చారిత్రక స్థలాలపై ప్రభుత్వానికే అవగాహన లేదా?
posted on Jul 24, 2012 @ 3:59PM
ఐక్యరాజ్యసమితికి పంపిన నివేదికను పరిశీలిస్తే పర్యాటక స్థలాలపై రాష్ట్రప్రభుత్వానికే అవగాహన లేనట్లు కనపడుతోంది. ఒక్క కుతుబ్‌షాహీ సమాథి, గోల్కొండకోట, చార్మినార్ మినహా ఇంకేమీ చారిత్రక స్థలాలుగా ప్రభుత్వకంటికి కనిపించలేదు. ఆ మూడిరటిని యునెస్కో చారిత్రకస్థలాల జాబితాలో ప్రపంచచారిత్రకస్థలాలుగా గుర్తించాలని కోరింది. వాస్తవానికి ఆదుర్రు బౌద్ద క్షేత్రం, నాగార్జునకొండ, చంద్రగిరికోట, కె.డి.పేట, కర్నూలు కొండారెడ్డి బురుజు, ఖమ్మం ఖిల్లా, వరంగల్ వేయిస్తంభాలగుడి వంటి పలు పర్యాటకస్థలాలు చారిత్రక ఆనవాళ్లుగా మిగిలాయి. వీటిని చూడటానికి కూడా పర్యాటకులు ఇష్టపడతారు. ప్రత్యేకించి ఆదుర్రు, నాగార్జునకొండ బౌద్ధం ఆవిర్భవించటానికి కారణమైన స్థలాలు అని, మంగళగిరిలో కూడా బౌద్ధం ఆనవాళ్లు మిగిలి ఉన్నాయని పరిశోథకులు తేల్చారు. కొన్ని వందల ఏళ్ల చరిత్ర వీటికి ఉన్నాయి.
అలానే చంద్రగిరికోట విషయానికి వస్తే విజయనగర సామ్రాజ్యాథిపతి శ్రీకృష్ణదేవరాయలు తన రాణులతో ఇక్కడే సేదతీరేవారని చరిత్ర చాటుతోంది. ఆయన వాడిన 160కేజీల కత్తి, ఆభరణాలు కూడా అక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఒకే వేటుకు ఏనుగును సంహరించే ఆ కత్తి ప్రపంచవ్యాప్తంగా వింతే. అప్పటి ఉరికంబం, కొండల్లో నుంచి వచ్చే నీరు ఇప్పటికీ పలువురిని ఆశ్చర్యపరుస్తుంది. ఇక వరంగల్‌వేయిస్తంభాల గుడి చూసేందుకు పర్యాటకులు భారీసంఖ్యలో వస్తుంటారు. అరుదైన ఏకశిలలు ఇక్కడ ఉన్నాయి. ఏకశిలపై శివలింగం మలిచిన చరిత్ర ఈ వేయిస్తంభాల గుడి సొంతం. అలానే కర్నూలు కొండారెడ్డిబురుజు అసలు కట్టడమే చారిత్రక పటుత్వానికి నిదర్శనం.ఇటువంటి అనేక ప్రాచీన చారిత్రాత్మక ప్రాంతాలు రాష్ట్రంలో ఉంటే ఆంథ్రప్రదేశ్ ప్రభుత్వం వాటిని విస్మరించటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతేకాకుండా ఎక్కువ చారిత్రకస్థలాలున్న రాష్ట్రంగా గుర్తింపునందుకుంటే పర్యాటకుల వరద ఖాయం. అసలు జాబితానే తయారు చేయటంలో మందకొడి విధానం అవలంబిస్తే ఆంథ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగినట్లే అని పర్యాటకప్రేమికులు ప్రభుత్వపోకడపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.