అధికార పార్టీలో బెరుకు బెదురు!?
posted on Jul 31, 2023 6:56AM
వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ సొంత చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో ఇటీవల చోటు చేసుకొంటున్న వరుస పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీలోని అత్యంత కీలక నేతల్లో నిద్రకరవైందనే చర్చ ఆ పార్టీలోని ఓ వర్గంలో హల్‌చల్ చేస్తున్నది.
తన తండ్రి వివేకా హత్య జరిగిన కొద్ది రోజులకు.. తన సోదరుడు, సీఎం జగన్ భార్య వైఎస్ భారతి, వైఎస్ విజయమ్మ, సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులంతా ఒకే సారి తన ఇంటికి వచ్చారని.. ఆ సమయంలో భారతీ ఆందోళన చెందుతూ కనిపించారని.. అలాగే ఏదైనా ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడాలంటూ భారతి.. తనకు సూచించారని డాక్టర్ సునీత పేర్కొన్నట్లు పలు కథనాలు జులై 22, 23వ తేదీల్లో.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయినాయి.
ఆ వెంటనే అంటే.. ఆ రెండు రోజులకే జులై 25న ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి... ఆ కథనాలపై క్లారిటీ ఇవ్వడమే కాకుండా... వివేకా హత్య జరిగిన కొద్ది రోజుల తర్వాత.. తాను, తన ఫ్యామిలీ సునీత నివాసానికి వెళ్లి పరామర్శించి వచ్చామని స్పష్టం చేశారు. అంతేకానీ భారతి, విజయమ్మ, తాను కలిసి సునీత ఇంటికీ వెళ్ల లేదని చెప్పారు.
అయితే ఆ రెండు రోజుల తర్వాత.. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి నేరుగా తాడేపల్లి చేరుకొని.. సోదరుడు, ముఖ్యమంత్రి జగన్‌తోపాటు ప్రభుత్వ ముఖ్య సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయి పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు ఓ చర్చ పార్టీ శ్రేణుల్లోనే జరుగుతోంది.
ఇది జరిగిన రెండు రోజులకే సీఎం జగన్ ప్రధాన సలహాదారు అజేయ్ కల్లం... తెలంగాణ హైకోర్టు మెట్లు ఎక్కారు. వివేకా హత్య కేసులో ఇంతకు ముందు సీబీఐకి తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని తప్పుగా నమోదు చేసుకుందని.. దీంతో వివేకా హత్య కేసు ఛార్జీషిట్ నుంచి తన వాంగ్మూలాన్ని తొలగించాలని పిటిషన్ దాఖలు చేశారు.
ఇలా వరుసగా ప్రతీ రెండు రోజులకు ఒకరు.. ఇలా బుల్లి తెర తెలుగు సీరియల్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా వివేకా హత్య కేసు ముందుకు సాగకుండా అడుగడుగునా అడ్డుపడే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు ఈ హత్య వెనుక ఉన్న సూత్రధారులు ఎవరో.. ఈ హత్యకు స్కెచ్ చేసిందెవరో... అన్ని ప్రజలకు క్లియర్ కట్‌గా అర్థమైనా..
ఈ హత్య కేసులో సజ్జల , అవినాష్ లు జగన్ తో భేటీ కావడం, అనంతరం అజేయ్ కల్లం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం చూస్తుంటే వివేకాహత్య కేసు విషయంలో అధికార పార్టీలో ఏదో బెరుకు, బెదురు కనిపిస్తున్నదని తేటతెల్లం అవుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చిన వారిలో మరొకరు ఎవరో బయటకొచ్చి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. ఇంకోవైపు ఆగస్టు 14వ తేదీ కోర్టుకు హాజరుకావాలంటూ.. కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. అలాంటి వేళ ఈ అంశం వైసీపీలోని అత్యంత కీలక నేతల్లో గుబులు రేపుతోందని, అందుకే సజ్జల, అవినాష్, జగన్ ల భేటీ, అజేయ్ కల్లాం పిటిషన్ అని అంటున్నారు.