చినుకుకే వణుకుతున్న నగరం!
posted on Jul 23, 2012 9:17AM
హైదరాబాద్‌లో ఒక గంట వర్షం పడినా దాని ప్రభావం ప్రజల మీద, ట్రాఫిక్ మీద వుంటుందనటంలో సందేహం లేదు.రోడ్లన్నీ జల మయం అయి మురుగు కాలువలను తలపింప చేస్తాయి. అలాంటిది గత రెండు రోజులనుండి ఎడతెరిపి లేకుండా పడిన వర్షాలకు 9మంది చనిపోగా లోతట్ టుప్రాంతాలన్నీ మునిగి ఇళ్ళలోకి నీరు ప్రవేశించి బాధితులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. 60 ఏళ్ళ క్రింద వుండే హైదరాబాదుకి ఈ దుస్థితి లేదు. వర్షపునీరంతా పోవడానికి సరిపడే డ్రైనేజి వ్యవస్థ వుంది. హైదరాబాద్ జనాభా అప్పుడు కేవలం లక్షమాత్రమే. మరో విషయం ఏమంటే మనం ఇప్పటికీ ఉపయోగిస్తున్న డ్రైనేజి, వాటర్ పైపు లైన్లు అప్పటివే. ఇప్పటికీ వీటిని ఉపయోగించటం వల్ల తుప్పుపట్టిన డ్రైనేజి, వాటర్‌పైపు లైన్లు సమాంతరంగా ఉండటం వల్ల ఒక దానిలో నీరు మరో దానిలోకి ప్రవేశిస్తుంది. వీటిని నివారించడానికి గ్రెటరు హైదరాబాదు పాలకులు వాటరు పైపులనుండి నీటిని 24 గంటలూ పంపవలసి ఉంది. అప్పుడు మాత్రమే డ్రైనేజి నీరు నీటి గొట్టాలలోకి ప్రవేశించకుండా ఉంటుంది. నీటి గొట్టాలు ఖాళీగా వుంటే వాటిలోకి డ్రైనేజి నీరు వెళుతుంది.
నిజాం నవాబు కాలంలో పట్టణం పద్దతి ప్రకారం నిర్మించడం జరిగింది. దక్షిణ హైదరాబాదులోని వర్షపు నీరు ఓల్డుసిటి మీదుగా మూసీ నదిలోకి ప్రవేశించేటట్లు, ఉత్తర హైదరాబాద్ లోని వర్షపునీరు మంజీరా మీదుగా కృష్ణా నదిలోకి కలిసే ఏర్పాట్లు చేశారు. నగరంలోని చెరువులన్నీ రాజకీయనాయకు ల ద్వారా రియల్‌ఎస్టేట్ చేతుల్లోకి వెళ్ళటం, ఆక్రమణలకు గురవడంతో ప్రస్తుత పరిస్థితి నెలకొందని తెలుస్తుంది. దీనికి గాను పక్కా ప్రణాళికను అమలు చేయవలసిన అవసరం ఉందని స్వంచ్చంధ సంస్థలు కోరుతున్నాయి. ఇంతే కాకుండా ప్రతి సంవత్సరం ఎండా కాలంలో డ్రైనేజీని తరలించవలసి ఉండగా ఏమాత్రం అధికారులు పట్టించుకోవడం జరగడం లేదు. ప్రతి కార్పొరేటర్‌కు సంవత్సరానికి కోటి రూపాయలు ఇస్తుంటే గుడుల నిర్మాణాలకు, శ్మశానాలకు మాత్రమే ఖర్చుపెట్టి రోడ్లను మురుగు కాలువలుగా తయారు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.
మంచినీటి సరఫరాకు 1200 కోట్లు, డ్రైనేజీకి గాను 80 కోట్లు కావల్సి ఉండగా ప్రభుత్వం వాటిమీద శ్రద్దచూపక పోవడం కూడా ఒక కారణం. మున్సిపాలిటీ మంత్రి మహిధర్‌రెడ్డి దీనికి ఏ మాత్రం శ్రద్ద చూపకపోవడం కూడా కారణంగా చెప్పుకోవచ్చు. నగరాన్ని సుందరీకరణ పేరుతో ఖర్చుపెట్టేదానికన్నా ఇది చాలా తక్కువ అని కూడా మర్చిపోకూడదు. ఇదే మంత్రి జాతీయ విపత్తు సంఘంలో కూడా ఉన్నందున హైదరాబాద్ నగరానికి వర్షం పడినప్పుడల్లా నరకాన్ని చవి చూస్తున్న ప్రజలకు సరైన రోడ్లు, డ్రైనేజి అందించటం పెద్ద సమస్య కాదు. అయితే రాజకీయ అలసత్యం, అధికారగణంలోని ధన దాహం హైదరాబాద్‌నగర వాసులకు శాపంగా పరిణమించింది. వరల్డ్‌క్లాస్ నగరం, నాలెడ్జిసిటీ, క్లీన్ అండ్ గ్రీన్ సిటీ అని చెప్పుకుంటూ సెప్టెంబరులో జరిగే ఇంటర్నేషనల్ కార్యక్రమానికి పైపై మెరుగులు దిద్దటానికి 500 కోట్లు విడుదల చేశారు. అంతేకాకుండా సిటీ లుక్ మారుస్తామని ప్లైఓవర్లు, మెట్రోరైలు నిర్మాణాల చేపడుతున్నారు. వీటన్నిటికంటే కూడా ముందు మురుగునీరు రోడ్లపైకి రాకుండా చూడటం ప్రజలకు త్రాగునీరు అందించటంలో అలసత్వాన్ని ప్రదర్శించరాదని నగర పౌరులు కోరుతున్నారు.