లండన్ బ్యాంకుల్లో మూలుగుతున్న నిజాం నిధులు
posted on Jul 23, 2012 9:06AM
నిజాం నగలను ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న వారసులు 1995 లో అత్యంత విలువైన 173 ఆభరణాలను లండన్ వేలంలో అమ్ముతుండగా భారత ప్రభుత్వం వాటిని తీసుకువచ్చి వారికి 216 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఆమొత్తానికి కట్టవలసిన పన్నుని నైజాం వారసులు భారత ప్రభుత్వానికి బకాయిపడి ఉన్నారు. ప్రభుత్వం రెండు నెలల క్రిందట టాక్స్ మొత్తాన్ని చెల్లించవలసిందిగా ఒత్తిడి తెచ్చిన సందర్బంలో వారు తమ దగ్గర అంత డబ్బులేదని కట్టలేమని ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఆర్ధిక పరిస్థితులను తాళలేని నిజాం నవాబు వారసుడు నవాబ్ నజాఫ్ అలీఖాన్ ఆరు శతాబ్ధాలుగా లండన్ బ్యాంకులో ఉన్న తమ నిధులను ముస్లిం చట్ట ప్రకారం తమకు అప్పగించాలని భారత్, పాకిస్థాన్ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఇస్లామాబాద్‌లో సెప్టెంబరులో జరిగే ఇరుదేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో నిజాం నిధుల విషయంలో ఒక అవగాహనకు రావాలని కోరారు. ఈ నిధుల విలువ 30 మిలియన్ పౌండ్లని తెలిపారు. భారత్, పాకిస్థాన్ విడిపోయిన తర్వాత నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ సంస్థానంలోని ఆర్ధిక మంత్రి మొయీన్ నవాజ్ నిధులను నాటి లండన్ లోని పాకిస్థాన్ హైకమీషనర్ రహ్మతుల్లా పేరు మీద బదిలీచేశారని తెలిపారు.
లండన్‌లోని నేషనల్ వెస్ట్ మినిస్టర్ బ్యాంకులో ఈ నిధులను భద్రపరిచారు. ఇప్పుడు ఈ బ్యాంకును రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్‌లాండ్‌గా పిలుస్తున్నారు. నిజాం నిధులను తరలించడాన్ని భారత్ అప్పట్లోనే వ్యతిరేకించింది. నిజాం సంస్ధానం భారత్‌లో భాగం కాదని స్వతంత్య్ర సంస్థానంగా వ్యవహరించి ఇంగ్లాండుకు తరలించింది. భారత్‌తో వాదనతో ఏకీభవించిన ఇంగ్లాండు ప్రభుత్వం ఈ ఖాతాను స్థంభింప చేసింది. 2008 లో భారత్ ప్రభుత్వం నిజాం వారసులతోనూ, పాకిస్తాన్ ప్రభుత్వం తోనూ చర్చించి తుది పరిష్కారానికి రావాలని నిర్ణయించింది. నిజాం వారసులు ప్రధాని మన్మోహన్ సింగ్‌తోనూ ఆర్ధిక మంత్రి ప్రణబ్‌తోనూ చర్చించారు. నిజానికి ఈ నిధులు ఏ ట్రస్టుకు చెందవని ముస్లిం చట్టప్రకారం తమకే చెందుతాయని వారసులు వాదిస్తున్నారు. అయితే నిజాం ట్రస్టు సాంస్కృతిక సలహాదారు మహ్మద్ సాపుల్లా మాత్రం నిజాం వారసులకు 20 శాతం వాటా మాత్రమే లభిస్తుందని మిగతా భాగం భారతదేశానికి చెందుతుందని చెబుతున్నారు. నైజాం వంశానికి చెందిన అత్యంత ధనరాసులు గల మూడు పెద్ద ఇనుప పెట్టెలను నేలమాళిగలో ఉంచగా గత సంవత్సరం అవి తస్కరించబడినవి. కేవలం ఖాళీ పెట్టెలను మాత్రమే పురాతత్వ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.