వడ్డి కాసుల వాడికి ప్రైవేట్ వడ్డీ అవసరమా?
posted on Jul 24, 2012 @ 3:05PM
తిరుపతి ఏడుకొండల వాడి నిధులు ప్రభుత్వబాండ్లుగా మార్చేందుకు రంగం సిద్ధమైంది. అంటే ప్రభుత్వం ఆ నిధులను ఉపయోగించుకుంటుందన్న మాట. ఏదో ఒక పేరిట ఆ నిధులను వినియోగించుకోవాలన్న ప్రభుత్వపాచిక ఒకరకంగా పారిందనే చెప్పవచ్చు. దీనికి టిటిడి బోర్డు ఏకగ్రీవ ఆమోదాన్ని తెలిపింది. దీనికి తోడు ఇప్పటికే వందలాది కోట్ల రూపాయల స్వామివారి నిధులు జాతీయ బ్యాంకుల్లో ఉన్నాయి. వీరికన్నా కొన్ని ప్రభుత్వ బ్యాంకులు ఎక్కువ వడ్డీ ఇస్తాయని ఆశ చూపించడంతో టి.టి.డి.పాలక వర్గం ఆ బ్యాంకుల్లో కూడా కొంత డిపాజిట్లు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది.ప్రైవేటు బ్యాంకుల్లో డబ్బుదాచాలని కూడా టిటిడి తీసుకున్న నిర్ణయం పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదెంత మాత్రం క్షేమకరం కాదని పాలకమండలి గుర్తించాలని ఆర్థికనిపుణులు సూచిస్తున్నారు.
ప్రభుత్వసెక్యూరిటీస్‌తో పాటు ట్రాన్స్‌కో, జెన్‌కో, ఆర్టీసీ వంటి సంస్థలు జారీ చేసే బాండ్లు కొనుగోలు చేయవచ్చని పాలకమండలి భావిస్తోంది. గత నెల 25న ఈ మేరకు ఓ (నెంబరు 76) తీర్మానం కూడా చేసింది. ఇప్పటి వరకూ టిటిడి తన ఆదాయాన్ని జాతీయబ్యాంకుల్లో డిపాజిట్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వసెక్యూరిటీలు కొనుగోళ్లకు తెరలేపింది. ఫలితంగా ఓ రెండుశాతం వడ్డీని టిటిడి నష్టపోతోంది. జాతీయబ్యాంకులు ఇచ్చే వడ్డీ కన్నా రెండుశాతం తక్కువవడ్డీ ప్రభుత్వ సెక్యూరిటీల్లో లభిస్తున్నది. ఈ విషయం తెలిసినా కూడా టిటిడి పాలకమండలి ప్రభుత్వానికి ఆ నిధులు పంపించేందుకు సిద్ధమైంది.
ఇప్పటి వరకూ వెంకన్న నిధుల్లో ఎక్కువ భాగం ఆంథ్రాబ్యాంకులోనే జమైంది. ఇండియన్ ఓవర్‌సీస్‌బ్యాంకులో 11.19శాతం, ఇండియన్‌బ్యాంకులో 9.83శాతం, విజయాబ్యాంకులో 8.88శాతం, సిండికేట్‌బ్యాంకులో 7.17శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 5.77శాతం, యూనియన్‌బ్యాంక్‌లో 4.93శాతం, ఇతరబ్యాంకులో 8.61శాతం డిపాజిట్లు చేసింది.