వైకాపా అంటే తెరాసకు భయమా?
posted on Jul 23, 2012 @ 10:49AM
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణా రాష్ట్ర సమితి(తెరాస) భయపడుతోంది. అసలు తెలంగాణా ప్రాంతంలోనూ సమైక్యవాదాన్ని వినిపించి 2012 పరకాల ఉపఎన్నికల్లో దాదాపుగా విజయవంతమైన వైకాపా గురించి తక్కువ అంచనా వేయలేని స్థితిలో తెరాస ఉంది. చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టాలన్న చందాన్న తెరాస నిరసనకార్యక్రమాల ద్వారా వైకాపాపై తెలంగాణా ప్రాంతంలో వ్యతిరేకత పెంచేందుకు కృషి చేస్తోంది. ఎంత కృషి చేసినా పరకాల ఉపఎన్నికల్లో మెజార్టీ కేవలం 1500ఓట్లు వచ్చాయన్న విషయాన్ని తెరాస జీర్ణించుకోలేకపోతోంది. వైకాపా అన్న పేరు వినగానే తెరాస నాయకులు ఉలిక్కిపడుతున్నారు.
వైకాపా అథినేత జగన్మోహనరెడ్డి చంచల్‌గూడా జైలులో ఉన్నప్పుడే రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే వైకాపా తరుచుగా ఆందోళనలు, కార్యక్రమాలు కొనసాగిస్తే తమ ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర డిమాండు దెబ్బతింటుందని తెరాస అభిప్రాయపడుతోంది. తెలంగాణా ప్రాంతంలో నిరసనకార్యక్రమాలకు భారీస్పందన ఉంటుందనే సూత్రాన్ని నమ్మిన తెరాస, వైకాపా రెండూ కూడా తమ బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో చేనేతకార్మికుల సంఖ్య ఎక్కువ. వీరు ప్రస్తుతం దయనీయ స్థితిలో ఉన్నారన్న విషయం తెలుసుకునే వైకాపా అక్కడ తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నిరసనకార్యక్రమాలు నిర్వహించటం ద్వారా బలాన్ని పెంచుకోవచ్చని భావిస్తోంది. ఉప ఎన్నికల ఫలితాలు ఇప్పటికే చేనేత కార్మికులను ఆకట్టుకున్నాయి. అందుకే కొందరు పార్టీ సభ్యత్వాన్నీ కోరారన్న సంగతీ వైకాపా నేతలు విజయమ్మ ముందుంచారు. దీంతో అటు నిరసనకార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మంచి ఉద్యమం అన్న ఖ్యాతి, పార్టీ బలోపేతం జరుగుతాయని విజయమ్మ భావిస్తున్నారు. ఆమె రాకుండానే అడ్డుకోవాలని, ఒకవేళ నిరసనకార్యక్రమం ప్రారంభించాకనైనా ఆమెను నిలువరించాలని తెరాస భావిస్తోంది.
ఎందుకంటే తమ కార్యకర్తల బలాన్ని ఆమె లాగేసుకుంటారన్న భయం తెరాసను వెంటాడుతోంది. అందుకే ముందస్తుగా కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో మహిళాకార్యకర్తలు తెరాస తరుపున భారీర్యాలీలు నిర్వహించారు. నల్గొండలోని క్లాక్‌టవర్ వద్ద విజయమ్మ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. అయినా విజయమ్మ కార్యక్రమం ఆగకుండా బహిరంగంగా అడ్డుకుంటామన్న తెరాస నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టులు అన్యాయమని మాజీ ఎంపి వినోద్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా తమ నిరసన కార్యక్రమాలు కొనసాగించుకునే హక్కుంటుందని, విజయమ్మ కార్యక్రమాన్ని అడ్డుకోవటం కన్నా ఆమెనే కొన్ని ప్రశ్నల ద్వారా నిలదీయటం తప్పులేదని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ తరుపున ప్రజాస్వామ్యయుతంగా శాంతిపద్దతుల్లో ఆమెను ప్రశ్నించాలని కార్యకర్తలకు ఆయన పిలుపు ఇచ్చారు.
విజయమ్మ చేపడుతున్న చేనేత దీక్షను విజయవంతం చేస్తే ఇప్పటి నుంచి 2014 ఎన్నికలకు కావాల్సిన బలాన్ని పుంజుకోవచ్చని పరకాల వైకాపా నాయకులు కొండా సురేఖ, ఇతర నాయకులు భావిస్తున్నారు. వీరి అభిప్రాయానికి తగ్గట్లు కాంగ్రెస్‌విప్ జగ్గారెడ్డి మాట్లాడుతూ తెలంగాణాలో విజయమ్మ కాలుమోపటానికి తెరాస అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించారు. ఇతర పార్టీలు వస్తే తమను మర్చిపోతారన్న భయంతోనే తెరాస, జెఎసి విజయమ్మ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఏమైనా అన్ని పార్టీలూ కూడా తెరాసకు విజయమ్మ రాక భయం పుట్టిస్తోందన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఉద్రిక్తవాతావరణాన్ని తీసుకువచ్చి అయినా వైకాపా నేతలను తెలంగాణాలో కాలు మోపకుండా చూడాలని తెరాస పన్నాగాలు బయటపడ్డాయి.