హీరోయిన్స్ లా స్టైల్ గా మెడకు పెర్ఫ్యూమ్ కొట్టేవారికి షాకింగ్ న్యూస్..!   ఫ్యాషన్ ప్రపంచం చాలా పెద్దది.  ముఖ్యంగా అమ్మాయిలు ఫ్యాషన్ లో మునిగి తేలుతుంటారు. దుస్తులు, మేకప్ నుండి అంతా తయారయ్యాక చివరగా పెర్ఫ్యూమ్ స్ప్రే చేయడం వరకు ఎక్కడా రాజీ పడరు. చాలామంది సెలబ్రిటీలను, హీరోయిన్స్ ను అనుసరిస్తారు. వారిలా చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. వాటిలో పెర్ఫ్యూమ్ అప్లై చేయడం ఒకటి. టీవీ లో పెర్ఫ్యూమ్  యాడ్స్ గమనిస్తే గనుక హీరోయిన్స్ లేదా మోడల్స్  పెర్ఫ్యూమ్ ను చాలా స్టైల్ గా మెడ దగ్గర స్ప్రే చేస్తుంటారు. ఆ తరువాత చేతి మణికట్టు దగ్గర కూడా స్ప్రే చేస్తుంటారు. అయితే ఇలా స్ప్రే చేయడం ఎంత వరకు ఆరోగ్యకరం అనే విషయం మాత్రం ఆలోచించరు.  మెడ దగ్గర, మణికట్టు దగ్గర పెర్ఫ్యూమ్ స్ప్రే చేస్తే జరిగేదేంటో.. దీని గురించి చర్మ సంరక్షణ నిపుణులు ఏం చెప్పారో తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంది. పెర్ఫ్యూమ్ ను మెడ, మణికట్టు దగ్గర స్ప్రే చేయడం వల్ల పిగ్మెంటేషన్ సమస్య  బాధితులుగా మారే అవకాశం ఉంటుందట. పెర్ఫ్యూమ్ సువాసన చాలా ఘాటుగా ఉంటుంది. ఇందులో చాలా రసాయనాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతీస్తాయి. వీటిని ఫోటోసెన్సిటైజింగ్ ఏజెంట్లు అని అంటారు. పెర్ఫ్యూమ్ స్ప్రే చేసిన చర్మం భాగంలో పదునైన సూర్య కిరణాలు తాకినప్పుడు చర్మం చికాకు పెట్టడం, వాపుకు గురి కావడం, హైపర్పిగ్మెంటేషన్ కు దారితీయడం జరుగుతుంది. చాలా పెర్ఫ్యూమ్ ల తయారీలో ఆల్కహాల్ వాడతారు. ఈ ఆల్కహాల్, సింథటిక్ వాసనలు చర్మాన్ని చికాకు పెడతాయి. అలెర్జీని కలిగిస్తాయి. పిగ్మెంటేషన్ కు కారణమయ్యే మెలనోసైట్ లను ప్రేరేపించి చర్మాన్ని  నల్లగా మార్చే మెలనిన్ ను ఉత్పత్తి చేసేలా చేస్తుంది. మచ్చలు ఏర్పడటానికి కూడా కారణం అవుతుంది. కొన్ని రకాల పెర్ఫ్యూమ్ లలో ఉండే రసాయనాల కారణంగా చర్మ సంబంధ వ్యాధులు వస్తాయి. ఇది కూడా పిగ్మెంటేషన్ ను కలిగిస్తుంది.                                              *రూపశ్రీ.   

45 ఏళ్లు దాటినా యవ్వనంగా కనిపించాలంటే ఇవి ఫాలో కావాలి..!   ప్రతి మహిళను అడిగినా తన వయసు ఉన్నదాని కంటే 5 నుండి 10 ఏళ్లు తక్కువ గా చెప్తుంది.  అయితే ఇది కొందరికి బాగా సెట్ అవుతుంది. కానీ మరికొందరికి సెట్ కాదు. ఎందుకంటే శరీరాన్ని చూసి కొందరు వయసు తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా చెప్పేస్తుంటారు.  అయితే ఎంత వయసు వచ్చినా యవ్వనంగా కనిపించాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు.. కానీ దానికి తగిన జీవినశైలి,  ఆహారపు అలవాట్లు, యవ్వనంగా కనిపించేలా చేసే చిట్కాలు పాటించకపోవడమే తప్పు.  ఈ కింద ఉన్న టిప్స్ పాటిస్తే 45 ఏళ్లు దాటినా స్కూల్లకు, కాలేజీలకు వెళ్లే పిల్లలు ఉన్నా హ్యాపీగా యూత్ లాగా కనిపించవచ్చు.   మహిళలు ఇంట్లో ఆహారాన్ని వండినప్పుడు కొన్ని ఆహారాలు మిగిలిపోతాయి. దానిని పారేసే బదులు దానిని మరుసటి రోజు తినడం చాలామంది మహిళల అలవాటు. కానీ  ఇలా మిగిలిపోయిన ఆహారాన్ని మరుసటిరోజు  తినడం     రోగనిరోధక శక్తికి,  పేగు ఆరోగ్యానికి చాలా హానికరం.  యవ్వనంగా కనిపించాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా ఉదయం నుండి రాత్రి వరకు తాజా ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. రోజుకు 4 లీటర్ల నీరు త్రాగితే బరువు తగ్గడానికి,  ఆరోగ్యకరమైన చర్మ సంరక్షణ కోసం అనువుగా ఉంటుంది.   నాలుగు లీటర్ల కంటే ఎక్కువ నీరు త్రాగవలసిన అవసరం లేదు. కనీసం మూడు నుండి నాలుగు లీటర్ల నీరు త్రాగడం ద్వారా కూడా బరువు తగ్గవచ్చు.  చర్మాన్ని మెరిచేలా, యవ్వనంగా ఉంచుకోవచ్చు. ఆహారాన్ని తీసుకునే విధానాన్ని ఆయుర్వేదం మూడు ముక్కలలో చెప్పింది.  ఉదయం భోగి లాగా,  మధ్యాహ్నం యోగి లాగా,  రాత్రి రోగి లాగా ఆహారం తీసుకోమని చెబుతుంది.  అంటే ఉదయం బాగా తినవచ్చు. అది రోజంతా పనిచేయడానికి శక్తిని ఇస్తుంది. మధ్యాహ్నం బోజనం మితంగా తినాలి. భోజనంలో కార్బోహేడ్రేట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి దాన్ని నియంత్రణలో పెట్టాలి. ఇక రాత్రి సమయంలో చాలా తేలికగా తినాలి. రాత్రి నిద్రించే సమయం కాబట్టి బరువుగా ఉన్న ఆహారాలు తీసుకోకూడదు. రోజూ 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు వ్యాయామం చేయడం వల్ల  ఆరోగ్యంగా యవ్వనంగా ఉండవచ్చు. కానీ చాలామంది  వర్కవుట్ చేయడానికి సమయం ఉండదని చెబుతుంటారు. కానీ  ఈ అలవాటు భవిష్యత్తులో అనేక వ్యాధులకు దారి తీస్తుంది.  మహిళలు ఎంత బిజీగా ఉన్నా, 24 గంటలలో మీ కోసం అరగంట నుండి 45 నిమిషాల సమయం కేటాయించుకోవాలి.  తేలికపాటి వ్యాయామం చేయవచ్చు, వాకింగ్ చేయవచ్చు, యోగా చేయవచ్చు లేదా బరువులను ఎత్తవచ్చు. దీని వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.  ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండటానికి సహాయపడుతుంది.                                                *రూపశ్రీ.


పిల్లలు దుడుకుతనంగా తయారవ్వకూడదంటే... పిల్లలలో దుడుకుతనం సహజమేకాక, స్వాభావికం కూడా. తన భద్రతకు, తన సంతోషానికి, తన వ్యక్తిత్వానికి ముప్పు వాటిల్లుతోందని అనిపించినప్పుడు పిల్లలు దుడుకుతనాన్ని ఆశ్రయిస్తుంటారు. కారణాలు పిల్లలు దుడుకుతనాన్ని ప్రదర్శించడానికి మనస్తత్వ శాస్త్రవేత్తలు రకరకాల కారణాల్ని వివరిస్తుంటారు. ప్రతి మనిషిలోనూ స్వతహాగా పోరాడేతత్వం వుంటుందనీ అది బాల్యంలో దుడుకుతనం ద్వారా ప్రదర్శితమవుతుంటుందనీ అంటారు కొందరు. తల్లిదండ్రులు, సహోదరులు, సాటి పిల్లల నుంచి దుడుకుతనపు అలవాట్లు పిల్లలకు వంటపడతాయని అంటారు మరికొందరు. అలాగే పిల్లవాడు దుడుకుతనాన్ని ప్రదర్శించినప్పుడు పెద్దవాళ్లు మెచ్చుకోలు ద్వారా ప్రోత్సహాన్ని అందించుతోంటే కూడా అతనిలో ఆ స్వభావం జీర్ణించుకుపోతుంది. దుడుకు చేష్టలపట్ల సమాజపు దృక్పథం కూడా మనుషుల్లో దుడుకు స్వభావాల్ని ప్రవేశపెడుతుంది. ఈ రోజుల్లో వెలువడుతున్న పాపులర్ సినిమాలు, నవలల్లో వయొలెన్స్ చూపించడం జరుగుతోంది. ఇలాంటి వాటివల్ల ఇతరులతో  దెబ్బలాడడం దుడుకు చేష్టలకు దారి చూపుతుంది.  ఈ పై చెప్పిన కారణాలలో ఒక్కోటి ఒక్కో పిల్లాడిమీద తన ప్రభావాన్ని చూపి అతడిలో దుడుకు స్వభావానికి మూలకంగా పనిచేస్తుంది. పిల్లల్ని అతి గారాబంగా పెంచడం, అతి క్రమశిక్షణలో పెంచడం లాంటివి కూడా వాళ్లలో దుడుకు స్వభావానికి పునాదుల్ని వేస్తాయి. అతి గారాబం మంచిది కాదు పిల్లలు దుడుకుగా తయారుకావడానికి ఒక ముఖ్య కారణం అతి గారాబపు పెంపకం. మరీ గారాబంగా పెంచడంవల్ల పిల్లలకు రెండు రకాల నష్టం జరిగే అవకాశం వుంది. పిల్లవాడు పనికిమాలినవాడుగా, పిరికి వాడుగా తయారుకావచ్చు. పిల్లల్ని ఎంత గారాబంగా పెంచినా అవసరమైన సందర్భాలలో వాళ్లపట్ల ఖచ్చితంగానూ, కఠినంగానూ వ్యవహరిస్తుండాలి. కొన్ని రకాల దుడుకు పనుల్ని అనుమతించేది లేదని పిల్లవాడికి స్పష్టంగా తెలియజెప్పాలి. తోటి పిల్లల్ని చావగొట్టడం, బనాయిస్తూ ఏడిపించడం లాంటి పనులు చేయనివ్వకూడదు.  మరీ భయభక్తులూ ఉండకూడదు పిల్లలను మరీ భయభక్తులతో పెంచడం వల్ల కూడా దుడుకుతనం ఏర్పడడానికి ఆస్కారం వుంటుంది. మరీ భయభక్తులతో పెంచడం వల్ల పిల్లలు తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో పడిపోయి తల్లిదండ్రులమీద కలిగే తిరుగుబాటు భావాల్ని, కోపాల్ని ఇంట్లో ప్రదర్శించలేక బయటి సాటి పిల్లలమీద ప్రదర్శిస్తూ అగ్రెసివ్గా తయారవుతారు. ఇలాంటి పిల్లలలో ఎక్కువగా బాధ్యతారాహిత్యం తొంగిచూస్తుంటుంది. సమర్ధించనివ్వకూడదు.  అగ్రెసివ్ వుండే పిల్లలు బయట పిల్లలతో దెబ్బలాడి వచ్చినప్పుడు తమను తాము సమర్ధించుకోడానికి ప్రయత్నిస్తారు. అలా సమర్ధించుకోవడాన్ని తల్లిదండ్రులు అనుమతించకూడదు. ఖండించడానికి ప్రయత్నించాలి. మూలకారణాన్ని వెతకాలి పిల్లవాడు దుడుకు స్వభావాన్ని ప్రదర్శిస్తూ అగ్రెసివ్ ప్రవర్తిస్తున్నప్పుడు తల్లిదండ్రులు అందుకు మూలకారణం  ఏమై వుంటుంది అన్నది తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అతడిని తాము విమర్శిస్తున్నారా ? అతడికి అవసరమైన ప్రోత్సాహం, మెచ్చుకోలులు లభించడంలేదా? శారీరకంగా ఏదన్నా అంగవైకల్యం వుంటే తోటిపిల్లలు అతణ్ణి గేలి చేస్తున్నారా ? లాంటివి తెలుసుకోవాలి. కొందరు పిల్లలు ఇంట్లో తాము కోరుకునే ప్రేమానురాగాలు లభించకపోతే అగ్రసేవ్ ధోరణిలో ప్రతిస్పందిస్తుంటారు. కాబట్టి పిల్లాలు దుడుకుగా ఉండకూదంటే.. పైన చెప్పుకున్న విషయాలను పాటించాలి.                                        ◆నిశ్శబ్ద.

Aracheta Gorinta / Mehendi / Gorinta Designs / Mehndi / Learn Simple & Easy Mehendi Designs / Learn Gorintaku Designs / Learn Tattoo Designs / Henna Designs

మహిళలూ ఆర్థిక విషయాల్లో జాగ్రత్త తప్పనిసరి! మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. నేటికీ కొంతమంది మహిళలు ఆర్థికపరమైన విషయాల్లో తండ్రి, సోదరుడు, భర్త...ఇలా ఎవరొకరిమీద ఆధారపడుతుంటారు. ఆర్థికపరమైన అంశాలపట్ల సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణమంటున్నారు నిపుణులు. ఇంకొంతమంది మహిళలు తాము సంపాదించిన మొత్తాన్ని పరిస్థితులకు అనుగుణంగా తమ భర్త చేతిలో పెట్టడం వల్ల చిన్న చిన్న అవసరాలకు కూడా వాళ్ల వద్ద చేయి చాచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా చేతినిండా సంపాదన ఉన్నా...చాలా మంది మహిళలు ఆర్థికపరంగా నేటికీ పురుషులపై ఆధారపడాల్సి వస్తుంది. అయితే ఇకనైనా మేల్కోని ఈ ధోరణిని మార్చుకోవాలి. లేదంటే అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పవు. ఈ క్రమంలో వివాహం జరిగినప్పటినుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని చెబుతున్నారు. ఉద్యోగం మానకూడదు: కొంతమంది వ్యక్తిగత కారణాలు, కుటుంబ పరిస్థితుల కారణంగా అప్పటివరకు తాము చేస్తోన్న ఉద్యోగానికి రాజీనామా చేస్తుంటారు. ఇంకొంతమంది సంపాదించాల్సిన అవసరం లేదని ఈ నిర్ణయం తీసుకుంటారు. ఈ రెండూ కూడా ఆర్థికంగా చేటు చేసే నిర్ణయాలే అని చెబుతున్నారు నిపుణులు. మొదట్లో బాగానే ఉన్నా తర్వాత భవిష్యత్తులో ప్రతి చిన్న అవసరానికీ భర్త మీదే ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి పెళ్లైనా ఉద్యోగం మానకపోవడమే మంచిది. తద్వారా భవిష్యత్తులో ఒంటరిగా జీవించాల్సి వచ్చినా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అవగాహన పెంచుకోవాలి: ఆర్థిక విషయాల్లో పెళ్లికి ముందు తండ్రిపై...పెళ్లి తర్వాత భర్తపై ఆధారపడే అమ్మాయిలు ఈ కాలంలో చాలా మంది ఉన్నారు. ఆర్జన వరకు బాగానే ఉన్నా...డబ్బు పొదుపు మదుపు విషయాల్లో అవగాహన లోపమే దీనికి కారణం. అయితే ప్రతి చిన్న దానికీ ఇతరులపై ఆధారపడటం వల్ల వాళ్లు అందుబాటులో లేనప్పుడు ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది. కాబట్టి డబ్బులను ఎందులో పొదుపు చేయాలి లాభాలు ఆర్జించాలంటే వేటిలో పెట్టుబడులు పెట్టాలనే ప్రథమిక విషయాలపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం అంటున్నారు నిపుణులు అలాని ఒకేసారి అన్ని విషయాల గురించి తెలుసుకోవడం ఎవరితోనూ సాధ్యం కాదు. కాబట్టి నిపుణుల సలహాలు పాటిస్తూ ఉండాలి. ఇవి కూడా గుర్తుంచుకోవాలి... మహిళలు తప్పకుండా వైద్య బీమా చేయించుకోని ఉండాలి. అనుకోని అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టకుండా ఉంటుంది. మీ అత్తమామలు, భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఏవైనా పత్రాలపై సంతకం చేయమని అడుగుతే గుడ్డిగా చేయకండి. వాటిని క్షుణ్ణంగా చదివిన తర్వాతే చేయాలా వద్దా అనేది నిర్ణయించుకోండి. పెళ్లికి ముందు తర్వాత మహిళలకు పుట్టింటివారు మెట్టినింటి వారి నుంచి వచ్చే బహుమతులు, కానుకలు స్త్రీధన్ అంటారు. అవి పెట్టుబడులు, స్థిరాస్తి, చరాస్తి, డబ్బు, బంగారం ఇలా ఏ రూపంలో అయినా ఉండవచ్చు. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లను జాగ్రత్తగా భద్రపరుచుకోవడం ముఖ్యం.