గుడివాడ అభ్యర్ధి వేటలో తెలుగుదేశం?
posted on Jul 23, 2012 @ 11:04AM
తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పదవికి పోటీ చేయగల సమర్థులైన అభ్యర్థుల కోసం ఆ పార్టీ ఇక కసరత్తులు చేయకతప్పదు. ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ అథిష్టానంతో పోరాటం జరిపిన ఎమ్మెల్యే కొడాలి నాని తన అంతరంగాన్ని బయటపెట్టాడు. తాను వైఎస్‌ఆర్‌సిపి తరుపున పోటీ చేస్తానని ప్రకటించారు. అంటే అవసరమైతే రాజీనామా చేసి ఎన్నికలకు తెరలేపటానికి నాని సిద్ధంగా ఉన్నారు. అందుకే తన నియోజకవర్గ అభివృద్థికి రూ.250కోట్ల ప్యాకేజీని నాని ప్రకటించారు. అయితే ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆయన తనకు అవసరమైన కార్యకర్తలను సమకూర్చుకున్న తరువాతే తెలుగుదేశం వీడినట్లు ప్రకటించటం గమనార్హం.
సస్పెండ్ చేశామని చెప్పిన తెలుగుదేశం పార్టీని తప్పుబడుతూ నాని కొందరు తెలుగుదేశం కార్యకర్తలను తనకు మద్దతుదారులుగా మలుచుకున్నారు. అనుకున్నది అయ్యేంత వరకూ ఓర్పువహించిన నాని జగన్ సూచనల మేరకే నడుచుకుంటున్నారని సమాచారం. తనపై దుమారం లేపిన తెలుగుదేశం నేతలను నాని సమర్ధవంతంగా తిప్పికొట్టారు. పైగా, తెలుగుదేశం క్యాడర్‌ను నాని కొన్నాళ్లపాటు కార్యాలయం స్వాధీనం చేసుకుని ఒకరకంగా దెబ్బతీశారు. డబ్బులు తీసుకున్నారని నానిపై ఆరోపణలు చేసిన వారందరినీ టార్గెట్ చేసిన నాని ఇప్పుడు ఫ్రీ అయ్యారు. సాక్షాత్తూ తమ పార్టీ అథినేత చంద్రబాబును తనకు తెలిసిన కోణంలో ప్రజల ముందుంచిన నాని ఇక వైకాపా అభ్యర్థిగా పోటీ చేయదలుచుకున్నారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు స్వస్థలం గుడివాడ. ఇక్కడ నందమూరి కుటుంబానికీ, ఆయన సామాజికవర్గానికీ మంచి ఆదరణ ఉంది. ఆయన తరువాత మనుమడు, హీరో ఎన్టీఆర్ స్వయంగా కొడాలి నాని గురించి చంద్రబాబుకు రికమండ్ చేశారు. ఎన్టీఆర్ సిఫార్సు మేరకు తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన నాని ఇప్పుడు వైకాపాకు ఆదరణ ఉందంటున్నారు. అందుకే ఆ పార్టీ తరుపున ప్రజల ద్వారా ఎన్నికవుతానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల నందమూరి కుటుంబవారసుడు బాలకృష్ణ రాజకీయరంగ ప్రవేశానికి ఉవ్విళ్లూరుతున్నారు.
ఆయన ఈ గుడివాడ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తే ఒక్క సామాజికవర్గానికి ప్రతినిధిగా మిగిలిపోతానని బాలకృష్ణ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన హిందుపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అందువల్ల ఆయన్ని ఇప్పుడు తప్పనిసరిగా గుడివాడకు ఒప్పిస్తే 2014కు హిందుపురం అసెంబ్లీలో రెండోసారి పోటీకి నిలపవచ్చని తెలుగుదేశం సీనియర్లు భావిస్తున్నారు. కొడాలినానిని ఎదుర్కోవాలంటే బాలకృష్ణ మాత్రమే బలమైన ప్రత్యర్థి అని భావిస్తున్నారు. అయితే బాలకృష్ణ కుమార్తెను కూడా రాజకీయాల్లో దింపాలన్న ఆలోచన ఉన్న సీనియర్లు ఆమెను దింపి వెనుక నుంచి బాలకృష్ణ మద్దతు తీసుకున్నా పర్వాలేదంటున్నారు.