ఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళా చక్రవర్తి రజియా సుల్తానా!   స్త్రీ....  అంటే ఓ చైతన్యం. అతివ.. ..అంటే ఓ అపూర్వం.  పడతి.... అంటే ఓ ప్రగతి.  అరచేతిని అడ్డుపెట్టి అరుణోదయాన్ని ఎలాగయితే ఆపలేమో. కట్టుబాట్ల అడ్డుగోడలు, కష్టాల కన్నీళ్ళు, స్త్రీమూర్తిని ఆపలేవు. సాధించాలన్న తపన ...లక్ష్యం చేరాలన్న ఆశయం ..ఆమెను ఆకాశమంత చేస్తాయి. ఆమె వేసే ఒక్కో అడుగు.. వేల మార్పులకు శ్రీకారం.  మహిళామణులు అందరికీ 'మహిళా దినోత్సవ' శుభాకాంక్షలు. 1908 సంవత్సరం మార్చి 8వ తేదీన అమెరికా దేశంలో మహిళలు తమకు ఉద్యోగాలలో సమాన అవకాశాలు, వేతనలు కావాలనీ డిమాండ్ చేస్తూ చేపట్టిన భారీ నిరసన ఉద్యమం చేపట్టారు. ఈ చారిత్రక నేపథ్యాన్ని పురస్కరించు కొని ప్రతి సంవత్సరం యావత్ ప్రపంచం మార్చి 8 తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. సమాన అవకాశాలు, స్వేఛ్చ అందించగలిగితే మహిళలు పురుషులకు మిన్నగా అన్ని రంగాల్లోనూ రాణిస్తారు. అకాశంలో సగమైన మహిళ ఆత్మగౌరవం కోసం, అభ్యున్నతి కోసం ప్రతీ ఒక్కరు పని చేయడమే నిజమైన నాగరికతగా భావించాలి  గృహిణిగా, శ్రమజీవిగా, ఉద్యోగిగా, ప్రజాప్రతినిధిగా, అన్ని రంగాల్లోనూ ప్రతిభావంతంగా పని చేస్తున్నా ఆమెకు తగిన గుర్తింపు రావడం లేదు. ఇప్పటికీ సమాన పనికి సమాన వేతనం దక్కడం లేదు. ప్రజాప్రతినిధులుగా స్థానం సంపాదించినా భర్తల చేతిలో కీలుబొమ్మలుగానే ఉన్నారు. మహిళల సమానత్వం ప్రచార ఆర్భాటాలకే తప్ప ఆచరణలో కానరావడం లేదు. నేటికీ మహిళగానూ, శ్రామిక మహిళగానూ, పౌరురాలిగానూ దోపిడీకి గురౌతూనే ఉంది. ఇన్ని సమస్యలున్నా కొందరు విజయం వైపు దూసుకెళ్తూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు.  సృష్టికి మూలం ఆడది. అసలు ఆడదే లేకపోతే సృష్టే లేదు. అంతటి మహోన్నత ప్రశస్తి కలిగిన మహిళ నేటి ప్రస్తుత నవ సమాజంలో అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. సాటి సభ్య సమాజాన్ని చూసి ఆమె కన్నీరు పెడుతుంది..! ఆడపిల్ల పుట్టిందంటేనే భారంగా భావించే రోజులు దాపురించాయి. అసలు బయటి ప్రపంచాన్ని చూడకుండానే అసువులు బాసిన ఆడపిల్లలు కోకొల్లలు. ఏ దేశంలో లేని దుస్థితి మన దేశంలో ఎందుకు..? ఆడపిల్లని కనడం, చదివించడం, పెళ్లి చేయడం లాంటి తదితరాలన్నింటినీ భారంగా భావించే తల్లిదండ్రులు మన దేశంలో ఎందరో..! అసలు ఆడపిల్ల పుట్టిందంటేనే అదో పెద్ద శిక్షగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఆడపిల్లల సంఖ్య రోజురోజుకూ క్షీణిస్తుంది.  భారత  రాజ్యాంగం భారతీయ మహిళలందరికీ సమానత్వం (ఆర్టికల్ 14), రాష్ట్రాలనిబట్టి ఎటువంటి వివక్షా చూపించకుండా ఉండడం (ఆర్టికల్ 15 (1) ), అవకాశంలో సమానత్వం (ఆర్టికల్ 16), సమాన పనికి సమాన జీతం (ఆర్టికల్ 39 (డి) ) మొదలైన హామీల నిస్తున్నది. రాష్ట్రాలు స్త్రీలకు, పిల్లలకు ప్రత్యేక సదుపాయాలను అందించే వీలు కలుగజేస్తుంది (ఆర్టికల్ 15 (3)). మహిళల గౌరవానికి భంగం కలిగించే చర్యలను త్యజించాలని (ఆర్టికల్ 51 (ఎ) ) సూచిస్తోంది. అలాగే స్త్రీలకు ప్రసూతి సెలవలు ఇవ్వడానికి, వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడాన్ని అనుమతిస్తుంది. (ఆర్టికల్ 42).   ఆదర్శాలకీ వాస్తవాలకూ మధ్య చాలా సందర్భాల్లో పొంత్యన కుదరదన్న విషయాన్నే దేశంలో ఎల్లెడలా పరుచుకుపోయిన అసమానతలు చాటుతున్నాయి. వివిధ రంగాల్లో స్త్రీ పురుషుల మధ్య సామానత్వ సాధనలో ఏఏ దేశాలు ఎంతెంత వెనకబడి ఉన్నాయో ఆ నివేదిక కళ్లకు కడుతుంది. 2017 చివర్లో వెలువడిన ఓ నివేదిక ప్రకారం మొత్తం 145దేశాల పరిస్థితులను విశ్లేషిస్తే భారత్  108వ స్థానంలో ఉంది. ఆర్ధిక భాగస్వామ్యంలో 139, విద్యలో 125, వైద్యం, ఆరోగ్యంలో 143 వ స్థానాన్ని ఆక్రమించింది. సమానత్వ సూచీలో పేర్కొన్న గణాంకాల ప్రకారం 145 దేశాల్లో ఏ ఒక్కటీ స్త్రీ పురుష అంతరాలను తగ్గించడంలో వంద శాతం విజయం అందించలేదు.  ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే, స్వీడన్ వంటి దేశాలు 80 శాతం వరకు అధిగమించి సమానత సాధన దిశలో ముందు వరసల్లో ఉన్నాయి. బలమైన ఆర్ధిక వ్యవస్థలున్న సమాజాలు సమానత్వ సాధనలో వెనకబడిపోవడానికి మహిళా శక్తిని గుర్తించలేకపోవడంతో పాటు పాతుకుపోయిన పురుషాధిక్య భావజాలమూ ప్రధాన కారణమే. భారత్‌లో మహిళలు పురుషులతో పోలిస్తే రోజూ అయిదు గంటల పాటు ఎలాంటి ప్రతిఫలం లభించని పని చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. పని విభజనలో తారతమ్యం ఏ దేశంలోనూ ఈ స్థాయిలో ఉండదు. ఆర్ధిక సాధికారతలో వెనకబాటుకు ప్రధాన కారణమదే. మహిళా యాజమాన్యంలోని సంస్థలు అతి తక్కువ శాతం ఉన్నదీ భారత్ లోనే.  ప్రపంచవ్యాప్తంగా గడిచిన పదేళ్లలో మహిళా కార్మిక శక్తి 150 కోట్ల నుంచి 175 కోట్లకు పెరిగింది. కానీ మహిళల వార్షిక వేతనం చూస్తే ప్రస్తుతం స్త్రీలు సంపాదిస్తున్న జీతం పదేళ్ల క్రితం పురుషుడు సంపాదించిన దానితో సమానం. ప్రగతి బాటలో స్త్రీ పురుషుల మధ్య అంతరం తగ్గుతూ పోయిన కొద్దీ జీడీపీ పెరుగుతుందని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ రంగంలో అంతరాలను అధిగమించిన దేశం సుసంపన్నం అవుతోంది.  భారతదేశంలో తొలిగా అహ్మదాబాద్ లో "అనసూయా సారాభాయ్ -టెక్స్‌టైల్‌ లేబర్‌ అసోసియేషన్‌" అనే పేరుతో కార్మికసంఘం ప్రారంభించింది. భారత కార్మికోద్యమంలో కార్మిక స్త్రీలను సంఘటితం చేసిన మహిళా నేతలలో సుశీలా గోపాలన్‌, విమలారణదివే, కెప్టెన్‌ లక్ష్మిసెహగల్‌, అహల్యారంగ్నేకర్‌, పార్వతీకృష్ణన్‌ ప్రముఖులు.. కొన్ని సహస్రాబ్దులు గా  భారత దేశంలో మహిళల పాత్ర అనేక గొప్ప మార్పులకు లోనౌతూ వచ్చింది. ప్రాచీన కాలంలో పురుషులతో సమాన స్థాయి కలిగివున్న భారతీయ మహిళలు మధ్యయుగంలో అధమ స్థాయికి అణచబడటం, అనేకమంది సంఘ సంస్కర్తలు తిరిగి వారికి సమాన హక్కుల కల్పన కోసం కృషి చేయడం, ఇలా భారతదేశంలో మహిళల చరిత్ర అనేక సంఘటనల సమాహారంగా ఉంది.  ఆధునిక భారతదేశంలోమహిళలు దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్, ప్రతిపక్ష నాయకురాలు వంటి అత్యున్నత పదవులను అలంకరించి దేశ కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడింపచేసారు. పతంజలి, కాత్యాయనుడు వంటి ప్రాచీన భారత వ్యాకరణకర్తల రచనల ప్రకారం, వేదకాలపు ఆరంభంలో మహిళలు చదువుకోనేవారని తెలుస్తోంది. ఆ సమయంలో మహిళలు యుక్తవయస్సులో పెళ్ళి చేసుకోనేవారని, వారు భర్తను ఎన్నుకొనే హక్కుని కలిగి ఉండేవారని ఋగ్వేద శ్లోకాలు తెలుపు తున్నాయి. తరువాత (సుమారుగా 500 బి.సి.) నుండి మహిళల హోదా తగ్గడం మొదలయ్యింది  మధ్యయుగ సమాజంలో మహిళల స్థాయి ఇంకా దిగజారింది.   కొంత  మంది మహిళలు రాజకీయ, సాహిత్యం, విద్య, మత రంగాలలో రాణించారు. రజియా సుల్తానాఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళా చక్రవర్తి.  గోండు రాణి దుర్గావతి పదిహేనేళ్ళు పరిపాలన సాగించింది. ఆమె మొఘల్ చక్రవర్తి అక్బర్ ను ఎదుర్కొంది. అక్బర్ ను  1590లో చాంద్ బీబీ ఎదుర్కొని అహ్మద్ నగర్‌ను రక్షించింది.  జహంగీర్ భార్య నూర్జహాన్  సార్వభౌమ అధికారాన్ని ప్రతిభావంతంగా చెలాయించి మొఘల్ మకుటం వెనుక ఉన్న నిజమైన శక్తిగా గుర్తింపు పొందింది.  మొఘల్ యువరాణులు జహనారా, జేబున్నీసాలు మంచి పేరున్న రచయిత్రులు.  శివాజీ తల్లి జిజియాబాయి యోధురాలిగాను, పాలకురాలి గానూ చాటుకున్న సమర్థత వలన సమర్ధురాలైన రాణిగా గణుతి కెక్కింది.  దక్షిణ భారతంలో చాలామంది మహిళలు గ్రామాలు, పట్టణాలు, మండలాలను పాలించారు. అనేక సామాజిక, మత సంస్థలకు ఆద్యులయ్యారు. భక్తి ఉద్యమం మహిళల హోదాని తిరిగి నిలపడానికి ప్రయత్నించి కొన్ని రకాల అణిచివేతలను అడ్డుకుంది. మీరాబాయి అనే ఒక మహిళా సాధు కవయిత్రి భక్తి ఉద్యమపు ముఖ్య వ్యక్తులలో ఒకరు. ఈ కాలపు ఇతర మహిళా సాధు-కవయిత్రులు అక్క మహాదేవి, రామి జనాభాయి, లాల్ దేడ్.   యూరోపియన్ పరిశోధకులు 19వ శతాబ్దపు భారత స్త్రీలు మిగతా స్త్రీలకంటే "సహజంగా శీలవంతులు", "ఎక్కువ ధర్మపరులు" అని గమనించారు.  బ్రిటిషు పాలన సమయంలో రామ్ మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, జ్యోతిరావు ఫులే మొదలైన సంఘసంస్కర్తలు మహిళా అభ్యున్నతికి పోరాడారు. పండిత రమాబాయి వంటి చాలామంది మహిళా సంస్కర్తలు కూడా మహిళా అభ్యున్నతికి కృషి చేసారు. కర్ణాటకలోని కిట్టుర్ రాజ్య రాణి కిట్టుర్ చెన్నమ్మ బ్రిటిషువారి కాలదోషం పట్టిన సిద్ధాంతాలకి ప్రతిస్పందనగా వారికీ వ్యతిరేకంగా సైన్యాన్ని నడిపించింది. తీరప్రాంత కర్ణాటక రాణి అబ్బక్క రాణి యురోపియన్ సైన్యాల ఆక్రమణలకి ముఖ్యంగా 16వ శతాబ్దంలో పోర్చుగీసు ఆక్రమణలకి ఎదురునిలిచింది. రాణి లక్ష్మీ బాయి ఝాన్సీ రాణి బ్రిటిషువారికి వ్యతిరేకంగా 1857 భారతీయ తిరుగుబాటుని నడిపించింది. ఆమె నేడు జాతీయ హీరోగా భావించబడుతున్నది.  అవద్ సహా-పాలకురాలు బేగం హజ్రత్ మహల్ 1857 తిరుగుబాటును నడిపించిన ఇంకో పాలకురాలు. ఈమె బ్రిటిషువారితో ఒప్పందాలని నిరాకరించి తరువాత నేపాల్ కి వెళ్ళిపోయింది. మహిళలు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యపాత్ర పోషించారు. కొంతమంది ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాళ్ళు భికాజి కామా, డా. అనీ బిసెంట్, ప్రీతిలత వడ్డేదార్, విజయలక్ష్మి పండిట్, రాజకుమారి అమ్రిత్ కౌర్, అరుణ అసఫ్ ఆలీ, సుచేత కృపలానీ, కస్తుర్బా గాంధీ. మరికొందరు ముఖ్యులు ముత్తులక్ష్మీ రెడ్డి, దుర్గాబాయి దేశ్ముఖ్మొదలైనవారు. సుభాష్ చంద్ర బోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ, లక్ష్మీ సెహగల్ని కెప్టన్‌గా, మొత్తం మహిళలతో కూడిన  ది రాణి అఫ్ ఝాన్సీ రెజిమెంట్ ను ఏర్పాటు చేసింది. కవయిత్రి, స్వాతంత్ర్య సమర యోధురాలూ అయిన సరోజినీ నాయుడు, భారత జాతీయ కాంగ్రెసుకు అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ. భారతదేశంలో ఒక రాష్ట్రానికి గవర్నరయిన మొదటి మహిళ కూడా. నేటి భారతీయ మహిళ విద్య, రాజకీయాలు, మీడియా, కళలు, సంస్కృతీ, సేవా విభాగాలు, విజ్ఞాన, సాంకేతిక రంగాలు వంటి అన్ని రంగాలలో పాల్గొంటోంది. పదిహేనేళ్ళపాటు భారతదేశపు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరా గాంధీ ప్రపంచంలో ప్రధానమంత్రిగా ఎక్కువకాలం పని చేసిన మహిళ. ఈదేశంలో  మనం కొందరు   మహిళలు గురించి తెలుసుకోవాలి.. జాన్ ఇలియట్ డ్రింక్ వాటర్ బెతూనే 1849లో బెతూనే స్కూల్ ప్రారంభించింది, ఇది 1879లో బెతూనే కళాశాలగా వృద్ధి చెంది భారతదేశంలో మొదటి మహిళా కళాశాల అయింది. 1883 లో చంద్రముఖి బసు,  కాదంబినీ గంగూలీ బ్రిటిషు సామ్రాజ్యపు మొదటి మహిళా పట్టభధ్రులయ్యారు. కాదంబినీ గంగూలీ, ఆనందీ గోపాల్ జోషి భారతదేశమునుండి పాశ్చాత్యవైద్యంలో శిక్షణ పొందిన మొదటి మహిళలు. 1905 లో సుజన్నే ఆర్ డి టాటా కారు నడిపిన మొదటి భారతీయ మహిళ. 1916 జూన్ 2న సంఘసంస్కర్త  దొండో కేశవ్ కార్వేగారిచేత కేవలం ఐదుమంది విద్యార్థులతో మొదటి మహిళా విశ్వవిద్యాలయం SNDT మహిళా విశ్వవిద్యాలయం స్థాపించబడింది. 1917 లో అన్నే బిసెంట్ భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి మహిళా అధ్యక్షురాలయింది. 1919 లో ఆమె విలక్షణమైన సామజిక సేవకు గుర్తింపుగా పండిత రమాబాయి బ్రిటీష్ రాజ్ నుంచి కైజర్-ఇ-హింద్ పురస్కారం పొందిన మొదటి మహిళ. 1925 లో సరోజినీ నాయుడు భారత జాతీయ కాంగ్రెస్కి భారతదేశంలో పుట్టిన మొదటి మహిళా అధ్యక్షురాలు. 1944 లో భారతీయ విశ్వవిద్యాలయంనుంచి సైన్స్ డాక్టరేట్ అందుకున్న మొదటి మహిళ అసిమా చటర్జీ. 1947 ఆగస్టు 15 స్వతంత్రం తరువాత సరోజినీనాయుడు యునైటెడ్ ప్రావిన్సులకి గవర్నర్ అయింది, ఈవిడ భారతదేశపు మొదటి మహిళ గవర్నరు. 1951లోడెక్కన్ ఎయిర్వేస్ కు చెందినా ప్రేమ మాథుర్ భార్తదేశపు మొదటి మహిళా వాణిజ్య పైలట్. 1953లో  విజయలక్ష్మి పండిట్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి మొదటి మహిళా అధ్యక్షురాలు  (మొదటి భారతీయ)  1959లో  అన్నా చండీ హైకోర్టుకి మొదటి మహిళా జడ్జ్ (కేరళ హై కోర్టు)  1963లో  సుచేత కృపలానీ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అయి, భారతదేశంలోని ఏ రాష్ట్రములోనైనా ఆస్థాయిని పొందిన మొదటి మహిళ అయ్యారు. 1966 లో  కేప్టన్ దుర్గ బెనర్జీ ఒక రాష్ట్ర ఎయిర్లైన్స్, ఇండియన్ ఎయిర్లైన్స్ కి పైలట్ అయిన మొదటి భారతీయ మహిళ. 1966లో  కమలాదేవి చటోపాధ్యాయ  వర్గ నాయకత్వానికిగానూ రామన్ మెగాసస్సే పురస్కారం గెలుచుకున్నారు. 1966లో ఇందిరాగాంధీ భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి. 1970లో కమల్జిత్ సందు ఏషియన్ గేమ్స్ లో బంగారు పతకం గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ. 1972లో  కిరణ్ బేడి ఇండియన్ పోలీస్ సర్వీస్ కి ఎన్నికయిన మొదటి మహిళా అభ్యర్థి. 1979లో  మదర్ థెరిస్సా నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళా పౌరురాలు. 1984 మే 23న బచేంద్ర పాల్ మౌంట్ ఎవరెస్ట్ను  అధిరోహించిన మొదటి మహిళ అయ్యారు. 1989 లో జస్టిస్ ఎం.ఫాతిమా బీవీ సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియాకి మొదటి మహిళా జడ్జ్ గా ఎన్నికయ్యారు. 1997లో కల్పనా చావ్లా గగనంలోకి వెళ్ళిన మొదటి భారత జన్మిత మహిళ. వీరందరి స్ఫూర్తితో మన సోదరీమణులు ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు...💐💐💐

 మచ్చలేని ముఖచర్మానికి ఇంట్లోనే  బ్యూటీ క్రీమ్ ఇలా సిద్దం చేసుకోండి! ఎవరిని అయినా సరే మొదట చూడగానే వారి ముఖమే గమనిస్తారు. ముఖం అందంగా ఉంటే ఇట్టే ఏదో ఆకర్షణ పుడుతుంది. అందుకే అమ్మాయిలు అందంగా తయారవ్వడానికి కష్టపడతారు. ఇప్పుడున్న మేకప్ ల ప్రభావం కారణంగా ఎలాంటి వారు అయినా మేకప్ వేయగానే హీరోయిన్స్ ను తలదన్నేలా ఉంటారు. అయితే ఎంతసేపూ ఇలా మేకప్ లు వేసి ముఖాన్ని కవర్ చేయడం, ముఖం సహజంగా అందంగా మారడం కోసం బ్యూటీ క్రీములు వాడటం చేస్తుంటారు. కానీ ఎంత వాడినా అవి  తగిన ఫలితం ఇవ్వవు. అయితే దీనికి సహజమైన చక్కని పరిష్కారం ఉంది. ఇంట్లోనే ఈజీగా బ్యూటీ క్రీమ్ తయారుచేసుకుని వాడటం వల్ల మచ్చలేని, యవ్వనమైన ముఖ చర్మం సొంతమవుతుంది. దీన్నెలా తయారుచెయ్యాలో, దీనికి కావలసిన పదార్థాలేంటో  తెలుసుకుంటే.. ఇంట్లోనే బ్యూటీ క్రీమ్ తయారుచేయడానికి కావలసిన పదార్థాలు ఇవీ.. బాదం నూనె.. 1/2టేబుల్ స్పూన్ గ్లిజరిన్..1/2 టేబుల్ స్పూన్ కొబ్బరినూనె..1/2టేబుల్ స్పూన్ యాపిల్ జ్యూస్.. 2టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్.. 1 టేబుల్ స్పూన్ విటమిన్ -ఇ టాబ్లెట్.. 1 పై పదార్థాలు అన్నీ ఒకచిన్న గిన్నెలో ఒకదాని తరువాత ఒకటి వేస్తూ మిశ్రమాన్ని బాగా మిక్స్ చెయ్యాలి. దీన్ని ఎక్కువసేపు మిక్స్ చేస్తే ఇది క్రీమ్ లాగా తయారవుతుంది. ఈ క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకుంటూ ఉంటే ముఖం మీద మచ్చలు, గీతలు,ముడతలు అన్నీ క్రమంగా తగ్గుతాయి. మరీ ముఖ్యంగా ముఖం కాంతివంతంగా తయారవుతుంది.  ఈ క్రీమ్ ను ఏ సమయంలో అయినా ఉపయోగించవచ్చు. దీన్ని చిన్న కంటైనర్ లో భద్రపరిచి ఫ్రిజ్ లో ఉంచితే వారం రోజుల పాటూ ఉపయోగించుకోవచ్చు. ఎక్కువ ఫలితాలు కావాలంటే ఈ క్రీమ్ ను రాత్రి పడుకునేముందు ముఖాన్ని శుభ్రం చేసుకుని నైట్ క్రీమ్ లాగా రాసుకుని పడుకోవాలి.                                             *నిశ్శబ్ద.

పట్టుచీరలు  ఐరన్ చేసేటప్పుడు ఈ టిప్స్ తప్పక పాటించండి! భారతీయ సాంప్రదాయానికి మెరుగులు దిద్దేవి పట్టుచీరలు. పట్టుచీరలలో అమ్మాయిలు ముస్తాబైతే వారిని చూడటానికి రెండు కళ్లు సరిపోవు. నిజానికి భారతీయత అంతా పట్టుచీరలలోనే తిష్ట వేసుకుందేమో అనిపిస్తుంది. ఇకపోతే ప్రతి మహిళ దగ్గరా పట్టుచీరలు ఉండటం కామన్. పండుగ, శుభకార్యాల సమయాలలో సందర్బానుసారంగా పట్టుచీరలు కట్టి పండుగకు మరింత అందం తెస్తారు. అయితే పట్టుచీరలను ఐరన్ చేసేటప్పుడు కొన్ని టిప్స్  పాటిస్తే మాత్రం లుక్ రెట్టింపు అవుతుంది. దుస్తులు కూడా సురక్షితంగా ఉంటాయి. ఇంతకీ పట్టుచీరలను ఐరన్ చేసేటప్పుడు పాటించాల్సిన టిప్స్ ఏంటో తెలుసుకుంటే.. ముందు జాగ్రత్త.. పట్టుచీరలను జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే దానికి చెయ్యాల్సిన మొదటి పని కొనుగోలు చేసేటప్పుడే ఆ చీరలను ఐరన్ చెయ్యచ్చా లేదా అనే విషయం తెలుసుకోవడం. ఒకవేళ పెద్ద షాప్స్ లో కొంటూ ఉంటే ఆ పట్టు రకం, దాని ఖరీదు మొదలైనవాటితో పాటూ సదరు చీరను ఐరన్ చెయ్యచ్చా లేదా అనే విషయం కూడా అందులో పొందుపరిచి ఉంటారు.  అవి చూసుకోవాలి. కవరింగ్.. పట్టుచీరలను ఎప్పుడూ నేరుగా ఐరన్ చెయ్యకూడదు. పట్టుచీర మీద ఐరన్ బాక్స్ నేరుగా పెట్టకూడదు. దానిబదులు మొదట చీరను జాగ్రత్తగా ఒక పెద్ద టేబుల్ మీద ఉంచి, చీర మీద కాటన్ క్లాత్ లేదా కాటన్ టవల్ వంటివి ఉంచాలి.పైన క్లాత్ ఐరన్ చేస్తుంటే కింద చీర ఐరన్ అయిపోతుంది. ఇలా ఐరన్ చేస్తే చీర దారప్పోగులు, రంగు దెబ్బతినవు. సెట్ చేయాలి.. ఐరన్ బాక్స్ తో ఐరన్ చేసేటప్పుడు ప్రతి ఫ్యాబ్రిక్ కు తగినట్టు  టెంపరేచర్ సెట్ చేసే సౌకర్యం ఉంటుంది. దాన్ని అనుసరించి పట్టుచీరల కోసం సిల్క్ సెట్టింగ్ చేయాలి. ఇలా చేస్తే పట్టుబట్టలకు తగినంత మాత్రమే ఉష్ణోగ్రత ప్రసారం అవుతుంది. మొదలు ఇక్కడే.. పట్టుచీరలను మొదట అంచు నుండి ఐరన్ మొదలుపెట్టాలి. తరువాత చీరల మధ్యలో ఐరన్ చెయ్యాలి. ఇలా చేస్తే ముడతలు ఉండవు. కానీ చీరలు పాడవకుండా ఉండాలన్నా, ఏమాత్రం నష్టం జరగకూడదు అన్నా ఐరన్ బాక్స్ ను చీరమీద ఒకేచోట ఎక్కువ సేపు ఉంచకూడదు. ఫైనల్ స్టెప్ మిస్టేక్.. చీరలు ఐరన్ చేశాక జాగ్రత్తగా మడతేసి బీరువాలో పెట్టడం మగువలకు అలవాటు. అలా కాకుండా ఐరన్ చేసిన చీరలను హ్యాంగర్ కు పెట్టి దాన్ని వార్డ్ రోబ్ లో వేలాడదీయాలి. కవర్లలో పెట్టడం ఇరుకైన డ్రాయర్లలో పెట్టడం చెయ్యకూడదు.                                       *నిశ్శబ్ద.

సర్వైకల్ క్యాన్సర్..  మహిళలకు ప్రాణాంతక జబ్బు ఇది..! మహిళల ఆరోగ్యానికి ఎప్పుడూ ఏదో ఒక సమస్య రక్కసిలా కోరలు చాపుకుని పొంచి ఉంటుంది. తాజాగా బాలీవుడ్ నటి , మోడల్.. పూనమ్ పాండే మహిళల ప్రాణాలను అధికంగా బలితీసుకుంటున్న సర్వేకల్ క్యాన్సర్ తో మృతిచెందింది. అప్పటికే ఈ క్యాన్సర్ గురించి పలు అవగాహనా వార్తలు, చర్యలు తీసుకుంటుంటగా.. పూనమ్ పాండే మృతి ఈ సమస్య మీద గట్టిగా చర్చించాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది.  32ఏళ్ల వయసుకే  పూనమ్ పాండే మరణానికి కారణం అయిన సర్వైకల్ క్యాన్సర్  ఎలా వస్తుంది? దీనికి చికిత్స లేదా? దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. మహిళలలో యోని, గర్భాశయాన్ని కలిపే భాగాన్ని సర్వైకల్ అని పిలుస్తారు. ఈ సర్వైకల్  ప్రాంతంలో క్యాన్సర్ కణాలు పెరిగి అవి క్రమంగా గర్బాశయంలోకి వ్యాపించి వ్యాధిని వ్యాప్తి చేస్తాయి. దీన్నే సర్వైకల్ క్యాన్సర్ లేదా గర్బాశయ క్యాన్సర్ అని అంటారు.  నిజానికి సర్వైకల్ క్యాన్సర్ అనేది అంటువ్యాధి.  హ్యూమన్ పాపిల్లోమావైరస్ ఈ వ్యాధికి కారణమవుతుంది.  కానీ ఈవైరస్ వచ్చినప్పుడు చాలా వరకు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ దీన్ని అధిగమిస్తుంది. ఈ  హ్యూమన్ పాపిల్లోమావైరస్  కూడా చాలా రకాలు ఉన్నాయి. వీటిలో కొన్ని మాత్రమే గర్భాశయ క్యాన్సర్ కు కారణం అవుతాయి. ఈ వైరస్ ఎలా సంక్రమిస్తుందంటే.. చాలావరకు ఈ వైరస్ శారీరక సంభోగం వల్లే వస్తుంది. అక్రమ సంబంధాలు కలిగి ఉండటం. ఎక్కువ మందితో రిలేషన్ మెయింటైన్ చేయడం వంటివి ఈ వైరస్ కు ఎక్కువ కారణాలు.  యోని ప్రాంతంలో ఇన్పెక్షన్లు రావడం వంటివి కూడా ఈ వైరస్ రావడానికి ప్రధాన కారణం అవుతాయి. గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు.. కటి నొప్పి మూత్రంలో రక్తం లైంగిక సంపర్కం తర్వాత రక్తస్రావం పీరియడ్స్ సమయంలో సాధారణ రక్తస్రావం కంటే ఎక్కువ పీరియడ్స్ ముగిసిన తర్వాత కూడా రక్తస్రావం కావడం వింత వాసనతో కూడిన బ్లడ్ లేదా యోని నుండి ద్రవాలు రావడం అలసట ఆకలి నష్టం వెన్నునొప్పి కాళ్ళలో వాపు గర్భాశయ క్యాన్సర్ నాలుగు దశలలో ఉంటుంది. దీనికి చికిత్స క్యాన్సర్ దశను బట్టి జరుగుతుంది. కీమెథెరపీ, రేడియేషన్ థెరపీ, టార్లెటెడ్ థెరపీ, శస్త్రచికిత్స, ఇమ్యునోథెరపీ మొదలైన పద్దతులలో దీనికి చికిత్స చేస్తారు.                                                *నిశ్శబ్ద.

విడాకులు తీసుకోవడానికి సిద్దపడ్డారా..ఈ ఐదు విషయాల గురించి స్పష్టత ఉందా ! స్నేహితులు, బంధుమిత్రుల సమక్షంలో  ఒక్కటై జీవితాంతం కలసి ఉండాలనే ఆలోచనతో పెళ్లిళ్లు చేసుకుంటారు. కానీ ఇక ఇద్దరూ కలసి ఉండటం అసాధ్యమని, ఇద్దరూ ఒక చోట ఉంటే అక్కడ పెద్ద గొడవకే దారి తీస్తుందనే పరిస్థితి వచ్చాక చట్టప్రకారంగా విడాకులు తీసుకుని విడిపోతారు. ఈ మధ్యకాలంలో విడాకులు కూడా చాలా సాధారణం అయిపోయింది.  నిజానికి భార్యాభర్తలు కష్టంగా కలసి ఉండటం కంటే ఇద్దరూ మాట్లాడుకుని ఆరోగ్యకరంగానే విడిపోవడం మంచిది. దీనివల్ల కొత్త జీవితం ప్రారంభించే అవకాశం ఉంటుంది. అయితే విడాకులు తీసుకోవడానికి సిద్దమయ్యక కొన్ని విషయాల మీద స్పష్టత అవసరం అవుతుంది. ఆ విషయాల గురించి పూర్తీగా క్లారిటీ వచ్చిందన్నాకే విడాకులు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా మహిళల జీవితంలో విడాకులు పెద్ద కుదుపుకే కారణం అవుతాయి. అప్పటికే పిల్లలున్నా, కుటుంబాలు కాస్త సాంప్రదాయంగానూ, పెద్దవిగానూ అయినా చాలా ఇబ్బందులే ఎదుర్కొంటారు. అందుకే ఈ ఐదు విషయాల మీద స్పష్టత ఉండటం ఎంతో అవసరం అవుతుంది. విడాకుల ప్రక్రియ.. విడాకులు తీసుకోవాలని  నిర్ణయించుకోవడం వేరు దాన్ని చట్టప్రకారంగా అమలు దిశగా తీసుకెళ్లడం వేరు. విడాకులు తీసుకోవాలని  నిర్ణయించుకున్నాక అనుభవజ్ఞులైన న్యాయవాదుల దగ్గరకే వెళ్లాలి. వారు విడాకుల నిర్ణయం ఎంతవరకు సరైనదో కూడా చెబుతారు. దీనివల్ల ఆవేశం మీద చీలిపోయే బంధాలు కూడా నిలబడే అవకాశం ఉంటుంది. చట్టప్రకారంగా విడాకులు తీసుకుంటే ఆ తరువాత హక్కులు, బాధ్యతలు వంటి విషయాల గురించి కూడా న్యాయవాదులు స్పష్టత ఇస్తారు. ఆర్థిక పరిస్థితి.. భర్త సంపాదిస్తున్నాడు కదా ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటే అదే సంతోషం అనుకుని చాలామంది మహిళలు పెళ్లయ్యాక ఉద్యోగాలు మానేస్తుంటారు. దీనివల్ల విడాకుల తరువాత ఇబ్బందులు తలెత్తుతాయి. భర్త నుండి భరణం లభించినా అది నేటి ఖరీదైన జీవనానికి ఎంతవరకు సరిపోతుందో చెప్పలేం. ఇకపోతే మగవారు విడాకులు తీసుకోవాలి అనుకుంటే ముందుగా తమ ఆర్థిక పరిస్థితి గమనించుకోవాలి. తమ సంపాదనలో భార్యకు భరణం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి దాని గురించి ఆలోచించి ముందడుగు వెయ్యాలి. పిల్లల గురించి ఆలోచన.. చాలా కేసులలో భార్యాభర్తల గొడవల కారణంగా పిల్లలు తల్లిదండ్రుల  ప్రేమను కోల్పోతారు. తల్లిదండ్రుల విడాకుల తరువాత ఇద్దరి ప్రేమను ఉమ్మడిగా పొందే అవకాశం పిల్లలకు ఉండదు. పైపెచ్చు పిల్లలు ఎవరో ఒకరి దగ్గరున్నా, వారి సంరక్షణ విషయంలో ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఎదురవుతాయి. నిజానికి విడిపోయిన తల్లిదండ్రుల కారణంగా పిల్లలు కూడా సమాజం నుండి చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటి గురించి ఆలోచించాలి. విడాకులు తీసుకోవడం అంత ఈజీ కాదు.. సినిమాల్లోనూ, సీరియళ్లలోనూ చూపించినంత ఈజీగా విడాకుల వ్యవహారం ముగిసిపోదు. దానికి చాలా పెద్ద తతంగమే నడుస్తుంది. విడాకుల గోల నడుస్తుండగానే ఆ ఒత్తిడి భరించలేక చాలా సార్లు డిప్రెషన్ వంటి సమస్యలు కూడా ఎదురుకావచ్చు. అందుకే విడాకుల విషయం పూర్తీగా స్పష్టత వచ్చాకనే ముందుకు వెళ్లాలి. ఆ తరువాత కూడా కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో కలుస్తూ గతం తాలూకు విషయాలు చాలా వరకు అధిగమించాలి. భాగస్వామ్యం అవసరం.. విడాకులు కావాలంటే ఓ లాయర్ ను నియమించుకోవాలి. కేవలం లాయర్ ను నియమించుకుంటేనే కాదు.. విడాకులకు గల కారణాలను ఆధారాలతో సహా కోర్టు వారి ముందు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కోర్టు అడిగే ప్రతి విషయంలో చురుగ్గా స్పందించాలి. విడాకుల చట్టంలో నియమాలు, సందేహాలు తప్పని సరిగా తెలుసుకోవాలి. లీగల్ ప్రోసీడింగ్ గురించి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా భవిష్యత్తు గురించి ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలి.                                                  *నిశ్శబ్ద.  

మహిళలూ ఆర్థిక విషయాల్లో జాగ్రత్త తప్పనిసరి! మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. నేటికీ కొంతమంది మహిళలు ఆర్థికపరమైన విషయాల్లో తండ్రి, సోదరుడు, భర్త...ఇలా ఎవరొకరిమీద ఆధారపడుతుంటారు. ఆర్థికపరమైన అంశాలపట్ల సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణమంటున్నారు నిపుణులు. ఇంకొంతమంది మహిళలు తాము సంపాదించిన మొత్తాన్ని పరిస్థితులకు అనుగుణంగా తమ భర్త చేతిలో పెట్టడం వల్ల చిన్న చిన్న అవసరాలకు కూడా వాళ్ల వద్ద చేయి చాచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా చేతినిండా సంపాదన ఉన్నా...చాలా మంది మహిళలు ఆర్థికపరంగా నేటికీ పురుషులపై ఆధారపడాల్సి వస్తుంది. అయితే ఇకనైనా మేల్కోని ఈ ధోరణిని మార్చుకోవాలి. లేదంటే అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పవు. ఈ క్రమంలో వివాహం జరిగినప్పటినుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని చెబుతున్నారు. ఉద్యోగం మానకూడదు: కొంతమంది వ్యక్తిగత కారణాలు, కుటుంబ పరిస్థితుల కారణంగా అప్పటివరకు తాము చేస్తోన్న ఉద్యోగానికి రాజీనామా చేస్తుంటారు. ఇంకొంతమంది సంపాదించాల్సిన అవసరం లేదని ఈ నిర్ణయం తీసుకుంటారు. ఈ రెండూ కూడా ఆర్థికంగా చేటు చేసే నిర్ణయాలే అని చెబుతున్నారు నిపుణులు. మొదట్లో బాగానే ఉన్నా తర్వాత భవిష్యత్తులో ప్రతి చిన్న అవసరానికీ భర్త మీదే ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి పెళ్లైనా ఉద్యోగం మానకపోవడమే మంచిది. తద్వారా భవిష్యత్తులో ఒంటరిగా జీవించాల్సి వచ్చినా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అవగాహన పెంచుకోవాలి: ఆర్థిక విషయాల్లో పెళ్లికి ముందు తండ్రిపై...పెళ్లి తర్వాత భర్తపై ఆధారపడే అమ్మాయిలు ఈ కాలంలో చాలా మంది ఉన్నారు. ఆర్జన వరకు బాగానే ఉన్నా...డబ్బు పొదుపు మదుపు విషయాల్లో అవగాహన లోపమే దీనికి కారణం. అయితే ప్రతి చిన్న దానికీ ఇతరులపై ఆధారపడటం వల్ల వాళ్లు అందుబాటులో లేనప్పుడు ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది. కాబట్టి డబ్బులను ఎందులో పొదుపు చేయాలి లాభాలు ఆర్జించాలంటే వేటిలో పెట్టుబడులు పెట్టాలనే ప్రథమిక విషయాలపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం అంటున్నారు నిపుణులు అలాని ఒకేసారి అన్ని విషయాల గురించి తెలుసుకోవడం ఎవరితోనూ సాధ్యం కాదు. కాబట్టి నిపుణుల సలహాలు పాటిస్తూ ఉండాలి. ఇవి కూడా గుర్తుంచుకోవాలి... మహిళలు తప్పకుండా వైద్య బీమా చేయించుకోని ఉండాలి. అనుకోని అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టకుండా ఉంటుంది. మీ అత్తమామలు, భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఏవైనా పత్రాలపై సంతకం చేయమని అడుగుతే గుడ్డిగా చేయకండి. వాటిని క్షుణ్ణంగా చదివిన తర్వాతే చేయాలా వద్దా అనేది నిర్ణయించుకోండి. పెళ్లికి ముందు తర్వాత మహిళలకు పుట్టింటివారు మెట్టినింటి వారి నుంచి వచ్చే బహుమతులు, కానుకలు స్త్రీధన్ అంటారు. అవి పెట్టుబడులు, స్థిరాస్తి, చరాస్తి, డబ్బు, బంగారం ఇలా ఏ రూపంలో అయినా ఉండవచ్చు. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లను జాగ్రత్తగా భద్రపరుచుకోవడం ముఖ్యం.  

వాషింగ్ మెషీన్ లో దుస్తులు వేసే అలవాటు ఉంటే ఈ పనులు మాత్రం చెయ్యకండి! స్నానం చెయ్యడం, ఉతికిన  దుస్తులు ధరించడం పిల్లల నుండి పెద్దల వరకు పాటించే అలవాటు. అయితే వాషింగ్ మెషిన్ వాడే అందరికీ అందులో దుస్తులు వేయడం గురించి సరైన అవగాహన ఉండదు. కొందరు తెలిసీ తెలియక కొన్ని రకాల దుస్తులు వేయడం వల్ల దుస్తులు చాలా దారుణంగా దెబ్బతింటాయి.  అసలు వాషింగ్ మెషీన్లో వేయకూడని దుస్తులేంటో తెలుసుకుంటే.. ఉన్ని దుస్తులు.. ఉన్నిదుస్తులను వాషింగ్ మెషీన్లో అస్సలు వేయకూడదు. దీనివల్ల దుస్తులు చాలా దారుణంగా దెబ్బతింటాయి. ముఖ్యంగా ఉన్ని దారాల మధ్య గ్యాప్ పెరిగిపోయి దుస్తులు చాలా వదులుగా తయారవుతాయి. దీనివల్ల ఈ దుస్తులను చలికాలంలో వేసుకున్నా చలిని నియంత్రించలేవు. పైపెచ్చు ఉన్నిదుస్తులు వాషింగ్ మెషీన్లో వేస్తే రంగు కోల్పోయనట్టు డల్ గా తయారవుతాయి. లెదర్ దుస్తులు.. అబ్బాయిలు లేదా అమ్మాయిలు లెదర్ దుస్తులను వాడుతుంటారు. ముఖ్యంగా లెదర్ జాకెట్లు చాలామందికి ఉంటాయి. అదే విధంగా తోలుతో తయారైన ఇతర దుస్తులు కూడా ఉంటాయి.  కానీ వీటిని వాషింగ్ మెషీన్లో వేయకూడదు. ఇవి తొందరగా మన్నిక తగ్గడమే కాదు, రంగు నుండి చాలా విధాలుగా నష్టం జరుగుతుంది. పట్టుబట్టలు.. పట్టు దుస్తులు  అమ్మాయిల దగ్గర ఖచ్చితంగా ఉంటాయి. ఆడవాళ్ళు వీటిని చాలా అపురూపంగా చూసుకుంటారు. పైగా ఇవి ఖరీదు కూడా ఎక్కువ. తెలిసీ తెలియనితనంతో పొరపాటుగా  పట్టు దుస్తులను వాషంగ్ మెషీన్లో వేస్తే అంతే సంగతులు. దుస్తుల పోగులు పైకి లేవడమే కాకుండా పట్టుదుస్తులు వాషింగ్ మెషీన్లో వేస్తే బట్ట కుచించుకుపోతుంది. దుస్తుల రూపమే మారిపోతుంది. స్టక్చర్డ్ దుస్తులు.. ఫ్యాషన్లో భాగంగా ముడతలతో కూడిన దుస్తులు వస్తుంటాయి. వీటిని ప్లీటెడ్ దుస్తులు అని కూడా అంటారు. ఈ దుస్తులను వాషింగ్ మెషీన్లో అస్సలు వేయకూడదు. ఇలాంటి దుస్తులు వాషింగ్ మెషీన్లో వేస్తే బట్టల నాణ్యత దెబ్బతింటుంది. దుస్తుల రూపం చెడిపోతుంది.                                      *నిశ్శబ్ద.  

సంక్రాంతి సంబరాలలో ముఖం మెరిసిపోవాలంటే ఇలా చేయండి! ' సంక్రాంతి పండుగ వస్తోంది. ఈ పండుగలో అమ్మాయిల అందం, వారు వేసే ముగ్గులతో పోటీ పడుతూ ఉంటుంది. ఇక వస్త్రధారణ సరేసరి. ఎంత అందంగా తయారు అయినా మగువల ముఖం వెలవెలబోతుంటే ఏమీ బాగుండదు. పండుగ కళ మొత్తం ముఖంలో కనిపించాలన్నా, ముఖం గాజులా  మెరిసిపోవాలంటే కొరియన్ స్టైల్ గ్లాసీ స్కిన్ కోసం ప్రయత్నం చెయ్యాలి.  కొరియన్ అమ్మాయిలకు ఉన్నట్టు ముఖం గాజులా మెరిసిపోవడానికి ప్రముఖ నటి ప్రియాంక చోప్రా తల్లి డాక్టర్  మధు చోప్రా  ఓ అద్భుతమైన చిట్కా చెప్పారు. దీన్ని ఫాలో అవుతుంటే 50 ఏళ్ల వయసు వచ్చినా ముఖంలో ఏ చిన్న ముడత కనిపించదు. అదేంటో తెలుసుకుంటే.. కొరియన్ అమ్మయిల్లా గ్లాసే స్కిన్ కావాలి అంటే రైస్ వాటర్ చాలా బాగా పనిచేస్తుంది. చాలామంది రైస్ వాటర్ అంటే బియ్యపు కడుగుతో ముఖం కడుగుతుంటారు, అదే ముఖానికి స్ప్రే చేస్తుంటారు. కానీ రైస్ వాటర్ తయారు చేసుకోవడం, ముఖానికి అప్లై చేయడం పూర్తిగా విభిన్నమైన పద్దతి.  సరైన  జుట్టుకు మాత్రమే కాకుండా చర్మాన్ని కాంతివంతం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.  ఇప్పట్లో బియ్యం నీటిని అనేక చర్మ సంరక్షణ ఉత్పత్తులలో కూడా ఉపయోగిస్తున్నారు. వీటిలో అమినో యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు,  మినరల్స్ మంచి పరిమాణంలో ఉంటాయి, ఇవి వృద్ధాప్య ప్రక్రియను మందగించడంలో సహాయపడతాయి. బియ్యం నీరు చర్మశుద్ధి, మచ్చలు,  వడదెబ్బ సమస్య నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.. ముందుగా అరకప్పు బియ్యాన్ని బాగా కడిగి కొంచెం నీళ్ళు వేసి స్టౌ మీద పెట్టి ఉడికించాలి. బియ్యం ఊడుకు పట్టిన తరువాత స్టౌ ఆఫ్ చేసి బియ్యంలో ఉన్న నీటిని వేరు చేయాలి. సాధారణంగా దీన్ని స్టార్చ్ అని అంటారు. ఇది మరీ పలుచగా ఉండకూడదు. కాసింత గట్టిగానే ఉండాలి. అందులో అలోవెరా జెల్,  కొన్ని చుక్కల ఆముదం కలపాలి.  చర్మం జిడ్డుగా ఉంటే కొద్దిగా నిమ్మరసం జోడించవచ్చు. కానీ  చర్మం పొడిగా ఉంటే ఆలివ్ నూనె వేసి కలపాలి. ఇదే రైస్ వాటర్ మాస్క్. ఈ పేస్ట్‌ను రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ముఖాన్ని కడిగి ఆరిన తరువాత దీన్ని ముఖానికి అప్లై చేయలి..  దీన్ని ముఖానికి మాస్క్ లాగా అప్లై చేసుకోవచ్చు. మొదట్లో ఇది ముఖాన్ని శుభ్రపరిచి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.   ఏడు రోజుల పాటు ఈ రెమెడీని కంటిన్యూగా పాటించడం వల్ల గాజులాంటి మెరిసే చర్మం  సొంతమవుతుంది. దీన్ని లైఫ్ స్టైల్ లో భాగం చేసుకుంటే 50 యేళ్లు వచ్చినా ముఖంలో ముడతలు, మచ్చలు కనిపించవు.                                     *నిశ్శబ్ద.

స్త్రీలు తెలుసుకోవలసిన  జనన నియంత్రణ మార్గాలు..! సెక్స్, అబార్షన్,  గర్భనిరోధకం, ఈ మూడు అంశాలు నేటికీ వివాదాస్పదంగా ఉన్నాయి. గర్భాన్ని నిరోధించడానికి గర్భనిరోధకాలు వాడతారన్నది నిజం. కానీ వాటి ఉపయోగం ఒకే ప్రయోజనానికి పరిమితం కాదు. వారి స్వంత ప్రాణశక్తి ప్రకారం అనుసరించడానికి ఏ మార్గం అనుకూలంగా ఉంటుంది? లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులను ఎలా నివారించాలి? వాటిని ఉపయోగించడం వల్ల దుష్ప్రభావాలు ఉన్నాయా? అవి ఎంత ప్రభావవంతంగా ఉన్నాయి?సురక్షితమైన సెక్స్ కోసం గర్భనిరోధక పద్ధతులను ఎంచుకునే ముందు పరిగణించవలసిన అనేక అంశాలు ఉన్నాయి. బాహ్య కండోమ్: కండోమ్ అంటే సాధారణంగా బాహ్య కండోమ్ అని అర్థం. ఇది మగ జననేంద్రియాల పైన అమర్చబడుతుంది. ఈ కండోమ్ రబ్బరుతో తయారు చేయబడింది. వీటి వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి గర్భధారణను నివారించడమే కాకుండా లైంగికంగా సంక్రమించే వ్యాధులను కూడా నిరోధిస్తాయి. వీటి వల్ల అలర్జీలు రావచ్చు. అంతర్గత కండోమ్: ఇది మహిళల కోసం తయారు చేయబడింది. చాలా బాహ్య కండోమ్‌లు రబ్బరు పాలుతో తయారు చేస్తారు. అంతర్గత కండోమ్‌లలో రబ్బరు పాలు ఉండవు. వీటిని మహిళలు తమ ప్రైవేట్ పార్ట్‌లలో ధరిస్తారు. కాపర్టీ: IUD అనేది స్వచ్ఛమైన రాగి లోహంతో తయారు చేయబడిన పరికరం. దీనికి ప్లాస్టిక్ పూత ఉంటుంది. ఇది గర్భాశయం లోపల అమర్చబడుతుంది. ఈ సాధనం నైలాన్ థ్రెడ్‌ను కలిగి ఉంది. ఒకసారి ఇన్‌స్టాల్ చేస్తే 10 సంవత్సరాల వరకు సరిగ్గా పని చేస్తుంది. ఇవి 99% గర్భాన్ని నివారిస్తాయి. గర్భనిరోధక మాత్ర: ఇవి అత్యంత ప్రాచుర్యం పొందిన జనన నియంత్రణ పద్ధతుల్లో ఒకటి. ఇది రోజుకు ఒకసారి తీసుకోవలసిన చిన్న మాత్ర. ఈ మాత్ర వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, ఈ మాత్రను సమయానికి తినడం మర్చిపోకుండా తీసుకోవడం చాలా అవసరం. చాలా ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే ఇది సెక్స్ చర్యతో జోక్యం చేసుకోదు.  ఈ మాత్రను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మాత్రమే తీసుకోవాలి. అందువల్ల, వైద్యుడిని చూడటం చాలా అవసరం.ఇవి సురక్షితమైనవి అయినప్పటికీ, దుష్ప్రభావాలు కలిగిస్తాయి.  

తొడల కొవ్వు తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నారా.. ఈ అయిదు టిప్స్ ఫాలో అయిపోండి! శరీర సౌష్టవం బాగుంటే ఎక్కడలేని ఆత్మవిశ్వాసం వస్తుంది. శరీర సౌష్టవం సరిగా లేకపోతే ఎవరో ఒకరు ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. బాడీ షేమింగ్ పట్టించుకోనక్కర్లేదు.. అని  చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అసలు శరీర సౌష్టవం దెబ్బతింటే దాన్నలాగే ఎందుకు వదిలేయాలి. నిజానికి శరీరాకృతి మారిపోయిన శరీరంలో ఏదో ఒక అసౌకర్యం, ఏదో ఒక సమస్య ఉండనే ఉంటాయి. అందుకే శరీరాన్ని చక్కని రూపానికి తెచ్చుకోవడం మంచిది. మహిళలలో ఎక్కువగా తుంటి భాగంలో కొవ్వు పేరుకుని పోతుంటుంది. దాన్ని వదిలించుకోవడానికి కష్టపడుతుంటారు. అయితే తుంటి కొవ్వు తగ్గించుకోవడానికి ఐదెంటే ఐదే టిప్స్ ఫాలో అయితే చాలు.. లోయర్ బాడీ వ్యాయామాలు.. తుంటి కొవ్వు తగ్గాలంటే లోయర్ బాడీ అంటే దిగువ శరీరం వ్యాయామాలు ఫాలో కావాలి. హిప్స్, గ్లుట్ లను చక్కని ఆకృతిలోకి తీసుకురావడానికి లంగ్స్, స్క్వాట్ ల, లెగ్ రైజ్ లు వంటి దిగువ శరీర వ్యాయామాలు చక్కగా ఉపయోగపడతాయి. వీటిని రోజూ ప్రాక్టీస్ చేయాలి. కౌంట్ పెంచాలి.. వ్యాయామంలో భాగంగా చాలామంది నడవడం, జాగింగ్, రన్నింగ్, మెట్లు ఎక్కడం మొదలైనవి ఫాలో అవుతారు. వీటిని సాధారణంగా చేయడం కంటే మరికాస్త ఎక్కువ సమయం పొడిగించి చేయాలి. ఇవి హిప్ కండరాలను బిగించి చక్కని ఆకృతి రావడంలో సహాయపడతాయి. కార్డియోవాస్కులర్ వ్యాయామాలు అదనపు కేలరీలు వదిలించుకోవడానికి సహాయపడతాయి. ఈ ఫుడ్ కు దూరం.. ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. వీటిలో అసంతృప్త కొవ్వులు, అదనపు చక్కెరలు ఉంటాయి. ఇవి తుంటి భాగంలో పేరుకుని పోతాయి. వీటని తింటూ ఎన్ని వ్యాయామాలు చేసినా ఫలితం శూన్యం. వీటికి బదులుగా బరువు తగ్గడానికి ఉపయోగపడే ఆహారాలు, విటమిన్లు, ఖనిజాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. పైబర్ ఆహారానికి పెద్ద పీట వేయాలి. నీరు.. నీరు శరీరానికి ఇంధనం వంటిది. ప్రతిరోజూ శరీరానికి తగిన మోతాదులో నీటిని తాగడం వల్ల శరీరంలో టాక్సిన్ లు బయటకు పోతాయి. శరీరంలో అన్ని అవయవాల పనితీరు బాగుంటుంది.   బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. నిద్ర.. శరీరంలో కణాల మరమ్మత్తు జరగడానికి నిద్ర కూడా చాలా ముఖ్యం. శరీరంలో పేరుకున్న కొవ్వు కోల్పోవడానికి నిద్ర ప్రముఖ పాత్ర వహిస్తుంది. నిద్ర శరీరానికి ఊరటనిస్తుంది. తద్వారా బరువు తగ్గడానికి శరీరం  చురుగ్గా ఉంటుంది.                                                          *నిశ్శబ్ద

స్వెట్టర్లు, ఉన్ని దుస్తులు ఉతికేటప్పుడు ఈ తప్పులు చేయకండి! చలికాలం రాగానే ప్రతి ఇంట్లో ఏ అల్మరాలోనో, బీరువాల్లోనో భద్రం చేసిన ఉన్ని దుస్తులు అన్ని బయటకు తీస్తారు. వీటిలో చేతి తొడుగులు, మంకీ క్యాప్ లు, స్వెట్టర్లు, ఉన్ని దుప్పట్లు, చెవులకు రక్షణ ఇచ్చే వివిధ రకాల దుస్తులు ఉంటాయి. అయితే అన్ని రోజులు బీరువాల్లోమూలిగి ఉన్నవాటిని బయటకు తీయగానే వాటిని ఉతికి వాడటం చాలా మంది చేసే పని. కానీ ఉన్ని దుస్తులను ఉతకడంలో చాలామంది తప్పులు చేస్తారు. ఈ కారణంగా అవి తొందరగా పాడవుతాయి. ఉన్ని దారాలు పైకి పొలుసుల్లా లేచి దుస్తులను తొందరగా పాడైపోయేల చేస్తాయి. ఉన్ని దుస్తులు ఉతికేటప్పుడు అస్సలు చేయకూడని మిస్టేక్స్ తెలుసుకుంటే..  ఉన్నితో చేసిన బట్టలు చాలా సున్నితమైనవి. వాటిని మెయింటైన్ చేయడం,  శుభ్రపరచడం చాలా జాగ్రత్తగా చేయాలి, లేకుంటే వాటి  మెరుపు,  వెచ్చదనం ఇచ్చే లక్షణాలను కోల్పోతుంది. చాలా మంది తప్పులు చేసేది ఇక్కడే.  స్వెట్టర్లను ఉతకడంలో తప్పులు చేస్తే  అవి కొన్ని రోజుల్లో పనికిరాకుండా పోయే అవకాశం ఉంటుంది.   వాషింగ్ మెషిన్ లో వేయొద్దు.. ఉన్ని బట్టలు చాలా సున్నితంగా ఉంటాయి. వాషింగ్ మెషిన్ లో బట్టల గమనం చాలా వేగంగా ఉంటుంది. పైపెచ్చు వాషింగ్ మెషిన్ లో బట్టల మీద ఒత్తిడి ఎక్కువ ఉంటుంది.  దీనివల్ల బట్టలు తీవ్రంగా దెబ్బతింటాయి. అందుకే స్వెటర్లను ఎల్లప్పుడూ చేతులతో సున్నితంగా రుద్దుతూ శుభ్రం చెయ్యాలి. . అలాగే బ్రష్‌తో కూడా రుద్దకూడదు. ఇలా ఉతికితే ఉన్ని దుస్తులు మీద పొరలు లేస్తాయి.   నీటిలో నానబెట్టకూడదు.. స్వెటర్లు లేదా ఏదైనా ఉన్ని బట్టలు డిటర్జెంట్ నీటిలో కానీ సాధారణ నీటిలో కానీ ఎక్కువ సేపు  నానబెట్టకూడదు. దీంతో అవి త్వరగా పాడైపోతాయి. అంతేకాకుండా, దాని రంగు కూడా పోతుంది.  డిటర్జెంట్ పౌడర్ వొద్దు.. ఏళ్ల తరబడి డిటర్జెంట్ పౌడర్ వాడే అలవాటు ఉండటంతో అందులో బట్టలు ఉతకడం మామూలే. కానీ బట్టల నుండి పౌడర్ సరిగ్గా వదలదు.   దీని కారణంగా బట్టలు పాడవుతాయి. అందువల్ల, స్వెటర్లను కడగడానికి డిటర్జెంట్ ద్రవాన్ని ఉపయోగించడం మంచిది. లిక్విడ్ డిటర్జెంట్ అయితే దుస్తులు శుభ్రం చేయడం సులువే కాదు సువాసన కూడా బాగుంటాయి.                              *నిశ్శబ్ద.

 ప్రసవానంతర స్త్రీలు ఈ తప్పు చేయకూడదు.! ప్రసవం తర్వాత మహిళలు పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. మహిళలు తమ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. నార్మల్ డెలివరీ అయినా.. సిజేరియన్ డెలివరీ అయినా.. ఇలాంటి వాటిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భారీ వస్తువులను ఎత్తడం మానుకోండి: ప్రసవించిన తర్వాత, మహిళలు తమను.. వారి నవజాత శిశువును అలాగే ఇంటి పనులను జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటి సందర్భాలలో, వారు తరచుగా నీటితో నింపిన బకెట్లు, ఉతికిన బట్టలు మొదలైన బరువైన వస్తువులను ఎత్తుతుంటారు. అలాంటి బరువైన వస్తువులను ఎత్తడం వల్ల పొత్తికడుపుపై చాలా ఒత్తిడి పడుతుంది. ఇది కడుపు నొప్పి లేదా నడవడానికి ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి, ఎలాంటి బరువైన వస్తువులను ఎత్తకుండా ఉండండి. పదే పదే మెట్లు ఎక్కడం: నార్మల్ డెలివరీ అయినా, సిజేరియన్ అయినా.. మహిళలు కొన్ని రోజులు మెట్లు ఎక్కడం, దిగడం మానేయాలి. మీరు రోజుకు ఒకసారి మాత్రమే ఎక్కవలసి వస్తే, పదే పదే మెట్లు ఎక్కడం మంచిది కాదు. ఇది ప్రసవ సమయంలో వేసిన కుట్లు తెరుస్తుంది. నొప్పిని పెంచుతుంది. పిల్లల పనులన్నీ మీరే చేయకండి: సాధారణంగా తల్లులు మాత్రమే పిల్లల బాధ్యత తీసుకుంటారు. పురుషులు కూడా తమ బాధ్యతను కొంతమేరకు మోయాలి. డెలివరీ అయిన వెంటనే బిడ్డకు పూర్తి జాగ్రత్తలు తీసుకోవద్దు. బదులుగా, ఇంటిలోని ఇతర సభ్యులతో పిల్లల బాధ్యతను పంచుకోండి. ఇది మీకు విశ్రాంతి తీసుకోవడానికి సమయాన్ని ఇస్తుంది. మీరు కోలుకోవడంలో సహాయపడుతుంది. రాత్రికి సరిపడా నిద్ర పట్టదు: పిల్లలు రాత్రంతా మేల్కొని ఉంటారని తరచుగా చెబుతారు. పిల్లలతో ఉన్న తల్లులు కూడా అప్రమత్తంగా ఉండాలి. మీరు పుట్టిన వెంటనే పూర్తి విశ్రాంతి తీసుకోకపోతే, మీ కోలుకోవడం నెమ్మదిగా ఉంటుంది. ఈ రకమైన పరిస్థితి మీకు చికాకు కలిగిస్తుంది. వేగంగా కోలుకోవడానికి, బాగా విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. శిశువు రాత్రిపూట నిద్రపోకపోతే, మీరు విశ్రాంతి తీసుకునేలా శిశువును జాగ్రత్తగా చూసుకోమని అమ్మకు కానీ అత్తకు కానీ లేదంటే ఇతర కుటుంబ సభ్యులకు అప్పగించండి. శిశువు నిద్రిస్తున్నప్పుడు, మీరు శిశువుతో నిద్రిస్తారు. పరిశుభ్రత గురించి పట్టించుకోవాలి: ప్రసవం తర్వాత పరిశుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ కాలంలో కాస్త అప్రమత్తత లోపించినా ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. ప్రత్యేకించి, సాధారణ ప్రసవం ఉన్న మహిళలు తమ యోని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు మీ ప్యాంటీని క్రమం తప్పకుండా మార్చాలి. మూత్రవిసర్జన సమయంలో మీ ప్రైవేట్ భాగాలను నీటితో కడగాలి.  కనీసం 40 రోజులు లైంగిక సంపర్కానికి దూరంగా ఉండండి.

చలికాలంలో చర్మం పగుళ్లా.. ఇదొక్కటి వాడితే మెరిసిపోతారు! చలికాలం  పాటలలోనూ, సినిమాలలోనూ మాత్రమే బాగుంటుంది. కొన్ని సార్లు వేడి వేడి ఆహారం, పకోడిలో, కాల్చిన మొక్కజొన్న పొత్తుల కోసమో చలికాలాన్ని తల్చుకుంటాము. కానీ నిజానికి చలికాలం వచ్చిందంటే పెద్ద పెట్టున చర్మానికి ఎసరు పెడుతుంది. చర్మం పగిలిపోతుంది. కొన్నిసార్లు చర్మం ఎర్రగా మారిపోయి రక్తం కూడా కారుతుంది. ఇంట్లోనుండి అడుగు బయట పెట్టాలన్నా, స్లీవ్ దుస్తులు వేసుకోవాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ వీటన్నింటికి కేవలం ఒకే ఒక్కటి చెక్ పెడుతుంది. అదే తేనె. తేనెను ఆయుర్వేదం అమృతంతో పోలుస్తుంది.తేనెలో ఎన్నోపోషకాలు, మరెన్నో ఔషద గుణాలు ఉన్నాయి. కొన్ని సార్లు తేనెను సౌందర్య సాధానంగా కూడా ఉపయోగిస్తారు. అసలు చలికాలంలో తేనెను ఎందుకు వాడాలి? ఎలా వాడితే చర్మం మెరుస్తుంది? చాలామంది తేనెను ఉదయాన్నే వేడినీళ్లలో వేసుకుని తాగుతుంటారు. కానీ చలికాలంలో తేనెను ముఖానికి రాసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. తేనె చర్మం మీద లోతుగా పేరుకున్న మలినాలను తొలగించి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు చర్మాన్ని రిపేర్ చేస్తాయి. చర్మం మీద ముడుతలు తగ్గిచడంలో, వాడిన చర్మానికి జీవం ఇవ్వడంలో తేనె ది బెస్ట్. చలికాలంలో ముఖ చర్మం పగలడం వల్ల, చలి కారణంగా చర్మం మీద దురద, మచ్చలు వస్తాయి. కానీ పెరుగులో తేనెను కలిపి రాసుకోవాలి.  లేదంటే శనగపిండిలో తేనె కలిపి ముఖానికి రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. దీని వల్ల ముఖ చర్మం మీద మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. ముడతలు పడి వదులుగా మారిన చర్మం తిరిగి బిగుతుగా మారాలంటే  తేనె బెస్ట్ ఫలితాలు ఇస్తుంది. నిమ్మరసం లేదా యాపిల్ సైడర్ వెనిగర్ లో తేనె వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి రాసుకుంటే ఈ ముడతలు పోయి ముఖం యవ్వనంగా మారుతుంది.                                                          *నిశ్శబ్ద.

భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి ఈ ఐదే ప్రధాన కారణాలట! సంతోషకరమైన వైవాహిక జీవితం,  సంతోషకరమైన కుటుంబం చాలా మంది కల. వివాహాం తరువాత  ప్రతి జంట సంతోషంగా ఉండటానికే ప్రయత్నిస్తుంది. ఏడు జన్మల సంబంధం అనుకునే వివాహ బంధాన్ని ఒక్క జన్మకు కూడా కొనసాగించలేని పరిస్థితులు ఎదురవుతాయి. భార్యాభర్తలు తమ బంధంలో తీసుకునే నిర్ణయాలు, వారి అభిప్రాయాలు కొన్నిసార్లు   వారి సంబంధానికి శత్రువులుగా మారతాయి. ఇదే వారి మధ్య పెద్ద అడ్డుగోడ కడుతుంది. ఇది ద్వేషంగా కూడా మారుతుంది. ఈ ద్వేషం మితిమీరిపోతే ఎంతో సంతోషంగా గడపాల్సినవారు కాస్తా  విడిపోవాలని నిర్ణయించుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీసే ముఖ్యమైన విషయాలేంటో ముందే తెలుసుకుని వాటిని తమ జీవితంలో పొరపాటున కూడా ప్రస్తావించకపోవడం ఉత్తమం. అన్నింటిలో తప్పులు, లోపాలు వెతకడం.. ఎప్పుడూ ఒకరి వ్యక్తిత్వంలో లేదా పనిలో  లోపాలను వెతుక్కునే భార్యాభర్తలు బంధాన్ని  నిలకడగా నిలుపుకోలేరు. ఒకరిలోపాలను ఒకరు పదే పదే ఎత్తిచూపుతుంటే ఆ సంబంధం చాలా ప్రతికూలంగా మారుతుంది.  కొంతకాలం తర్వాత ఇద్దరూ విడిపోవడమే మంచిదనే ఆలోచన కూడా పుడుతుంది. నిజానికి ఇలా తప్పులు ఎంచడం భార్యాభర్తల బంధంలోనే కాదు.. వేరే ఏ బంధంలో కూడా మంచిది కాదు. ఒక్కరిమీదే భారం ఉండటం.. వైవాహిక జీవితంలో భాగస్వాములిద్దరూ సమానంగా  ఉండాలి. భర్త ఉద్యోగం చేస్తే భార్య ఇంటిపని చూసుకోవడం, భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తే ఇంటి పనులు ఇద్దరూ చూసుకోవడం చేయాలి. అలాగే ఎవరికి నచ్చిన పనిని వారు మాత్రమే చేసుకోకుండా ఇద్దరూ కలసి చేయాలి. నీ పని నీది, నాపని నాది అనే భావన పొరపాటున కూడా చూపించవద్దు. వ్యక్తిగతానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటే భార్యాభర్తల మధ్య  తాము ఒక్కటనే ఫీలింగ్ కొరవడుతుంది. ఫోన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం.. ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామి కంటే తన ఫోన్‌పై ఎక్కువ శ్రద్ధ చూపితే అది వారి సంబంధంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.  ఈ అలవాటు వల్ల దాంపత్య సంతృప్తి తగ్గుతుందని, రోజుకోక గొడవ సర్వసాధారణమైపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ప్రజలను డిప్రెషన్ వైపు నడిపిస్తాయి. బంధం చీలిపోవడానికి కారణం అవుతాయి. మనీ మేనేజ్మెంట్ సరిగా లేకపోవడం.. డబ్బు నిర్వహణలో సరైన అవగాహన లేని భాగస్వాములతో కలసి జీవించడానికి చాలా మంది అనాసక్తి చూపిస్తారు. డబ్బు బ్రతకడానికి ప్రధాన వస్తువు అయినప్పుడు దాన్ని మేనేజ్ చేయడం చాలా బాగా తెలిసి ఉండాలి. డబ్బును నిర్లక్ష్యం చేసేవారితో భాగస్వాములు ఎక్కువగా గొడవలు పడతారు.  ఇలాంటి గొడవలు  జరగడం ఆ తరువాత గొడవలు మాములు అయిపోవడం కూడా జరుగుతుంది. అన్నీ లెక్కలు వేసుకోవడం..  భాగస్వామి కోసం తాము చేసిన ఖర్చులను  ఎప్పుడూ  లెక్కగట్టే వారు కొందరు ఉంటారు. ఇలాంటివారు డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారేమో అనిపించేలా ఉంటుంది వారి ప్రవర్తన. భాగస్వామితో సంతోషాలను వారికోసం చేసే ఖర్చును మాటిమాటికి లెక్కవేయడం, దాన్ని పదే పదే భాగస్వామి దగ్గర ప్రస్తావించడం వల్ల  వైవాహిక జీవితంలో సంతోషం దెబ్బతింటుంది.                                                         *నిశ్శబ్ద

దీపాలకాంతితో అమ్మాయిల  అందం పోటీ పడాలంటే ఇలా చెయ్యాల్సిందే!  దీపావళి భారతదేశ ప్రజలందరూ పెద్ద ఎత్తున సంతోషంగా జరుపుకునే పండుగ. అందుకే ఎక్కడ చూసినా ఈ పండుగ వైభవం కనిపిస్తుంది. ఇది హిందూ మతానికి చాలా  ప్రత్యేకమైన పండుగ.   ప్రతి ఏడాది దీన్ని చాలా గొప్పగా  జరుపుకుంటారు. దీపావళి సందర్బంగా ఇళ్లను అలంకరించుకోవడం, ఇంటి ముంగిట రంగురంగుల ముగ్గులు వేయడం , ఇల్లంతా దీపాలు వెలిగించడం వంటివి చేస్తారు.  కొత్త బట్టలు ధరించి లక్ష్మీదేవిని పూజిస్తారు. ముఖ్యంగా దీపావళి సందర్బంగా  అమ్మాయిలు తమ అందంలో  దీపాల కాంతితో పోటీ పడాలని ప్రయత్నిస్తారు. అయితే  ఈ దీపాల పండుగలో  డిఫరెంట్‌గా కనిపించాలన్నా గులాబీ లాంటి అందంతో మెరిసిపోవాలన్నా ఈ కింది టిప్స్ పాటించాలి.. దీపావళికి ఇంకా ఒకరోజే సమయం ఉంది. ఈ సందర్బంగా  ఇంట్లో తయారుచేసిన ఫేస్ ప్యాక్‌,  మాస్క్‌లను ఉపయోగించడం మంచిది.  కావాలంటే  చర్మానికి సరిపోయే ఫేషియల్ కూడా చేసుకోవచ్చు. దీని వల్ల చర్మానికి లోపల నుండి జీవం వస్తుంది,  ముఖానికి రక్త ప్రసరణ పెరుగుతుంది, ఇది దీపావళి నాటికి  ముఖం మెరిసేలా చేస్తుంది. చాలామంది అమ్మాయిలు  తమ ముఖాన్ని సాధారణ ఫేస్ వాష్‌తో కడగడం ద్వారా శుభ్రం చేసుకుంటారు, అయితే కొన్నిసార్లు హడావిడిలో   ముఖాన్ని శుభ్రం చేయడానికి తగినంత సమయం ఉండదు. ఏదైనా క్లెన్సింగ్ ఏజెంట్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.  ఇందుకోసం పచ్చి పాలలో కాటన్‌ను నానబెట్టి ముఖానికి మసాజ్ కూడా చేసుకోవచ్చు. మసాజ్ చేసిన తర్వాత 5 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖ చర్మం శుభ్రంగా,  మేకప్‌కు చేసుకోవడానికి అనువుగా  స్మూత్‌గా మారుతుంది. దీపావళి పండుగ  రోజున మేకప్ చేసేటప్పుడు ఎక్కువగా పొరల మేకప్  వేసుకోకపోవడం మంచిది. బేస్,  ఫౌండేషన్  వేరు వేరు  లేయర్‌లను వేసుకోవడం  వలన  మేకప్ క్రాక్స్ వచ్చి తక్కువ సమయంలో పగుళ్లు ఏర్పడతాయి. అందువల్ల మేకప్  ను ఒకే  సన్నని పొరగా వేసుకోవాలి. ఇది చాలా సేపు ఉంటుంది.  ముఖం ఎక్కువసేపు  ఆరోగ్యంగా కనిపిస్తుంది. ముఖానికి మేకప్ వేసేటప్పుడు చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే, పాత లేదా చౌక ఉత్పత్తులను ఉపయోగించడం.  వీటితో  ఎన్ని విధాలుగా మేకప్ అప్లై చేసినా  అవి ఎక్కువ కాలం ఉండవు.   చెమటతో కారిపోవడం, లేదా రంగు వెలసిపోవడం జరుగుతుంది. అందువల్ల ఎల్లప్పుడూ మంచి కంపెనీ నుండి ఉత్పత్తులను ఎంచుకోవాలి. ఇకపోతే మేకప్ వేసేటప్పుడు జరిగే రెండవ తప్పు.. సరైన క్రమంలో మేకప్ వేయకపోవడం.  క్లెన్సర్, టోనర్, మాయిశ్చరైజర్, ప్రైమర్, ఫౌండేషన్, కన్సీలర్, ఫేస్ పౌడర్, బ్లషర్, ఐ మేకప్ అన్నీ వేటి  ప్రాముఖ్యతను అవి కలిగి ఉంటాయి. వాటిలో దేని తరువాత దేన్ని అప్లై చేయడం మంచిదో తెలుసుండటం ముఖ్యం. ఏ ఒక్కటైనా అటుది ఇటు, ఇటుది అటు వేస్తే మేకప్ మొత్తం పాడైపోతుంది. కాబట్టి మేకప్ వల్ల అందంగా కనబడాలంటే  ఈ తప్పులు చేయకూడదు.  మేకప్ ఎక్కువసేపు ఉండాలంటే వాటర్ ప్రూఫ్ మేకప్ ఉత్పత్తులను ఉపయోగించాలి. ప్రస్తుతం మార్కెట్లో చాలా కంపెనీలు వాటర్‌ప్రూఫ్ మేకప్‌ను విడుదల చేస్తున్నాయి. ఇవి సులభంగా అందుబాటులో ఉంటాయి.   ఇవి ముఖంలో గ్లోను  ఎక్కువసేపు ఉంచడంలో కూడా సహాయపడతాయి.                                                             *నిశ్శబ్ద

 నవరాత్రుల భక్తి వెనుక ఆరోగ్యం.. ఆరోగ్యంగా అధిక బరువుకు చెక్ పెట్టేద్దాం.. స్త్రీ పూజ్యునీయురాలు . భారతదేశంలో స్త్రీని దేవతగా భావిస్తారు. స్త్రీ శక్తిని చాటి చెప్పే కథలు, పండుగలు కూడా ఉన్నాయి. వాటిలో శరన్నవరాత్రులు ఎంతో ప్రాశస్త్యమైనవి. దేవి నవరాత్రులు అని, శరన్నవరాత్రులు అని, దసరా అని పిలుచుకునే ఈ పండుగ సందర్భంగా మహిళలు తమ ఆరోగ్యాన్ని ఫిట్ గా ఉంచుకోవచ్చు. భక్తితో అటు దైవ కృపకు పాత్రులు కావడం, ఇటు ఫిట్ గా మారడం మహిళల చేతుల్లోనే ఉంది. చాలామంది నవరాత్రుల సందర్బంగా  ఉపవాసాలు ఉంటారు. అధిక బరువు కలిగిన వారికి ఈ నవరాత్రులు మంచి అవకాశం. భక్తి వెనుక భయం కూడా ఉంటుంది. కాబట్టి సాధారణ సమయాల్లో నోరుకట్టేసుకుని బాధపడుతూ మధ్యలో కాంప్రమైజ్ అయ్యేవారు దేవుడి ముందు భక్తితో ఉపవాసం పాటిస్తారు. నవరాత్రుల ఉపవాసంలో పండ్లు ఎక్కువగా తీసుకుంటారు.  అయితే, పండ్ల పేరుతో చాలామంది  ఫ్రూట్స్ కలిపిన పాయసం,  నైవేద్యం పేరుతో  పూరీ, బూరెలు,  కేసరి, డ్రైఫ్రూట్స్, పనీర్ వంటివి తింటారు. వీటి వల్ల కేలోరీలు బాగా శరీరంలోకి వెళతాయి. అలా కాకుండా బరువు పెరగకుండా రోజులో ఒకపూట మాత్రమే తినే ఆహారం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. అందుకోసం కింది టిప్స్ పాటించాలి. ఏ వంటకం చేసినా దాన్ని  వేయించడం మానుకోవాలి. ఆవిరి మీద ఉడికించినవి తీసుకోవాలి. చక్కెరకు బదులుగా ఇతర చక్కెర ప్రత్యామ్నాయాలను ఉపయోగించండి. మిశ్రి(కండచక్కెర), బెల్లం, తేనే, ఎండు ద్రాక్ష మొదలైనవి తీపిని ఇస్తాయి. సగ్గుబియ్యం, మఖనా, బరువు ఉండవు  కాబట్టి బరువు పెరగం అనుకుంటారు. కానీ ఇవి అధిక  కేలరీల ఆహారాలు, ఇవి బరువును పెంచుతాయి. వాటిని వీలైనంత తక్కువగా ఉపయోగించాలి. డ్రై ఫ్రూట్స్‌కు బదులుగా మొత్తం పండ్లను తినాలి. బరువు తగ్గడానికి తాజా పండ్లను బీట్ చేసే డైట్ లేనే లేదు. వెన్న తీసిన పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవచ్చు. ఉపవాస సమయంలో రోజంతా వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి. పాల ఉత్పత్తులు కొందరు జీర్ణించుకోలేరు. అలాంటి వారు పాల ఉత్పత్తును తినకపోవడం మంచిది. దీనికి బదులుగా   వెజిటేరియన్ ప్రోటిన్ పౌడర్ ఉపయోగించవచ్చు. ఉపవాసం కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు. అది ఆధ్యాత్మిక భావనను పెంచుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వ్యామోహాన్ని తగ్గిస్తుంది. చాలామంది దేవుడి పేరుతో బాగా వండుకుని తింటారు. కానీ అది తప్పు. ఆ భావన వదలకపోతే శారీరక, మానసిక ఆరోగ్యం రెండూ ప్రశ్నార్థకమే అవుతాయి. పండుగ ముగిసేసరికి మరింత బరువు పెరుగుతారు.                                                    *నిశ్శబ్ద.

 అమ్మబాబోయ్.. ఈ నెయిల్ పాలిష్ కొనాలంటే ఖరీదైన విల్లా కూడా  అమ్ముకోవాల్సిందే.. అందానికి అమ్మాయిలకు చాలా దగ్గరి సంబంధం ఉంది. అమ్మాయిలు సహజంగానే ఎంత అందంగా ఉన్నా సరే.. తమ అందం మరింత పెరగాలని  ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. శరీరంలో ప్రతి భాగాన్ని ఆకర్షణగా తీర్చిదిద్దుకుంటారు. కళ్లకు కాటుక, నుదుటన బొట్టు, కనురెప్పలు, కనుబొమ్మలు, పెదవులు, వేళ్లు, వేలి గోర్లు  ఓయబ్బో ఈ సింగారాలకు అంతులేదు.  అమ్మాయిల ఈ వీక్నెస్ ఏ బ్యూటీ ఉత్పత్తుల బిజినెస్ కూడా. పైన చెప్పుకున్న ఎన్నో ఐటెమ్స్  కు పదుల నుండి వందలు వేలు కూడా ధారబోస్తారు. అయినా కించిత్  విచారం కూడా వ్యక్తం చేయరు. ఈ కారణంగానే చాలా బ్యూటీ ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తుల ధరలను ఆకాశాన్నంటేలా  ఉంచుతుంటారు. ఇకపోతే అమ్మాయిలకు ఎంతో ఇష్టమైన నెయిల్ పాలిష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మధ్యకాలంలో నెయిల్ ఆర్ట్ ప్రాచుర్యం పెరిగాక నెయిల్ పాలిష్ ల అమ్మకాలు కూడా బాగా  ఊపందుకున్నాయి.  సాధారణంగా నెయిల్ పాలిష్ ల ధరలు చిన్న చిన్న షాప్ లలో మన్నిక  క్వాలిటీ లేనివి అయితే 20రూపాయల నుండి లభిస్తాయి. అదే మంచి క్వాలిటీ కావాలంటే వీటి ధరలు 50 నుండి వందల రూపాయలు ఉంటాయి. ఇంకా ఖరీదైన బ్రాండులు అయితే వేలు కూడా ఉండొచ్చేమో. కానీ ఓ నెయిల్ పాలిష్ ధర మాత్రం గుండెలు దడదడలాడిస్తోంది. ఈ నెయిల్ పాలిష్ కొనాలి  అంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉన్న మంచి విల్లాను అమ్మేసుకోవాలి. ఏంటి నెయిల్ పాలిష్ కే అంత మాట అంటున్నారని డౌటా? అయితే ఈ నెయిల్ పాలిష్ కథ తెలుసుకోవాల్సిందే.. అమ్మాయిలు ఎంత అందంగా తయారైనా సరే. అందమైన చేతి గోర్లకు నెయిల్ పాలిష్ పెట్టకపోతే అంత ఆకర్షణ ఉండదు. అంతేనా డ్రస్సుకు మ్యాచ్ అయ్యే నెయిల్ పాలిష్ పెడితే మరింత ఆట్రాక్షన్ గా మారిపోతారు. చాలావరకు అమ్మాయిల దగ్గర కనీసం ఓ పది రంగులైనా నెయిల్ పాలిష్ లు ఉండనే ఉంటాయి. వీటి ధర 50 నుండి వందలు, వేలు ఉండచ్చు. కానీ నెయిల్ పాలిష్ ధర ఏకంగా కోటి రూపాయలు ఉండటం ఎప్పుడైనా విన్నారా? కోటి అనేమాట వింటుంటేనే దిమ్మతిరిగిపోతుంది కానీ ఇది అక్షరాలా నిజమే.. లాస్ ఏంజిల్స్ కు చెందిన అజాచర్ బ్లాక్ అండ్ డైమండ్ నెయిల్ పాలిష్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ గా నిలుస్తోంది.  15మి.లీ ల నెయిల్ పాటిష్ ధర్ ఏకంగా రూ. 1,63,66,000. ఇంత డబ్బు తో హైదరాబాద్ లో మాంచి విల్లాను కొనుగోలు చేయవచ్చు. లేదూ.. ఈ నెయిల్ పెయింట్ కొనాలని అనిపించిందా.. ఇదిగో మాంచి ఖరీదైన విల్లాలను అమ్ముకుని నెయిల్ పాలిష్ కొనాల్సి ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ నెయిల్ పాలిష్ తెగ హాట్ టాపిక్ గా మారింది.  కేవలం గోర్లకు వేసుకునే నెయిల్ పాలిష్ ఇంత ఖరీదు ఉండటమేంటని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు.                                                        *నిశ్శబ్ద. 

  మనశ్శాంతి కరువైందా.. వెంటనే ఈ నాలుగు విషయాలు వదిలెయ్యండి.. జీవితంలో మనశ్శాంతి కరువైందని చెప్పేవారు చాలామంది ఉంటారు. మనశ్శాంతి ఉంటే ఎంత సమస్యలు ఎదురైనా వాటిని చాలా నేర్పుగా ఏదుర్కొంటారు.  చాలామంది మనశ్శాంతి కేవలం సమస్యల  వల్ల ఉండదని  అనుకుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే మనశ్శాంతి అనేది సమస్యల వల్ల కాదు చేతులారా చేసే నాలుగే నాలుగు పనుల వల్ల కోల్పోతారు.  సెల్ప్  లవ్ ఉన్నవారు తమ మనశ్శాంతిని పోగొట్టుకోకుండా దాన్ని ఎవరి గుప్పెట్లో వారు ఉంచుకోవాలంటే కేలవం నాలుగు పనులు చేస్తే చాలు. ఆ నాలుగు పనులు ఏంటో తెలుసుకుంటే.. ఇబ్బంది పెట్టే వ్యక్తులకు దూరం ఉండటం.. చాలా సార్లు ఆత్మీయులుగా అనిపించే   కుటుంబం, స్నేహితులు మరియు జీవిత భాగస్వామి మొదలైనవారు   ఆందోళనలకు దుఃఖాలకు కారణం అవుతారు.  అయితే దీన్ని అంగీకరించడం చాలా కష్టం. వాళ్లు నా వాళ్ళు వారి గురించి ఇలా అనుకుంటే ఎలా నేను పొరపడుతున్నానేమో అని మభ్యపుచ్చుకోవడం చాలామందిలో కనిపిస్తుంది. మరికొన్నిసార్లు నా వాళ్లే కదా నా మంచికోసమే చేసుంటారు అనే ఒకానొక అమాయకపు భావన కూడా మూర్ఖులుగా మార్చేస్తుంది. కానీ ఒకరి  శాంతి,  ఆనందం కోసం  ఇతరుల జీవితాలను ఇబ్బందులకు గురిచేయడం ఎప్పుడూ సరైనది కాదని తెలుసుకోవాలి. అందరూ మీ జీవితాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇబ్బందుల పాలు చేస్తుంటే   అది  చాలా నష్టాన్ని కలిగిస్తుందని అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుని  జీవితాన్ని ఇబ్బంది పెడుతున్నవారికి దూరంగా ఉండటం ఎంతో మంచిది. ఒత్తిడితో కూడిన వాతావరణాన్ని వదిలేయడం.. మీరు ఎక్కడ నివసిస్తున్నారు? ఎక్కడ పని చేస్తారు? ఈ విషయాలు ఎక్కువగా  జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఒత్తిడితో కూడిన వాతావరణం  ఆనందాన్ని,  శాంతిని పూర్తిగా నాశనం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు మీ గురించి శ్రద్ధ వహిస్తే, జలగలాగా మీ మనశ్శాంతిని నెమ్మదిగా నాశనం చేసే  వాతావరణం నుండి వెంటనే  దూరం వెళ్లాలి. లేకపోతే అది క్రమంగా మానసిక జబ్బున్న వ్యక్తిగా మిమ్మల్ని మార్చేస్తుంది. బయటి విషయాలను బాధ్యులుగా మార్చకుండా ఉండటం.. మీరు మీ సమస్యలన్నింటికీ బయటి  పరిస్థితులను నిందిస్తే  జీవితంపై నియంత్రణను కోల్పోతారు. ఇలా చేసేవారి మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. కొంతకాలం తర్వాత కుటుంబ సభ్యులు కూడా అలాంటి వారిని వదిలివేస్తారు. ఇలాంటి  పరిస్థితిలో సొంతంగా చేసే   తప్పులు,  బాధల బాధ్యతను,  పర్యావసానాలను  అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.  ఈ రోజుకు   రేపటిని మార్చే శక్తి ఉంటుందనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అందరినీ సంతోషంగా ఉంచడానికి తమ సంతోషాన్ని త్యాగం చేయడం.. అందరినీ సంతోషంగా ఉంచడం సాధ్యం కాని పని . ఇలాంటి  పరిస్థితిలో తమను తాము ఇబ్బంది పెట్టుకుంటూ  ఇతరులకు సుఖాన్ని లేదా ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నించే వ్యక్తులు ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు. అందువల్ల, ఒక వ్యక్తి తన స్వంత ఆనందాన్ని త్యాగం చేయడం ద్వారా ఇతరులను సంతోషంగా ఉంచడానికి మూల్యం చెల్లించాల్సిన అవసరం లేని మార్గాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.                                                        *నిశ్శబ్ద.