హైదరాబాద్ కి వచ్చిన నరహంతకుడు ఆంటోనీ

కేరళ రాష్ట్రానికి చెందిన నరహంతకుడు ఆంటోనీ కేరళ, ఆంధ్ర ప్రదేశ్ పోలీసులని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఆంటోని హైదరాబాదులో తిరుగుతున్నట్లు ఆ రాష్ట్ర పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని ఇక్కడి పోలీసులకు సమాచారమందించారు. ఆంటోనీ కోసం ఇక్కడి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాజధాని శివార్లలో రెండు పోలీసు బృందాలు ఆంటోని కోసం గాలిస్తున్నాయి. దీంతో అతనిని పట్టుకునేందుకు అక్కడి నుండి ప్రత్యేక పోలీసులు వచ్చారు. తిరుపతి క్రైం పోలీసులు కూడా కేరళ పోలీసులకు ఆంటోనీని పట్టుకునేందుకు సహకారం అందిస్తున్నారు.   కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో నరహంతకుడిగా చలామణి అవుతోన్న ఆంటోనిపై 20కి పైగా కేసులున్నాయి. గత నెల 25న కేరళలోని పొల్లం జిల్లా యందువారిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పెట్రోలింగ్ వాహనంపై దాడి చేసి ఎస్‌ఐ జోయిని కత్తితో పొడవటమే కాకుండా పోలీస్‌ డ్రైవర్‌ మునియన్‌ పిళ్లైను దారుణంగా హతమార్చాడు. అంతే కాకుండా సైకో ఆంటోని 17 మందిని వివాహం చేసుకున్నట్లు ఆధారాలున్నాయని పోలీసులు చెప్పారు.

బీసీలకు వంద సీట్లు సాధ్య౦ చేసి చూపిస్తాం: చంద్రబాబు

బీసీలకు వంద సీట్లు ఇస్తామన్న టీడీపీ ప్రకటన దేశ రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగించింది. ఇది ఎలా సాధ్యమని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎలా సాధ్యమో చేసి చూపిస్తాం అని చంద్రబాబు అన్నారు. సమర్థులైన మంచి నేతలు ముందుకు వచ్చి రాజకీయంగా పరిస్థితులు అనుకూలిస్తే బీసీలకు వందకంటే ఎక్కువ సీట్లు ఇవ్వడానికి కూడా సిద్ధమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. ఎన్టీఆర్ భవన్‌లో మంగళవారం వివిధ బీసీ సంఘాలు చంద్రబాబును సన్మానించాయి. బీసీలకు వందసీట్లివ్వాలన్న టీడీపీ నిర్ణయాన్ని కులాలకు అతీతంగా బీసీ వర్గాలు బలపరచాలని పిలుపునిచ్చారు. పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి కృషిచేయాలని విజ్ఞప్తి చేశారు.

త్వరలో కిరణ్‌ క్లీన్‌ బౌల్డ్‌ కావడం ఖాయమా?

రాష్ట్రంలో ముఖ్యమంత్రికి , మంత్రులకు సమన్యయ లోపం ఉందని కిరణ్‌కుమార్‌రెడ్డి తూర్పు గోదావరిలో జరిపిన ఇందిరమ్మబాటలో మరో సారి వెల్లడైంది. దానికి సీనియర్‌ మంత్రులెవరూ రాకపోవడం, ఎవరికి వారే విడివిడిగా పర్యటనలు  జరపటం వల్ల మంత్రులంతా ఏకతాటిపై  లేరనితెలుస్తుంది. సీనియర్‌ మంత్రులు కిరణ్‌కుమార్‌రెడ్డి తమతో చర్చించకుండా ఎప్పటిలాగే తనకుతానుగానే కార్యక్రమాలు చేబడుతున్నారని ఆరోపిస్తున్నారు. తూర్పుగోదావరిలో కార్యకర్తల మీటింగ్‌ను ప్రారంభించిన బొత్స సత్యన్నారాయణ వారితో ఎక్కువ సమయం గడపకుండానే రెండు మాటలు మాట్లాడగానే చాల్లే....అనటం వారిని నిరాశకు గురిచేసింది. ముఖ్యమంత్రి వచ్చామా, మీటింగ్‌లో మాట్లాడామా....కార్యక్రమం జరిగిందా అన్న చందంగా ఇందిరమ్మబాట కార్యక్రమాన్ని ముగించారు. అయినా అధికార పక్షంగా ఉన్న కాంగ్రెస్‌ సమస్యలమీద దృష్టి పెట్టకుండా ప్రజలదృష్టిని మరల్చటానికే ఇందిరమ్మబాట పట్టారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యమంత్రి తానో బ్యాట్స్‌మెన్‌ అని తనను ఎవరూ అవుట్‌చేయలేరంటూ చేసిన నర్మగర్భవాఖ్యలు, అదృష్టం వుంటే అన్నీ అవేవస్తాయని అందుకుగాను తన స్పీకర్‌ పదవి, ముఖ్యమంత్రి  వాటంతట అవే  వచ్చాయని చెప్పడం పట్ల సీనియర్‌ మంత్రులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అదృష్టం ఎక్కువ కాలం ఎవరి వద్దా ఉండదని త్వరలోనే ఆయన క్లీన్‌ బౌల్డ్‌ కావడం ఖాయమని వారు అంటున్నారు.

కిరణ్‌ దేశంలోనే అత్యంత అప్రయోజక ముఖ్యమంత్రా?

కిరణ్‌కుమార్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎంతోకాలం కొనసాగలేరని, చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ తెలిపారు. దేశం మొత్తంమీద ఇలాంటి అప్రయోజక ముఖ్యమంత్రి లేరని, ఇంటిబాట పడతానన్న బెంగతోనే ఇందిరమ్మ బాట పట్టారని ఆయన ఎద్దేవా చేశారు. హెలికాప్టర్‌లో తిరుగేందుకే ఇలాంటి యాత్రలు నిర్వహిస్తున్నారన్నారు. చిత్తూరులో సంవత్సరం క్రిందట జరిగిన శ్రీకృష్ట దేవరాయ శతాబ్డి ఉత్సవాల్లో జిల్లా అభివృద్దికి ఆరువేల కోట్లు ఇస్తామన్న కిరణ్‌ ఇంతవరకు ఆరు రూపాయలు కూడా విదల్చలేదన్నారు. తిరుమల అన్నదాన కార్యక్రమంలో పాయసం బదులు మామిడి రసం పెడితే  మమిడి రైతులకు ఉపయోగంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్ధులకు మంత్రి శైలజానాధ్‌ చెప్పులు కొంటారని చెప్పారని, ఆయన కొనకపోతే తన నియోజకవర్గ విద్యార్థులకు తనే చెప్పులు కొంటానని ఎంపీ శివప్రసాద్‌ తెలిపారు.  

మన ఎం.పీ.లు పైరవీలకే పరిమితమా?

మన పార్లమెంటు సభ్యులు ఏం చేస్తున్నారనుకుంటున్నారు....కేంద్రమంత్రులు ఏలా ఉండాలనుకుంటున్నారు..వారు సామాన్య ప్రజానీకాన్ని గురించి చర్చించి మెరుగైన సమాజం కోసం పాటుపడేవాళ్లగా ఉండాలనుకుంటుంన్నాం . కాని వారు మాత్రం సౌకర్యాలను అనుభవిస్తూ ప్రజలగురించి మాత్రం పూర్తిగా మర్చిపోయారనటానికి బోల్డన్ని ఉదాహరణలు. ఒక్కసారంటే ఒక్కసారి కూడా ప్రాంతీయ వివక్షను ప్రక్కనపెట్టి ప్రాజెక్టులుగాని, విద్యుత్‌, గ్యాస్‌లపై అధనంగా మన రాష్ట్రానికి రావాల్సిన వాటా గురించి కాని అడిగిన పాపాన పోలేదు. రిలయన్సు గ్యాస్‌ డ్రిల్లింగ్‌ జరుపుతున్న  కె.జి.బేసిన్‌ ప్రాంతానికి  చెందిన ఎంపి ఈ మద్య మాట్లాడుతూ ఎందుకు గ్యాస్‌ మనకు ఇవ్వవలసినదానికన్నా తక్కువ ఇస్తున్నారు మీరు ఎందువల్ల  తేలేక పోతున్నారంటే వారు డ్రిల్లింగ్‌ పర్మిషన్‌ తీసుకునేటప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన  పత్రాలపై సంతకాలు తీసుకోలేదని, ఇప్పుడు రిలయన్స్‌ యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం ద్వారా తమను వత్తిడికి గురి చేస్తున్నందువల్లే పార్లమెంటులోఅడగలేక పోతున్నామన్నారు. యుపిఎ గవర్నమెంటులో అందరికన్నా ఎక్కువ మంది ఎం.పి.లు  ఆంధ్రప్రదేశ్‌నుండి వెళ్లినా వివక్షకు గురి అవుతున్నాం. నగర అభివృద్దికోసం కేంద్రం తలపెట్టిన జవహర్‌లాల్‌ నెహ్రూ పట్టణ పునర్నిర్మాణానికి కెటాయింపులలోనూ వివక్షకు గురిఅయ్యాం. బెంగుళూరు, ముంబై, చెన్నై, కలకత్తాలు మనకు రెట్టింపు మొత్తాలు పొందాయి.  నగరాల్లో  మంచినీటి సరఫరా, భూగర్బడ్రైనేజీ వర్షపునీటి పైపులైన్ల నిర్మాణానికి మన రాష్ట్రంనుండి 2,166 కోట్లవిలువైన ప్రతిపాధనలు పంపినా 3 సంవత్సరాలనుండి వాటికి మోక్షం రాలేదు. పోలవరం, చేవెళ్ల, ప్రాణహిత ప్రాజెక్టులకు జాతీయ హోదా కోసం ఒక్కరు కూడా ప్రయత్నించడంలేదు. రైళ్లసంగతి అలాగేవుంది. మనకు  ఈ సంవత్పరం 31 రైళ్లు రాష్ట్రానికి మంజూరు చేసినా ఇప్పటివరకు 12 రైళ్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. వైద్య శాఖపైకూడా అదే నిర్లక్ష్యం చూపుతుంది. ట్రామాకేర్‌ నిధులను ఐదేళ్ళ నుంచి మంజూరు చేయించుకోలేక పోయారు. నల్గొండ జిల్లాలోని బీబీనగర్‌ ఆసుపత్రి ది అదే పరిస్థితి. అడుగడుగునాప్రజాధనంతో విలాసాలు ,డిల్లీలో పైరవీలు తప్ప వీరు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్న విమర్శలు వస్తున్నాయి.  

రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టిన సుప్రీం కోర్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆందోళనల సమయంలో హైకోర్టులో జరిగిన ఘటనపై వ్యవహరించిన తీరును తప్పు బడుతూ సుప్రీం కోర్టు తీవ్రంగా ప్రభుత్వాన్ని అభిసంశించింది. న్యాయమూర్తులు హెల్మెట్‌లతో వచ్చి హైకోర్టులో విధులు నిర్వహించాల్సిన పరిస్థితిని తీసుకోస్తారా అని కోర్టు ఆగ్రహించింది. గొడవలు చేసిన న్యాయవాదులను గుర్తించడంలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించింది. ఇప్పటి వరకు ఆందోళనలకు పాల్పడిన ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని, బార్ కౌన్సిల్‌పై ఎటువంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ఆందోళనలు చేసిన వారిని బార్ కౌన్సిల్ సభ్యత్వం నుంచి ఎందుకు తొలగించలేదని ప్రశ్నించింది. న్యాయస్థానాల్లో రౌడీయిజం, గుండాయిజం లాంటి చర్యలను ప్రభుత్వం సమర్థిస్తుందా అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవాదుల లైసెన్స్‌లు ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించింది. వారిపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్‌లో  కోర్టులలో ఇలాంటి ఘటనలు జరగవని హామీ ఇవ్వగలరా అని అత్యున్నత న్యాయస్థానం ఆవేదన వ్యక్తం చేసింది. భవిష్యత్లో అనుకూలంగా తీర్పు రాకుంటే, న్యాయమూర్తులపైన కూడా దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

అమ్మకానికి మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌

ప్రైవేటు వ్యక్తుల నుంచి బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణం కోసం భూమి సేకరించిన ప్రభుత్వయంత్రాంగం బాకీ పడ్డ సొమ్ము చెల్లించేందుకు మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టరేట్‌ను, అంబేద్కర్‌ భవనాన్ని అమ్మేయాలని సీనియర్‌సివిల్‌ కోర్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు రాష్ట్రవ్యాప్తంగా సంచలనమవుతోంది. భూమిపై యజమానుల హక్కులను కాపాడేతీర్పుల్లో ఇది ఒకటని పలువురు న్యాయవాదులు ప్రశంసిస్తున్నారు. 1986లో మూడు ఎకరాల నాలుగు కుంటల భూమిని బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణం కోసం సేకరించారు. ఈ భూమి ప్రైవేటు వ్యక్తులది. ప్రైవేటువ్యక్తుల నుంచి భూమి సేకరించినప్పుడు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలున్నా అథికారులు నామమాత్రంగా ముట్టజెప్పి బాకీ చెల్లించటం మానేశారు. అథికారులు తమ ఇతర కార్యక్రమాల్లో పడి నిర్లక్ష్యం చేయటంతో భూ యజమానులు సీనియర్‌సివిల్‌కోర్టును ఆశ్రయించారు. 25ఏళ్ల తరువాత న్యాయమూర్తి ఓ సంచలన తీర్పును వెలువరించారు. ప్రభుత్వాధికారులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నందున న్యాయమూర్తి జిల్లా కలెక్టరేట్‌ను, అంబేద్కర్‌భవనాన్ని అమ్మేసి అయినా బాకీ తీర్చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ తీర్పు జిల్లాలో ఎంత సంచలనమైందంటే ప్రతీప్రాంతంలోనూ కలెక్టరేట్‌ను అమ్మేస్తారట అని చర్చించుకుంటున్నారు.

ఇక విద్యా రుణాలకు బ్యాంకుల చుట్టూ తిరగక్కరలేదు?

పేద విద్యార్థుల ఉన్నతచదువు కోసం త్వరలో విద్యాఆర్థిక కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నాయి. దీనికి కేంద్రస్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. పేద విద్యార్థుల కోసం ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర సహాయమంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి స్పష్టం చేశారు. ఉన్నత విద్య కోసం బ్యాంకుల చుట్టూ పేదవిద్యార్థుల తల్లిదండ్రులు తిరిగే శ్రమను ఈ ఆర్థిక కార్పొరేషన్లు తగ్గిస్తాయని ఆమె వివరించారు. కొన్ని బ్యాంకులు ఈ రుణాలు ఇవ్వటానికి ఆసక్తి చూపటం లేదని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ధరఖాస్తుల ప్రక్రియ కూడా కార్పొరేషనులో సులభతరమవుతుందని తెలిపారు. ప్రత్యేకించి ప్రతీపేద విద్యార్థి తమ భవిష్యత్తు కోసం చదువుకోవాలనే తపన ఆధారంగానే ఈ కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్రణాళిక వేశామని వివరించారు. ఈ కార్పొరేషనులో అప్పు తీసుకోవటానికీ సరళమైన ప్రక్రియలు కూడా ఉంటాయన్నారు.   ఆమోదం కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా తక్షణం మంజూరు చేసే సదుపాయం కూడా కార్పొరేషన్లలో ఉంటుందన్నారు. ఉన్నతవిద్య అభ్యాసనకు బ్యాంకులు అనుసరించే విధానాన్ని మార్చకుండా అతితక్కువ సమయంలో ఎక్కువ మందికి లబ్ది చేకూరేలా నిబంధనలు సరళతరం చేశామని పురందరేశ్వరి వివరించారు. పేద విద్యార్థులు త్వరలో ఏర్పాటయ్యే ఈ విద్యాఆర్థిక కార్పొరేషన్లు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

బాలయ్యకు బ్రేక్‌లు వేస్తున్న చంద్రబాబు?

తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శిగా సినీ హీరో నందమూరి బాలకృష్ణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల టిడిపి అథినేత చంద్రబాబు ముందు తన అంతరంగాన్ని ఉంచిన బాలయ్య ఇప్పుడు ఏ పదవైతే తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటించటానికి అవకాశ ముంటుందో తెలుసుకుని ఒక నిర్ణయానికి వచ్చారని తెలిసింది. ప్రధాన కార్యదర్శి అయితే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ తాను గుర్తింపు తెచ్చుకోవచ్చని బాలయ్య భావిస్తున్నారట. అంతే కాకుండా తాను ఎమ్మెల్యేగా పోటీ చేయటానికి కృష్ణాజిల్లాలోని గుడివాడ అసెంబ్లీ కానీ, హిందుపురం కానీ అయితే బాగుంటుందని కూడా బాలయ్య అభిప్రాయపడుతున్నారట. ఈ రెండు విషయాలను మరో వారంలోపు చంద్రబాబు ముందుంచి తాను తెలుగుదేశం పార్టీ తరుపున అందరినీ కలుస్తానని బాలయ్య తన సన్నిహితులకు చెబుతున్నారట.   తన కుమారుడు నారా లోకేశ్‌ను రంగంలోకి దింపే సమయంలో బాలకృష్ణ రాజకీయతెరపైకి రావటం ఎంతవరకూ బాగుంటుందన్న విషయమై చంద్రబాబు దీర్ఘాలోచన చేస్తున్నారని తెలిసింది. పార్టీలో పొలిట్‌బ్యూరో సభ్యత్వం ఇచ్చి బాలయ్యను రాష్ట్రవ్యాప్తంగా తిప్పటమా? బాలయ్య కుమార్తె, తన కోడలును రంగంలోకి దించి రాష్ట్రవ్యాప్తంగా యువరక్తంతో రాజకీయాల్లో సంచలనం సృష్టించటామా? అన్న ప్రశ్నలు చంద్రబాబును వేధిస్తున్నాయట. అందుకే తనకు స్పష్టత వచ్చాక మాట్లాడదామని పార్టీ కార్యక్రమాల్లో బాబు బిజీ అయ్యారని తెలిసింది. అయితే ఈ బిజీలో కూడా పొలిట్‌బ్యూరో సభ్యులతో తన ఆలోచనలు ఆయన పంచుకుంటున్నారట. చివరికి బాలయ్యకు తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి పదవి ఇచ్చేందుకు పార్టీలోని పొలిట్‌బ్యూరో సభ్యులు కూడా సన్నద్ధంగానే ఉన్నారని సమాచారం.

మెట్రోరైలుకు ప్రణాళిక పూర్తి!

మెట్రోరైలు ప్రాజెక్టుకు అవసరమైన ప్రణాళికను పూర్తి చేశారు. నిర్మాణంపై ఉన్న సందిగ్థత వీడిరది. దీంతో ఎల్‌అండ్‌టి కార్యాచరణకు దిగింది. మెట్రోరైలు స్టేషన్లు, జంక్షన్లు ఎలా నిర్మించాలన్న సందేహంలో కొట్టుమిట్టాడుతున్న ఎల్‌అండ్‌టికి రైల్వే అధికారులు, ఇంజనీర్లు మార్గదర్శనం చేశారు. పిల్లర్లపై ఈ నిర్మాణాన్ని పూర్తిచేయనున్నారు. రోడ్డువేకు అనుసంధానం గానే 8 మీటర్ల ఎత్తులో నిర్మాణం చేయనున్నారు. స్టేషను కూడా 30 మీటర్లలో చతురస్రంగా నిర్మించనున్నారు. అంతే కాకుండా స్టేషనులోకి అడుగుపెట్టడానికి ముందే రైల్వేటిక్కెట్టు వెండర్‌ మిషన్లను ఏర్పాటు చేయబోతున్నారు.   టిక్కెట్టును రీడ్‌ చేశాక రైల్వేస్టేషనులోకి ప్రవేశించటానికి ఎలక్ట్రానిక్‌ డోర్‌లను అమర్చనున్నారు. ఫ్లైఓవర్లపైనా కూడా పిల్లర్ల సాయంతో ఈ నిర్మాణాలు సాగుతాయి. వాహనాలు పెట్టుకునేందుకు స్టాండ్లు, పాదాచారులు స్టేషనుకు చేరటానికి 8 మీటర్ల దారులు ఏర్పాటు చేయనున్నారు. అయితే స్టేషన్ల నిర్మాణంలో జంక్షన్లను కూడా నిర్ణయించారు. అమీర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌ వంటి కీలకమైన ప్రాంతాల్లో జంక్షన్లు ఏర్పాటు చేయనున్నారు. మహాత్మాగాంధీ బస్‌స్టేషను, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషను కూడా జంక్షన్‌ల్లో కీలకప్రాధాన్యత కల్పించారు. అలానే స్టేషన్ల భద్రత కోసం ప్రయాణీకుల సామాన్లు చెకింగ్‌ చేసేందుకు ఎలక్ట్రానిక్‌ మిషన్ల సాయంతో చర్యలు తీసుకుంటున్నారు. వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రైల్వేఅథికార్లు, ఎల్‌అండ్‌టి ప్రతినిధులు ప్రకటించారు.

కాంగ్రెస్‌ న్యూస్‌ ఛానల్‌ రాబోతుందా?

కాంగ్రెస్‌ పార్టీకి సొంత మీడియా అవసరం నానాటికి పెరుగు తోందని మంత్రులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లో ఒక మీడియా సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఒక న్యూస్‌ఛానల్‌, ఒక పత్రిక ఉంటే ఎటువంటి సమస్యలు ఎదురైనా ఎదుర్కోవచ్చని మంత్రులు అభిప్రాయ పడుతున్నారు. ఎంత కష్టపడి మంచి పథకాలు ప్రవేశపెట్టినా స్పందన రాకపోవటానికి మీడియా లేకపోవటమే కారణమని మంత్రులు అంటున్నారు. కనీసం ప్రశంసల మాటెలా ఉన్నా అసలు స్పందన కూడా రాకుండా కొన్ని మీడియా సంస్థలు అడ్డుపడుతున్నాయని అభిప్రాయపడుతున్నారు.   సొంతఛానల్‌ అయితే తమ పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను యథాతథంగా ప్రచారం చేయవచ్చని, దీని వల్ల ప్రశంసలు కూడా వచ్చే అవకాశాలున్నాయని మంత్రులు తేల్చేశారు. దీనికి సమాధానమిస్తూ మంత్రి రఘవీరారెడ్డి కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు సొంత మీడియా ఉందని గుర్తు చేశారు. ఆ ప్రత్యేక మీడియా మంచి ఫలితాలను తెచ్చిపెట్టిందని చెప్పారు. అయితే కొందరు మంత్రులు మాత్రం ఉన్న మీడియాను మనదారిలో తెచ్చుకుంటే సరిపోతుందని నచ్చచెబుతున్నారు. చివరికి రాష్ట్రంలో సొంత మీడియా గురించి కాంగ్రెస్‌ పార్టీ యోచించాలని మంత్రులు కోరారు. మంత్రి ధర్మాన నేతృత్వంలోని మంత్రివర్గ ఉపకమిటీ సమావేశం ఏర్పాటు చేసి అందరు మంత్రులను హాజరుకావాలని ఆహ్వానించింది. ఈ ఆహ్వానం అందుకున్న మంత్రుల్లో కేవలం ఐదుగురు మాత్రమే హాజరయ్యారు. హాజరైన మంత్రులు పలు అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించారు.   వాటిలో మీడియా గురించి, తెలంగాణా ప్రత్యేకరాష్ట్రం గురించి, ఎస్సీ వర్గీకరణ అంశంపై ఏకాభిప్రాయానికి రావాలనే పలు అంశాలపై చర్చ సాగింది. రేషనుకార్డులు నిరంతర ప్రక్రియగా మార్చకపోవటం వల్ల కూడా నష్టం జరిగిందని మంత్రి శ్రీధర్‌బాబు అభిప్రాయపడ్డారు. ఇక ప్రతీనెలా ఏదో ఒక ఎన్నికల ద్వారా కాంగ్రెస్‌ కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని మంత్రులు పార్టీకి సూచించారు.

కంట తడిపెట్టిన మంత్రి గీతారెడ్డి ?

సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న తమను అవినీతిపురులుగా ప్రజలు చూస్తున్నారంటూ మంత్రి గీతారెడ్డి కంటతడిపెట్టినట్లు తెలిసింది. ఆమె మంత్రివర్గ ఉప కమిటీ సమావేశానికి హాజరై మాట్లాడుతూ సహచర మంత్రులు కూడా దోషులుగానే తమను పరిగణిస్తున్నారని వాపోయారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో తాము జీఓలు విడుదల చేసినందుకే విచారణను ఎదుర్కోవలసి వస్తోందన్న నిజాన్ని ఎవరూ నమ్మటం లేదన్నారు. సిఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి కూడా గతంలో తప్పు తమదే అన్నట్లు వ్యవహరిస్తే కేబినెట్‌ నిర్ణయమని విశదీకరించామన్నారు. తాము ఆ జీఓల వల్ల ఎటువంటి లబ్దిపొందలేదన్న విషయాన్ని గుర్తించుకోవాలని కోరారు. కేబినెట్‌ మొత్తం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని నమ్మినందు వల్లే ఆ జీఓలు విడుదల య్యాయని గీతారెడ్డి అన్నారు. తోటి మంత్రులు కూడా తమ నైతికప్రవర్తన నమ్మకపోతే ఎలా అని వాపోయారు. పూర్తి సంఫీుభావం తెలిపితే తాము ఆనందిస్తామని ఆమె అన్నారు. ఒకవేళ సంఫీుభావం చెప్పకపోయినా తమను అవినీతిపరుల్లా వేరు చేసి చూడరాదని ఆమె కోరారు.

వై.ఎస్‌. ఆనవాళ్ళను కాంగ్రెస్‌ చెరిపేయగలదా?

దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌ పార్టీ కన్నా వ్యక్తిగతంగా సంపాదించుకున్న ఇమేజ్‌ ప్రజల్లో నాటుకు పోయింది. ఏ సంక్షేమ పథకం ఆయన ప్రకటించినా అది కాంగ్రెస్‌ పార్టీ రూపొందించినది కాదని, వైఎస్‌ సొంతంగా ఈ పథకాన్ని రూపొందించారని ప్రచారం జరిగింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ కన్నా వైఎస్‌కు ప్రజల్లో సంక్షేమపథకాల నిర్మాతగా ముద్రపడిరది. ఆ ముద్ర ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డికి లాభిస్తోంది. వైఎస్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని వై.కా.పా. అధ్యక్షుడు జగన్‌ పలుమార్లు డిమాండు చేశారు. దీంతో కాంగ్రెస్‌ జాతీయ స్థాయిలో అమలు చేసే ఏ సంక్షేమ పథకమైనా రాష్ట్రంలో మాత్రం వైఎస్‌ ముద్రను సొంతం చేసుకున్నాయి. ఇటీవల మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలోని మంత్రివర్గకమిటీ కూడా ఈ విషయాన్ని గమనించింది.   జగన్‌ తొలిసారి ఈ ముద్రను వేసినప్పుడే తిప్పికొట్టి ఉంటే బాగుండేదని, ఇప్పుడు ప్రజలకు దీని గురించి వివరించటం చాలా కష్టమని కాంగ్రెస్‌ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్‌ పార్టీ రూపొందించిన సంక్షేమ పథకం ఇది అని వివరిస్తూ వైఎస్‌ కూడా తనలాగే ముఖ్యమంత్రిగా పని చేశారు కాబట్టి దాన్ని అమలు చేశారని విశదీకరిస్తున్నారు. ఇంత సుదీర్ఘ విశదీకరణ అన్ని ప్రాంతాల్లోనూ ఆయన చెప్పగలరా? ఆ ముద్రను చెరపటం అంత సులభమా?   ముద్ర చెరపటమే అంత సులభమైతే ఉప ఎన్నికల్లో ఓటమి తప్పేదని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. అలానే వైఎస్‌ హయాంలో ఆగిపోయిన సగం ప్రాజెక్టులను ఇప్పుడు పూర్తి చేయటం ద్వారా అది తమ పార్టీ రూపొందించినది అని తెలియజేయాలని సూచనలు వస్తున్నాయి. అవసరమైతే లబ్దిదారులకు మళ్లీ మంజూరులు చేయటం ద్వారా కూడా కాంగ్రెస్‌ పార్టీ సంక్షేమ కార్యక్రమమన్న అభిప్రాయాన్ని కల్పించాలని ప్రభుత్వానికి పలువురు సూచిస్తున్నారు. ఏమైనా వైఎస్‌ ముద్ర మాత్రం కాంగ్రెస్‌ను భయపెడుతోంది.

చిన్నం రాయకోటయ్యకు అభయ ‘‘ హస్తం ‘‘

నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య చివరికి కాంగ్రెస్‌లో కుదురుకున్నారా? అన్న సందేహం ఆయన కాంగ్రెస్‌ నాయకుడు పాలడుగువెంకట్రావు పత్రికావిలేకరుల సమావేశంతో బలపడుతోంది. నిన్నటి వరకూ వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ తో మొదలుపెట్టిన ఈ ఎమ్మెల్యే చివరకు కాంగ్రెస్‌లోనే చేరేశానన్నట్లు వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ టిక్కెట్టుపై ఎమ్మెల్యే అయిన చిన్నం ఇప్పుడు పాలడుగు వెనుక తిరుగుతున్నారు. పాలడుగు ఎక్కడికి వెడితే అక్కడికి ఆయన కూడా వచ్చేస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్‌ నాయకులను పలకరిస్తూ తాను ఆ పార్టీ వాడినే అనేలా వ్యవహరిస్తున్నారు. పాలడుగు పాత్రికేయులతో మాట్లాడుతూ ఉండగా చిన్నం తాను రాష్ట్రపతి యుపిఎ అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీకి మద్దతు ఇస్తున్నానని తేల్చిచెప్పారు. అంతేకాకుండా తనకు రాష్ట్రపతిగా గెలిచిన తరువాత ప్రణబ్‌తో ఫొటో తీయించుకోవాలనుందని అన్నారు.   దీనికి పాలడుగు వెంటనే స్పందిస్తూ ప్రణబ్‌ ముఖర్జీతో తాను రచించిన పుస్తకాలు ఆవిష్కరణ జరుగుతుందని ఆ సమయంలోనే చిన్నం ఆయనతో ఫొటో తీయించుకోవచ్చని హామీ ఇచ్చారు. ఇంతకీ కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీ మరో ఎమ్మెల్యేను వదులుకున్నట్లేనా? చిన్నం రాష్ట్రపతి ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తారా? మరి నాని విషయంలో తెలుగుదేశం పార్టీ చేసినంత అల్లరి మళ్లీ రామకోటయ్య విషయంలో తప్పదా? అన్న పలు ఆసక్తికరమైన సందేహాలు పరిశీలకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతల స్పందన ద్వారానే ఈ సందేహాలు తీరుతాయని వారు ఎదురుచూస్తున్నారు.

దివాళా తీస్తున్న ఐటిసెజ్‌లు?

రాష్ట్రంలో ఐటిసెజ్‌లు ఏర్పాటు చేయటం ద్వారా నిరుద్యోగసమస్యను కొంతవరకూ పరిష్కరించ వచ్చన్న ప్రభుత్వ పాచిక పారలేదు. అనుకున్న స్థాయిలో కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించకపోవటంతో ఈ ఐటిసెజ్‌లు నామమాత్రంగా మిగిలాయి. ఈ ఐటిసెజ్‌ల్లో నిరుద్యోగ సమస్య తీరుతుంటే ప్రవాసాంధ్రులు తిరిగి స్వదేశాలకు వచ్చి పెట్టుబడులు పెడతారని ప్రభుత్వం భావించింది. ఇది కూడా కలలో మాట అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో 119 సెజ్‌లు ఏర్పాటు చేశారు. వీటిలో 56ఐటి సెజ్‌లకు ప్రభుత్వం అనుమతి లభించింది. వీటిలోనూ 21 ఐటి సెజ్‌లు మాత్రమే పని చేస్తున్నాయి. నాలుగు కంపెనీలు సెజ్‌లు ప్రారంభించి నష్టాలపాలై దివాళా దశకు చేరుకున్నాయి. ఈ మొత్తం ఐటీసెజ్‌ల్లో కనీసం 3,97,433 ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేశారు. కానీ, వాస్తవానికి 78,380 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు.   ఈ ఐటిసెజ్‌ల్లో రూ.14,995కోట్లు పెట్టుబడి ప్రతిపాదనలు సిద్ధమైతే విడుదలైంది మాత్రం 6,809.93కోట్ల రూపాయలు మాత్రమే. మొత్త సెజ్‌ల ద్వారా 4,10,185మందికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉపాథి లభిస్తుందని లెక్కించారు. కానీ, 17,034మంది మాత్రమే ఉపాథి పొందుతున్నారు. ప్రస్తుతం ఈ సెజ్‌ల్లో ఎన్‌ఎస్‌ఎల్‌ ఇన్‌ఫ్రా, సిఎంసి, దివ్యశ్రీ, డిఎల్‌ఎఫ్‌ కమర్షియల్‌ డెవలపర్స్‌, ఇన్‌ఫోసిస్‌, ఫోనిక్స్‌, సత్యం, విప్రో, కాకినాడ సెజ్‌లో జిఎంఆర్‌ వంటి కంపెనీలు భాగస్వామ్యం వహిస్తున్నాయి. తిరుపతి, విశాఖ, వరంగల్‌లో ఐటి పరంగా కీలకమైన టవర్ల నిర్మాణం కోసం ఎపిఐఐసి ఆసక్తివ్యక్తికరణ నోటీసు విడుదల చేస్తే ఇప్పటి వరకూ ఎటువంటి స్పందన రాలేదు. ఈ టవర్లు నిర్మించకపోతే పలుకంపెనీలు నష్టాన్ని భరించలేమంటూ తమ సంస్థలను వెనక్కి తీసుకునే అవకాశాలూ ఉన్నాయి. ఒకవైపు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, మరోవైపు నిరుద్యోగ సమస్యలు ఎదుర్కొంటున్న ఈ ఐటిసెజ్‌లపై ప్రభుత్వం ఒక్కసారి పునారాలోచించి సరైనచర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

తెలుగుదేశంలో చిచ్చు పెట్టిన ప్రణబ్‌

రాష్ట్రపతి ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ దూరం అవుతోంది. ఆ పార్టీ సీనియర్‌నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రపతి ఎన్నికలపై ఏర్పాటు చేసిన సమీక్షలో కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీకి బహిరంగ మద్దతు తెలిపారు. ప్రణబ్‌ సీనియర్‌ నాయకుడని, ఆయనకు రాష్ట్రపతి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని కొందరు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ఎన్డీఏ అభ్యర్థి పిఎ సంగ్మాకు పార్టీపరంగా మద్దతు ఇవ్వనందున ప్రణబ్‌కు ఓటేస్తే తప్పేంటని పార్టీ సీనియర్‌నేతలను ప్రశ్నించారు. దీంతో ఆశ్చర్యపోయిన సీనియర్లు, పార్టీ అథినేత తిరిగి సమావేశమై రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉంటేనే మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. తెలుగుదేశం పార్టీ తరుపున ఎవరూ ఈ ఎన్నికల్లో పాల్గొనరాదని కోరారు. అంతేకాకుండా కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీకి ఓటేయాలనుకుంటున్న వారినందరినీ ప్రత్యేకంగా పిలిచి మరీ ఎన్నికలకు దూరంగా ఉండాలన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటేనే భవిష్యత్తులో మరిన్ని అవకాశాలుంటాయని సీనియరు నేతలు స్పష్టం చేశారు. ఒకవేళ పార్టీ నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలూ తప్పవని హెచ్చరించారు. ఇది ఇలా ఉండగా తెలుగుదేశం పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయాన్ని పక్కన పెట్టి మరీ రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనటానికి నిర్ణయించుకున్నారు. ఓటు హక్కును వదులుకుని ఇంకో అభ్యర్థిని గెలిపించటం కన్నా వినియోగించుకుని ప్రణబ్‌ని గెలిపించాలని వారు నిశ్చయించుకున్నారు.  

రామచంద్రపురం నచ్చేసిందన్న సిఎం!

తనకు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం బాగా నచ్చేసిందని రాష్ట్రముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి పర్యటనలో భాగంగా ఆయన ద్రాక్షారామలో మాట్లాడుతూ తాను ముందుగా ఊహించినట్లే రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు తెలివైన వారని నిరూపించుకున్నారని కొనియాడారు. మాజీమంత్రి, వై.కా.పా. అభ్యర్థి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ ఓటమి కోసమే ఈ ఎన్నికలు వచ్చాయని తన ఎన్నికల ప్రచారంలో అన్నమాటను సిఎం గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి తోట త్రిమూర్తులును గెలిపించటం ద్వారా నియోజకవర్గ ప్రజలు కోరినవన్నీ తీరుస్తానని మాట ఇచ్చారు. ముందస్తుగా ఒక ఐటిఐను, వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలను మంజూరు చేశారు.   రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ల కొరతను తీరుస్తామన్నారు. గంగవరం మండలంలో జూనియర్‌ కాలేజీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఎస్సీ ఆశ్రమపాఠశాలను కూడా ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అడిగిన ప్రతీ ఒక్క అంశానికీ సిఎం ఆమోదముద్ర లభించింది. సిఎం వైఖరిని గమనిస్తే ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు మంత్రిపదవి కూడా ఇదే స్పీడులో ఇచ్చేస్తారన్న అభిప్రాయం కూడా స్థానిక కాంగ్రెస్‌ శ్రేణులకు ఏర్పడిరది. ఇంకోసారి నియోజకవర్గానికి వస్తానని సిఎం చెబుతూ కిందకి దిగుతున్నప్పుడు మా తోటకు మంత్రిపదవి ఇచ్చాక అని కొందరు వ్యాఖ్యానించటం చెవిన పడ్డా చిరునవ్వుతో సిఎం బయలుదేరి వెళ్లిపోయారు.

ప్రత్యేకరాయలసీమకు పెరుగుతున్న స్పందన?

రాయలతెలంగాణా ఇస్తామని కాంగ్రెస్‌ కేంద్ర నాయకత్వం కదిపిన అంశం ఇప్పుడు ఒక ప్రత్యేక డిమాండుకు ప్రాతిపదక అయి కూర్చుంది. దీని కారణంగానే తమకు ప్రత్యేక రాయలసీమను ఇవ్వాలని కొత్తడిమాండు తెరపైకి వచ్చింది. అంతేకాకుండా ఈ డిమాండుకు నానాటికీ ఆదరణ పెరుగుతోంది. రాయలసీమలోని పలుప్రాంతాల నుంచి ఈ డిమాండుకు స్పందన వస్తోంది. కర్నూలులోని కొండారెడ్డి బురుజు కేంద్రంగా ఈ డిమాండుకు టిడిపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి బైర్రెడ్డి రాజశేఖరరెడ్డి బీజం వేశారు. రాయలసీమ పరిరక్షణ సమితిని కూడా ఏర్పాటు చేశారు. ఆయన ఈ సమితికి అధ్యక్షునిగా ఉండి అందరినీ కూడగట్టే ప్రయత్నాలు ప్రారంభించారు.     చారిత్రక ప్రాశస్త్యం ఉన్న తమ రాయలసీమకు ఫ్యాక్షన్‌ ప్రాంతమని అపవాదు సృష్టించి రాయలసీమ వాసుల మంచితనాన్ని, గొప్పదనాన్ని మరుగున పడేశారని రాజశేఖరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎందరో ప్రముఖుల పుట్టినిల్లు అయిన రాయలసీమను గతంలో రత్నాలసీమ అనేవారని, ఇప్పుడు నిత్యం ఫ్యాక్షన్‌ తగాదాలతో మిగిలి ఉన్న ప్రాంతమంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖ్యాతిగడిరచిన ఇంజనీరు విశ్వేశ్వరరెడ్డి, రాష్ట్రాన్ని పాలించిన నేతలు రాయలసీమలోనే పుట్టారని గుర్తుంచుకుని తమ డిమాండుకు కేంద్రం ఆమోదాన్ని తెలపాలని కోరుతున్నారు. తెలంగాణావాదులు కావాలనే తమపై బురదజల్లుతున్నారని, కర్నూలు కేంద్రంగా తమకు ప్రత్యేకరాష్ట్రాన్ని ఆమోదిస్తే దారిద్య్రంతో సతమతమవుతున్న తమ ప్రాంతం తిరిగి రత్నాలసీమ అని పొగడ్తలను అందుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఈయనకు మద్దతుగా కొండారెడ్డిబురుజు చుట్టూ క్యాండిల్స్‌తో ప్రదర్శన చేశారు. కేంద్రప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి తమకు న్యాయం చేయాలని రాజశేఖరరెడ్డి డిమాండు చేశారు.