ఫైర్‌బ్రాండ్‌ల నెలవుగా మారిన కృష్ణాజిల్లా ?

రాజకీయాల్లో ఒకరిని ఒకరు విమర్శించుకోవటం పరిపాటే. ఈ విమర్శల్లో రాటుదేలిన కృష్ణాజిల్లా నేతలు వార్తల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అటువంటి వారి కోవలో ఎక్కువకాలం రాజ్యమేలినది ఎంపి లగడపాటి రాజగోపాల్‌. ఈయన మాట్లాడటమే ఎదుటివారిని కదిలించేసి వారి నుంచి ఊహించని రియాక్షన్‌ కూడా వచ్చేస్తుంటుంది. ఆఖరికి ఈయన తీసుకునే నిర్ణయాలు కూడా ఎదుటివారిని తక్కువ చేయాలనే కసిగా ఉంటాయని ప్రచారం. ఈయన్ని దూషించని తెలంగాణా నేత లేరంటే అతిశయోక్తి కాదు.    ఫైర్‌బ్రాండ్‌గా ఈయన తరువాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమ కూడా జాబితాలో చేరారు. ఉమ ఇటీవలే గుడివాడ ఎమ్మెల్యే ఆళ్ల నానిని టిడిపి సస్పెండ్‌ చేసినప్పుడు ఉమ భయంకరంగా ఫైర్‌ అయ్యారు. అయితే గురవింద గింజ సామెతలా తన తమ్ముడు టిడిపిని కాదని వై.కా.పా.లో చేరిన విషయాన్ని మరిచారు. అప్పుడు నాని ఆయనకు ఆ విషయాన్ని గుర్తిచేశారు. దీంతో తప్పనిసరిగా తగ్గాల్సివచ్చింది.   తరువాత తాజాగా ఉమ ఎంపి లగడపాటిని అసమర్థుడంటూ ఫైరయ్యారు. నీటివిడుదల విషయంలో కృష్ణా రైతాంగానికి జరిగిన అన్యాయం గురించి పోరాటం చేస్తామంటూనే ఉమ తన మాటల తూటాలను లగడపాటికి ఎక్కుపెట్టారు. విజయవాడ నగరాభివృద్థి  చేసానంటూ లగడపాటి వొట్టి కోతలు కోస్తున్నారని ఉమ అన్నారు. రైల్వేలో తీరని అన్యాయం జరిగిందని, దీనికి లగడపాటి వైఖరే కారణమని ధ్వజమెత్తారు. ఇలా కృష్ణాజిల్లాలో ఇద్దరు ఫైర్‌బ్రాండ్‌లు తలపడుతున్నారు. ఎంపి లగడపాటి దీనిపై ఎలా రియాక్టు అవుతారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బైరెడ్డి సాధించిందేమిటీ?

ప్రత్యేకరాయలసీమ రాష్ట్రం కావాలనే డిమాండుతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డి రాజశేఖరరెడ్డి చేస్తున్న ఉద్యమం వల్ల సాధించిందేమిటీ? ఈ ప్రశ్న ఒక్క పార్టీ కాదు యావత్తు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వస్తోంది. అయితే వాస్తవానికి తెలంగాణా ఇంక ఇవ్వలేమన్న నిర్ణయానికి కాంగ్రెస్‌ పార్టీ రావటానికి ఈయన చేపట్టిన ఆందోళనే కీలకమయిందని ఆ పార్టీ నేతలంటున్నారు. వేర్పాటువాదం వల్ల వచ్చే ప్రమాదాన్ని బైరెడ్డి చేసిన ఉద్యమాల వల్ల అర్థం చేసుకున్న కాంగ్రెస్‌ ఇక త్వరలో బయటపడేందుకు సిద్ధపడుతోంది. అయితే హోంశాఖ నివేదిక అవాస్తవమైనా కూడా ప్రత్యేక తెలంగాణా ఇచ్చేందుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మాత్రం సిద్ధంగా లేరన్నది వాస్తవం.   అగ్గికి ఆజ్యం పోసినట్లు ఇటీవల హైదరాబాద్‌ వచ్చిన బైరెడ్డి తన తోటి రాయలసీమ వాసులందరినీ కూడగట్టుకుని అవసరమైతే తెలుగుదేశం పార్టీకి రాజీనామా అయినా చేస్తాను కానీ, ప్రత్యేక రాయలసీమ సాధించేంత వరకూ విశ్రమించనని ప్రకటించారు. తమ రాయలసీమ పౌరుషాన్ని, తమ ప్రాంతానికి జరిగిన నష్టాన్ని కళ్లకు కట్టినట్లు ఆయన ప్రకటించిన తీరు తెరాసకు ఒళ్లు మండేలా చేసింది. దీంతో అక్కసు ఆపుకోలేక తమ తెలంగాణా రాయలసీమ నుంచి బైరెడ్డి ఒకరని టిఆర్‌ఎస్‌ ప్రకటించేసింది. ప్రత్యేకించి ఉన్నదీ, లేనిదీ అవాకులు, చవాకులు పేలే హరీశ్‌రావు బైరెడ్డిపై కోపాన్ని విమర్శల రూపంలో కక్కేశారు. అయితే బైరెడ్డి ఉద్యమబాట పట్టకపోతే తెలంగాణా వచ్చేసేదని టిఆర్‌ఎస్‌ ప్రచారం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఏమి సాధించలేదంటారే ఒక కొత్తశత్రువులను ఏర్పాటు చేసుకుని మాతృభూమిలో మందిని సమకూర్చుకుంటే చాలదా  అన్నట్లుంది బైరెడ్డి బాణి.

బిసి మంత్రిత్వశాఖ ఏర్పాటుకు దేశం కృషి

ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ బిసిలకు ఇస్తున్న వరాలజల్లు ముగియకుండానే కొత్త అంశం ఆ పార్టీ జాబితాలోకి చేరింది. కేంద్రస్థాయిలో బిసి మంత్రిత్వశాఖ ఏర్పాటు చేస్తే బిసిలకు సంబంధించిన పలుఅంశాలపై రాష్ట్రప్రభుత్వ భారం తగ్గుతుందని ఆ పార్టీ ఓ అంచనాకు వచ్చింది. అందుకే ఈ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు నిర్ణయించుకుంది. తమ పార్టీ ఎంపీలను ఈ మంత్రిత్వశాఖ ఏర్పాటుకు సహకరించాలని తెలుగుదేశం కోరుతోంది. దేశంలో బిసి జనాభా అత్యథికంగా ఉన్నందునే తమ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని టిడిపి పార్లమెంటరీపార్టీ నేత నామా నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటివరకూ కేంద్రస్థాయిలో బిసి సంక్షేమం కోసం ఎటువంటి చర్యలు తీసుకోనందున తాము ఈ మేరకు కృషి చేస్తున్నామని ఆయన వివరించారు. అంతేకాకుండా బిసి సంక్షేమమంత్రిత్వశాఖ ఏర్పాటు వల్ల దేశంలో బిసిల అభివృద్థి సాథ్యమవుతుందని విశదీకరించారు. ప్రత్యేకించి తమ పార్టీ ప్రకటించిన బిసి డిక్లరేషన్‌లో కూడా ఈ సంక్షేమం మంత్రిత్వశాఖ అంశాన్ని జోడిస్తున్నామని తెలిపారు. తమ పార్టీ అథినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన మద్దతు వల్లే ఇది సాధ్యమవుతోందన్నారు. అయితే వచ్చే పార్లమెంటరీ సమావేశాల్లో ఈ అంశంపై పోరాడుతామని నామా హెచ్చరించారు. పూర్తిస్థాయిలో శాఖ ఏర్పాటు చేసేంతవరకూ తమ పార్టీ ఎంపీలు  సహకరిస్తారని ఆయన ఆశిస్తున్నారు. అందుకే తమకు మద్దతు ఇవ్వాలని ఇతర పార్టీల్లోని బిసి సంక్షేమ ఆసక్తి ఉన్న నేతలకు విజ్ఞప్తి చేస్తున్నారు.బిసిలకు సరైన స్థాయి కల్పిస్తే వారు బాగా రాణిస్తారని తెలుగుదేశం పార్టీ అథినేత చంద్రబాబునాయుడు అభిప్రాయపడుతున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ అదిలాబాద్‌ నాయకులతో మాట్లాడుతూ తాము బిసి డిక్లేరేషన్‌ చేసినది మొదలుకుని ఇంకా భవిష్యత్తులోనూ బిసిలకు ఆదరణ ఇస్తూనే ఉంటామన్నారు. రాష్ట్రంలో కీలకమైనస్థానాల్లో బిసిలు ఉంటే తమకు సమన్యాయం సాధించినట్లు అనుభూతి  మిగులుతుందన్నారు.

ఈగనై పోతానంటున్న కిషన్‌ రెడ్డి

  ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ వేసేంత వరకూ తాను ‘ఈగ’లా వెంటాడతానని బిజెపి రాష్ట్ర అథ్యక్షుడు కిషన్‌రెడ్డి సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని హెచ్చరించారు. అయితే ఆయన చేసిన ప్రకటన ఓ సినిమా పబ్లిసిటీ స్టంట్‌లో భాగంలా ఉందని అందరూ నవ్వుకున్నారు. ఇక నుంచి కిషన్‌రెడ్డిని ఈగ అని పిలవచ్చా అని ఆయన్ని సమావేశం ముగిసిన తరువాత ప్రశ్నించారు. రాజధానిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈగ సినిమా ఎంతలా హిట్‌ అయిందో అలానే ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ కూడా సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.     ఈయన వెంటబడతారు సరే! సిఎం ఇందిరమ్మబాటలో నిద్ర చేస్తున్న విషయం ఈ ఈగకు తెలుసా? మరి తెలిస్తే హైదరాబాద్‌లో ఈ ఈగ వాలిందేమిటీ? మరి సిఎం కంటిపై దాడి చేయాలి కదా! మరెందుకు సిఎంను నిద్రపోనిస్తున్నారు? అంటే ఈ ఈగ మాటలు చెప్పటమే కానీ, ఎవరినీ బాధించదేమో! ఒకవేళ బాధపెట్టినా తన పార్టీ వారికే కిషన్‌రెడ్డి ప్రాధాన్యత ఇస్తారని అనుకుంటున్నారు. ఇంతకీ ఈ ఈగకు ఎగరటం వచ్చా? లేదా? మరి ఎలా ఈ ఈగ తెరపై నటిస్తుంది? అదీ రాజకీయతెరపైన అనేది కిషన్‌రెడ్డే తేల్చాలి. అందరినీ నవ్వించటం కోసమేనా ఈయన ఈగ సినిమా గురించి ప్రస్తావించారని పలువురు కిషన్‌రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. శాసనసభ సమావేశాల్లో తాను ప్రతిపాదించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ గురించి  వారం రోజులు సమయం కూడా అవసరమని కిషన్‌రెడ్డి ప్రభుత్వానికి స్పష్టం చేశారు.

న్యూఢిల్లీ చెన్నైఎక్స్‌ప్రెస్‌లో ప్రమాదం,33 మంది మృతి

 సోమవారం తెల్లవారుజామున న్యూఢిల్లీ- చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. నెల్లూరు రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరిన కొద్ది సేపట్లోనే రైల్లోని ఎస్-11 బోగీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 33 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తున్నది. మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని కొంత వరకు మంటలను అదుపుచేశారు. బోగీలో అగ్నికి ఆహుతైన ప్రయాణికులను బయటికి తీశారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. గ్యాస్ కట్టర్ సహాయంతో మంటలు వ్యాపించిన బోగీని రైలు నుంచి వేరు చేశారు. ఈ రైలు ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న ఎస్పీ, జిల్లా కలెక్టర్ శ్రీధర్ ప్రమాద ఘటనా స్థలానికి చేరుకుని సహయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

ప్రత్యేక తెలంగాణా ఇక లేనట్లేనా ?

ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఇక లేనట్లే. దీనిపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కూడా ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పటి వరకూ ఓ నిర్ణయం తీసుకుని రాష్ట్రపతి ముందుంచుతామన్న కేంద్రం ఇక ఒకవైఖరి ప్రకటించేయాలని నిశ్చయించుకుంది. అందుకే ఆంధ్రప్రదేశ్‌ను భౌగోళికంగా విడదీయలేమని కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి నివేదించింది. నదులు, నీటి సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆ నివేదికలో స్పష్టం చేసింది. అంతేకాకుండా అతిచిన్నరాష్ట్రంగా తెలంగాణా ఏర్పడితే నిధుల కొరతే కాకుండా ఎన్నో కొత్తసమస్యలు తలెత్తుతాయని స్పష్టం చేసింది. ఈ ప్రత్యేకతెలంగాణా గురించి అథ్యనం చేసిన జస్టీస్‌ శ్రీకృష్ణ కమిటీ తన ఆరోసిఫార్సులో యథాతథస్థితి కొనసాగింపు అంశాన్నే హోంశాఖ బలపరిచింది. తెలంగాణా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఆర్థికభద్రత, సామాజికరక్షణ, చట్టపరమైన చర్యలు ద్వారా పరిష్కారం వెదకవచ్చని స్పష్టం చేసింది. మరో రెండేళ్లలో రాష్ట్రంలో తెలంగాణా అభివృద్థిపై ఒక స్పష్టతతో కూడిన చర్యలు తీసుకోవచ్చని అభిప్రాయపడిరది. ఈ నివేదికను ఆగస్టు 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లోపు బహిరంగపరచాలని కూడా హోంశాఖ భావిస్తోంది. అయితే నివేదిక ఇచ్చే అథికారం హోంశాఖకు లేదని, మొత్తం కేబినెట్‌ పరంగానే రాష్ట్రపతికి నివేదిక పంపాలని మాజీ ఎంపి, టిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు వినోద్‌ అంటున్నారు. ఇది రాజ్యాంగవిరుద్ధమని హోంశాఖ చర్యను ఆయన ఖండిరచారు. ఇప్పటికే తెలంగాణా జెఎసి ప్రత్యేకరాష్ట్రం కోరుతూ ఆందోళనలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. అయితే ఈ ఆందోళనకు వెళ్లేందుకు ప్రజలు సముఖత వ్యక్తం చేయటం లేదు. కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటుంది అనవసరంగా ఆందోళనలకు దిగొద్దని టిఆర్‌ఎస్‌ అథినేత కెసీఆర్‌ ఇచ్చిన పిలుపు తెలంగాణావాదులను వెనక్కి తగ్గేలా చేసింది. అందువల్ల టిజెఎసికి స్పందన కొంతమేరకు తగ్గింది. అయితే విద్యార్థులు మాత్రం మొదటి నుంచి యథాప్రకారం ఆందోళనలకు సిద్ధమవుతూనే ఉన్నారు. వారు ప్రస్తుతం టిఆర్‌ఎస్‌ పరిథిలో లేరు. ఎందుకంటే వారు మొదటి నుంచి ప్రతీఅంశాన్నీ నేరుగా పరిశీలించి ప్రత్యక్షచర్యలకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు కేంద్రహోంశాఖ నిర్ణయంపై కూడా వీరి నుంచి నిరసన వ్యక్తమయ్యే అవకాశాలున్నాయి. ఒకరకంగా టిఆర్‌ఎస్‌ అదుపుతప్పిందనటానికి విద్యార్థుల పోకడే నిదర్శనంగా తీసుకోవచ్చు. ప్రత్యేకతెలంగాణా ఉండబోదన్న నిర్ణయం జైఆంథ్రా ఉద్యమంలో పాల్గొన్న వృద్ధులూ జీర్ణించుకోలేకపోతున్నారు. వీరు కూడా ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ రెండిరటిని ప్రభుత్వం అదుపు చేయగలిగితే కేంద్రం నివేదిక రాష్ట్రపతికి చేరుతుంది. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రత్యేక తెలంగాణాకు వ్యతిరేకి అవటం వల్ల సమైక్య ఆంథ్రా వర్ధిల్లుతుంది. కేంద్రం నివేదిక పట్ల సమైక్యాంధ్ర  సులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారు రాష్ట్రపతిని తన వైఖరి మార్చుకోకుండా తెలుగుజాతిని కాపాడాలని కోరుతున్నారు.  

సమైక్యాంధ్రకోసం త్యాగానికి సిద్ధమంటున్న కాంగ్రెస్‌?

ఎన్నికల్లో గెలుపు ఒక్కటే ముఖ్యం కాదు. ఒక రాష్ట్రభవిష్యత్తు అనేదే కాంగ్రెస్‌కు ముఖ్యమని ఆ పార్టీ సీనియర్‌ నేతలు ప్రకటిస్తున్నారు. 2014ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఓటమి పాలైనా పర్వాలేదంటున్నారు వారు. సమైక్యాంథ్ర కోసం పోరాడిన నాటి నేతల స్ఫూర్తిని రాష్ట్రానికి మిగులుస్తామని త్వరలో కాంగ్రెస్‌ ప్రకటించబోతోంది. అంతేకాకుండా అవసరమైతే ఈ రాష్ట్రాన్ని త్యాగం చేస్తాం కానీ, వేర్పాటువాద ధోరణిని సహించబోమని కాంగ్రెస్‌ హెచ్చరించనుంది. ఒక్క విభజన సిద్ధాంతాలనే పునాదులపై పార్టీలు పుట్టుకొచ్చినా పర్వాలేదు కానీ, కాంగ్రెస్‌ అన్న పదానికి సరైన అర్థం వచ్చేలా ప్రవర్తిస్తామని ఆ పార్టీ పేర్కొంటోంది. అందుకోసం అథికారాన్ని త్యాగం చేయటానికైనా సిద్ధమేనని కాంగ్రెస్‌ కేంద్ర కమిటీ త్వరలో ప్రకటించనుంది.  ఇప్పటి వరకూ దేశంలో ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల పాలనపై సదభిప్రాయం ఉందని, దాన్ని కొనసాగేలా భవిష్యత్తులో నడుచుకుంటామని ఆ పార్టీ సీనియర్‌ నేతలు అంటున్నారు. ఎందరో స్వాతంత్య్ర ఉద్యమ సారధులు తమ పార్టీ ఏర్పాటుకు కీలకపాత్ర పోషించినందున ఆనాడు పాకిస్తాన్‌గా విభజించటానికే ఇష్టపడని ఆ నిర్ణయాన్నే ఆంధ్రప్రదేశ్‌ విషయంలోనూ అమలు చేస్తామంటున్నారు. ఒక ప్రాంత ప్రజల ఆశల కోసం ఇంకొకరిని బలిపెట్టబోమని కాంగ్రెస్‌ ఘాటుగా సమాధానం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ప్రత్యేకించి ఆగస్టు 8 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలకు ముందే ఈ విషయాన్ని యథాతథంగా ప్రకటిస్తామని సీనియర్‌ నేతలు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు.

ఇక సిఎం మార్పు లేనట్లేనా?

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని మార్చేస్తారని ఇప్పటి వరకూ వచ్చిన ఊహాగానాలకు తెరపడిరది. ఆయన స్థానంలో తెలంగాణా ప్రాంతానికి చెందిన సీనియర్‌నేతను సిఎంగా ప్రకటించి ఆ తరువాత సమైక్యాంధ్రగానే రాష్ట్రం కొనసాగిస్తారని కాంగ్రెస్‌ అధిష్టానంపై పలు ఊహాగానాలు వెలువడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రత్యేక తెలంగాణా ఇవ్వటం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో పలు భౌగోళిక, జల సమస్యలు ఉత్పన్నమవుతాయని, ఆంతర్‌రాష్ట్ర విబేధాలకు ఇది వేదికవుతుందని కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి నివేదించనుంది. ఈ నివేదిక మార్పులకు అవకాశం లేదని స్పష్టంగా ప్రకటించటంతో సిఎం మార్పు కూడా ఉండకపోవచ్చని రాజకీయపరిశీలకులు స్పష్టంగా చెబుతున్నారు.   ఒకవేళ సిఎంను మార్చి ఇంకొకరికి అధికారమిస్తే ఆయన తెలంగాణావాదానికి లొంగరన్న గ్యారెంటీ లేదు కాబట్టి ఆ నిర్ణయం కాంగ్రెస్‌ అధిష్టానం వెనక్కితీసుకుందంటున్నారు. ఇందిరమ్మబాట, మంత్రి ధర్మానప్రసాదరావు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు, తెలంగాణా సమస్య ఎదురైతే దానిపై స్పందించిన తీరు, పర్యటనలకు వెనుకాడని నైజం సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ప్లస్‌ అయ్యాయని వివరిస్తున్నారు. ప్రత్యేకించి ప్రజల్లో మమేకమయ్యేందుకు సిఎం చూపిస్తున్న చొరవను కాంగ్రెస్‌ అధిష్టానం ప్రతిపాదిక తీసుకుందని భావిస్తున్నారు. అంతేకాకుండా రాహుల్‌గాంధీ ప్రధాని అభ్యర్థి అయ్యేందుకు తన వంతు సహకారం అందిస్తామన్న సిఎం భరోసా కూడా సీటుమార్పు ఆలోచనను దెబ్బతీసిందని విశదీకరిస్తున్నారు.    

టిఆర్‌ఎస్‌ కు మంత్రిపదవుల ఎర?

కేంద్రక్యాబినెట్‌లో  రెండు మంత్రిపదవులు తెలంగాణా రాష్ట్ర సమితి(టిఆర్‌ఎస్‌)కు కేటాయించాలని సోనియా యోచిస్తున్నట్లు తెలిసింది. టి.ఆర్‌.ఎస్‌.ను బుట్టలో వేసుకునేందుకే ఇటువంటి ఆఫర్‌ ఆ పార్టీకి ఇస్తున్నట్లు తెలిసింది అయితే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఉండబోదని ప్రకటించేందుకు కేంద్రం సన్నద్ధమవటంతో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో చేరేందుకు సముఖత వ్యక్తం చేయకపోవచ్చని రాజకీయపరిశీలకులు తేల్చేస్తున్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం ముందుగా సమాచారాన్ని లీక్‌ చేసినా ఇంతవరకూ తన వైఖరిని ప్రకటించని టిఆర్‌ఎస్‌ ఇప్పుడు ప్రత్యేక తెలంగాణా లేదంటే ఊరుకోదని జగమెరిగిన సత్యం.     అసలు ప్రత్యేకతెలంగాణా అంశమే లేకుంటే టిఆర్‌ఎస్‌ లేదు. అందువల్ల పార్టీ దెబ్బతింటుందని ఆ పదవులను త్యాగం చేసేందుకు సిద్ధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ మీడియాకు  దూరంగా ఉంటున్న టిఆర్‌ఎస్‌ అధినేత కెసీఆర్‌ ఇక తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం త్వరలో తెలంగాణా ప్రకటించేస్తుందని ఆశలు పెట్టుకున్న ఆయన ఆందోళనలు సైతం చేయొద్దని ప్రకటించారు. కేంద్రం నిర్ణయం మారుతున్నందువల్ల అందువల్ల ఆయన తిరిగి ఉద్యమబాట పట్టే అవకాశం ఉంది. ఏదేమైనా కేంద్రహోంశాఖ రాష్ట్రపతికి ఇచ్చే నివేదిక టిఆర్‌ఎస్‌తో తెగతెంపుల దాకా రావచ్చనేది పరిశీలకుల అభిప్రాయం. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెరపైనే చూడాలి!

స్వచ్ఛందంగా తెల్లకార్డులు తిరిగి ఇచ్చేస్తారా?

 బోగస్‌ తెల్లకార్డులున్న వారందరూ స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చేయాలని రాష్ట్రపౌరసరఫరాలశాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు కోరారు. ఆగస్టు పదోతేదీలోపు ఈ కార్డులు అందజేయాలని ఆయన గడువు ఇచ్చారు. తెలిసో తెలియకో కార్డులుంటే అప్పజెప్పేయాలి అని మంత్రి పేర్కొనటాన్ని రాష్ట్రంలోని పలువురు ఎగతాళి చేస్తున్నారు. ఇదేమిటి అలా అడిగేస్తే ఇచ్చేస్తారా అని  ప్రశ్నిస్తున్నారు. కొందరు ధనవంతులు కూడా  వీఆర్వోలను మెప్పించి మరీ ఈ కార్డులను పొందారు. అలానే ఆరోగ్య అవసరాలు తీర్చుకునేందుకు ధనవంతులు ఎక్కువ మంది తెల్లకార్డులు పొందారు. రెవెన్యూ శాఖలోని సిబ్బందికి తెలియకుండా ఈ కార్డులు విడుదలవ్వలేదు కాబట్టి వారిని హెచ్చరిస్తే బాగుంటుంది కానీ, బోగస్‌కార్డుదారులనే స్వచ్ఛందంగా అప్పగించమనటం ఎంతవరకూ కరెక్టు అని ప్రశ్నిస్తున్నారు. అలాకార్డులు అప్పగించకుంటే తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. ఏ చర్య తీసుకోవటానికి అవకాశముందో ముందుగానే చూసుకుని చెప్పాల్సిన మంత్రి ఇలా కామన్‌గా ప్రకటిస్తే బోగస్‌కార్డుదారులు బయటపడతారా? అసలు లొసుగున్న రెవెన్యూశాఖను హెచ్చరిస్తే ఈ కార్డులు ఎక్కడ ఉన్నాయో వివరాలన్న దొరికేవి. ఇటీవల ప్రతీరేషను దుకాణంలోనూ తెల్లకార్డుదారుల ప్రూఫ్‌లు తీసుకున్నారు. అలా ప్రూఫ్‌లు సమర్పించకుండా కార్డులను కొనసాగించేవారిపై చర్య తీసుకుంటామని ప్రకటిస్తే బోగస్‌కార్డుల వివరాలు సేకరించటం ఏమంత కష్టం కాబోదు. ఈ విషయాన్ని మంత్రి గుర్తించి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. స్వచ్ఛందంగా కార్డులు సమర్పించకుంటే వాటిని రద్దు చేస్తామన్నా బాగుండేదని మంత్రికి పలువురు సూచిస్తున్నారు.

యురేనియం తవ్వకాలతో సాగర్‌కు ముప్పు ?

 నల్గొండ జిల్లా దేవరకొండలోని చందం పేట అడవుల్లో మళ్లీ యురేనియం కోసం తవ్వకాలను జరపటం స్థానికులను భయ బ్రాంతులను చేస్తుంది. ఇంతకు ముందు రెండేళ్లక్రితం గిరిజనుల ఉద్యమం చేపట్టడం ద్వారా కొంతకాలం తాత్కాలికంగా ఆపిన సంస్ధ మళ్లీ నమూనా సేకరణను యుసిఐఎల్‌ చేపట్టడం గిరిజనులను కలత పెట్టింస్తుంది. మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల్లో సాగర్‌రిజర్వాయరుకు సమీపంలో వేలాది ఎకరాల్లో యురేనియం నిల్వలున్నట్లు కనుగొన్నయసిఐఎల్‌ సంవత్సరం క్రితం మహబూబ్‌నగర్‌ జిల్లా తుమ్మలచెరువులో నమూనాలు సేకరించే ప్రయత్నం చేయగావారి బోరు యంత్రాలను స్ధానికులు అడ్డుకున్నారు. తాజాగా 15 రోజుల నుండి నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని చిత్రాలగుట్టపై క్యాంపు ఏర్పాటు చేశారు. ఇప్పుడు బోరు బావులనుండి శాంపుల్స్‌ సేకరించి పరిశోధన నిమిత్తం ముంబాయి పంపారని నిర్వాహకులు చెప్పారు. గతంలో ప్రజలు, పర్వావణ శాస్త్రవేత్తలు, స్వచ్చంద సంస్ధల ఆందోళనతో వెనక్కి తగ్గిన తవ్వకాలు మళ్లీ జోరందుకున్నాయి. పెద్దగట్టు ప్రాంతంలో యుసిఐఎల్‌ వారు వేసిన బోరునుండి నీటిని తాగిన మేకలు, బర్రెలు మృత్యువాల పడ్డాయి.సాగర్‌ నిర్వాసితుల పిఏ పల్లి , చందం పేటల వారు ఇక్కడ స్థిరపడ్డారు. ఇప్పుడు మళ్లీ  ఈ ప్రాంతంలోని తవ్వకాలు చేపట్టటంతో నిర్వాసితులకు నీడలేకుండా పోతుంది. 2007 సంవత్సరంలో తవ్వకాలకు నిరసనగా పర్యావరణ శాస్త్రజ్ఞులు, స్వచ్చంధ సంస్థలు చేపట్టిన పాదయాత్ర వల్ల సాగర్‌నీటిని కలుషితం కాకుండా, జీవనవైవిధ్యం దెబ్బతినకుండా చూశారు. వారు తమ సహాయాన్ని ఇప్పుడు కూడా ఇవ్వవలసిందిగా స్ధానికులు కోరుకుంటున్నారు. ఈ ప్రాంతం లో యురేనియం ఫ్యాక్టరీ నెలకొల్పితే ప్రజలకు హానిక కలుగుతుందని, అలాగే సాగర్‌జలలు కలుషితం అవుతాయని స్వచ్చంధ సంస్థలు చెబుతున్నాయి. గిరిజనులను ప్రతిచోటా ఇదే విధంగా దోచుకుంటున్నారని, అటవీ సంపద తరిగి పోతుందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉరకలు వేస్తున్న వరద గోదావరి

 నిన్న మొన్నటివరకు ఇసుక మేటలతో ఎడారిని సూచించిన గోదావరి, గత కొన్ని రోజులుగా ఎగువున కురుస్తున్న వర్షాలకుగాను వరదరూపంలో వచ్చిన నీటితో కనులపండుగగా మారింది. రైతుల కళ్లల్లో వెలుగులు నింపుతూ పొలాలన్నీ సస్యశ్యామలం చేస్తుంది. దీని వల్ల ఖరీఫ్‌ పంటకు దిగులు లేదని తెలుస్తుంది.రానున్న రెండు రోజుల్లో వరద ఉదృతి మరింత పెరిగే దిశలో ఉంది.  ఇప్పటికే పొంగి పొర్లుతున్న ఇంద్రావతి, శబరి, ప్రాణహితల వల్ల గట్లు తెగిపోకుండా ఉండేందుకు ఇరిగేషన్‌ అధికారులు  ఏటిగట్ల పటిష్టతపై దృష్టి సారించారు. రెండురోజుల నుండి  ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజి దగ్గర గేట్లన్నీ ఎత్తేశారు.  గోదావరి లో నీటి మట్టం పెరుగుతుండటం వల్ల డెల్టాకాల్వలకు 10,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని అధికారులు తెలిపారు. ఇంకా నదిలో వరద ప్రవాహం పెరుగుతుండటం వల్ల దాదాపు నాలుగు లక్షల క్యూసెక్కుల నీటిని బంగాళా ఖాతం లోకి వదిలామని తెలిపారు.

ఇందిరమ్మ బాటతో వోట్లు రాలవు

నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతూ పోవడం పట్ల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. సంపాదనకు, ఖర్చుకూ పొంతన కుదరని ఈ రోజుల్లో  ప్రభుత్వం ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించాడానికి సక్రమమైన చట్టం తేవాలని, ఆదాయాలతో నిమిత్తంలేకుండా ప్రజలందరికీ సార్వత్రిక పంపిణీ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే స్వామినాధన్‌ సిఫార్సులకు అనుగుణంగా రైతాంగానికి మద్దతుధర అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పట్టణాల్లో రోజుకు 32 రూపాయలు, పల్లెల్లో 28 రూపాయలు ఆదాయం పొందే వారిని పేదవారిగా పరిగణించకూడదంటూ ప్రణాళికా  సంఘం చెప్పడం హాస్వాస్పదం. కొన్ని చోట్ల రేషన్‌ షాపుల్లో ఒకటి రెండు రోజులు మాత్రమే పంపిణీ చేసి మిగతా రేషన్‌ అంతా నల్లబజారుకు తరలించడం వల్ల చాలా చోట్ల నిరుపేదలు కడుపునిండటం కష్టమవుతుంది. ఇప్పటికే భారత దేశంలో సమతుల్య ఆహారం కొరత వల్ల ఏటా ప్రజలు అనేక రోగాలు పడుతున్నారు. గ్రామీణ, మద్యతరగతి ప్రజల్లో రక్తహీనత వేథిస్తున్న సమయంలో రాష్ట్రంలో ఆహార భద్రత కోసం గట్టి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాపంపిణీ విధానాన్ని బలోపేతం చేసి పేద కుటుంబాలన్నిటికీ కార్డులు మంజూరు చేయాలి. పేదల బ్రతుకులు బాగు చేయకుండా  ఇందిరమ్మ బాటలు పట్టడం ద్వారా ప్రజలకు ఒరిగేది ఏమీ వుండదు. ఇటువంటి బాటలు వోట్లు రాల్చవని గతానుభవాలు చెబుతున్నాయి. కేవలం ఆడంబరాలకోసం ముఖ్యమంత్రి ఇలాంటి కార్యక్రమాలు జరుపుతుంటారని ప్రజలు  భావిస్తున్నారు. ఇప్పటికైనా పేద, మద్యతరగతి కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందేలా చేసి అర్హులైన వారికి తెల్ల కార్డులు మంజూరు చేసి ప్రభుత్వం తన చిత్తశుద్దిని రుజువు చేసుకోవాలి.

జగన్‌పై కేసులు త్వరలో కొట్టేస్తారా ?

జగన్‌ బెయిల్‌ పిటీషన్‌ సుప్రీంకోర్టునుండి విత్‌డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. కారణాలు ఏమైవుంటాయా అని రాష్ట్రరాజకీయ నాయకులంతా ఎంత ఆలోచించినా ఒక నిర్ణయానికి రాలేకపోయారు. వివారాలలోకి వెళితే వైసిపి పార్టీ తన బద్ద శత్రువైన కాంగ్రెస్‌ ప్రతిపాదించిన ప్రణబ్‌కు ఓటు వేయడం ద్వారానే రాష్ట్రంలో చాలా విమర్శల పాలయింది. విపక్షాలకు వైసిపి నేతలు  చాలా వివరణలు ఇచ్చుకోవలసి వచ్చింది.అధికార కాంగ్రెస్‌ పార్టీ  రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ వైసిపి కుట్రలపార్టీ అది ఖచ్చింతంగా మా ప్రత్యర్ధి పార్టీనే అని తేల్చిచెప్పడంతో తాత్కాలికంగా దాని విషయం అన్ని ప్రధాన పార్టీలు ప్రక్కన పెట్టాయి.   సుప్రీంకోర్టులో జగన్‌కు బెయిలు వచ్చే అవకాశం ఉందని స్వయానా విజయమ్మ చెప్పారు. ఒక వేళ అదే జరిగితే మళ్ళీ జగన్‌వర్గంపై కాంగ్రేసేతర పార్టీలు  దాడి చేసి  వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ  కాంగ్రెస్‌తో కుమ్మక్కయిందని  ఆరోపించే అవకాశం ఉంది.  ఇప్పుడు ఎందుకిదంతా , ఎలాగూ  జగన్‌ ఇ.డి. విచారణ నుండి తప్పించుకోలేకపోయారు. ఇక నిండా మునిగిన వాడికి చలి ఎందుకనుకున్నారో  ఏమో ఇడి విచారణ కూడా ముగిశాక కడిగిన ముత్యంలా బైట పడాలనే  ఉద్ధేశంతో బెయిలు పిటీషన్‌ వెనుకకు తీసుకున్నారని తెలిసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కళంకిత మంత్రులకు  న్యాయ సహాయం అందిస్తూ మంత్రులకు అక్రమాస్తులతో సంబంధం లేదని కోర్టుకు సంకేతాలు పంపింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఆత్మరక్షణా చర్యలు జగన్‌కు కలసి వచ్చేలా చేశాయి. ఎలాగూ కొట్టేసే కేసుకు  బెయిలును కాస్త ముందు తీసుకొని ప్రతిపక్షాలకు పని కల్పించడం కన్నా తనను తాను నిరూపించుకొని  బయటపడటం కరెక్టుగా భావించారు.  అదే సమయంలో ఏ ఒక్క ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాధారాలను  సిబిఐకి  లభించ లేదు  కనుక కోర్టు తనను  నిరపరాధిగా విడుదల చేయగలదు. ఈ సమయంలో బెయిలు పిటీషన్‌ పెట్టుకొని బయటకు వచ్చి విమర్శల పాలవడం కన్నా అన్ని విచారణలు అయిపోయాక నిర్దోషిగా  బయటకు రావడమే మిన్నగా అలోచించి నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.

తెలుగువారికి కీలక పదవులు ఇవ్వరా?

మన రాష్ట్రం 33 మంది ఎంపీలను పంపి యపిఎ గవర్నమెంటును నిలపటంతో ప్రముఖ పాత్ర పోషించింది. కాని మంత్రుల విషయంలో మాత్రం వచ్చింది చాలా తక్కువ. తమళనాడు, వెస్ట్‌ బెంగాల్‌, యుపి, మహరాష్ట్ర ఇలా ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా వాళ్లంతా మన కంటె చాలా తక్కువ ఎంపిలనిచ్చి కీలకమైన  పదవులు సంపాదించుకున్నారని తెలుస్తుంది.. ఇంతమంది ఎంపీలను పంపిన మన రాష్ట్రానికి మాత్రం ఉన్నది ఒకే ఒక  క్యాబినెట్‌ మంత్రి మంత్రి, మరో ఐదుగురు సహాయ మంత్రులతోనే సరి పెట్టుకోవాల్సి వచ్చింది. ప్రతి సారీ క్యాబినెట్‌ విస్తరణ విన్నప్పుడు మన రాష్ట్రనాయకులంతా ఢల్లీలో చెక్కర్లు కొట్టటం మామూలైపోయింది.ప్రస్తుతం మన రాష్ట్రంనుండి ప్రాతినిద్యం వహిస్తున్న మంత్రులంతా రెడ్డి, కాపు, కమ్మ, ఎస్‌.సి, ఎస్‌టి కి సంబందితులు. కాబట్టి ప్రత్యర్ధివర్గమైన తెలుగుదేశం రాబోయేరోజుల్లో బిసిలకు వంద సీట్లు కెటాయింపు జరుగుతుందని ప్రచారం చేస్తున్న నేపధ్యంలో కాంగ్రెస్‌లోకూడా బిసిలకు ప్రాతినిద్యానికి గాను ఒక మంత్రి పదవి ఇవ్వడం అవసరమని రాష్ట్ర కాంగ్రెస్‌ భావిస్తుంది. కాపు వర్గానికి చెందిన చిరంజీవికి మంత్రి పదవి ఇవ్వడం ఖాయమని తేలింది . అయితే  సీనియర్‌ తెలంగాణ నాయకుడు విహనుమంత్‌రావుకు మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని టి.కాంగ్రెస్‌ నేతలు కోరుకుంటున్నారు. హనుమంతరావు అయితేనే రాష్ట్రంలో వైసిపి నాయకుడు జగన్‌ని కూడా సమర్ధవంతంగా ఎదుర్కో గలరని  వారు అనుకుంటున్నారు.   అయితే ఇప్పటికే డిల్లీలో మాజీ పిసిసి అద్యక్షుడు డి.శ్రీనివాస్‌, తెలంగాణాకే చెందిన మరి కొంత మంది నాయకులు ఉన్నారు. అంతే కాకుండా సీమాంద్రకు చెందిన కావూరి, రాయపాటికూడా డిల్లీలోనే పైరవీలు జరుపుతున్నారు. రాష్ట్రంలో కేంద్రాన్ని డిమాండ్‌ చేసి పదవులు తెచ్చుకోగలిగిన నేతలు లేనందువల్లే తెలుగువారికి డిల్లీలో సముచిత స్ధానం లభించడంలేదనేది అందరి అభిప్రాయం.

తెలంగాణా కాంగ్రెస్‌లో తీవ్ర అసంతృప్తి

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణా జిలల్లాల్లో ఇప్పటికే సమస్యల్లో పడిరది. దీనికి తోడు నామినేటెడ్‌ పదవల పంపకంపై ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.  ఎప్పడూ పార్టీ ఆఫీసుల్లో చూడని వారిని జండాలు మోయని వారిని నామినేటెడ్‌ పోస్టుల్లో వేస్తున్నారని  కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నాయకులకు బందువులుగా ఉన్నవారిని, డబ్బున్న వారినే నాయకులు సిఫార్సులు చేస్తున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌ అధికారం లోకి వచ్చి మూడేళ్లు దాటుతున్నా ఇంకా నామినేటేడ్‌ పోస్టులను భర్తీ చేయకపోవడం పై వారు అసహనంగా ఉన్నారు. తెలంగాణలోని ఐదు జిల్లాల్లో గత  అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మెజార్టీ స్ధానాలు పొందింది. దీని వెనుక కార్యకర్తల కృషి ఎన్నతగినది. అయినా పదవులకు మాత్రం వారు దూరంగానే ఉండాల్సి వస్తుంది.   గత ఎన్నికల్లో పరాజయంపాలైన రేణుకా చౌదరి తన వారికి పదవుల పట్టం కట్టటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదేకోవలో తెలంగాణలోని సీనియర్‌ నేత రాంరెడ్డి వెంకటరెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ మల్లు భట్టివిక్రమార్కకూడా ఉన్నారు. ఈ పరిణామంతో పార్టీకింది స్థాయినుంచి బలహీనపడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మార్కెట్‌ కమిటి చైర్మన్‌, ఎపిఐడిసి, ఎపిఐఐసి, మైనింగ్‌ కార్పోరేషన్‌, సివిల్‌సప్లై కార్పొరేషన్‌, యస్‌ సి కార్పొరేషన్‌ లాంటి పదవులు, దేవాదాయ కమిటీ చైర్మన్‌లు, గ్రంధాలయ సంస్దల చైర్మన్‌లు కాళీగా ఉన్నాయి. నామినేటెడ్‌ పదవుల భర్త్తీ అయితేనే కాంగ్రెస్‌ కార్యకర్తల్లో ఉత్సాహం నిండుతుందని రాష్ట్రనాయకులు ఆలోచిస్తుండగా, కార్యకర్తలు తమను కాకుండా జిల్లానాయకులు వారి బందువులనే నామినేట్‌ చేస్తున్నారని ఆరోపించడం కొసమెరుపు.

విజయమ్మ బైబిల్‌ పై రాద్ధాంతం అవసరమా ?

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మీ ఈ మద్య ఎక్కడికి వెళ్లినా బైబిలుతో వెళ్లటం చర్చనీయాంశమైంది. మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎవరు ఏ మతానైనా అనుసరించే వెసులుబాటు వుంది. అయినా ఈ దేశంలో పుట్టుకలో వచ్చే కులం మాత్రమే చచ్చే వరకు మారదు, కాని మతాలు మాత్రం మన ఇష్టం ఉన్నప్పుడు మారే అవకాశం మన రాజ్యాంగం కల్పించింది. మహాత్మాగాందీ ఎప్పుడూ గీతతో దర్శనమిచ్చేవారు. ఇప్పటికీ చాలామంది కాశీతాడునో లేదా సాయిబాబా తాడులనో చేతులకు కట్టుకుంటారు. లేదంటే ఆంజనేయ బిళ్లలు మెడలో వేసుకుంటారు. అది వాళ్ల మానసిక స్థితికి అద్దంపడుతుంది. అంతా మంచి జరుగుతుందని, లేదంటే భయపడకుండా వుండటానికి ఇలా చాలా కారణాలు ఉండవచ్చు.   వైసిపి గౌరవాద్యక్షురాలు బైబులు పట్టుకొని కనపబడటం వెనుక కారణాలను చూద్దాం. ఆమె నిన్నటివరకు సాదా సీదా మహిళ కచ్చింతంగా చెప్పాలంటే ఎన్నడూ గుమ్మందాటి ఎరుగని మామూలు మహిళ. అనుకోని పరిస్థితుల్లో రాజకీయల్లోకి రావడం, ప్రచారం చేయాల్సిరావడం వెంటవెంటనే జరిగిపోయాయి. దాంతో పరిస్థితులను వెంటవెంటనే ఆకళింపు చేసుకొని సందర్బాను సారంగా అనుసరించే పద్దతులకు ఇంకా ఆమె అలవాటు పడలేకే ఆత్మ స్ధయిర్యం కోసం బైబిలును వెంటబెట్టుకుని తిరుగుతున్నారనిపిస్తుంది. దీని వెనుక ఆమె అత్తగారు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి తల్లిగారైన జయమ్మగారి ప్రభావం కూడా ఉండి వుంటుంది. ఆమె తన కొడుకును ముఖ్యమంత్రిగా చూడటానికి ఏళ్ల తరబడి ప్రార్ధనలు చేసారని చెబుతారు. ఆఖరికి ఆమె తన కొడుకు ముఖ్యమంత్రి అయిన తరువాతే పరమపదించారు. అకాలమరణంతో భర్తని పోగొట్టుకోవడంతో పాటు  కొడుకు జైలుపాలవ్వడంతో ఆమె బైబిల్‌లో ప్రశాంతత వెతుకుంటున్నారనే అనుకోవాలి. అనేక గందరగోళ పరిస్థితుల్లో తెలంగాణలోని సిరిసిల్ల పర్యటన జరపవలసి వచ్చినప్పుడు కూడా అదే తోడుగా ధైర్యాన్ని పొందారనుకుందాం. మీడియాలోని కొన్ని వర్గాలు అమె బైబిల్‌ పై కూడా చర్చలు జరిపి, రాద్దాంతాలు చేయడం ఎంతవరకూ సమంజసమన్న విమర్శలు వస్తున్నాయి.