జగన్‌పై ఢిల్లీ నేతల వైఖరిలో మార్పు ?
posted on Jul 23, 2012 8:58AM
జగన్ ఉప ఎన్నికల్లో పదిహేను సీట్లు గెలుచుకున్నాక కేంద్రం వైఖరి మారడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ శ్రేణులకు ఏం చెయ్యాలో తోచడం లేదు. జాతీయ నాయకత్వ నిర్ణయాలకు రాష్ట్రనాయకత్వానికిచ్చే ఆదేశాలకు పొంతన కుదరటంలేదు. దీంతో రాష్ట్రనాయకత్వానికి ఎటూ పాలుపోవడం లేదు. పార్టీ కేడర్ అంతా అయోమయంలో ఉంది. వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమలైన అభివృద్ది పథకాలన్నీ కాంగ్రెస్‌వి కాగా, అవి వైయస్ పథకాలుగా నమ్మిన ప్రజలు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్‌కు ఓట్లు వేసారని రాష్ట్రనాయకత్వం అధిష్టానికి వివరించింది. ఇప్పుడు వాటిని సరిదిద్దుకునేందుకు ఇందిరమ్మ బాటను పట్టి అవి సర్కారు వారి స్కీములుగా చెప్పుకుంటున్నారు.
ఈ తరుణంలో రాష్ట్రపతి ఎన్నికలు జరగటం, జగన్ వర్గం కాంగ్రెస్ బలపరచిన ప్రణబ్‌కు ఓటు వేయటంతో రాష్ట్రంలో పరిస్దితులు మారాయి. ప్రస్తుత పరిస్దితిని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక రాష్ట్ర నాయకత్వం తికమక పడుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరుడిని ఒక రకంగా ఆయన కొడుకును మరో విధంగా చూడటం, గతంలో వై.ఎస్. వల్ల లబ్ధిపొందిన మంత్రులు కూడా జగన్‌పై కక్ష గట్టినట్లు మాట్లాడడం వల్ల కూడా ఎన్నికల్లో కాంగ్రెస్ నష్టపోయినట్లు పిసిసి సమన్యయకమిటి అభిప్రాయపడినట్లు తెలుస్తుంది. వైయస్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పని చేస్తూ మరణించారు కనుక ఆయన్ను కాంగ్రెస్‌నాయకుడిగా చూడటమే సరైన పద్దతిగా ఈ సమావేశంలో పిసిసి అద్యక్షుడు బొత్స సత్యన్నారాయణ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నట్లు తెలిసింది. వైయస్ ఫోటో లేకుండా ప్రజల్లోకి వెళితే తమకే నష్టమని రానున్న రోజుల్లో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతుందని కూడా కొందరు నేతలు ప్రకటిస్తున్నారు.
ఈవిషయంలో నాయకులంతా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారని తెలుస్తుంది. ఈ నేపధ్యంలో మీడియాను ఫేస్ చేయడం రాష్ట్రనాయకత్వానికి పెద్ద ప్రాబ్లమ్‌గా వుందని వాపోతున్నారు. అధిష్టానం తమతో మాత్రం జగన్ విషయంలో కఠినంగా వ్యవహరించమని చెప్పి ఇప్పుడు వారు మాత్రం మెతకవైఖరి ప్రదర్శించడంతో రాష్ట్రనాయకత్వం ఖంగుతింటుందని తెలుస్తుంది.