చెక్‌పోస్టుల అవినీతికి చెక్‌పెట్టేదెప్పుడో?
posted on Jul 21, 2012 @ 11:44AM
రాష్ట్రంలోని పలు ఆర్‌టిఎ చెక్‌పోస్టులు అవినీతికి అడ్డాలుగా మారుతున్నాయి. దీనిపై ఎన్ని ఆరోపణలున్నా పూర్తిస్థాయిలో వీటిని సరిదిద్దలేకపోతున్నారు. కారణాలు పరిశీలిస్తే ఆర్‌టిఎ కార్యాలయాల్లో ప్రతీ ధరఖాస్తు కూడా ఆన్‌లైన్‌లో చేస్తున్నందున వచ్చే మామూళ్లు తగ్గిపోవటంతో చెక్‌పోస్టుల ఆదాయంపైనే సిబ్బంది దృష్టిసారిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ చెక్‌పోస్టులను పరిశీలించి మామూళ్లు వసూలు చేసుకునేందుకు ఆర్‌టిఎ కార్యాలయం నుంచి తరుచుగా రాకపోకలుంటున్నాయి. ఏమైనా ఇబ్బంది ఉంటే చెక్‌పోస్టులో ఉన్న సిబ్బందిని కార్యాలయానికి మార్చేస్తామని పరిశీలనకు వచ్చే వారు బెదిరిస్తుండటంతో ఆర్‌టిఎచెక్‌పోస్టు సిబ్బంది ఒక్క వాహానాన్ని కూడా తనిఖీ చేయకుండా వదలటం లేదు.
మామూళ్లు కోసం రికార్డుల్లో గట్టిగా తప్పులు వెదుకుతున్నారు. కలెక్షన్ పెంచుకోకపోతే ఆర్‌టిఎ అధికారులను సంతృప్తిపరచలేమని చెక్‌పోస్టు సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి అభిప్రాయంతోనే ఉన్న చిత్తూరు జిల్లా ఆర్‌టిఎ చెక్‌పోస్టులో సిబ్బంది అవినీతి సొమ్ముతో ఎసిబికి దొరికిపోయారు. సుమారు లక్షా 35వేల రూపాయలతో వీరు పట్టుబడ్డారు. ఇద్దరు ఎఎంఐలు, ఇద్దరు కానిస్టేబుల్స్, నలుగురు ఏజెంట్లు ఎసిబి దాడిలో దొరికిపోయారు. వీరిని అదుపులోకి తీసుకుని ఎసిబి కేసు పెట్టింది. ఇదే విధంగా తూర్పుగోదావరి జిల్లాలోని పలుచెక్‌పోస్టులు రోజుకు మూడు లక్షల రూపాయలు తక్కువ కాకుండా ఆర్జిస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఒకసారి చెక్‌పోస్టులో ఐదులక్షల రూపాయలు ఎసిబి అధికారులకు దొరికాయి. ఎసిబి అన్ని జిల్లాల్లోనూ ఈ తరహాదాడులు చేస్తే బాగుంటుందని సూచనలు వస్తున్నాయి.