ప్రణబ్‌ కు 25 బెంజ్‌ కార్లు

రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన ప్రణబ్‌ ముఖర్జీ ప్రయాణించిన బెంజికారు గురించి మీకు తెలుసా... ఆయన ఇంతకు ముందుబుల్లెట్‌ప్రూఫ్‌ అంబాసిడర్‌ కారులో తిరిగేవారు. ఇప్పటి ఈ బ్లాక్‌ కారు స్వాన్‌కీ మెర్సిడెస్‌ బెంజ్‌కార్‌ లో మోడల్‌ బ్లాక్‌ యస్‌ పుల్‌మ్యాన్‌ లగ్జరీకారు. దీని ఖరీదు ఎంతో తెలుసా? అక్షరాల ఆరు కోట్లు. దీని టైరు రేటే మూడు నుండి 5 లక్షల వరకు ఉంటుంది. బెంజ్‌ వేగం గంటకు 300 కి.మీ .ఈ కారు  పెట్రోలు ట్యాంకు కెపాసిటీ 90 లీటర్లు.  దీనిలో ఉన్న సౌకర్యం ఏమంటే ఇది ఎంత స్పీడుగా వెళుతున్నా ఏమాత్రం కుదుపులు వుండకుండా దీనికి స్పెషల్‌ షాక్‌ ఎబ్జార్భర్స్‌  ఉంటాయి. ఈ బెంజ్‌ కారుకి ప్రమాదకరమైన హ్యాండ్‌ గ్రేనేడ్స్‌ని , బాంబు దాడులను తట్టుకునే శక్తి ఉంది.    దీని బాడీని అత్యంత శక్తివంతంగా తయారు చేశారుమరి. దీని బరువు 3 టన్నులు. ఈ కారు కోసం వాడిన స్టీలు పఠిష్టమైనది. ఇది నూనెపోసిన రోడ్లమీద కూడా రయ్యిన దూసుకుపోగలదు. ఈ కారులో సీట్లు ఎదురెదురుగా కూర్చుంటానికి వీలుగా ఉంటాయి. దీనివల్ల ఫారిన్‌ డెలిగేట్స్‌ వచ్చినప్పుడు గాని ముఖ్యవ్యక్తులతో గాని కారులోనే కూర్చుని మీటింగు పెట్టుకునే వీలు ఉంటుంది. దీనిలో టివి తోపాటు అత్యాధునిక టెక్నాలజీ అంతా దానిలో  ఉంటుంది. ఎసి మామూలే.కారుకు అమర్చిన స్పెషల్‌ గ్లాసువల్ల సౌండు ఫ్రూఫ్‌గా పనిచేస్తుంది. కాబట్టి మొదటిపౌరుడికి ఏకాగ్రతకు భంగం వాటిల్లదు. ఇలాంటి కార్లు సుమారు 25 కార్లు ఇండియన్‌ ప్రెసిడెంట్‌ కి ఎల్లప్పుడు అందుబాటులో వుంటాయి.

ఉమేష్‌ చేతబడి పూజలు నిజమేనా ?

రాష్ట్రంలో మంత్రుల అక్రమాస్తులు, ఐఏఎస్‌ల అధికారదుర్వినియోగం, ఐపియస్‌ల పదవీ కాంక్ష, గాలిబెయిలు కేసపులో న్యాయమూర్తులు కటకటాలు ఇందంతా చూస్తుంటే ఏ మైంది ఈ రాష్ట్రానికి అనిపించక మానదు. సగటు మానవుడు పట్టించుకోనట్టు ఒక వేళ పట్టించుకున్నా చేసేదిఏమీ లెదన్నట్లూ నిట్టురుస్తూ బ్రతుకు బండిని లాగటానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. అవినీతి మంత్రులకు, అధికారులకు న్యాయ సహాయం చేసే రాష్ట్రముఖ్యమంత్రి ప్రజలకు మాత్రం నడ్డివిరిచే  పన్నులు విధించేశారు.   ఈ అస్తవ్యస్త ప్రభుత్వంలో మరో మచ్చ రాష్ట్రడిజిపికి మరో సీనియర్‌ సస్పెండెడ్‌ పోలీసాఫీసరు ఉమేష్‌కుమార్‌ చేతబడి పూజలు చేయించారని వార్తలు. ఎప్పటికీ తగ్గని రోగంతో డిజిపి దినేష్‌రెడ్డి నాశనం అయిపోవాలని, ఇప్పటికే తిరుగమనంలో ఉన్న మనం ఈ వార్తలతో ఎక్కడికి ప్రయాణిస్తున్నామో తెలియని అంధకారంలోకి నెట్టివేయబడుతున్నాం. ప్రజలకు స్వచ్చమైన పరిపాలన అందించవలసిన అధికారులు, రాజకీయవేత్తలు, మేధోసంపన్నులు అధికార దాహంతో బరితెగించి రాష్ట్రానికి దిశా దశాలేకుండా చేస్తున్నారనటానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి. మేధస్సుతో ఉషస్సుని నింపాల్సిన జగతిలో స్వప్రయోజనాలకోసం చదువుకున్న వారుకూడా చదువులేని వారికి తీసిపోని విధంగా దేనికైనా తెగించడం సిగ్గుచేటు.

చిరు కు త్వరలో కేంద్రమంత్రి పదవి?

రాజ్యసభ సభ్యుడు,మెగాస్టార్‌ చిరంజీవి కేంద్రమంత్రి అవటం ఖాయం అని వార్తలొస్తున్నాయి. దీంతో పీఆర్పీ విలీనం అప్పుడు కాంగ్రెస్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు అవుతుందంటున్నారు. అయితే కేంద్రంలో మంత్రి పదవికి ప్రణబ్‌ముఖర్జీ రాజీనామా చేయటం, మరికొన్ని ఖాళీలు ఉండటంతో రాష్ట్రం నుంచి కనీసం ముగ్గురికి కేంద్ర మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటి వరకూ తెలంగాణా ప్రత్యేకరాష్ట్రం కోసం పోరాడుతూనే వచ్చిన తెరాస నుంచి ఇద్దరికి మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. తెలంగాణా ఇవ్వకపోయినా మంత్రిపదవుల ద్వారా వారిని కాంగ్రెస్‌కు అనుకూలంగా మార్చుకోవాలని అథిష్టానం భావిస్తోంది.    ప్రత్యేకించి బయట నుంచి మద్దతు ఇచ్చిన తెరాస ఇప్పుడు మంత్రుల ద్వారా లోపలికి ఆహ్వానించాలని కాంగ్రెస్‌ ఏర్పాట్లు చేసుకుంటోంది. కొత్త మంత్రులతో పాటు కాంగ్రెస్‌ జాతీయప్రధానకార్యదర్శి రాహుల్‌గాంథీ కూడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరిగాయని తెలుస్తోంది. తిరుపతి ఎన్నికల్లో ఓటమి తరువాత చిరంజీవి కేంద్ర మంత్రి వర్గంలో స్థానం దక్కదనుకుని మౌనంగా ఉన్నారు. అంతేకాకుండా తమ గొప్పదనాన్ని చాటేందుకు ప్రయత్నించి భంగపడ్డ చిరుకు ఈ మంత్రి పదవి ఓ మంచి అవకాశమని పలువురు భావిస్తున్నారు. ఈ పదవి ద్వారా ఏమైనా చేస్తేనే ఆయనకు కాంగ్రెస్‌ తగిన గుర్తింపు ఇస్తుందన్నది మాత్రం ఆ పార్టీపెద్దలు తేల్చేస్తున్నారు.  

త్వరలో మంత్రి పార్థసారథి రాజీనామా?

రాష్ట్రమంత్రి పార్థసారథి రాజీనామా చేయాల్సిన సందర్భం వచ్చిందని రాజకీయనిపుణులు తేలుస్తున్నారు. ఎందుకంటే ఆయన ఫెరా చట్టం కింద నేరం చేశారని రుజువైంది. ఆర్థికనేరాల ప్రత్యేక కోర్టు ఆయనకు మూడు లక్షల రూపాయల జరిమానా విథించింది. పైగా జరిమానా చెల్లించకపోతే పదినెలల పాటు జైలుశిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చింది. దీంతో ఆయన త్వరలో రాజీనామా చేస్తారని వార్తలు వెలువడుతున్నాయి. కెపిఆర్‌ టెలీమీడియా ప్రాడెక్ట్సు సంస్థకు మేనేజింగ్‌డైరెక్టర్‌ అయిన పార్థసారథి 1994లో పరికరాల కోసం రూ.50లక్షలు విదేశాలకు తరలించారని కోర్టు గుర్తించింది. 2001లోనే ఆర్థికనేరాల ప్రత్యేక కోర్టు మూడు లక్షల రూపాయలు జరిమానా విథించింది.    ఆ జరిమానా చెల్లించకుండా తీర్పు వెలువడే సమయానికి కోర్టుకు రాకుండా పార్థసారథి గడిపేయటంపై కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తనకు సకాలంలో సమాచారం అందకపోవటం, ప్రజాజీవితంలో మంత్రిగా కొన్ని సమస్యల్లో చిక్కుకుపోవటం వల్ల కోర్టుకు హాజరుకాలేదని పార్థసారథి వివరణ ఇచ్చారు. దీంతో కోర్టు విథించిన నాన్‌బెయిలబుల్‌వారెంటును రీకాల్‌ చేసింది. అయితే ఫెరా చట్టం కింద నేరం ధృవీకరణ కావటంతో మంత్రి పార్థసారథి చిక్కుల్లో పడ్డారు. ప్రతిపక్షాలకూ ఈ విషయం చేరటంతో త్వరలో తనను రాజీనామా చేయమనే డిమాండు అన్నిపత్రికల్లోనూ, మీడియాలోనూ వస్తుందని మంత్రి పార్థసారథి ఆందోళన చెందుతున్నారు.  

చాక్లెట్లు తీసిన ప్రాణాలు?

అపరిచితులు ఇచ్చే చాక్లేట్లు మత్తుపదార్థం కలిపి ఉంటాయని రైల్వేశాఖ తరుచుగా ప్రకటనలిస్తుంది. అలానే అపరిచితులు ఇచ్చిన చాక్లెట్లు తిన్న ఇద్దరు చిన్నారి విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ విషాదాంతం యావత్తు రాష్ట్రాన్ని కలిచివేస్తోంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. కృష్ణాజిల్లా ఘంటసాల మండలం దేవరకోట గ్రామంలోని పాఠశాలలో శ్రీనివాస్‌, దీపిక చదువుకుంటున్నారు. రోజూ వీరిద్దరూ స్కూలుకు వస్తూ వెళుతుండటం గమనించిన ఓ అపరిచితుడు వారికి మంచిమాటలు చెబుతూ రెండు చాక్లెట్లు ఇచ్చాడు. చాక్లెటు రుచి తెలిసిన ఆ ఇద్దరు చిన్నారులూ వెంటనే తినేసి ఇంటికి వచ్చారు.   ఇంటికి చేరేటప్పటికే అస్వస్థులుగా ఉండటంతో వారిద్దరి ముఖాల్లో తేడా గమనించిన తల్లిదండ్రులు వీరస్వామి, స్వాతి తమ పిల్లలను ఓ ప్రయివేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూనే ఇద్దరు చిన్నారులు మరణించారు. ఈ సంఘటన తెలుసుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. తోటి విద్యార్థుల సహాయంతో అసలు విషయం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే అపరిచితుడు ఇచ్చిన చాక్లెటు వల్లే చిన్నారులు మరణించారని తెలిసింది. దీంతో అసలు ఆ పాఠశాల సమీపంలో తిరిగే అపరిచితులపై పోలీసులు దృష్టి సారించారు. పాఠశాల యాజమాన్యకమిటీ కూడా ఓ సమావేశం నిర్వహించి అపరిచితులు ఇచ్చే చాక్లెట్లు తీసుకోవద్దని విద్యార్థులను కోరింది.

నూతనవథువులకు తాళిబొట్టు పథకం?

ఏదైనా కొత్తది ఆలోచించాలి అని ప్రయత్నిస్తూ పోతే ఒక్కటంటే ఒక్కటైనా కొత్త ఆలోచన వచ్చేస్తుంది. అలానే మంత్రి ధర్మానప్రసాదరావు నేతృత్వంలో ఏర్పాటు మంత్రివర్గ ఉపసంఘం ఎట్టకేలకు సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి, పిసీసీ చీఫ్‌ బొత్సా సత్యన్నారాయణకు ఓ నివేదిక సమర్పించింది. దానిలో ఆ కమిటీ రూపొందించిన కొత్తపథకం ఏమిటంటే నూతనవథువులకు తాళిబొట్టు పథకం. అంటే ఇక నుంచి కాంగ్రెస్‌ పార్టీ కళ్యాణతంతులను మోగిస్తుందన్న మాట. ఈ పథకం కింద తాళిబొట్టు అందించాలంటే పెళ్లిళ్లకు వెళ్లాలి కదా! అలా వెళితే కాంగ్రెస్‌ పెళ్లిపెద్దగా వ్యవహరించినట్లే.   ఈ పథకం ప్రభుత్వపరంగా అమలు చేస్తే మంత్రులు పెళ్లిపెద్దలవుతారన్న మాట. ఏదేమైనా మంత్రులందరూ కలిసి ఓ కొత్తపథకాన్ని రూపొందించి ఆంథ్రప్రదేశ్‌ మ్యారేజీబ్యూరో కాంగ్రెస్‌ పార్టీ అనిపించుకుంటున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. అయితే ఈ కమిటీ మాత్రం గతం నుంచి అనుకున్నట్లే పత్రిక, న్యూస్‌ఛానల్‌ తప్పనిసరి అని ప్రతిపాదించింది. ప్రతీ ఇందిరమ్మ కాలనీలో ఇందిరమ్మ విగ్రహాన్ని నెలకొల్పాలని సూచించింది. పార్టీ బలోపేతం అవ్వాలంటే శిక్షణ అవసరమని గుర్తించింది. అలానే పెండిరగ్‌లో ఉన్న నామినేటెడ్‌ పదవులు వెంటనే భర్తీ చేయాలని సూచించింది. స్థానిక ఎన్నికలు నిర్వహించాలంది. ఆరోగ్యశ్రీ పథకంలో గర్బిణులకు , బీసీ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది.  

శ్రీలక్ష్మి కి న్యాయ సహాయం ఎందుకు చేయడం లేదు ?

జగన్‌ అక్రమాస్తుల కేసులో జైలు జీవితం గడుపుతున్న ఐఏఎస్‌ అథికారులు ఏడుగురికి రాష్ట్రప్రభుత్వం న్యాయసహాయం మంజూరు చేసింది. అయితే ఐఏఎస్‌ మహిళా అథికారి శ్రీలక్ష్మికి ఎటువంటి సహాయం అందించలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఘటనపై దుమారం లేస్తోంది. ఐఏఎస్‌అథికారుల అందరి పేర్లూ ప్రకటించి ఆమెకు ఇవ్వకపోవటం వెనుక ఏమైనా కుట్ర ఉందా? కావాలనే ఆమె పేరు లేకుండా చేశారా? అసలు శ్రీలక్ష్మికి న్యాయసహాయం అందించాల్సినంత దారుణమైన పరిస్థితులే లేవా? అసలు ఏ ప్రాతిపదికన ఈ న్యాయసహాయం విడుదల చేశారు? ఎవరు ఈ పేర్లు ప్రతిపాదనలోకి తీసుకున్నారు? అసలు ఐఏఎస్‌లు న్యాయఖర్చులు భరించలేరనుకుంటే మరి శ్రీలక్ష్మి సహాయం వద్దన్నారా? వంటి పలురకాల ప్రశ్నలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. అసలు మహిళల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ఇది నిరూపిస్తోందని కొందరు బహిరంగంగానే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. శ్రీలక్ష్మి నేరం చేశారా? లేదా? అని నిర్ధారించాల్సినది కోర్టు అయితే న్యాయసహాయం విస్మరించటం మాత్రం ప్రభుత్వతప్పిదంగా పరిగణించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఐఏఎస్‌ అథికారులు మన్మోహన్‌సింగ్‌, శ్యామ్యూల్‌, రత్నప్రభ, ఆదిత్యనాథ్‌, సిబిఎస్‌కెశర్మ, ఎస్‌వి ప్రసాద్‌, జి.శ్యాంబాబులకు న్యాయసహాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

కెసీఆర్‌ ఎక్కడున్నావ్‌?

ఇక నెక్ట్స్‌ తెలంగాణానే అంటూ కాలం గడుపుతూ వచ్చిన  తెరాస అథ్యక్షుడు కెసీఆర్‌ ఇటీవల ఎక్కడా కనిపించటం లేదు. వార్తల్లో లేకుండా విశ్రాంతి జీవితం గడుపుతున్న కెసీఆర్‌కు వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మి వచ్చి వెళ్లిందన్న విషయం కూడా తెలిసినట్లు లేదు. అంతేకాకుండా తెరాస నేతలు కూడా కెసీఆర్‌ ప్రస్తావన లేకుండా పనులు చేసుకుంటూ పోతున్నారు. తమకు కెసీఆర్‌ అవసరమే లేదన్నట్లు ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. విజయమ్మ కెసీఆర్‌ కుమారుడు కెటిఆర్‌ ప్రాతినిథ్యం వహించే  సిరిసిల్ల వస్తే కెసీఆర్‌ మాట వినిపించలేదేంటని యావత్తురాష్ట్రం ఆశ్చర్యపోయింది. ఉద్యమం చేయాల్సిన అవసరం లేదని ఇటీవల కెసీఆర్‌ చేసిన ప్రకటన అటు తెలంగాణావాదులకు, ఇటు సీమాంథ్రవాసులకు  కోపం తెప్పించింది.   ఎందుకంటే మామూలుగా లొంగని కేంద్రం ఉద్యమం మానేస్తే ఎలా లొంగుతుందని తెలంగాణావాదులు ప్రశ్నించారు. అలానే తెలంగాణా వచ్చేస్తుందన్న ధీమాతో కెసీఆర్‌ మాట్లాడటం సీమాంథ్రులను కలవరపెట్టింది. సరైన సమాచారం ఏదైనా వచ్చిందేమో అని సమైక్యాంథ్ర ఆందోళన చెందే సమయంలో ప్రణబ్‌ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నికవటం కొంత ఊరట కలిగించింది. అయితే తెలంగాణావాదులు మాత్రం రాష్ట్రపతి ఎన్నికపై మండిపడుతున్నారు. తమను వ్యతిరేకించే ప్రణబ్‌కు పట్టడం కట్టడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా కెసీఆర్‌ లేకపోవటం వల్ల ఆత్మహత్యలు తప్పాయని, ఉండి ఉంటే సిరిసిల్ల ఘటనపై విద్యార్థుల ఆత్మహత్యలకు హైడ్రామా ఆడిరచేవారని తెరాసలోని కొందరు నేతలు  బహిరంగంగానే విమర్శిస్తున్నారు.   కెసీఆర్‌ అందుబాటులో లేరన్న సంగతి తెలిసే తెరాస ఎంపీ, సినీనటి విజయశాంతి, హోంశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి కొంత హడావుడి చేశారు. తెలంగాణా ఉద్యమాన్ని తప్పుపడుతున్నారని ఆమె హోంమంత్రికి వివరించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రౌడీలదని, వారు గూండాయిజం చేసైనా అనుకున్నది సాధిస్తారని, అనవసరంగా విజయమ్మకు సిఎం అధిక ప్రాధాన్యత కల్పించారని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణాకు మద్దతు ఇస్తారు కదా అని విజయశాంతి మంత్రిసబితను ప్రశ్నించి తన అనుమానాలను తీర్చుకుంది. ఏమైనా కెసీఆర్‌ కనిపించకుంటే విజయశాంతికి పండుగేనేమో!

మంత్రి గల్లా అరుణకుమారికి కాంట్రాక్టర్ల బెదిరింపు?

పపంచవ్యాప్తంగా బంగారానికి పెరిగిన డిమాండు అందరికీ తెలిసిందే. అందువల్ల బంగారుగనుల తవ్వకాల కోసం వందల సంఖ్యలో రాష్ట్రప్రభుత్వానికి ధరఖాస్తులు చేస్తున్నారు. అయితే సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ముందు మాత్రం మూడు పేర్లను ప్రతిపాదించామని గనులశాఖామంత్రి గల్లా అరుణకుమారి తెలిపారు. ఈమె చేసిన ఈ ప్రకటన అస్మదీయులకు అవకాశంలా ఉందని అప్పుడే మిగిలిన  ధరఖాస్తుదారులు మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్‌గా ఆ గనుల తవ్వకాలు చేయగల వారిని పరిశీలించి ప్రతిపాదించాలని ధరఖాస్తుదారులు కోరుతున్నారు.   అయితే మంత్రి మాత్రం తాము ముందుగానే ఫిక్స్‌ అయిపోయినట్లు ప్రకటించారు. ఇలా మంత్రి ఫిక్స్‌ అయ్యారంటే తెరవెనుక కథలు ఏమైనా జరిగాయా అని ధరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. ఆ ముగ్గురి అర్హతను బహిరంగపరచాలని డిమాండు చేస్తున్నారు. అసలు బంగారు గనుల తవ్వకాలంటే మన రాష్ట్రమే కాదు పొరుగురాష్ట్రాల నుంచి కూడా వలసవస్తారని అభిప్రాయపడుతున్నారు. ఆ మూడు గుత్తెదార్ల సంస్థల్లో ఎవరు ఎక్కువ ఇస్తే వారికి ప్రతిపాదించే అవకాశాలు లేవా? అని కూడా ధరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. మంత్రి ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా బంగారుగనుల తవ్వకాల గురించే చర్చిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆ మూడు గుత్తెదార్ల సంస్థల్లో అవకతవకలు ఎంచేంందుకు ధరఖాస్తుదారులు సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా ఈ వ్యవహారంలో ఏమైనా అక్రమాలు జరిగాయని తెలిస్తే మంత్రి గల్లా అరుణకుమారి అంతుచూసేస్తామని కూడా వారు హెచ్చరిస్తున్నారు.  

ఎఫ్‌.డి.ఐ.లతో ముప్పు తప్పదా ?

ప్రధాన మంత్రే ప్రస్తుతం ఆర్ధిక మంత్రిగా కూడా ఉన్న విషయం తెలిసిందే. అయితే దేశంలో ఆర్ధిక మాంధ్యాన్ని అరికట్టటంలో భాగంగా అటకెక్కించిన ఎఫ్‌ డి ఐ ని ముందుకు తెస్తున్నారు. ఇదివరలో యుపిఎ భాగస్వాములు దీనిని వ్యతిరేకించడం తెలిసిందే. ప్రస్తుతం ములాయంసింగ్‌ కుమారుడు ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయిన అఖిలేష్‌ యాదవ్‌ కూడా దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఎఫ్‌డిఐకి వ్యతిరేకంగా రిటైల్‌రంగం లోనికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించకూడదని వచ్చేనెల 9న, వర్తకులంతా దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయనున్నారని ఆలిండియా ట్రేడర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులవల్ల దేశవాళీ సంస్థలు మూతపడతాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. మల్టీఫుల్‌ బ్రాండ్‌ రిటైల్‌ రంగంలోనికి 51 శాతం విదేశీ కంపెనీలకు ఇవ్వటం ద్వారా చిన్న చిన్న వ్యాపారాలకు విఘాతం కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికి 14 ఎఫ్‌డిఐల ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంట్లో హైదరాబాద్‌కు చెందిన తక్షశిలటెక్‌పార్కు అండ్‌ ఇన్‌క్యుబేటర్స్‌లో 125 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. మిగతా 15 ఎఫ్‌డిఐలకు  కేంద్రం అనుమతులు లభించలేదు.

గోదావరికి మళ్ళీ జలకళ

గోదావరి చాలా నెలల తర్వాత నీటితో కళకళలాడుతోంది. ధవళేశ్వరం వద్ద గోదావరి పరుగులిడుతుంది. ఎగువ ప్రాంతాలలో వర్షాలు కురుస్తుండ టంతో నదిలోకి నీటి ప్రవాహం వచ్చి చేరింది. దీంతో 1,60,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచి పెట్టారు. ఇప్పటివరకు వర్షాభావ పరిస్థితిల్లో ఉన్న గోదావరి మూడు నాలుగు రోజుల కుంభవృష్టితో జలకళను సంతరించుకుంది. సాగు అవసరాల నిమిత్తం 10,200 క్యూసెక్కుల నీటిని డెల్టా కాల్వలకు విడుదల చేసినట్లు అధికారు తెలిపారు. మంగళవారం వరకు వరదనీటితో పోటెక్కిన గోదావరికి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఆగిపోవడం వల్ల వరదనీరుకూడా తగ్గిందని అధికారులు చెబుతున్నారు. మంగళవారం సాయంత్రానికి ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ దగ్గర 10.60 నీటి మట్టం నమోదయ్యింది. బ్యారేజిలోని 175 క్రస్ట్‌ గేట్లను 0.30 మీటర్లకు ఎత్తి లక్షా అరవైవేల క్యూసెక్కుల నీటిని బంగాళాఖాతంలోకి విడిచి పెట్టారు.

అధికారులను బెంబేలెత్తిస్తున్న శాండ్‌ మాఫియా!

రాష్ట్రంలోని అన్నిజిల్లాలలోనూ అక్రమ ఇసుక తవ్వకాలు జరుగు తున్నాయి. ఇసుక మాఫియా అధికారులను ఏ మాత్రం ఖాతరు చేయడంలేదనడానికి అనేక ఉదంతాలు వెలుగు చూసాయి. రాజకీయ నేతల సహకారంతో వారు ఇసుక తవ్వకాలను నిర్వహిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. పర్వావరణకు ముప్పువాటిల్లుతున్నా వారు ఏ మాత్రం వెనుకంజ వేయటం లేదు. ఇప్పటికే ఇసుక తవ్వకాల వల్ల నీటి పరిమాణం భూమిలో తగ్గింది. చాలా చోట్ల 700 నుంచి 1000 అడుగుల వరకు బోర్లు వేసినా ఒక్క చుక్క కూడా నీరు అందటంలేదు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఇదివరలో 50 అడుగుల లోతులో నీళ్లు పడుతుండగా ఇప్పుడు 250 నుండి 400 అడుగుల లోతుకు వెళ్లవలసి వస్తుంది. పల్లెల్లోనూ, పట్టణాల్లోనూ జరుగుతున్న నిర్మణాలు, సిమెంటురోడ్ల వల్ల నీరు ఇంకిపోదని అందువల్లకూడా రానున్న రోజుల్లో మరింత నీటి కటకట తప్పదని సామాజిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కురుస్తున్న వర్షపు నీరు భూమి పొరల్లోకి ఇంకాలంటే ఇసుక ప్రాధాన్యత చాలా వుందని వారు చెబుతున్నారు. ఇసుక తవ్వకాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా ప్రభుత్వం మాత్రం నిద్రావస్థనుండి మేల్కోలేదని తెలుస్తుంది. తగింత సిబ్బంది, పర్యవేక్షణ, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.

పులివెందులపై కన్నేసిన తెలంగాణా ఎంపి.లు !

తెలంగాణపై వైసిపి పార్టీ నిర్ణయం చెప్పకుండానే తెలంగాణలో ప్రవేశించిన విజయమ్మ, కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో చేనేత కార్మికులకోసం చేపట్టిన ధర్నా తెలిసిందే. దీనికి ధీటుగా తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపిలు పులివెందులలో ప్రవేశించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి గాను వారు వైసిపి నేత జగన్‌ స్వంత జిల్లాలోనే చేనేత కుటుంబాల వారు వందలాదిగా ఉన్నందున ఈ కార్యక్రమాన్ని జరపనున్నట్లు తెలసింది. ఈ పథకం రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు ఢిల్లీ నివాసంలో రూపు దాల్చిందని చెబుతున్నారు.     ఒక వైపు చంద్రబాబు నాయుడు బిసిలకు 100 సీట్ల పథకంతో ముందుకు సాగుతున్నారని, ఇంకోవైపు రాజకీయ లబ్దికోసమే విజయమ్మ సిరిసిల్లలో ధర్నా చేసారని వీటిని త్రిప్పికొట్టాలంటే తాము కూడా ఏదైనా నిర్ణయాత్మక కార్యక్రమంతో ముందుకు సాగాలని తెలంగాణ ఎంపిలు నిర్ణయం తీసుకున్నారు. త్వరలో కడపజిల్లా జమ్మలమడుగులో పర్వటించి అక్కడి చేనేత కార్మికుల వెతలను తెలుసుకొని నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపి పరిష్కారానికి ఒత్తిడి తేవాలని నిర్ణయించుకున్నారు. వైకాపాకు అడ్డుకట్టవేయడానికి ఇదే సరైన పరిష్కారంగా తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు, ఎంపిలు భావిస్తున్నారు. ఇలా అయితేనే రానున్న 2014 ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని భావిస్తున్నారు. విజయమ్మకు ఆమె నివాసం నుండి సిరిసిల్లకు వచ్చివెళ్లటానికి అసాధారణ భద్రత కల్పించిన ప్రభుత్వం తమకు కూడా అదే స్ధాయిలోతమకు కూడా భద్రత కల్పించాలని టికాంగ్రెస్‌ ఎంపిలు కోరుతున్నారు.

త్వరలో మంత్రి వర్గ విస్తరణ ?

దేశంలోని ఏ సమస్యకైనా పరిష్కారం ప్రణబ్‌ ఎన్నిక తర్వాతే నని తేల్చి చెప్పిన అధిష్టానం ఇప్ఫుడు ఏ నిర్ణయం తీసుకుంటుందా అని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఢిల్లీ దర్బారంతా రాష్ట్రపతి ప్రమాణోత్సవంలో కోలాహలంగా ఉంది. అయితే రాజస్థాన్‌, మహారాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు మాత్రం తమ తమ రాష్ట్రాలలో నాయకత్వ మార్పుకోసం డిల్లీలో కుస్తీపడుతున్నారు. ఇదే అదనుగా ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌నాయకులంతా ఢిల్లీలో తిష్టవేశారు.     తెలంగాణ, ఆంధ్ర నాయకులు బలాబాలాలు బేరీజులో భాగంగా తెలంగాణ నుండి ముఖ్యమంత్రిగా కోరుతున్న వారిలో జానారెడ్డి, పిసిసి మాజీ చీఫ్‌ డి.శ్రీనివాస్‌ అక్కడే వున్నారు. అయితే ప్రణబ్‌ ప్రమాణస్వీకారంతరం అజాద్‌ ముఖ్యమంత్రితో బేటీ అవుతారని తెలుపుతుండటంతో రాష్ట్రంలో నాయకత్వం మారుతుందా లేక మంత్రివర్గ విస్తరణకే ప్రాధాన్యత ఇస్తారా అనేది తేలనుంది. నాయకగణం అంతా మంత్రివర్గ విస్తరణే అంటున్నారు. ఢిల్లీలో మన నేతలంతా మాట్లాడుకునే అంశం మాత్రం చిరంజీవికి త్వరలో మంత్రిస్దానం లభించబోతోందనే . ఇదివరలో రోశయ్యను మంత్రి వర్గంనుండి తొలగించేటప్పుడు కూడా ఇదే విదంగా 15 రోజుల ముందు ఢిల్లీకి పిలిపించారు కాబట్టి ఇప్పుడు కూడా అదే జరుగుతుందనే ఊహాగానాలు ఉన్నాయి. దీనికి తోడు రాష్ట్ర గవర్నరు కూడా కిరణ్‌ సర్కార్‌ పై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారంటూ ఇక్కడి నాయకులు, మంత్రులు గవర్నర్‌ ను కలసిన వారు తెలియజేస్తున్నారు. ఇప్పడు గవర్నర్‌ కూడా అక్కడే ఉండడంతో రాష్ట్ర ప్రజలంతా ఉత్కంఠతో ఏ మార్పులు చేర్పులు జరుగుతాయోనని ఎదురు చూస్తున్నారు.

భయోత్పాతం సృష్టిస్తున్న బొత్స మేనల్లుడు

విజయనగరం జిల్లాలో జనం భయం,భయంగా ఒక నీడనేత పంచన బ్రతుకుతున్నారు.ఈ రాజకీయనాయకుడు మరెవరోకాదు సాక్షాత్తూ పిసిసి అధ్యక్షుడు, రాష్ట్రమంత్రి అయిన బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను. ఇతని వల్ల భయపడని అధికారిలేడు. బెదిరించని డిపార్టుమెంటుకూడా లేదు. ఇతని బాధపడలేని అధికారులు అయితే ట్రాన్సుఫర్‌చేయించుకొని వేరే చోటికి వెళ్లటం లేదంటే లాంగ్‌లీవు పెట్టి ఇంటిదగ్గర వుండటం చేస్తున్నారు. కలెక్టరు కూడా ఎదురు చెప్పట్లేదు సరికదా ముఖ్యమైన ఫైల్స్‌ అన్నీ అతనికి చూపి మరీ నిర్ణయం తీసుకుంటున్నారు. జిల్లా యస్‌పిది అదే తీరు. దీంతో ఇక్కడ ప్రజాస్వామ్యం లో ఉన్న పరిస్థితులేవీ కనబడటంలేదు.నయానో భయానో పనులు చేయించుకునే సదరు నాయకుడు అధికార పార్టీకి కొమ్ముకాస్తుండటం మినహా ఏ రాజకీయ పదవులూ లేవు. గత మూడేళ్లనుండి ఇతని ప్రవర్తన విపరీత రూపం దాల్చింది. ఇతని బెదిరింపులకు తట్టుకోలేని అధికారి ఒకరు ఈ మద్యనే విపరీతమైన వత్తిడికి గురై ఉద్యోగ బాద్యతల్లో ఉండగానే గుండెపోటుతో మరణించారు.   దీంతో అతని కుటుంబం అంత్యక్రియల సందర్బంలో ఈ నాయకుడిని , జిల్లా కలెక్టరుని అక్కడే తిట్టారు. తనకు అనుకూలంగా పనిచేయని అధికారులను, నాయకులను యస్‌టి, యస్‌ సి అట్రాసిటీ కేసుల్లో ఇరికిస్తానని మరీ భయపెడుతున్నాడు. ఈ నాయకుడి ప్రాబల్యం తగ్గించవలసినదిగా ప్రజలంతా ముఖ్యమంత్రిని కోరినా ఉపయోగంలేకపోయింది. కడుపురగిలిన జనం ఒక సారి కలెక్టరు ఆఫీసు ముందే ఈ రాజకీయనాయకుడి దిష్టిబొమ్మను దగ్దం చేశారు.మొన్న జరిగిన దళితుల ఊచకోత బాధితుల పక్షంగా పాల్గొన్న దళిత నేతలంతా రాజ్యాంగేతరశక్తిగా ఎదిగిన ఈ నీడనేతను అదుపులో పెట్టాలని డిమాండు చేశారు.

ప్రణబ్‌ను ఆహ్వానిస్తున్న రాష్ట్రపతి భవన్‌

పదమూడవ రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రణబ్‌ ముఖర్జీకి స్వాగతం పలకడానికి రాష్ట్రపతి భవన్‌ను ముస్తాబు చేస్తున్నారు. నిజానికి ఆనాటి బ్రిటీషు పాలకులు తమ వైస్రాయి నివాసానికి ఈ భవనాన్ని కట్టారు. ఈ భవనం రెండులక్షల చదరపు అడుగుల స్థలంలో కట్టిన నాలుగంతస్తుల నిర్మాణం. 340 గదులున్న భవనమే ఇండియా ప్రధమపౌరుడు నివసించే భవనం .ఇండియా, యూరప్‌ సంస్కృతులు కలగలసిన అపూర్య కట్టణంగా ఇది ప్రసిధ్దికెక్కింది. దీన్ని నిర్మించడానికి. మూడు మిలియన్‌ కూబిక్‌ అడుగుల రాయి దీని నిర్మాణానికి వాడారు.తొలుత దీన్ని 4 సంవత్సరాలలో 4లక్షల పౌండ్లతో నిర్మించాలనుకున్నారు. కాని 17ఏళ్ల సుదీర్ఘ కాలం ఈ నిర్మాణానికి వెచ్చించవలసి వచింది.దానితో పాటే ఖర్చూ 12.4 లక్షల పౌండ్లకు పెరిగింది.ఈ అద్బుత కట్టడానికి 1931లో ప్రారంభోత్సవం జరిగింది. విశేషం ఏమంటే దీన్ని కట్టిన 18 ఏళ్లకు మనకు స్వాతంత్య్రం సిద్దించింది. దీనిలోని ఎల్లో డ్రాయింగ్‌రూమ్‌లో చిన్న ఫంక్షన్లు జరుగుతాయి. అంటే ఆడిటర్‌జనరల్‌, చీఫ్‌ ఎలక్షన్‌ కమీషన్‌ వారి పదవీభాద్యతలు చేపట్టే కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి.   దీని ప్రక్కనే ఉన్న గ్రే డ్రాయింగ్‌రూమ్‌ను ఎల్లో డ్రాయింగ్‌రూమ్‌ లోని అతిధుల సౌకర్యాల కోసం వినియోగిస్తారు. అశోకా హాల్‌ 32 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో హాలు క్రింద భాగం అంతా చెక్కతో ఉంటుంది. పైభాగం అంతా పెయింటిగ్స్‌తో అందంగా అలంకరించబడి ఉంటుంది.ఉత్తర డ్రాయింగ్‌ హాల్‌లో కింగ్‌జార్జి5, క్వీన్‌మేరి నిలువుటెత్తు, బస్ట్‌ సైజు ఫోటోలు ఉంటాయి. సెంట్రల్‌ హాలు ప్రక్కనే బిలియార్డు, బాల్‌రూము, 8 సింహాల నీళ్ల పంపులు దాని క్రింద సింకులతో బిగింపబడిఉంటుంది. దర్బారు హాలులో 2టన్నుల బరువైన షాడ్లియర్స్‌ 33 మీటర్ల పైనుండి వ్రేలాడుతూ ఉంటుంది. ఇక్కడే పద్మ అవార్డులు ఇస్తుంటారు. దీనిలో మరొక ముఖ్యమైన హాలు బ్యాంకెట్‌ హాలు ఒక పెద్ద బోజనపు బల్ల ఎదురుగా కుర్చీలు ఉంటాయి. దీనిలో ఒకే సారి 104 మంది కూర్చొని భోజనం చేయవచ్చు.   ఈ హాలులో మాజీ రాష్ట్రపతుల ఫోటోలను వరుసగా ఉంచారు.రాష్ట్రపతి భవనానికి వెనుక పేరు గాంచిన మొఘల్‌ గార్డెన్‌ను చూడవచ్చు .దీనిలో ఉత్తర, దక్షిణభాగంగా విభజించారు. దీనిలోని పూలు మనల్ని కట్టిపడేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. వేలాడే ఉద్యానవనాన్నికూడా మనమిక్కడ చూడగలం. అత్యంత సౌందర్యవంతమయిన గులాబీతోట మన మనసులను విహరింపచేస్తాయి. దీనిలో ఉన్న వాటర్‌ఫాల్స్‌ పర్యాటకుల మనసు దోచుకుంటుంది. బోన్సాయ్‌ మొక్కలకు పేరుగాంచింది.దీన్నిమీకు చూడాలని ఉందా అయితే ప్రతి ఏడాది ఫిబ్రవరిలో ప్రజల సందర్శనం కొరకు తీసి వుంచుతారు. తాజ్‌మహల్‌, కుతూబ్‌మీనార్‌ల తరువాత దీన్ని సందర్శించడానికే ప్రజలు ఇష్టపడుతున్నారు.

ప్రభుత్వంపై తెలుగుభాషోద్యమసమాఖ్య యుద్ధం

తెలుగుభాషోద్యమం గురించి రాష్ట్రవ్యాప్తంగా విశేషకృషి చేస్తున్న తెలుగుసమాఖ్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. త్వరలో తిరుపతిలో ప్రపంచతెలుగుమహాసభలను నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్లలో కనీసం తమ వంతు పాత్రకు సమాఖ్యను ఆహ్వానించలేదు.  ప్రభుత్వవైఖరిపైసమాఖ్యకేంద్రకార్యనిర్వాహకమండలి మండిపడుతోంది. అసలు ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించే అర్హత రాష్ట్రప్రభుత్వానికి లేదని నిర్వాహక మండలి అంటోంది. ప్రాచీనభాషగా తెలుగుభాషకు జాతీయస్థాయిలో గుర్తింపునకు కృషి చేయాల్సిన రాష్ట్రప్రభుత్వం ఆ రీతిలో స్పందించటం లేదంటోంది. ప్రపంచతెలుగుమహాసభల గురించి కూడా ఇంగ్లీషులో జీఓ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తెలుగుభాషనే ప్రోత్సహించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు రాష్ట్రప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరుతోంది. ఎందుకంటే జీఓలు దగ్గర నుంచి అన్ని విధివిధానాలూ తమిళంలో ఉండటానికి ఆ రాష్ట్రప్రభుత్వం విశేషకృషి చేస్తోందని స్పష్టం చేసింది. ఆ విధమైన కృషి చేయకపోగా, తెలుగుభాషోద్యమ సమాఖ్యలను విస్మరించినందుకు సమాఖ్య అధ్యక్షుడు సామల రమేష్‌ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రపంచతెలుగుమహాసభలు నిర్వహించే అర్హత లేదన్న విషయాన్ని అన్ని జిల్లాల్లోనూ చాటుతామని ఆయన ప్రకటించారు. అంటే ప్రభుత్వంపై పరోక్ష యుద్ధానికి సమాఖ్య సిద్ధమైందన్న మాట.

విశాఖ ఉక్కుకు చెదలు

ప్రపంచ ప్రఖ్యాత స్టీలుప్లాంటులో కేంద్ర ప్రభుత్వం తన పెట్టుబడుల్లో పదిశాతం వాటాను ఉపసంహరించుకోనుంది. ఇలా కొద్ది కొద్ది వాటాలు వెనక్కితీసుకుంటూ చివరికి ఈ పరిశ్రమను పూర్తిగా ప్రయివేటు పరం చేసేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. దీని వల్ల ఇప్పటి వరకూ ఉన్న కార్మికుల భద్రత కూడా కొరవడుతుంది. అంతేకాకుండా ప్రభుత్వరంగంలో లాభాలార్జిస్తున్న ఏకైక పరిశ్రమ ఈ విశాఖ ఉక్కుపరిశ్రమ. జాతికి అంకితమైన ఈ పరిశ్రమ ప్రైవేటుపరమైతే ఆ పారిశ్రామికవేత్తలు మరిన్ని లాభాలను ఆర్జించటంతో పాటు ప్రపంచస్టీలుమార్కెట్టును శాసించటం ఖాయం. ఇప్పటి వరకూ ఈ స్టీలురంగంలో భారతీయులే ఎక్కువగా రాణిస్తున్నారు. అందుకే టాటాస్టీలు, మిట్టల్‌ స్టీలు పరిశ్రమలు అంతర్జాతీయఖ్యాతిని ఆర్జించాయి. లాభాలబాటలో ఉన్న పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రభుత్వంలో కొందరు పెద్దల స్వలాభానికి దోహదపడుతోందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.    అందుకే విశాఖపరిశ్రమలోని సుమారు 17వేల మంది కార్మికులు ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమబాట పడుతున్నారు. ఎఐటియుసి, సిఐటియు, ఐఎన్‌టియుసి, బిఎంఎస్‌, హెచ్‌ఎంఎస్‌, టిఎన్‌టియుసి తదితర కార్మికసంఘాలు ఈ ఉద్యమాలకు నేతృత్వం వహిస్తున్నారు. మొదట్లో ప్రభుత్వం ఈ నెల 25న ఐపీఓ జారీ చేద్దామని నిర్ణయించుకుంది. కానీ, మార్కెట్టుపరిస్థితులు అనుకూలంగా లేకపోవటంతో ఆ ప్రతిపాదన మార్చుకుంది. దేశచరిత్రలోనే ఓ ప్రధాని జాతికి అంకితం చేసి లాభాల బాటలో నడిచే గర్వకారణమైన ఈ స్టీలు పరిశ్రమ మరొకటి లేదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తు తెచ్చుకునేలా కార్మికులు ఉద్యమబాట పడుతున్నారు. మంగళవారం మొత్తం ప్రొడక్షన్‌ను ఆపేసి మరీ తమ నిరసన గళాన్ని వినిపించారు. కార్మికుల ఉద్యోగభద్రత దృష్ట్యా ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదన విరమించుకోవాలని, పెద్దలు కూడా తమ స్వలాభాన్ని మానుకుని పరిశ్రమను యథాతథంగా నడిపేలా చూడాలని కార్మికనేతలు,రాష్ట్రప్రజలు కోరుకుంటున్నారు.    అందుకే విశాఖపరిశ్రమలోని సుమారు 17వేల మంది కార్మికులు ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమబాట పడుతున్నారు. ఎఐటియుసి, సిఐటియు, ఐఎన్‌టియుసి, బిఎంఎస్‌, హెచ్‌ఎంఎస్‌, టిఎన్‌టియుసి తదితర కార్మికసంఘాలు ఈ ఉద్యమాలకు నేతృత్వం వహిస్తున్నారు. మొదట్లో ప్రభుత్వం ఈ నెల 25న ఐపీఓ జారీ చేద్దామని నిర్ణయించుకుంది. కానీ, మార్కెట్టుపరిస్థితులు అనుకూలంగా లేకపోవటంతో ఆ ప్రతిపాదన మార్చుకుంది. దేశచరిత్రలోనే ఓ ప్రధాని జాతికి అంకితం చేసి లాభాల బాటలో నడిచే గర్వకారణమైన ఈ స్టీలు పరిశ్రమ మరొకటి లేదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తు తెచ్చుకునేలా కార్మికులు ఉద్యమబాట పడుతున్నారు. మంగళవారం మొత్తం ప్రొడక్షన్‌ను ఆపేసి మరీ తమ నిరసన గళాన్ని వినిపించారు. కార్మికుల ఉద్యోగభద్రత దృష్ట్యా ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదన విరమించుకోవాలని, పెద్దలు కూడా తమ స్వలాభాన్ని మానుకుని పరిశ్రమను యథాతథంగా నడిపేలా చూడాలని కార్మికనేతలు,రాష్ట్రప్రజలు కోరుకుంటున్నారు.