దేశానికి 14వ రాష్ట్రపతి ఎన్నిక నేడే
దేశానికి 14వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు బ్యాలెట్ పోరు మరికొన్ని గంటల్లో జరగనుంది. యూపీఏ అభ్యర్థి, అపార అనుభవజ్ఞుడు ప్రణబ్‌కుమార్ ముఖర్జీ ఒకవైపు.. లోక్‌సభకు స్పీకర్‌గా వ్యవహరించి, ఈశాన్య రాష్ట్రాలలో తిరుగులేని గిరిజన నాయకుడిగా పేరొందిన పూర్ణో అహితో సంగ్మా మరోవైపు ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు.
దేశవ్యాప్తంగా 4,896 మంది ప్రజాప్రతినిధులు.. వీరిలో 776 మంది ఎంపీలు, 4,120 మంది ఎమ్మెల్యేలు తమ ఓట్లతో దేశ ప్రథమపౌరుడిని ఎన్నుకుంటారు. పార్లమెంటులోని రూంనెం. 63లోను, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలలోను పోలింగ్ గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అక్రమాస్తుల కేసులో అరెస్టయ్యి జైల్లో ఉన్న వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహనరెడ్డి, 2జీ స్కాంలో బెయిల్ మీద బయటకు వచ్చిన డీఎంకే నేతలు ఎ.రాజా, కనిమొళి సహా.. అందరూ ఓట్లు వేయనున్నారు. వీరందరి ఓట్ల విలువ కలిపి 10.98 లక్షలు. ఇందులో విజేత కావాలంటే కనీసం 5,49,442 ఓట్ల విలువ అవసరం అవుతుంది.
అయితే, టీడీపీ లాంటి కొన్ని పార్టీలు ఈ ఎన్నికను బహిష్కరిస్తుండటంతో మొత్తం ఓట్ల విలువ, విజేతకు అవసరమైన ఓట్ల విలువ కూడా కొంతమేర తగ్గుతాయి. ఇప్పటికే సుమారు 7.5 లక్షల ఓట్ల విలువ ఉన్న ప్రణబ్‌ముఖర్జీ సునాయాసంగా గెలుస్తారని అంతా భావిస్తున్నారు. గురువారం పోలయ్యే ఓట్లను ఆదివారం లెక్కిస్తారు. అదేరోజు సాయంత్రానికి ఫలితం వెలువడే అవకాశం కనిపిస్తోంది. యూపీఏ భాగస్వామ్య పక్షాలన్నింటితో పాటు సమాజ్‌వాదీ, బీఎస్పీ, ఆర్జేడీ, జేడీ(ఎస్), ఎన్డీయే పక్షాలైన జేడీ(యూ), శివసేన.. ఇంకా సీపీఎం, ఫార్వర్డ్‌బ్లాక్ కూడా ప్రణబ్‌కు మద్దతు ప్రకటించాయి. లోక్‌సభ మాజీ స్పీకర్ అయిన సంగ్మా తొలుత బీజేడీ, అన్నా డీఎంకే మద్దతుతో, గిరిజన కార్డుతో బరిలోకి దిగారు. తర్వాత బీజేపీ, అకాలీదళ్ కూడా ఆయనకు మద్దతు ప్రకటించాయి.
కాగా.. తృణమూల్ కాంగ్రెస్ తనకు మద్దతు ఇవ్వకపోవడం శరాఘాతమేనని సంగ్మా అంగీకరించారు. అయితే ఇప్పటికీ ఆయన 'ఆత్మప్రబోధ ఓటు'పైనే ఆశలు పెట్టుకున్నారు. ఏదో అద్భుతం జరుగుతుందని, తాను రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. ప్రణబ్ ముఖర్జీ తన ప్రచారాన్ని తమిళనాడుతో మొదలుపెట్టగా, సంగ్మా తన ప్రచారాన్ని తమిళనాడులో ముగించారు. కాగా పార్టీలు రాష్ట్రపతి ఎన్నికల్లో అన్ని పార్టీలూ పాల్గొనాలని కాంగ్రెస్ రాష్ట్ర ఎంపీల ఫోరం కన్వీనర్ పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనకుంటే అది ప్రజాస్వామ్యాన్ని అవమానించినట్లేనని ఆయన అన్నారు.