తిరుపతి వెంకన్న వెండికి ఇ టెండర్‌

తిరుమల వెంకన్నకు చెందిన వెండిని మార్చి బంగారం కొనాలని  తిరుమలతిరుపతి పాలకమండలి నిర్ణయం తీసుకుంది. అసలు ఈ వెండి భక్తులు సమర్పించిందా లేక హుండీదా అని పాలకమండలి తెలుపలేదు. దేశం మొత్తం మీద అధిక సంపన్నుడిగా పేరు గాంచిన వడ్డీకాసులవాడి ఆస్తులు లక్షన్నర కోట్ల పై మాటే. వెండి విలువ దాదాపు 16 వేలకోట్ల రూపాయలు.  స్వామి వారి దగ్గరున్న క్యాష్‌ వెయ్యికోట్లు .ఇదంతా జాతీయ బ్యాంకుల్లో భద్రంగా వుందని స్వామివారి పాలక మండలి చెబుతుంది. ఇప్పటికే వెంకటేశ్వర స్వామికి 50వేల కోట్లరూపాయల ఆభరాణాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం స్వామివారికి ఉన్న వెండిని కొంత కరిగించి దానితో బంగారాన్ని కొని బ్యాంకులో భద్రపరచాలని దేవస్ధానం నిర్ణయించింది. ఈ వెండిని హైదరాబాద్‌లోని మింట్‌కాంపౌండ్‌కి తరలించి కరిగిస్తారని దానికి గాను ఇ టెండర్లను పిలవాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. తరలించిన వెండిలో 20 శాతం తరుగు, రవాణా ఖర్చులకు పోతుందని దేవస్ధానం వారు తెలిపారు. అంతకు ముందుకూడా కరిగించిన వెండినితోనూ, బంగారంతోనూ డాలర్లు చేయించి భక్తులకు ఇచ్చేవారు. అయితే డాలర్లలో కొన్ని శేషాద్రి మాయంచేశాడని ఆరోపణలు ఉన్నా ఆయన తన పదవిని ప్రతి రెండేళ్లకు ఒకసారి పొడిగించుకుంటునే ఉన్నారు. వెంకటేశ్వరస్వామికి మరో ఆదాయం తలనీలాలు ప్రస్తుతానికి 500 టన్నుల  ఉన్నట్లు అంచనా దీని విలువ కోట్లలో ఉంటుందని వేరే చెప్పనక్కరలేదు. అయితే ఇవన్నీ జాతీయ బ్యాంకుల్లో ఉన్నాయా లేదా ఉంటే వాటికి భద్రత ఎంతవరకు గ్యారెంటీ ఉంటుందనేది మరొక ప్రశ్న..అలాగే స్వామివారి ఆస్తులను, కార్యకలాపాలన్నిటిని అనుమానాలకు తావివ్వకుండా పారదర్మకత ప్రదర్శించాలని భక్తులు కోరుతున్నారు.  

రాహుల్‌కి రాజకీయాలు అవసరమా?

ఇక కీలక బాధ్యతలు స్వీకరించడానికి తాను సిద్దమని రాహుల్‌ గాంధీ ప్రకటించారు. ఇదే  విషయమై స్వపక్ష్యం, ప్రతిపక్షాలనుండి రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. ప్రణబ్‌ రాష్ట్రపతి పదవికి పోటీచేయడంతో ఏర్పడిన గ్యాప్‌ను నింపడానికే రాహుల్‌గాంధీని క్రియాశీలక పాత్రలోకి తెస్తున్నారంటున్నారు. తరతరాలుగా దేశంకోసం ప్రాణాలర్పించిన త్యాగధనుల కుటుంబం నుండి వచ్చారన్న  భజన తప్ప నాయకత్వ లక్షణాలుగాని, సైద్దాంతిక లక్షణాలు గాని రాహుల్‌ లో కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.   ప్రత్యర్థులపై ఆయన ప్రభావం శూన్యం. దేశాన్ని  మున్ముందు ఎలా నడిపించాలన్న ఎజెండా ఏమీ ఆయన దగ్గరనుండి ఆశించలేము అని ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నారు. మొదటి ప్రధానిగా భారతదేశాన్ని సుస్థిరం చేసిన ఘనత  ఆనాటి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ ఉంది. పంచవర్ష ప్రణాళికల ద్వారా  ఆయన దేశానికి జవసత్యాలు అందించారు. ఆ తర్వాత ప్రధాని అయిన లాల్‌బహదుర్‌ శాస్త్రి ఎక్కువకాలం ప్రధానిగా లేరు. ఆయన ఆకస్మిక మృతితో ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా 20 పధకాలతో ముందుకుసాగారు. ఆమె తరువాత రాజీవ్‌గాంధీ ఐ.టి. యుగానికి బాటలు వేసి యువతరంలో ఉత్సాహం నింపారు. వీరి వారసుడైన రాహుల్‌కు వారి లక్షణాల్లో ఒక్కటి కూడా అబ్బలేదని ఆయనను సన్నిహితంగా పరిశీలిస్తున్నవారు అంటున్నారు.  మొన్న జరిగిన యుపి ఎన్నికలో రాహుల్‌ చమటోడ్చి పనిచేసినప్పటికి ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. అయినా ప్రస్తుతం కాంగ్రెస్‌కి ఉన్న ఒకే ఒక అస్త్రం రాహుల్‌ మాత్రమే. ఆయన వల్ల పార్టీకి ఇప్పటిదాకా పెద్ద ప్రయోజనం చేకూరలేదు. ఒకవేళ ఆయన ప్రభుత్వంలో బాధ్యతలు స్వీకరిస్తే ఎలా ఉంటుందన్న దానిపై  కూడా సందేహాలు ఉన్నాయి. బాబారామ్‌దేవ్‌ , అన్నా హజారే ల సత్యాగ్రహాలను ఆయన చులకన చేసి మాట్లాడడం, దేశం ఎన్నో  సమస్యలు ఎదుర్కోంటున్నా ఆయన ఏనాడు పార్లమెంట్‌లో వాటిని ప్రస్తావించకపోవడాన్ని చూస్తే ఆయన కు ప్రభుత్వ వ్యవహాహారలపై కూడా ఆవగాహన లేదనిపిస్తోంది.  స్వపక్షం రాహుల్‌ జపం చేయడమేకాని దేశంలో ఎవరికీ ప్రిన్స్‌ మీద అంచనాలు లేవని తెలుస్తుంది. త్వరలో  గుజరాత్‌ ,హిమాచల్‌ప్రదేశ్‌లో జరుగబోయే ఎన్నికల్లో గాని  ఆ తర్వాత కర్ణాటక, మధ్యప్రదేశ్‌ మొదలైన రాష్ట్రాలలో జరగబోయే ఎన్నికల్లో గాని రాహుల్‌ చరిస్మా ఎంతవరకు పనిచేస్తుందో అనుమానమే.  కాబట్టి పార్టీ పరంగాకాని, ప్రభుత్వ పరంగా కాని రాహుల్‌ గాంధీ క్రియాశీలక పాత్ర పై ఆశలు పెట్టుకుంటే అత్యాశే అవుతుంది.

న్యాయవాదులందు నాగమారుతీశర్మ వేరయా

న్యాయమూర్తులు న్యాయాన్ని ఎంత రేటుకు అమ్ముకుంటున్నారో సీరియల్‌లో చూపినట్టు రోజూ వార్తల్లో  గాలి జనార్దన్‌రెడ్డి కేసు మన కళ్ళ ముందుంచింది. మాఫియా కేసుల్లోని నిందుతులు ఎంతకైనా ఎలా తెగిస్తారో తెలుసుకుంటున్నాము. కేవలం బెయిలు కోసం వందకోట్ల రూపాయలు ఇస్తున్నారంటే న్యాయానికి ఖరీదుకట్టే షరాబులు ఇలా ఎంతమంది ఉన్నారో అనిపిస్తుంది కదా. అలాగే న్యాయమూర్తులను ఎంతగా ప్రలోభాలకు గురిచేస్తున్నారో ఈ సంఘటనతో మనం తెలుసుకుంటున్నాం. గతంలో కెఆర్‌ నారాయణ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు  బస్సుదోపిడీ కేసులో ఉరి శిక్షపడిన వారికి ఆఖరినిముషంలో యావజ్జీవ శిక్షగా మార్చినందుకు విమర్శల పాలయ్యారు. ఆ తరువాత రాఫ్ట్రపతిగా ఉన్న అబ్దుల్‌కలాం ఈ దేశంలో పేదలు మాత్రమే శిక్షలకు ఎందుకు గురి అవుతున్నారు? కార్పొరేట్‌  వ్యాపారులమీద అభియోగాలను ఎందుకు ఋజువు చేయలేకపోతున్నాం అని అడిగిన ప్రశ్నకు  ఇప్పుడు సమాదానం లభించిందని తెలుసుకోవాలి. ఇప్పటివరకు న్యాయమూర్తుల అవినీతిపై తు.తు మంత్రంగా మాత్రమే విచారణలు జరిగాయి. అయితే 10 కోట్లకు బెయిలు వ్యవహారం పై న్యాయమూర్తి పట్టాభి ఆయన కుమారుడు, వారిద్దరినీ నడిపించిన న్యాయమూర్తులు, ప్రభాకర్‌, లక్ష్మీనారాయణ, చలపతి, మొదలైన వాళ్ల గురించి రోజూ వింటున్నాం. పదికోట్లకు డీల్‌ను మాట్లాడిన  మద్యవర్తి రౌడీ అయిన యాదగిరి  రెండున్నర కోట్లు ఇచ్చి పట్టాభిని  బురిడీ కొట్టించాడు. ఈ అవినీతి పరాణాల నేపధ్యంలో  అక్షరాల 100 కోట్లు ఇస్తామని చెప్పినా ప్రలోభానికి గురికాకుండా న్యాయంకోసం నిలబడ్డ ఆదర్శ న్యాయమూర్తిగా నాగమారుతీశర్మను అభినందించక తప్పదు. రాజకీయాలు, రౌడీలు, మాఫీయాలు, న్యాయమూర్తులు కలిసి పోతున్న ఈ రోజుల్లో న్యాయానికి విలువనివ్వడం హర్షణీయం. ఈరోజు భారతమాత ఇలాంటి న్యాయమూర్తులనే కోరుకుంటుందని వేరే చెప్పనక్కర్తేదు.  భ్రస్టు పట్టిన ప్రస్తుత వ్యవస్దలో ఇలాంటి న్యాయమూర్తులు మరింతమంది రావాలని కోరుకుందాం.  

దేశం బాణీ ఒంటబట్టించుకున్న నాని?

తెలుగుదేశం బాణీని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని బాగా ఒంటబట్టించుకున్నారు. ఆయన ఆ పార్టీతో మమేకమై ఎంతలా పని చేశారంటే... టిడిపి సస్పెండ్‌ చేసినా కాంగ్రెస్‌ను విమర్శిస్తే కానీ నిద్రపోలేనంత అలవాటు నానికి ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వీరు చెప్పినట్లే రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఓటు వేశాక నాని తన వ్యాఖ్యానంతో అదరగొట్టేశారు. తరువాత తప్పు అర్థమై మౌనంగా వెళ్లిపోయారు. పిటీషన్ల కమిటీ అధ్యక్షుడు మల్లుభట్టు విక్రమార్కతో ఎమ్మెల్యే కేశవరెడ్డి, రేవంత్‌రెడ్డి ముచ్చటిస్తుండగా నాని వారిని కలిసి పలకరించారు. ఈ సందర్భంగా 2014 ఎన్నికల గురించి నాని ప్రస్తావిస్తూ ఈ ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ ఫినీష్‌ అయిపోతుందన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, తెలుగుదేశం పార్టీ మాత్రమే ఎన్నికల్లో పోటీ పడతాయని జోస్యం చెప్పారు. అయితే కాంగ్రెస్‌ ఫినీష్‌ అనేటప్పుడు నాని ముఖంలో కనిపించిన కసి చూసిన రేవంత్‌రెడ్డి అసలు అప్పుడు జరిగే ఎన్నికల గురించి ఇప్పుడే అంచనా వేయటం కష్టమని తేల్చిచెప్పారు. అంతే కాకుండా ఆ ఎన్నికల నాటికి ఏ పార్టీ ఉంటుందో? ఉండదో? కూడా తెలియటం లేదనీ, ఇప్పుడున్న వాతావరణంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతు ఇవ్వటం ఈ విషయాన్ని చాటి చెబుతోందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. దీంతో నాని ఏమీ మాట్లాడలేకపోయారు. మాడిన ముఖంతో తిరుగుపయనమయ్యారు.  

రాష్ట్రపతి ఎన్నిక లో వోటు వేసినందుకు టీడీపీ ఎమెల్యేల సస్పెన్షన్

నిన్న జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా వోటింగ్ లో పాల్గొన్నందుకు టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌ ముఖర్జీకి ఓటు వేసిన ఎమ్మెల్యేలు వేణుగోపాలచారి, హరీశ్వర్ రెడ్డి, రామకోటయ్య, బాలనాగిరెడ్డిలను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని టిడిపి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి టిడిపి ఎమ్మెల్యేలు ఐదుగురు ఓటు వేశారు. మరో ఎమ్మెల్యే కొడాలి నానిని కొద్ది రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మని కలిసిన రోజునే సస్పెండ్ చేశారు. తనను పార్టీ నుండి సస్పెండ్ చేయడం పై స్పందిస్తూ పరిగి ఎమెల్యే హరీశ్వర రెడ్డి, "పార్టీ కాదు తనని సస్పెండ్ చేసింది ... తానే పార్టీను సస్పెండ్ చేసానని" అన్నారు. తను సంవత్సరంన్నర క్రితమే తెలంగాణ వ్యతిరేకి అయిన తెలుగు దేశం పార్టీని విదిచిపెట్టానని, ఈ రోజు కొత్తగా పార్టీ నుండి బయటకు వచ్చిందేమీ లేదని అన్నారు. నూజివీడు ఎమెల్యే చిన్నం రామకోటయ్య మాట్లాడుతూ తానూ ఎప్పుడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని, తనను పార్టీనుండి బయటకు పంపే ప్రయత్నాలు జరిగాయని అన్నారు.  

‘ కిక్కు ‘ ఇవ్వని కొత్త పాలసీ!

కొత్తపాలసీ ద్వారా మద్యం అక్రమాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను హైకోర్టు అభినందించింది. అయితే ఎక్సయిజ్‌శాఖ మాత్రం పీకల దాకా కూరుకు పోయామని, పాతపాలసీని కాదని కొత్త చిక్కుల్లో పడ్డామని భావిస్తోంది. లక్కీడీప్‌లు, లాటరీలు తీసినా కొన్ని మద్యం దుకాణాలు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాక పోవటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎపిబిసిఎల్‌ అవుట్‌లెట్‌లకు సిద్ధమైన ఎక్సయిజ్‌ వాటికి సిబ్బందిని నియమించటం పెద్దసవాల్‌గా మారిందని భావిస్తోంది.   ప్రత్యేకించి గ్రేటర్‌ హైదరాబాద్‌ శివారు ప్రాంతాలు, రంగారెడ్డి జిల్లాలోనూ, తూర్పుగోదావరి జిల్లాలోనూ కొన్ని మద్యం దుకాణాలు మిగిలిపోయాయి. దీని ఫలితంగా తొలిత్రైమాసికం నష్టం దాదాపు 2500కోట్ల రూపాయలు అని లెక్క తేలింది. ప్రత్యేకించి లాటరీ ద్వారా దుకాణాలు కేటాయించినా ఎంఆర్‌పి ధరల కన్నా ఎక్కువకు అమ్మేస్తున్నారన్న ఆరోపణలు పలు ప్రాంతాల నుంచి గుప్పుమంటోంది. మళ్లీ ఎంఆర్‌పి సమస్య మొదలైందా అని ఎక్సయిజ్‌ తలలు పట్టుకుంటోంది. రాష్ట్రం మొత్తం మీద 6596 మద్యం దుకాణాలకు గతనెలలో తొలిసారి లక్కీడీప్‌ నిర్వహిస్తే 900 దుకాణాలు మిగిలిపోయాయి. ఈ నెల 3న మళ్లీ లాటరీ తీస్తే వాటిలో 678 దుకాణాలు మిగిలాయి. ఈ నెల 12న మూడోసారి లాటరీ తీస్తే ఇంకా 635దుకాణాలు మిగిలే ఉన్నాయి.   కేవలం 43దుకాణాలు మాత్రమే మంజూరు చేయగలిగారు. మొత్తం 39 డిపోల ద్వారా మద్యం సరఫరా జరుగుతోంది. పదిచోట్ల ఎపిబిసిఎల్‌ రాష్ట్ర మద్యపానీయాల సంస్థ కౌంటర్లు ఏర్పాటు చేసింది. దీని తరువాత మిగిలిన దుకాణాల స్థానంలో ఔట్‌లెట్లు ఏర్పాటు చేస్తోంది. ఎమ్మెల్యేల కమిటీ సూచనలు పాటించి కొత్త మార్పులు చేశాక నష్టం తప్పలేదని ఎక్సయిజ్‌ శాఖ ఆందోళన చెందుతోంది. మార్పు అనేది జరిగింది కాబట్టి ఫలితాలు రావటానికి కొంత సమయం వెచ్చించక తప్పదని ఆ శాఖకు పలువురు సూచనలిస్తున్నారు. అవుట్‌లెట్లు కనుక విజయవంతమైతే ఎక్సయిజ్‌శాఖకు కొంత ఊరట లభించవచ్చని పలువురు భావిస్తున్నారు.

హైట్‌క్‌ సిటీలో ఆన్‌లైన్‌ మోసాలు !

మీరు నిరుద్యోగులా అయితే మా కన్సల్టెన్సీకి రండి మంచి జీతం ఉన్న ఉద్యోగం పట్టండి ఆనందంగా జీవించండి అనే నినాదంతో ఆన్‌లైన్‌లో వచ్చే ప్రకటనలు నమ్మరాదని పోలీసులు నాలుగేళ్లుగా పలుదఫాలుగా ప్రకటనల్లో కోరుతూనే ఉన్నారు. ఈ ప్రకటనలను పత్రికల్లో చదివిన వారు కూడా తమ పిల్లలకు ఉద్యోగం వస్తుందని ముందూ వెనుకా ఆలోచించకుండా ఈ ఆన్‌లైన్‌ కన్సల్టెన్సీ సంస్థల్లో డబ్బులు కట్టేస్తున్నారు. ఇలా లక్షలాది రూపాయల చొప్పున నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన సిటీఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ బోర్డు తిప్పేసింది.   దీంతో వందల సంఖ్యలో బాధితులు హైదరాబాద్‌ నగరంలోని చిక్కడపల్లి పోలీసు స్టేషనుకు చేరుకున్నారు. బాధితుల సంఖ్య వందల్లో ఉండటంతో నగరనేరపరిశోథనావిభాగం (సిసిఎస్‌)ఒక ప్రత్యేకకౌంటర్‌ను తెరిచి ఫిర్యాదులు అర్థరాత్రి వరకూ తీసుకుంది. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు సిసిఎస్‌ ప్రత్యేకబృందాలను రంగంలోకి దించింది. నిందితులు విదేశాలకు పారిపోకుండా ఎయిర్‌ పోర్ట్‌లలో అలెర్ట్‌ ప్రకటించాలని వందల కోట్ల రూపాయల్లో రిటైర్డ్‌ ఉద్యోగులు, మహిళలు తదితరులు నష్టపోయినందున నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసులుగట్టి చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్రకార్యదర్శి నారాయణ కోరారు. తరుచుగా జరుగుతున్న ఇటువంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

కొడాలి అంటే బాలయ్యకు హడలా?

తన తండ్రి ప్రాతినిథ్యం వహించిన రాయలసీమలోని హిందూపురం నుంచే పోటీ చేయాలని యువరత్న నందమూరి బాలకృష్ణ కోరుకుంటున్నారు. ఇటీవల గుడివాడ ఎమ్మెల్యే కొడాలినానిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. అందువల్ల గుడివాడ స్థానం నుంచి పోటీ చేయించాలని టిడిపి అథినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో నాయకులు ఆశిస్తున్నారు. వాస్తవానికి గుడివాడ ఎన్టీఆర్‌ స్వస్థలం. అందువల్ల బాలయ్య అక్కడ కనుక పోటీకి నిలబడితే కొడాలినానికి గట్టిపోటీ ఇవ్వగలరని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది.     అయితే బాలయ్య మాత్రం హిందూపురం నుంచి పోటీ చేస్తే రాయలసీమలో తనకున్న ఆదరణ వల్ల విజయం సాధించటం సులభమవుతుంది. కులమతాలకు అతీతంగా గెలుపొందవచ్చని ఆయన నమ్ముతున్నారు. గుడివాడ నుంచి పోటీచేస్తే మాత్రం ఒకసామాజికవర్గ నాయకుడనే ముద్ర పడుతుందని భావిస్తున్నారట. హిందూపురంలో అయితే తేలికగా విజయం సాధించవచ్చని అదే గుడివాడలో అయితే గట్టిపోటీని ఎదుర్కోవాల్సి వస్తుందని బాలయ్య భయపడుతున్నట్లు తెలుస్తోంది. హిందూపురం నుంచే పోటీచేయాలని బాలయ్య డిసైడ్‌ అయితే గుడివాడలో జరగబోయే ఉప ఎన్నికల్లో నానితో పోటీ పడే నాయకుడెవరని తెలుగుదేశం ఆలోచనలో పడిందట. అందుకే బాలయ్యను ముందుగానే గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు వొప్పించాలని బాబుకు పలువురు సూచిస్తున్నారట. అయితే బాబు సమయం వచ్చినప్పుడు మాట్లాడొచ్చని భావిస్తున్నారట.

సింగరేణిపై సమరభేరి

సింగరేణి బొగ్గు గనుల తవ్వకాలు పర్యావరణంపై ప్రభావం చూపుతోందని ఇటీవల తాజాపరిశోథనలు తేల్చి చెబుతున్నాయి. ఈ గనుల తవ్వకాల సమయంలో వచ్చే పొగ వంటివి కార్మికుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని వైద్యనిపుణులు ధృవీకరిస్తున్నారు. అంతేకాకుండా ఈ తవ్వకాల వల్ల భూమి కుంగిపోతోందని కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తవ్వకాల కోసం వాడే మిషనరీ వేగం వల్ల సమీప గ్రామాల్లో భూమి కొద్ది కొద్దిగా కంపించి లోతుకు దిగుతోందని గుర్తించారు.   సింగరేణి సమీప గ్రామాల్లో రైతులు ప్రత్యేకించి తమ పొలాల్లో భూమి లోతుపెరిగిందంటున్నారు. ఈ విషయమై యాజమాన్యానికి రైతులందరూ రాసిన వినతి పట్టించుకోలేదు. దీంతో వీరు ప్రత్యక్షచర్యలకు సిద్థమయ్యారు. అదిలాబాద్‌ జిల్లాలోని ముత్యంపల్లి, కాశీంపేట గ్రామస్తులు సింగరేణి వల్ల కలుగుతున్న దుష్ఫలితాలపై మండిపడుతున్నారు. కాశీపేట భూగర్భగని వల్ల తమ భూమి కుంగిందని, ఇలా గనులు తవ్వుకుంటే పోతే కొన్నాళ్లకు భూమి బాగా లోతుకు దిగిపోతుందని వారు పరిశ్రమ యాజమాన్యంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు చర్యగా కాశీపేట గనిలో పని చేసే మొదటిషిఫ్టు కార్మికులను అడ్డుకున్నారు. దీంతో ఈ గని ప్రాంతంలో ఉద్రిక్తవాతావరణం నెలకొంది. యాజమాన్యం కనుక ఎటువంటి చర్యలకు పూనుకోకపోతే కాశీపేట తవ్వకాలు జరగనివ్వబోమని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు.

లోక్‌సత్తాకున్న ధైర్యం ఇతరపార్టీలకు లేదా ?

ఒక దేవాలయానికి విరాళం ఇస్తే, అన్నదానం చేస్తే కూడా ఆదాయపన్ను రాయితీ లభిస్తుంది. సెక్షన్‌ 80జి కింద ఆదాయపన్ను శాఖకు చూపవచ్చు. కానీ, రాజకీయపార్టీలు ఎటువంటి విరాళం తీసుకున్నా రశీదులు ఇవ్వవు. 90శాతం విరాళాలన్నీ అలానే తీసుకుని ఎన్నికల సమయంలోనూ, ఇతర రహస్యకార్యక్రమాల్లోనూ వాటిని వాడుతుంటారు. 2012 లో జరిగిన దేశంలోనే అంత్యంత ఖరీదైన ఉప ఎన్నికల్లో కూడా ఇదే తరహా ఖర్చులు చేశారు. లెక్కల్లో చూపని ఈ నల్లధనాన్ని రెండొందల కోట్లకు పైగా ఖర్చు చేశారు. మొత్తం అసెంబ్లీస్థానాల్లోనూ ఇదే తరహా ఖర్చులు జరిగాయని తేలినా ప్రభుత్వమూ, అటు ఎన్నికల కమిషనూ బీరాలు పలికి సర్దుకుపోయాయి.   ఇంత జరగటానికీ ఒకటే కారణం లెక్కల్లో చూపని డబ్బునే రాజకీయపార్టీలు తీసుకుంటాయి. ఆ నల్లధనాన్నే వినియోగిస్తాయి. పైగా వీటికి హుండీ ఆదాయం అని కూడా పేరుపెట్టాయి. ఈ హుండీ ఆదాయాల బురిడీకి ప్రభుత్వం ఎప్పుడు మంగళం పాడుతుందన్నది మిలియన్‌డాలర్ల ప్రశ్న.. దీనిపై అసలు చర్యలు తీసుకోవాలన్న ఆలోచనే ప్రభుత్వాలకు కొరవడిరది. ఎందుకంటే ఓట్లు కొనుక్కుంటే కానీ, ఏ పార్టీ కూడా అథికారంలోకి రాలేని నేటి పరిస్థితులు. ఇలా ఇంకెన్నాళ్లు అని ఆలోచనతో వచ్చిన లోక్‌సత్తా రాజకీయపార్టీ లన్నింటినీ ఒకటే ప్రశ్న అడుగుతోంది. అదేంటంటే తీసుకున్న ప్రతీ పైసాకు రశీదు ఇవ్వగల థైర్యం ఇతర రాజకీయ పార్టీలకు లేకుండా పోయిందని లోక్‌సత్తా విమర్శిస్తోంది. ఒక్కపైసాకు కూడా రశీదు ఇవ్వగలిగిన సత్తా తమ పార్టీకి మాత్రమే సొంతమని ఆ పార్టీ అథ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ అన్నారు. అలానే ఆదాయపన్ను నుంచి కూడా మినహాయింపు ఇప్పిస్తామన్నారు. మరి మిగతా జాతీయపార్టీలు ఈ తరహా ప్రకటన ఎందుకు చేయలేకపోయాయో ఒక్కసారి ఆలోచించాలి. ఆదాయపన్ను శాఖ కూడా జాతీయపార్టీల ఆదాయ,వ్యయాలను ఒక్కసారి తనిఖీ చేస్తే బాగుంటుందని, లెక్కల్లో లేని డబ్బులున్నట్లు తెలిస్తే ఆ డబ్బును స్వాధీనపరుచుకుంటే జాతిప్రయోజనాలకు అది ఉపయోగపడుతుందని పలువురు సూచిస్తున్నారు.

జగన్‌ నిలుస్తాడా? కలుస్తాడా?

వైసిపి నేతజగన్‌ పై సిబిఐ జోరు తగ్గింది. దానికి కారణం ప్రణబ్‌కు వోట్లు వేయడమేనని అందరికీ తెలుసు. రానున్న ఉప రాష్ట్రపతి ఎన్నికలకు కూడా కాంగ్రెస్‌ ప్రతిపాదించిన ప్రస్తుత ఉపరాష్ట్రపతి కే  ఓటు వేస్తామని వైపిపి ప్రకటన చేసింది. ఈ క్రమంలోనే  కాంగ్రెస్‌తో  వైసిపి మధ్య అవగాహన మరింత పెరుగుతుందన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రపతికి ఓటు వేయటానికి అభ్యంతరం తెలుపని సిబిఐ కోర్టు రానున్న రోజుల్లో బెయిల్‌ పై కూడా కౌంటర్‌ చార్జిషీటును పెట్టదని, అలాగే అభ్యంతరం కూడా తెలుపదని అనుకుంటున్నారు. మొన్నటివరకు ఉప్పు నిప్పులాగా ఉన్న కేంద్రం, వైసిపి పార్టీ కూల్‌ గా కనిపించడంతో ప్రతిపక్షాలకు, ప్రజలకు ఇప్పుడు ఇది హాట్‌ టాపిక్‌గా మారింది. వైసిపి పార్టీ  ఎలాగూ కాంగ్రెస్‌ తాను లో గుడ్డే కాబట్టి కలిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు ప్రధాన ప్రతిపక్షాలు. క్విడ్‌ ప్రో కొ  కేసులో  జగన్‌ అరెస్టయిన విషయం తెలిసిందే. ఇది అప్పటి ప్రభుత్వానికి సంభందించింది. నేను దాని పరిధిలోనికి రాను అంటూ వైయస్‌ జగన్‌ కోర్టులో అప్పీలు చేసుకున్న నేపధ్యంలో సుప్రీం కోర్టు అప్పటి మంత్రులకు కూడ నోటీసులు జారీ చేసింది. దాని పరణామ క్రమంలో మంత్రులు ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని ప్రభుత్వం వారిని  సమర్ధించిన కారణంగా జగన్‌కు ఊరట కల్పించినట్లయింది. దీనికి తోడు  ఇటీవల వైసిపి గౌరవాద్యక్షురాలు విజయలక్ష్మీ ప్రధాన మంత్రిని, ఇతర మంత్రులను కలిసిన తరువాత ఇక్కడ వైసిపి నేతల మీద కాంగ్రెస్‌నేతలు, సిబిఐ జోరు తగ్గిందనే చెప్పుకోవచ్చు. అందువల్ల రానున్న రోజుల్లో వైసిపి కాంగ్రెస్‌లో కలిపోనుందనే ప్రతిపక్షాలు జోస్యం చెబుతున్నారు. అయితే యువనేత జగన్‌ మడమతిప్పని నేతగా ఉంటారో లేదా రాజకీయాలలో శాశ్వత మిత్రులుగాని శాశ్వత శత్రువులుగాని ఉండరని మరోసారి ఋజువు చేస్తారో తెలియాలంటే కొంచెం ఓపిక పట్టాల్సిందే.

సర్వేలతో నాగం బిజీ బిజీ

తెలంగాణ వాదంతో అదరగొట్టే నాగం జనార్ధన్‌రెడ్డి ఇటీవల   పత్రికా సమావేశాల్లో, సభల్లో కనబడక పోవడానికి కారణం ఏమైవుంటుందా అని ఆరా తీస్తే ఆయన బిజీ బిజీగా సర్వేలు జరుపుతున్నారని తెలిసింది. దేని  నిమిత్తం అనుకుంటున్నారు...తెలంగాణా ఏ ఏ అంశాల్లో వెనుకబడివుందో తెలుసుకుంటున్నారట. అందుకోసమే అన్ని రంగాలలోనూ సర్వేలు జరిపిస్తున్నారట. ప్రతి ప్రభుత్వ కార్యాలయాలను దర్శించి వారు చెప్పిన వివరాలను నోట్‌చేసుకుంటున్నారట. ప్రవేటు సంస్ధలనుకుడా వదలటం లేదని తెలిసింది. ఆంధ్రావాళ్లు ఎంత ముందున్నారు తెలంగాణవాళ్లు ఎంతగా వెనుకబడ్డారో ఇక సర్వేరిపోర్టుల ఆధారంగా చెప్పనున్నారు. దీనివల్ల రానున్న ఎన్నికల్లో నాగం తెలంగాణవాదుల్ని మెప్పిస్తారని తెలుస్తుంది. తెలంగాణా ఉద్యమనాయకుడిగా కేసిఆర్‌ ప్రస్తుత స్ధాయికి ఎదగడానికి ఆయన చేస్తున్న ప్రసంగాలే. గణాంకాలతో ఆయన ఆలోచన రేకెత్తించేవిధంగా పదుదనైన ప్రసంగాలు చేస్తారు. నాగం జనార్ధన రెడ్డి కూడా కేసిఆర్‌ బాటలోనే పయనించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఏ విషయంపైనైనా  అనర్గళంగా ప్రసంగించగల నాగం జనార్దన్‌ రెడ్డి ఇక ముందు తన వాడి వేడి ప్రసంగాలకు గణాంకాలు జోడిరచి  అదరగొట్టనున్నారు. సో ఆంధ్రా నాయకులు రెడీగా వుండండి.