వాన్‌పిక్ తో తెలుగు దేశం లాభపడుతుందా?
posted on Jul 24, 2012 @ 2:28PM
తెలుగుదేశం పార్టీ తన బలాన్ని పెంచుకునే కసరత్తులకు శ్రీకారం చుట్టింది. ముందస్తుగా బిసీల బలాన్ని పెంచుకునేందుకు ఇటీవల కృషి చేసిన ఆ పార్టీ ఇప్పుడు సమస్యల వారీగా పరిశీలనలు ప్రారంభించింది. అందులో భాగంగానే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అథ్యక్షుడు జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో కీలకమైన వాన్‌పిక్ భూముల సమస్యను తెలుగుదేశం పార్టీ భుజానికి ఎత్తుకుంటోంది. ఈ సమస్యపై పోరాడితే కనీసం ప్రకాశం జిల్లాలో రైతుల మనస్సు గెలుచుకోవచ్చని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అందుకే కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలను మినహాయించి అన్ని పార్టీలనూ కలుపుకునేందుకు టిడిపి రంగం సిద్ధం చేసుకుంది.
దానిలో భాగంగానే ఈ నెల 25న ఒంగోలులో రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్సు ఏర్పాటు చేస్తోంది. ఈ సమావేశం తీసుకున్న నిర్ణయాల ప్రకారం వాన్‌పిక్‌భూముల విషయంలో తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు కరణం బలరామకృష్ణమూర్తి అంటున్నారు. తమ పార్టీ అథినేత చంద్రబాబు కూడా ఈ కార్యక్రమం గురించి ఉత్సుకత చూపుతున్నందున ఈ రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశామన్నారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల ముఖ్యనాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా అథ్యక్షుడు దామచర్ల జనార్దన్,మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు ఈ కార్యక్రమ ఏర్పాట్లలో ఉన్నారు.