నాటా - ఆంధ్రభూమి కథల పోటీలో విజేతలకు బహుమతి ప్రదానం
ఉత్తర అమెరికా తెలుగుసమితి [NATA] - ఆంధ్రభూమి దిన పత్రిక సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ మొట్టమొదటి కథల పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమం సన్ షైన్ హాస్పిటల్ ఆడిటోరియం నందు నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ. డి. శ్రీధర్ బాబు సివిల్ సప్ప్లైస్ అమాత్యులు విచ్చేశారు. ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకులు ఎమ్.విఆర్. శాస్త్రిగారు సభాధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో తెలుగు అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీ.కె. యాదగిరి గారు, ఆంధ్రభూమి వారపత్రిక సహాయ సంపాదకులు శ్రీమతి ఎ.ఎస్.లక్ష్మిగారు పాల్గొన్నారు. నాటా అధ్యక్షులు ఎ.వి.ఎన్ రెడ్డి, కార్యదర్శి ప్రదీప్ సామల, ఇండియా ఓవర్ సీస్ కో ఆర్డినేటర్స్ ద్వారకానాథరెడ్డి, గోపీనాథ రెడ్డి సమన్వయం చేశారు.
నాటా - ఆంధ్రభూమి నిర్వహించిన కథల పోటీలో విశేష స్పందన లభించిందనీ, అనేక ప్రాంతాల నుండి వచ్చిన కథలలో న్యాయ నిర్ణేతలు 5 (ఐదు ) కథలకు బహుమతి ప్రకటిస్తూ, మరికొన్ని కథలు సాధారణ ప్రచురణకు స్వీకరించినట్లు తెలియజేశారు. భాషను ప్రేమిస్తూ, ఓ తపస్సులా రచనలు చేస్తే అది వ్యక్తి వికాసానికి, సమాజాభివృద్ధికి తోడ్పడుతుందని పలువురు వక్తలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
సలీం (హైదరాబాద్ ) తను రాసిన 'నిర్ణయ' కథను ప్రథమ బహుమతి 20,000 వేల రూపాయలు గెలుపొందగా, ద్వితీయ బహుమతులు సింహప్రసాద్ (హైదరాబాద్) 'వంశవృక్షం' కథకి, చింతా జగన్నాథరావ్ (విశాఖపట్నం) 'తగువారము మేమే' కథకి గాను 10,000 వేల రూపాయలు గెలుపొందగా, వసుంధర (హైదరాబాద్) సృశాసని కథకి, బి.గీతిక (జిన్నూరు పశ్చిమగోదావరి ) 'మట్టి మనిషి' కథకి తృతీయ బహుమతిగా 5000 వేల రూపాయలు గెలుచుకున్నారు. వీరందరూ తమ తమ రివార్డును ఈ వేదికపై అందుకున్నారు.
సభా కార్యక్రమానికి ముందు మాస్టర్ శరశ్చంద్రచే నిర్వహించబడిన సినీసంగీత విభావరి సంస్క్రృతిక కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది.