మరో ఏడాది విదేశీపర్యటనలకు బ్రేక్
posted on Jul 21, 2012 @ 11:40AM
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికపరిస్థితి మెరుగుపడేంత వరకూ అనవసర విదేశీపర్యటనల జోలికి వెళ్లొద్దని నియంత్రిస్తూ పెట్టిన ఆంక్షలు మరో ఏడాది పొడిగించారు. ప్రత్యేకించి మంత్రులు, ఉన్నతాథికారులు, సాధారణ అథికారులు విదేశీపర్యటనలపై పొడిగింపు కొనసాగుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సిన వారికి మాత్రం అనుమతి ఇస్తున్నారు. ఈ అనుమతి కోసం ముందస్తుగా ధరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఆర్థికశాఖ కోరింది. దీని పరిశీలనకు ఒక కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ అసలు విదేశీపర్యటన అవసరమా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించి అవసరాన్ని బట్టి చర్యలు తీసుకుంటుంది.
ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఈ కమిటీకి ఛైర్మన్ హోదాలో పని చేస్తున్నారు. ఆయనకు మాత్రమే రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై అవగాహన ఉంటుందని ప్రభుత్వం ఈ నియామకం ఖరారు చేసింది. సభ్యులుగా అటవీశాఖ ప్రత్యేకప్రధానకార్యదర్శి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి, భూపరిపాలన ప్రధానకమిషనరు, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి నియమితులయ్యారు. ఈ కమిటీ మొత్తం ఒక్కసారిే సమావేశమై అర్హతల వారీగా, అవసరాల వారీగా ధరఖాస్తులను పరిశీలిస్తుంది. వచ్చే జూన్ నెల 15వ తేదీ వరకూ ఈ ధరఖాస్తులను అందజేయవచ్చని కమిటీ ఛైర్మన్ ప్రకటించారు. తుదిగడువులోపు తమకు ధరఖాస్తులు అందజేయాలని ఆయన కోరారు.