ఆగిన వెంకట్రామిరెడ్డి ప్రమాణస్వీకారం!
posted on Jul 24, 2012 @ 3:01PM
నిజామాబాద్ ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసేందుకు కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి శాసనమండలికి వెడితే హైకోర్టు ఇచ్చిన స్టే ఆ కార్యక్రమానికి బ్రేక్‌వేసింది. ఈ ఎన్నికపై తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మధ్య వివాదం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపొందారని కోర్టు ధృవీకరించింది.దీంతో ప్రమాణస్వీకారానికి సోమవారం ముహుర్తం పెట్టుకుని మరీ ఆయన శాసనమండలికి చేరుకున్నారు. ఆయన తరువాత శాసనమండలిలో కాలుమోపిన ప్రత్యర్థి, గతంలో గెలిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నర్సారెడ్డి హైకోర్టు ఇచ్చిన స్టేను శాసనమండలి ఛైర్మనుకు అందజేశారు.
హైకోర్టు స్టేను పరిశీలించిన అనంతరం వెంకట్రామిరెడ్డి శాసనమండలి సభ్యునిగా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్ర హైకోర్టు స్టే ఇవ్వటం వల్లే తాము ఈ ప్రమాణస్వీకారాన్ని ఆపుజేశామని మండలి ఛైర్మను స్పష్టం చేశారు. అట్టహాసంగా శాసనమండలికి చేరుకున్న వెంకట్రామిరెడ్డి ప్రమాణస్వీకారం ఆగిపోవటంతో చేసేదేమీ లేక తిరుగుముఖం పట్టారు. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై చెలరేగిన వివాదం కోర్టు పరిష్కారానికి వెళ్లటం వల్ల ఈ ప్రమాణస్వీకారం ఆగింది. తిరిగి హైకోర్టు మొత్తం కేసును పరిశీలించాక కానీ, నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కేసు ఒక కొలిక్కి రాదు. దీంతో తరువాత ఏమి చేయాలన్న విషయంపై వెంకట్రామిరెడ్డి, నర్సారెడ్డి తమ న్యాయనిపుణులను సంప్రదిస్తున్నారు.