దేశంపై అలకలు, తెలంగాణావాదంలో లుకలుకలు?
posted on Jul 21, 2012 @ 10:40AM
తెలుగుదేశం పార్టీపై అలిగేవారి సంఖ్య పెరుగుతోంది. అలానే తెలంగాణా కోసమే రాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగుదేశం పాల్గొనలేదన్న కొత్తవాదనలూ వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకూ కాంగ్రెస్‌ను మట్టికరిపిస్తామన్న తెలుగుదేశం అథినేత చంద్రబాబు ఆ మట్టిలోనే కూరుకుపోయారని ఇతర పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో అసలు పాల్గొనరాదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. పార్టీ సిద్ధాంతానికి భిన్నంగా కాంగ్రెస్‌కు ఓటేసే పరిస్థితే రాకూడదని ఆ పార్టీ సీనియర్లు అభిప్రాయపడ్డారు. దీంతో తాము రాష్ట్రపతి ఎన్నికలకు హాజరుకాబోమని చంద్రబాబు ప్రకటించారు.
ఆయన ప్రకటన వెలువడిన 24గంటల్లోపే రాష్ట్రపతి ఎన్నికలకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఐదుగురు ముందుగానే సిద్ధమయ్యారు. వీరు అనుకున్నది అనుకున్నట్లుగా తమ ఓటుహక్కును కూడా వినియోగించుకున్నారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, నూజివీడు ఎమ్మెల్యే చిన్నంరామకోటయ్య, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, తెలంగాణా ఎమ్మెల్యేలు హరీశ్వర్‌రెడ్డి, వేణుగోపాలాచారి రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్నారు. కొడాలినానిని తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. నూజివీడు ఎమ్మెల్యే చ్నిం రామకోటయ్యకు మంత్రి పార్థసారధి కాంగ్రెస్ కండువాకప్పి ఎన్నికలకు తీసుకువెళ్లారు. ఆయన కూడా ఉత్సాహంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసిపోయారు. తెలంగాణా ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే వేణుగోపాలరెడ్డి కాంగ్రెస్ నేత పాలడుగు వెంకట్రావుతో కలిసి వెళ్లి రాష్ట్రపతి ఎన్నికల ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇది ఇలా ఉంటే టిఆర్‌ఎస్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్ ఒక్కసారిగా విలేకరుల ముందు తెలుగుదేశం పార్టీని అభినందనలతో ముంచెత్తారు. ఆయన ఆనందానికి కారణం తెలంగాణా వ్యతిరేకి అయిన కాంగ్రెస్ నేత ప్రణబ్‌ముఖర్జీ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున ఆ ఎన్నికల్లో పాల్గొనటం లేదని తెలుగుదేశం పార్టీ ప్రకటించిందని ఆయన అంటున్నారు. అలా తెలంగాణా గురించి తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పాల్గొనకపోవటం సంతోషదాయకమని ఆయన కొనియాడారు. వాస్తవానికి ఇప్పటికీ తెలంగాణాపై తెలుగుదేశం పార్టీ ఒక కొలిక్కి రాలేకపోయింది.
అందుకే తెలంగాణా ఇవ్వాలని కూడా డిమాండు చేయలేదన్న విషయం డాక్టర్ చంద్రశేఖర్ గమనిస్తే మంచింది. లేకపోతే అసలు తెలంగాణా సిద్దాంతం కోసమే పని చేసే టిఆర్‌ఎస్‌కు ఆయన దూరం కావాల్సి వస్తుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరోలో సగం కన్నా తక్కువ తెలంగాణావాదులుంటే మిగిలిన మొత్తం సమైక్యవాదులన్న విషయాన్ని చంద్రశేఖర్ అర్థం చేసుకోవాలి. ఇలా తనకు తోచినట్లు ప్రకటనలు చేస్తే తరువాత నాలికకరుచుకోవటం మినహా ఏమీ చేయలేరని గుర్తుంచుకోవాలని తెలుగుదేశం నాయకులు అంటున్నారు.