రాష్ట్రమంతటా హై ఎలర్ట్‌

రాష్ట్రంలో హై ఎలర్ట్‌ను ప్రకటించారు. బుధవారం రాత్రి పూణేలో జరిగిన వరుస బాంబు ప్రేళుళ్ల సంఘటనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది.రాష్ట్ర రాజధానిలోనే కాకుండా ఇతర పట్టణాల్ లోనూ ముందస్తుగా భద్రతా చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో తీవ్రవాదులు దుశ్చర్యలకు పాల్పడే అవకాశాలు న్నాయని ఇంటిలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించడంతో అంతర్జాతీయ విమానాశ్రయాలలో కూడా గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. సందర్శకులెవరినీ అనుమతించడం లేదు. దీనికి సంబందించి డిజిపి దినేష్‌రెడ్డి అన్ని జిల్లాల యస్‌పిలతో టెలికాన్పరెన్స్‌ నిర్వహించారు.ప్రార్దానామందిరాలు, దేవాలయ ప్రాంగళాలలో 24 గంటలపాటు గట్టి నిఘా ఏర్పాటు చేసి అనుమానితులను అదుపు లోకి తీసుకుంటున్నారు. అన్ని పట్టణాల్లోనూ పోలీసులు రాత్రి, పగలు నాఖాబందీ నిర్వహిస్తున్నారు.

ప్రవేటు షాపుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల మందులు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు మాఫీయా చేతుల్లోకి చేరుకుంటున్నాయి. దీనిని నియంత్రించాల్సిన ఔషద నియంత్రణ శాఖ నిర్యక్ష్యం వహిస్తోంది. కార్పొరేట్‌ ఆసుపత్రులు, ప్రవేటు ఆసుపత్రులకు వెళ్లలేని వారంతా ఆధారపడే ప్రభుత్వాసుపత్రుల పనితీరు ప్రజలను విస్మయానికి గురి చేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే కొన్ని ఖరీదైన మందులు, ఇంజెక్షన్లు ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి దొడ్డి దారిన మందుల మాఫియా చేతుల్లోకి అక్కడి నుంచి ప్రైవేట్‌ మెడికల్‌ షాపుల్లోకి తరలిపోతున్నాయాని తెలుస్తోంది. ప్రభుత్వం సరఫరా చేస్తున్న మందులను బయటి మందులషాపులకు ఈ మాఫియా ముఠా అమ్ముకుని కోట్లాది రూపాయలు దండుకుంటున్నాయి. రాష్ట్రంలోని పిహెచ్‌సిలకు ప్రతి మూడు నెలలకు ఒకసారి బడ్జెట్‌ విడుదల చేస్తారు. వీటిని జిల్లాల డ్రగ్స్‌ కేంద్రాలనుండి అన్ని పిహెచ్‌సిలకు సరఫరా చేస్తుంటారు.   పిహెచ్‌సిలకు అత్యవసరమైన యాంటీ ర్యాబీస్‌ వాక్సిన్‌, పాముకాటుకు ఉపయోగించే యాంటీ వీనమ్‌ మందులు, సెలైన్లు డ్రగ్‌ మాఫియా చేతుల్లోకి వెళుతుండటం గమనార్హం. దీనికి నిదర్శనంగా రాజమండ్రి ప్రభుత్వాసుపత్రుల్లోని మందులు ఓ ప్రయివేటు మందుల షాపులో దొరకటమే. పిహెచ్‌సిలు, సబ్‌సెంటర్లు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, పౌష్టికాహార కేంద్రాలు గొలుసుకట్టుగా ప్రజలకు అందుబాటులో ఉంటాయి. వీటిల్లో వుండాల్సిన మందులు బయట షాపుల్లో ఉండటం సామాన్యమయిపోయిందని డాక్టర్లు కూడా ఒప్పుకోవడం గమనార్హం.

మద్యం డోర్‌ డెలివరీ!

రాష్ట్రం అవలంబించిన కొత్త పాలసీతో బెల్టుషాపులకు చెక్‌ పెట్టేద్దామనుకున్న ప్రభుత్వానికి మరో తరహాలో ఈ సమస్య ఎదురవుతుంది. పగలంతా ఎక్సైజ్‌ పోలీసుల పహారాతో గప్‌చుప్‌గా ఉన్నా చీకటి పడేసరికి అక్రమమార్గాల్లో తెరచి అమ్మకం సాగిస్తున్నారు. దీనికోసం మద్యం వ్యాపారులు కొత్త చిట్కాలను కనిపెట్టారు. పిజ్జాలను డోర్‌ డెలివరీ చేస్తున్నట్లు మద్యాన్ని కూడా డోర్‌ డెలివరీ చేస్తున్నారు. సోడా బడ్డీలు , కిళ్లీ దుకాణాల్లో కూడా మద్యం విక్రయిస్తున్నారు. బడ్డీలు నిర్వహించలేనివారు సైకిళ్ళపై వీధివీధినా తిరుగుతూ చీప్‌ లిక్కర్‌ విక్రయిస్తున్నారు. ఈ పద్దతిలో రాష్ట్రంలో కొన్ని చోట్ల ఎక్సైజ్‌ అధికారులు ఇలాంటివారిని పట్టుకొని కేసు రిజస్టర్‌ చేశారు.అయితే ఇలాంటి అమ్మకాలు రాత్రిపూట ఎక్కువ జరుగుతున్నందువల్ల కేసులు నమోదు తక్కువగా ఉంది. ఎంఆర్‌పి రేట్లకే అమ్మకాలు చేస్తుండడం వల్ల షాపు ఓనర్లకు ఇప్పుడున్న పరిస్థితుల్లో లాభాలు బాగా తగ్గాయి. లూజు అమ్మకూడదన్నందుకు కూడా ఇలాంటి పనులు చేస్తున్నట్లు తెలుస్తుంది.మొత్తానికి మందుబాబులుకు మందు, షాపులవారికి లాభాలుగా వుండటానికి ఈ మార్గం కనిపెట్టారని తెలుస్తుంది.

రాష్ట్ర యూనివర్శిటీల్లో డ్రగ్స్‌ మాఫియాలు?

మాదకద్రవ్యాలను వాడటం ద్వారా ఎక్కువ ఎంజాయ్‌మెంట్‌ దొరుకుతుందనే నిశ్చితమైన అభిప్రాయానికి డబ్బున్న వారి పిల్లలను వ్యాపారులు తీసుకువస్తున్నారు. తమ వ్యాపారాలకు యూనివర్సిటీ క్యాంపస్‌లూ, నగరాల్లోని పబ్‌లను వేదికగా చేసుకుంటున్నారు. ఈ మాదకద్రవ్యాల వ్యాపారం గ్యాంగ్‌లో ఉన్న ఒకరు విద్యార్థిగా యూనివర్సిటీలో చేరి తన తోటి డబ్బున్న వారి పిల్లలను ఆకర్షించి వ్యాపారాన్ని పెంచుతుంటారు. ఫక్తు సినీఫక్కీలో ఈ వ్యాపారం మూడుపువ్వులూ ఆరుకాయల్లా విస్తరిస్తోందని నిఘావర్గాలు గుర్తించాయి. అయితే యూనివర్సిటీల్లో దర్యాప్తు చేయటం కష్టమై నిఘావర్గాలు మౌనం వహించాయి. ఇప్పటికే పలుయూనివర్సిటీలపై ఈ మాదకద్రవ్యాల వినియోగం ఆరోపణలు వచ్చాయి. ఇక శెలవుదినాలు, రాత్రులు పబ్‌ల్లో మాదకద్రవ్యాలు అమ్మకం కొనసాగుతోంది. దీనిపై నేరుగా దాడి చేస్తే రాష్ట్రపాలకుల్లో కీలకమైన నేతల పిల్లలు, ఇతరులు దొరుకుతున్నారని వదంతులూ ఉన్నాయి.   కొన్నిసార్లు ఈ విషయం నిరూపితమైంది కూడా. అయితే యూనివర్సిటీల్లో జరుగుతున్న మాదకద్రవ్యాల వ్యాపారానికి హైదరాబాద్‌ ఉస్మానియాయూనివర్సిటీ సాక్ష్యంగా చూపవచ్చు. తాజాగా ఇక్కడ ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. ఇతని నుంచి భారీస్థాయిలో కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో మేల్కొన్న నిఘావర్గాలు తమ దర్యాప్తునకు పదునుపెట్టి అన్ని యూనివర్సిటీలపైనా కన్నేసింది. త్వరలో మరిన్ని దాడులు జరుగుతాయని సమాచారం.

వైఎస్‌ కాంగ్రెస్‌వాదా? కాదా?

ఈ ప్రశ్న దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చలకు దారి తీసింది. ప్రత్యేకించి కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ అంశమే చర్చలకు దారి తీస్తోంది. వైఎస్‌కు ప్రచారం చేస్తే కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లుతోందన్న సర్వేల నేపథ్యంలో ఆ పార్టీ వైఎస్‌ చిత్ర పటాలను తొలగించి ఆయన పేరు ఉచ్ఛరించటమే మానేసింది. ఇంతకీ వైఎస్‌ కాంగ్రెస్‌ వాదా? కాదా? అన్న అంశం గురించి ఆయన అభిమానులు పార్టీకార్యాలయాల్లో నేతలను నిలదీస్తూనే ఉన్నారు. దీనికి సమాధానం ఇవ్వకుండా నేతలు తప్పించుకుంటున్నారు. అయితే ఇదే సమస్య హైదరాబాద్‌లోని గాంధీభవన్‌నూ కుదిపేసింది.     టీకప్పులో తుపానులా అదేంటీ వైఎస్‌ ఫొటో లేకుండా చేశారని వైఎస్‌సలహాదారు కెవిపిరామచంద్రరావు నేతలను నిలదీశారు. దీనిపై కెవిపి పలురకాల వ్యాఖ్యానాలు కూడా చేశారు. దీనికి కాంగ్రెస్‌ సీనియర్‌నేత, రాజ్యసభసభ్యుడు వి.హనుమంతరావు సమాధానమిస్తూ వైఎస్‌ ఫొటో పెట్టినందుకే కార్యకర్తల మనస్సులు క్షోభిస్తున్నాయన్నారు. వైఎస్‌ తనయుడు, వైకాపా అథినేత జగన్మోహనరెడ్డి సోనియాగాంధీని, కాంగ్రెస్‌ పార్టీని ఇష్టం వచ్చినట్లు విమర్శించారన్న విషయమే కెవిపి గమనించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు మా మనస్సులు కూడా బాధపడ్డాయన్నారు. అలానే వైకాపా గౌరవాథ్యక్షురాలు విజయమ్మ ఊరూరా తిరుగుతూ కాంగ్రెస్‌ పార్టీని పలురకాలుగా విమర్శించారని, ఆ విషయంపై కెవిపి ఎందుకు స్పందించలేదని వి.హెచ్‌. ప్రశ్నించారు. వీరిద్దరి మధ్య మాత్రమే కాకుండా పలుప్రాంతాల్లో వైఎస్‌ఫొటో గురించి వివాదాలు జరిగాయి. బతికి ఉన్నంత వరకూ కాంగ్రెస్‌ వాదే అయినా వైఎస్‌ తనయుడు మాత్రం తన సొంతపార్టీకే ఆయన్ని పరిమితం చేశారని కాంగ్రెస్‌ నేతలు దీనికి సమాధానం ఇస్తున్నారు. ప్రజలందరికీ కాంగ్రెస్‌ వాదైన వైఎస్‌ పరిచయమని, ఆయన్ని వైకాపా పార్టీకి షిఫ్ట్‌ చేసిన ఘనత మాత్రం జగన్మోహనరెడ్డిదని గమనించాలని కోరుతున్నారు.

ఎమ్మార్‌ కేసులో అంతిమలబ్దిదారులు ఎవరు? రూ.45.41కోట్లు చివరికి ఎవరికి చేరాయి?

సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్‌వెస్టిగేషన్‌ (సిబిఐ) ఏడాది క్రితం చేపట్టిన ఎమ్మార్‌ కేసులో ఇంకా అంతిమలబ్దిదారులు ఎవరో తేలలేదు. అంతే కాకుండా ఈ కేసులో కీలకమైన 45.41 కోట్ల రూపాయలు చివరికి ఎవరికి చేరాయన్నది మిష్టరీగానే మిగిలిపోయింది. దుబాయిలో ఉన్న ఎంజీఎఫ్‌ సిఇఓ శ్రీకాంత్‌జోషిని కూడా ఇంకా పట్టుకోవాల్సి ఉంది. అతన్ని అదుపులోకి తీసుకుంటేనే కానీ, కేసు చిక్కుముడి వీడదని సిబిఐ భావిస్తోంది. ప్రధాననిందితుడైన కోనేరు ప్రసాద్‌ ఆడిటర్‌ సురేంద్ర ఇచ్చిన వాంగ్మూలం కేసును కొంతవరకూ ముందుకు నడపటానికే దోహదపడిరది. అయితే కేసును ముందుకు నడిపినప్పటికీ సిబిఐకు చిక్కుముడి వీడకపోవటానికి విదేశాల్లో ఉన్న నిందితులే కారణమని తేలుస్తోంది. కోనేరు ప్రసాద్‌ తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరటంతో సిబిఐ న్యాయస్థానం ఎదుట కేసుపురోగతిని విశదీకరించింది. ఈ కేసులో కీలకమైన మరో 43పత్రాలను సేకరించామని విన్నవించింది. కొత్తగా మరో ఎనిమిది మంది సాక్షుల వాంగ్మూలాలను కూడా నమోదు చేశామని తెలిపింది.   విల్లాల అమ్మకాలతో ఆర్జించిన సొమ్మును ఎమ్మార్‌ సంస్థ, సౌత్‌ఎండ్‌ సంస్థకు మళ్లించిందని తెలిపింది. జగన్‌ సన్నిహితుడు సునీల్‌రెడ్డికి చెందిన ఈ సౌత్‌ఎండ్‌లోకి రూ.36కోట్లు మళ్లించినట్లు తేలిందని సిబిఐ పేర్కొంది. ఈ కేసులో మరో నిందితున్ని విచారించాల్సి ఉందని, ఆ నిందితుడే మొత్తం కేసులో కీలకమైన విల్లాల సొమ్ము పక్కదారి పట్టడానికి కారణమని గుర్తించామని సిబిఐ వివరించింది. అంటే ఈ కేసులో ఇంకా నిందితుల పూర్తిస్థాయి విచారణ పూర్తి కాలేదని న్యాయస్థానం ఎదుట సిబిఐ ఒప్పుకుంది. అది ఎప్పటికి పూర్తవుతుందో మాత్రం వివరించలేదు. అంటే ఈ కేసు ఇంకొన్నేళ్లు కొనసాగుతుందా? అన్న అనుమానాలకు అవకాశం ఇస్తోంది.

అక్రమార్కులకు అయ్యప్ప అండగా ఉంటాడా?

గత తొమ్మిదినెలలుగా చంచల్‌గూడ జైలులో మగ్గిన కోనేరు ప్రసాద్‌కు కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఇదంతా అయ్యప్ప మహిమేనని ఆయన నమ్ముతున్నారు. అయ్యప్ప భక్తుడైన ప్రసాద్‌ ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కేసులో నిందితుడు. జైలులో కూడా అయ్యప్ప దీక్ష చేశారు. ఈయన అక్రమాస్తుల కేసులో చంచల్‌గూడా జైలులో ఉన్న వైఎస్‌ జగన్మోహనరెడ్డికి సహకరించారని ఆరోపణలున్నాయి. అందుకే ఈయన్ని అదుపులోకి తీసుకున్నారు. తొమ్మిదినెలల పాటు జైలు జీవితాన్ని అనుభవించిన ప్రసాద్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఈ బెయిల్‌ కోసం ప్రసాద్‌ 5లక్షల రూపాయల విలువైన బాండ్లను పూచికత్తుగా పెట్టారు. వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్‌ మంజూరు చేస్తున్న హైకోర్టు ఇతరప్రాంతాలకు వెళ్లకూడదని కోర్టు ఆంక్షలు విధించింది. రాష్ట్రం విడిచి వెడితే ఆయన బెయిల్‌ రద్దు అవుతుంది ఈ విషయాన్ని స్పష్టంగా కోర్టు ప్రకటించింది. దీంతో ప్రసాద్‌ షరతులతో కూడిన బెయిల్‌ను పొందేందుకు సిద్ధమయ్యారు. అలానే కోనేరు ప్రసాద్‌ తన బంధువులను, సిబ్బందిని, సన్నిహితులను కలవటానికీ ఇదో పెద్ద అవకాశంగా భావించి బెయిల్‌ ద్వారా బయటికి వచ్చారు. అయితే కోర్టు కేసు దర్యాప్తుకు అందుబాటులో ఉండాలని ఆదేశాలిచ్చింది. గతంలో అయ్యప్పమాల వేసుకున్న కోనేరుకు ఒకసారి బెయిల్‌మంజూరైంది. ఈసారి ఎస్కార్ట్‌తో కూడిన బెయిల్‌ మంజూరైంది. అయ్యప్ప మహిమ వల్లే తనకు బెయిల్‌ వచ్చిందని, ఆయన మహిమతోనే త్వరలోనే నిర్దోషిగా విడుదల అవుతానని ప్రసాద్‌ నమ్ముతున్నారు.

టెన్షన్‌ పడుతున్న మంత్రి పార్థసారథి

ప్రాథమికవిద్యాశాఖామంత్రి పార్థసారథి దాదాపు ఇరుక్కునట్లే. ఒకవైపు ఫెరా చట్టం ఉల్లంఘన, మరోవైపు ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు సరిగ్గా లేవన్న ఆరోపణలు ఆయన పీకలకు చుట్టుకున్నాయి. ఫెరా చట్టం కింద ఆయనకు శిక్ష కూడా ఖరారయ్యాక ఈ ఎన్నికల అంశం ప్రస్తావనలోకి వచ్చింది. ఈ అంశం ఎప్పుడైతే ప్రస్తావనకు వచ్చిందో అప్పుడే ఇక భవిష్యత్తుల్లో దీన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రి గుర్తించారు. ఆయన అలా గుర్తించి వారం తిరక్కుండానే ఎన్నికల కమిషన్‌ స్పందించింది.     మంత్రిపార్థసారథి ఎన్నికల అఫిడవిట్‌లో సరైన వివరాలు ఇవ్వలేదని తేలితే తదుపరి చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్‌ రాష్ట్ర అథికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. పార్థసారథి దాఖలు చేసిన అఫిడవిట్‌ పరిశీలించి తగిన వివరాలు తనకు సమర్పించాలని కృష్ణాజిల్లా అథికారులను ఆదేశించామన్నారు. ఈ ఆదేశాల ప్రకారం అఫిడవిట్‌లో మంత్రి నమోదు చేసిన వివరాలు తప్పుడువని తేలితే కఠినచర్యలు తప్పవని న్యాయ నిపుణులు అంటున్నారు. అప్పుడు దాదాపు ఎన్నికల కమిషనును మోసం చేయటం రాజ్యాంగాన్ని థిక్కరించట మంత పెద్ద నేరమని వారు వివరిస్తున్నారు. అంటే నేరం రుజువైతే కఠిన శిక్ష ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో మంత్రి పార్థసారథి కూడా ఆందోళనగా ఉన్నారని తెలుస్తోంది. తాను దాదాపుగా ఇరుక్కున్నానని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోతున్నారని సమాచారం. ప్రభుత్వం చేసేదేముందీ ఒక్క న్యాయసహాయం తప్ప అని మంత్రి ముందే అనేసి కొందరు నాలిక్కరుచుకున్నారట. దీంతో మంత్రి ఆందోళన మరింత పెరిగిందంటున్నారు. ఈ వేదనలో ఆయన తన కర్తవ్యం సరిగా నిర్వర్తించలేరు కాబట్టి మంత్రిని మార్చాలని విద్యార్థి, ఉపాథ్యాయ సంఘాలు డిమాండు చేస్తున్నాయి. దీంతో ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తన జీవితం ఉందని మంత్రి వాపోయారట.

వైయస్‌ ఫోటో వుండాలి, అక్కర్లేదు

మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడి ప్రమాణ స్వీకరణ సందర్బంగా జరిగిన కార్యక్రమం వల్ల రాష్ట్ర కాంగ్రెస్‌లో మూడు రకాలయిన నాయకులు ఉన్నారని తెలుస్తుంది. ఒక వర్గం అంతా దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్‌ అనుయాయులని,  దానికి పూర్తి వ్యతిరేకంగా రాష్ట్రంలో వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి గుర్తులే వుండకూడదనుకునే వర్గం రెండోది. మూడోది ఎవరైతే ఎంటి అనుకునే వర్గం. నిన్న జరిగిన యువజన నేత ప్రమాణ స్వీకార సభలో ప్రసంగించిన కెవిపి  గాంధీ భవన్‌లో వైయస్‌ రాజశేఖర్‌ చిత్రపటం లేకపోవటం పట్ల తీవ్ర  అవేదన వ్యక్తం చేసారు. అంతకుముందు గాంధీ భవన్‌లో జరిగిన మౌన దీక్షలో వి.హనుమంతరావు కాంగ్రెస్‌పార్టీలో వైయస్‌ అనునాయులను కోవర్టులతో పోలుస్తూ వారిని ఏరివేయాలని అన్నారు. ఇదే గంధీభవన్‌లో కెవిపి తర్వాత మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి రాజనర్శింహ మాట్లాడుతూ అంజయ్య అయినా, వైయస్‌ అయినా ఒకటేనని వైయస్‌ ఫోటో పెట్టేటట్లయితే అంజయ్య ఫోటోకూడా పెట్టాలని అన్నారు. అదే కార్యక్రమంలో మాట్లాడిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ ఈ విషయం గూర్చి ఏమాత్రం ప్రస్తావించకుండా వ్యాపారం చేసుకొని రాజకీయాల్లో ఖర్చుపెట్టేవాళ్లు రావాలని అంతే గాని రాజకీయాలను బిజినెస్‌ గా చూడకూడదని సెలవిచ్చారు. రాజకీయాలు ఇలాగే వుంటాయి మరి.

డిప్రెషన్‌లో వి.ఐ.పి.ఖైదీలు

అక్రమాస్తుల కేసులో అరెస్టయిన వివిఐపిలు  జగన్‌, నిమ్మగడ్డ ప్రసాద్‌, సీనియర్‌ ఐఎఎస్‌ సుబ్రమణ్యం, మంత్రి మోపిదేవి సీనియర్‌ ఐఎఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మీ, తదితరులంతా  చర్లపల్లి జైలులో దాదాపు మూడు నెలలుగా మగ్గుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వారు జైలులో  ప్రశాంతంగా గడుపుతున్నారా అంటే అది కూడా లేదని తెలిసింది ఆ మద్య  చెట్ల కింద రమ్మీ ఆడుతున్నారని,  ప్రత్యేక సదుపాయాలున్నందున వారికేమీ డోకాలేదని అందరూ అనుకున్నారు కాని అక్కడ పరిస్థితి వేరే ఉన్నట్లు తెలుస్తుంది.   ఇప్పటికే వారు ఒక్కొక్కరూ మూడు కేజీలవరకు తగ్గారని, విచారవధనాలతో కనిపిస్తున్నారని తెలిసింది.కాలక్షేపం కోసం ఎన్ని గేమ్స్‌ ఆడినా మనస్సుని కంట్రోల్‌ లో పెట్టుకునేందుకు మెడిటేషన్‌ చేస్తున్నా ఎందుకిలా జరుగుతుందనుకుంటున్నారు. హోమ్‌ సికనెస్‌ కారణమని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎంత విఐపి ట్రీట్‌మెంట్‌ ఉన్నా జైలు వాతావరణానికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు తప్పవని, దానికి ఉదాహరణ సత్యం రామలింగరాజే నని సైకాలజీ నిపుణులు విశ్లేశిస్తున్నారు. జైలు జీవితంతో రామలింగరాజు తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యారు. దాని నుంచి ఆయన ఇంకా కోలుకోలేదు. ఇదే పరిస్ధితి జగన్‌ తోపాటు మిగిలిన వి.ఐ.పి. ఖైదీలకు వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదని సైకాలిస్టులు చెబుతున్నారు.  

చిరంజీవికి ఇంటర్యూ ఇవ్వని సోనియా

రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి ఢల్లీిలో నిరాశ ఎదురైంది.  సోనియాను వ్యక్తిగతంగా కలుసుకోవాలన్న చిరు ప్రయత్నం బెడిసికొట్టింది. తన కేంద్ర మంత్రి పదవిపై మాట్లాడేందుకు సమయం ఇవ్వ వలసిందిగా ఆయన సోనియా కార్యాలయాన్ని సంప్రదించగా మరో 15 రోస్త్రల వరకూ వెయిట్‌ చేయాలని సమాధానం వచ్చింది.దీంతో  చిరంజీవికి కాంగ్రెస్‌లో ప్రాధాన్యత తగ్గుతుందన్న ఉహాగానాలు చెలరేగాయి. తనకు  మంత్రిపదవి ఇవ్వకుండా అవసరానికి ఉపయోగించుకొని వదిలేశారని, చిరంజీవి తన అనునాయుల దగ్గర వాపోతున్నట్లు తెలిసింది.కీలక సమయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఆదుకున్నందుకు రాజ్యసభ సభ్యత్వం  ఇచ్చి చేతులు దులుపుకున్నారని, పార్టీ విలీన సమయంలో జరిగిన ఒప్పందాలను మర్చిపోయారని చిరంజీవి భావిస్తున్నారు. అయితే కేంద్రంలో ఇంకా మంత్రి పదవులు ఖాళీగా ఉన్నందున ఇకముందైనా తనను మంత్రిని చేయక పోతారా అన్న  ఆశతో ఆయన  ఉన్నట్లు తెలిసింది. కేంద్రం ఇటీవల  క్యాబినెట్‌లో మంత్రిపదవులను  సర్ధుబాటు చేసింది తప్ప పెద్దగా  మార్పులు చేర్పులు ఏమీ చేయకపోవడం గమనార్హం. చిరంజీవి సంతోషపడే విషయం ఏమంటే రెండు నెలలు క్రిందట చెన్నయ్‌లో తన పెద్దకుమార్తె ఇంటి వద్ద ఆదాయ పన్ను అధికారులు స్వాధీన పర్చుకున్న 35 కోట్ల రూపాయలకు  టాక్సు కట్టించుకొని నల్ల డబ్బుని తెల్లడబ్బుగా మార్చి చిరంజీవికి అప్పగించినట్లు తెలిసింది. అది చిరంజీవి డబ్బే అని దానిని తన కుమార్తె  దగ్గర దాచివుంచారని అప్పట్లోనే మీడియా వర్గాలు పేర్కొన్నాయి. మంత్రిపదవి రాకపోయినా డిల్లీతో ఉన్న  సంబందాలు తన డబ్బును వెనక్కి తెచ్చుకోవడంతో ఉపయోగ పడినందుకు చిరంజీవికి ఆనందమే కదా!

2009-2010 విద్యుత్‌ సర్‌చార్జీలపై హైకోర్టు స్టే

2009 -2010 విద్యుత్‌ బిల్లులో ఇందన సర్‌చార్జీల బకాయిల( ఎఫ్‌ఎస్‌ ఎ) వసూలుపై రాష్ట్ర హైకోర్టు  స్టే విధించింది. సుమారు వందకు పైగా పారిశ్రామిక వినియోగదారులు దాఖలు చేసిన పిటీషన్లను జస్టిస్‌ సీవీ నాగార్జున రెడ్డి ధర్మాసనం విచారణకు అనుమతించింది. ఇప్పటికే వసూలు చేసిన బిల్లులను రాబోయే బిల్లుల్లో సర్దుబాటుచేయాలని హైకోర్టు స్పష్టం చేసింది.   2008-2009 సంవత్సరపు సర్‌చార్జీల కేసు సుప్రీంకోర్టులో ఉండగానే తదుపరి సంవత్సరాలకు బిల్లులు వసూలుచేయటం చట్ట వ్యతిరేకమని పిటీషనర్‌ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. ప్రతి నాలుగు నెలల అనంతరం విద్యుత్‌సర్‌చార్జీలను నెలలోపు వసూలు చేయాలన్న నిబంధనను మరచి, సంవత్సరాల అనంతరం వసూలుకు చర్యలు చేపట్టటం చట్టవ్యతిరేకం అని వివరించారు. ఈ ఆదేశం పిటీషనర్లకు మాత్రమే కాక, ఇంకా పిటీషన్లు దాఖలు చేయని పారిశ్రామిక సంస్ధలకు సైతం వర్తిస్తుందని న్యాయమూర్తి మౌఖికంగా తెలియచేశారు.

పాఠశాలలోని టాయిలెట్ల శుభ్రత విద్యార్ధులదే

విద్యార్దులు ఎవరి  టాయిలెట్లను వారే గ్రూపులుగా ఏర్పడి శుభ్రపరచుకోవాలని, ప్రాధమిక విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి చందనాఖన్‌ వివాదాస్పద వాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఉచితంగా విద్య, యూనిఫాం, పుస్తకాలు, స్కాలర్‌షిప్‌ వంటివి ఇస్తుంటే విద్యార్దులు వారి పని వారు చేసుకుంటే తప్పేమిటని అడిగారు. 400 మంది విద్యార్దులు ఉపయోగించే టాయిలెట్లను ప్రభుత్వం ఇచ్చే 500 రూపాయలకు శుభ్రపరచడానికి ఎవరూ రావడంలేదని ఆమె తెలిపారు.     హైదరాబాద్‌లోని జూబ్లీ హాల్‌లో యునిసెఫ్‌ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన పాఠశాల విద్యార్ధుల సదస్సులో చందనాఖన్‌ ఈ వివాదాస్పద వాఖ్యలు చేశారు. తమిళనాడు, కర్ణాటకలో  ఇప్పటికే ఈ విదానం అమలులో ఉందని ఆమె గుర్తు చేశారు. దీనిద్వారా చిన్నతనం నుండే డిగ్నిటీ ఆఫ్‌ లేబర్‌ తెలుస్తుందని ఆమె తెలిపారు.పాఠశాలలో ఎస్టీ ఎస్సీ విద్యార్ధులతోనే కాకుండా అందరూ కలసి  శుభ్రం చేసుకోవాలని చెప్పారు.

బొత్సపై సుప్రీంకోర్టులో పిటిషన్‌

రాష్ట్రంలోని మద్యం మాఫియాలో బొత్స సత్యనారాయణ పాత్రపై విచారణ జరిపించాలంటూ గిరియాదవ్‌ అనే వ్యక్తి సప్రీం కోర్టులో పిటీషన్‌ వేసారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు 2010లో అతి తక్కువ ధరకు మద్యం దుకాణాలను కైవసం చేసుకున్నారని, వారి పాత్ర బయటపడుతుందనే  భయంతోనే  ప్రభుత్వం ఏసీబీ దర్వాప్తును బలహీన పర్చిందని, దీనిపై నిజాయితీగా  వ్యవహరిస్తున్న  ఏసీబీ డిజి భూపతి బాబును, అదనపు డిజి శ్రీనివాస్‌లను ప్రభుత్వం బదిలీ చేసిందని పిటీషనర్‌ పేర్కొన్నారు. బొత్స తన జిల్లాలో 202 దుకాణాలకు గానూ 100 దుకాణాలను తన కంపెనీల్లో పనిచేసే పేద తెల్లకార్డు దారులవని, వారిపేరుతో మంత్రి లిక్కర్‌ షాపులను తెరిచారని, గిరి యాదవ్‌ తెలిపారు. 31 దుకాణాల్లో తమ కుటుంబానికి 27 శాతం పెట్టుబడులున్నట్లు ఆయన అంగీకరించిన విషయం కోర్టు ముందుంచారు. లిక్కర్‌ మాఫియా డాన్‌ నున్నా వెంకటరమణ, బాలరాజ్‌ గౌడ్‌ వెల్లడిరచిన  వివరాల్లో ఏడుగురు మంత్రులు, 23 మంది ఎమ్మేల్యేలకు, ఒక ఎంపికి  నెలకు 2కోట్ల మేర లంచాలు ఇచ్చామన్న విషయాన్ని గిరియాదవ్‌ పొందుపరచారు. అంతేకాక, బొత్సపాత్ర బయటపడకుండా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి,కేంద్రమంత్రి ఆజాద్‌కు రాసిన లేఖనుకూడా జతచేసారు. ఆవిధంగా ఏసీబి విచారణను ప్రభుత్వం నీరు కార్చినందున అత్యున్నత న్యాయస్ధానం ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలని గిరియాదవ్‌ విజ్ఞప్తి చేశారు.

తెలంగాణపై చేతులు దులుపుకుంటున్న కేంద్రం

తెలంగాణ వచ్చేసినట్టే అని తెలంగాణ వాదులు, తెలంగాణ ఇచ్చేదిలేదు కేంద్రం సమైఖ్యంగా ఉంటానికే మొగ్గు చూపుతుందని మరికొందరు ఆంధ్రానాయకులు డిల్లీ వెళ్లి వచ్చిన ప్రతీసారి రాష్ట్ర ప్రజలకు చెబుతుండటంపరిపాటి అయ్యింది. అయితే దేశ ఆర్ధిక మంత్రి చిదంబరం సీమాంద్ర మీడియాతో ముచ్చటిస్తూ తెలంగా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేది ఇవ్వనిది రాష్ట్ర ప్రజల అభీష్టం మేరకు జరుగుతుందని చెప్పారు.     తెలంగాణపై కేంద్ర నిర్ణయాన్ని  అమలు జరపటమే తమ పని అని అంతేగాని తెలంగాణా ఇచ్చే అంశం  తమ పరిధిలోనిది రాదని హోం శాఖ కార్యదర్శి ఆర్కే సింగ్‌  న్యూడిల్లీలో తెలిపారు. కేంద్రం మా పరిధిలో ఉంచిన అంశాన్ని శ్రీకృష్ణ నేతృత్యంలోని కమిటీకి అప్పగించాం. అది ఇచ్చిన నివేదిక ప్రజల్లో ఉంది. ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నాం. అన్నిరాజకీయ పార్టీలు తమ వైఖరి నిర్ణయించాకే  కేంద్రం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తుందని దాన్ని అమలు చేయటానికి కేంద్రహోం శాఖ కట్టుబడి ఉంటుందని చిదంబరం వివరించారు . రాష్ట్రంలోని పార్టీలకు, ప్రజలకే ఈ అంశాన్ని వదిలి చేతులు దులుపుకోవాలన్న పద్దతిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు దీనివల్ల ఆర్థం అవుతుంది.

సఫలమైన మనగుడి కార్యక్రమం

దేవాదాయశాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన గుడి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని తెలుస్తుంది. రాష్ట్రంలోని అన్ని గుడులలోనూ ఇది ప్రవేశ పెట్టడం హర్షణీయమని ఆత్యాధ్మిక సంఘాలు కొనియాడుతున్నాయి. ఈ కార్యక్రమం వల్ల ప్రజల్లో భక్తి భావం పెల్లుబుకుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణలోభాగంగా ప్రచార రధంలో దేవుని ఉత్సవ విగ్రహాన్ని అత్యంత వైభవంగా అలంకరించి గ్రామగ్రామాన ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలకు, మారుమూల ప్రాంతాలకు ఈ ప్రచార రధం వెళ్లడం వల్ల అధిక సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. ఆయా స్వామివారి, అమ్మవార్ల విశిష్టతను ప్రజలకు చాటిచెప్పారు. ఈ కార్యక్రమం వల్ల హిందూమత ఆచారసాంప్రదాయాలను ,భక్తి భావాలను పెంచటమే కాక హిందూ మత విశిష్టతను కూడా పెంపొందించుకోవచ్చని ఆత్యాధ్మిక సంఘాలు కొనియాడుతున్నారు. దీనిలో భాగంగానే అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్ధానం నుండి ప్రచారరధం శంఖవరం, రౌతులపూడి, తేటగుంట మీదుగా తుని చేరుకుంటుందని ఆలయ అధికారులు తెలిపారు.

చిన్న నిర్మాతలకు ఇక మంచి రోజులు

చిన్న నిర్మాతలకు ఇక నుండి మంచి రోజులు రానున్నాయని ఫిలిం ఛాంబర్‌లో తమ్మారెడ్డి భరద్వాజ ప్యానల్‌ సాధించిన ఘన విజయం చెబుతుంది. చిత్ర పరిశ్రమంతా కొందరి చేతుల్లో ఉండటం చిన్న సినిమాలకు ధియేటర్లు ఉండక పోవడం గత కొంతకాలంగా చిన్న హీరోలను, నిర్మాతలను వేధిస్తున్న సమస్య. సినిమా పరిశ్రమ అంతా గుత్తాధిపత్యం లోకి వెళ్లడంతో దిక్కుతోచని చిన్న సినిమాలు తీసే సినీ నిర్మాతలు గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తూనే వున్నారు. వీరంతా పెద్ద నిర్మాతల చేష్టలతో విసిగి వేసారిన వారే.... వారికి తమ్మారెడ్డి భరద్వాజ, దాసరి నారాయణరావు అండగా ఉండి మంచి సినిమా సినిమాలు రావాలంటే గుత్తాధిపత్యానికి తెరపడాలని సాగించిన పోరాటంలో ఫిలించాంబర్‌ ఎన్నికలు జరిగాయి.   అత్యధిక ఓటింగ్‌ చిన్న నిర్మాతలకు చెందిన తమ్మారెడ్డి ప్యానల్‌కు పోలవటం చిన్న హీరోలకు ఊరట కలిగింది. పెద్దనిర్మాతలు, పెద్ద హీరోల సినిమాలే కాకుండా ప్రేక్షకులకు చిన్న సినిమాలు కూడా వినోదానందిస్తాయని వాటిని నిరోధించటం తగదని వారు తెలిపారు. ఇకనుండి తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి రోజులు రానున్నాయని చిన్న హీరోలు ఆనందం వ్యక్తం చేశారు. ఇకపై సినిమాలకు సంబంధించిన అడ్యర్‌టైజ్‌మెంట్స్‌లో కూడా పెద్ద, చిన్న పత్రికలు అనే తేడా లేకుండా అందరికి సమాన అవకాశాలు ఇచ్చే దిశలో ఒకప్పటి పత్రికాధిపతి దాసరి కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.

కాంగ్రెస్‌ న్యూస్‌ ఛానల్‌పై సందేహాలు

రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఏర్పాటు చేసిన ధర్మాన కమిటీ కాంగ్రెస్‌కో మీడియా ఉండాలని లేక పోతే రానున్న ఎన్నికల్లో రాణించడం కష్టం తేల్చేసింది. అయినా అధికార పార్టీగా సమాచార శాఖను వినియోగించుకోకుండా కొత్తగా మీడియా ఆలోచన ఎందుకనేది మరో వర్గం వాదన. ఏది ఏమైనా అన్ని పార్టీలకు మీడియా ఉండి కేవలం అధికార పార్టీకి లేకపోవడం వెలితే అని మరికొందరి అభిప్రాయం. తమిళనాడులో కాంగ్రెస్‌తో సహా ప్రతి పార్టీకి ఒక ఛానల్ ఉందని అక్కడి యస్‌సి, యస్‌టిలకు కూడా మరొక కొత్త ఛానల్‌ ప్రతిపాదనలో ఉండటాన్ని కొందరు నేతలు గుర్తుకు తెస్తున్నారు.     అయితే అధికార కాంగ్రెస్‌ ఛానల్‌ నిర్వహణలో మరి కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవలసిన పరిస్థితులు ఉంటాయని మరికొంతమంది నాయకులు వివరిస్తున్నారు. అధికార కాంగ్రెస్‌ నాయకులు మాత్రమే మీడియాను ఉపయోగించుకుంటారా లేదా వ్యతిరేకులూ, పార్టీలో పదవులు రాని వాళ్లూ ఉపయోగించుకుని ఉన్న పరువును పోగొడతారా అనేది కొందరినేతల సందేహం. ప్రజల అవసరాలు, అధికధరలు లాంటి అత్యవసరాలు ప్రభుత్వం పట్టించుకోకుండా, సామాన్య మానవుడి బ్రతుకుని దుర్బరం చేస్తున్న సమస్యలను చేధించకుండా ఎన్ని ఛానల్స్‌ పెట్టినా ఏంటట అని సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు.

విద్యుత్‌ కోతల్లో వరల్డ్‌ రికార్డ్‌

కరెంట్‌ ఆదా చేయ్యడమంటే కరెంటును ఉత్పత్తి చేయడమే అనే స్లోగన్‌ కరెంట్‌ను పొదుపుగా వాడుకోవాలనే సదుద్దేశంతో జన్‌కో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కరెంటు బిల్లు కడుతున్నాము కదా అని ఎడాపెడ వాడకూడదు కదా. ఒక ప్రక్క కరెంటు వినియోగదారులు రోజురోజుకు పెరగటం, పెరిగిన అవసరాలకు తగినంత ఉత్పత్తి చేయలేక పోవడం ప్రభుత్వ వైఫల్యం. అనవసర విద్యుత్‌ వాడకాన్ని నివారించుకోలేక పోవడం ఇప్పుడు సీరియస్‌ సమస్య అయ్యింది. ఇప్పటికే మన దేశం విద్యుత్‌ కోతల్లో వరల్డ్‌ రికార్డు సృష్టించింది. మన దేశం విధిస్తున్నంతగా మరేదేశం విద్యుత్‌ కోతలు విధించడం లేదు.     దీనికి తోడు ఉత్తర భారతదేశంలో పవర్‌గ్రిడ్‌ వైఫల్యం వల్ల డిల్లీతో సహా 8 రాష్ట్రాల్లో అంధకారం అలుముకుంది. కొన్ని రాష్ట్రాలు ముందు చూపులేకుండా అవసరాలకు మించి అధికవిద్యుత్‌ను వాడుకోవడం, పవర్‌గ్రిడ్‌లను ఎప్పటికప్పుడు పరిరక్షించుకునే పటిష్టమైన చర్యలు చేపట్టక పోవడంతో ప్రధాన మంత్రి ఇంటినుండి సామాన్యుడు ఇంటివరకు కరెంటు లేని ఇళ్లను చూడవలసి రావడం జరిగింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోకపోవడం వల్ల కారుచీకట్లో అల్లాడవలసిన పరిస్థితి దాపురిస్తుంది. విద్యుత్‌ సరఫరాను పునరుద్దరించడానికి 15 గంటల సుదీర్ఘ సమయం పడుతుండటం కొసమెరుపు. దేశం నిండా బొగ్గునిల్వలు ఉన్నాయి. నదులకు కొదవలేదు, గ్యాస్‌ సమృద్దిగా ఉంది అయినా విద్యుత్‌ లేకపోవడానికి కారణం ముందుచూపు లేకపోవడమే. రెండో రోజు కూడా ఉత్తరాధి అంతా గ్రిడ్‌ ఫెయిల్యూర్‌ సమస్యతో మెట్రోరైళ్లు తో సహా అన్ని ఆగిపోయి ప్రజల సహనానికి పరీక్ష పెట్టాయి. దేశంలో ఇప్పటిదాకా ఇంత ధారుణంగా గ్రిడ్‌లు ఫెయిల్యూర్‌ కాలేదు. ఆర్ధికాభివృద్దిలో అభివృద్ది చెందుతున్న దేశాలతో పోటీ పడుతున్నట్లు గొప్పగా చెప్పుకుంటున్న మనం సరిగా విద్యత్‌ను కూడా సరఫరా చేయలేని దుస్ధితిలో ఉండడం శోచనీయం.