుకు సంబంధించి ఎన్ని ఆరోపణలు చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఇప్పడు తాజగా పంచాయతీ నిధుల దారి మళ్లింపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో సర్పంచులు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.8660 కోట్ల మేర గ్రామ పంచాయితీలకు కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్ళించిందని ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ కేసు కట్టి సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు.
అంతే కాదు ఇందుకు సంబంధిచిన వివరాలను, ఆధారాలను సంవత్సరాల వారీగా కేంద్ర మంత్రికి సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం 2019 నుంచి 2022 వరకు ఇచ్చిన ఆర్దిక సంఘం నిధులు రూ.8660 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వకుండా దారి మళ్లించి తన సొంత పథకాలకు, సొంత అవసరాలకు వాడుకుందని ఫిర్యాదు చేశారు. 2022-23 సంవత్సరానికి చెందిన 2010 కోట్లు, 2023 -24 సంవత్సరము కు చెందిన 2035 కోట్లు, మొత్తం రూ.4045 కోట్లను పంచాయితీలకు విడుదల చేయకపోవడంపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం - 2006 కింద వచ్చే నిధులు నరేగా చట్టప్రకారం గ్రామ పంచాయితీలకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి 2023 వరకు సుమారు రూ.35 వేలకోట్ల రూపాయలను తన సొంత అవసరాలకు, పథకాలకు వాడుకుంటోందని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
భారత రాజ్యాంగం, పంచాయతీరాజ్ చట్టాల ప్రకారం ఏర్పడిన గ్రామ పంచాయతీలను, సర్పంచులను, ఎంపీటీసీలను, వార్డు మెంబర్లను డమ్మీలను చేసి వారి అధికారాలను గ్రామ వాలంటీర్లకు కట్టబెట్టారని రాష్ట్రంలో పంచాయతీ రాజ్ వ్యవస్థకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, జప్పీటీసీలకు , వార్డు మెంబర్లకు సమాంతరమైన పోటీ వ్యవస్థ, రాజ్యాంగేతర శక్తులుగా గ్రామ సచివాలయాలను, గ్రామ వాలంటీర్లను తీసుకొచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. సర్పంచులను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను ఉత్సవ విగ్రహాలు లాగా మార్చిన దుస్థితి గుర్చి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక,చట్ట వ్యతిరేక చర్యల గురించి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలోని 3 కోట్ల 50 లక్షల మంది గ్రామీణ ప్రజలకు రాష్ట్రంలోని 12918 మంది గ్రామ సర్పంచులు కనీసం త్రాగునీరు కూడా అందించలేని స్థితిలో ఉన్నారని వివరించారు.
ఇంటింటికి త్రాగునీరు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పథకం జల జీవన్ మిషన్ పథకాన్ని కూడా మూలన పడేశారని ఆరోపించారు. ఇకపై కేంద్ర ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా నేరుగా గ్రామపంచాయతీ పి.ఎఫ్.ఎం.ఎస్ అకౌంట్లోనే జమ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించిన రూ.8660 కోట్ల నిధులపై సైబర్ క్రైమ్ కేసు కట్టి, సిబిఐ చేత ఎంక్వయిరీ చేయించాలని విజ్ఞప్తి చేశారు.అయితే, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుస్తుండా అంటే, అనుమానమే అంటున్నారు పరిశీలకులు.