మెట్ట పంటలకు మేలు చేస్తున్న వర్షాలు ?
గత వారం రోజులనుండి కురుస్తున్న వర్షాలతో మెట్టరైతులు ఉత్సాహంగా పొలంపనులు చేసుకుంటున్నారు. ఈ వర్షంతో దుక్కిదున్ని విత్తనాలు వేయవచ్చని అంటున్నారు. కాలం దాటిపోతుందనుకున్న సమయంలో వర్షం పడటం రైతులకు ఆనందం ఇచ్చింది. జూన్ ప్రారంభం నుండి ఈ నెలవరకు సాధారణ వర్షపాతం 213 మిల్లీలీటర్లు కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో 195 మిల్లీలీటర్లు వచ్చింది. వారం రోజుల క్రితం వరకు రాష్ట్రంలో 13 జిల్లాలు వర్షాభావ పరిస్థితుల్లో వుండగా ప్రస్తుతం ఆ సంఖ్య 6 తగ్గిందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
దీంతో కడప, నెల్లూరు, కర్నూలు, ఖమ్మం, వరంగల్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు కరువుకోరల నుండి బయట పడగలిగాయి. కాగా కరీంనగర్, అనంతపురం, విశాఖపట్నం, నిజామాబాద్, మెహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలలో మాత్రం రైతులు ఇంకా వర్షం కోసం చూస్తున్నారు. అయితే ఇంకా మూడు రోజుల పాటు ఇదే వర్షాలు కురిస్తే అక్కడ కూడా మెట్టపంటలకు ఢోకా వుండదని తెలుస్తుంది .రాష్ట్రం మొత్తం మీద 33 లక్షల హెక్టార్ల భూమిలో పంటలు సాగు చేయవలసి వుండగా ప్రస్తుతానికి 23 లక్షల హెక్టార్ల భూమి ఇప్పటికే సాగులోకి వచ్చింది. వేరుశనగ 2.40 లక్షల హెక్టార్లు, మొక్కజోన్న 3.10 లక్షల హెక్టార్లలో ఉంది. పత్తి13.70, కంది 2.05, పెసర 1.70, ఆముదం 0.80 లక్షల హెక్టార్లలో సాగయ్యాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.1.60 లక్షల హెక్టార్లలో చెరకుతో పాటు, 2.20లక్షల ఎకరాల్లో వరి నాట్లు పెరిగాయని, అయితే మెట్టసాగుకు మాత్రం మెరుగైన అవకాశాలున్నాయంటున్నారు