రికార్డ్ సృష్టించిన అన్సారీ ఎన్నిక
సర్వేపల్లి రాధాకృష్ణన్ రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతిగా పదవిలో కొనసాగారు. ఇన్ని సంవత్సరాల తరువాత హమీద్ అన్సారీ వరుసగా రెండు సార్లు ఉపరాష్ట్రపతి పదవిని దక్కించుకుని రికార్డ్ సృష్టించారు. హమీద్ అన్సారీ కోలకతాలో 1937వ సంవత్సరం ఏప్రిల్ 1న జన్మించారు. వర్షాకాల సమావేశాలు బుధవారం నుండి ప్రారంభం కానుండగా మంగళవారం ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. ప్రధాని మన్మోహన్, యోపేఎ చైర్ పర్సన్ సోనియా, రాహుల్ గాంధీ, యోపేఎ భాగస్వామ్య ఎంపీలు, ప్రతిపక్ష బీజేపీ పార్టీ అగ్రనేత అద్వానీ, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, ఎస్పీ అధినేత ములాయం సింగ్, బిఎస్పీ అధ్యక్షురాలు మాయావతి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజ్యసభకు కొత్తగా ఎంపికైన బాలీవుడ్ నటి రేఖ, క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
లోక్ సభ, రాజ్యసభలతో కలిపి మొత్తం 787 ఓట్లు ఉండగా 736 ఓట్లు పోలయ్యాయి అందులో 8 చెల్లుబాటు కాలేదు. యూపిఎ అభ్యర్థిగా బరిలో నిలిచిన హమీద్ అన్సారీ కి 490 ఓట్లు రాగా ఎన్.డి.ఏ. అభ్యర్థిగా పోటీలో నిలిచినా జశ్వంత్ సింగ్ కు 238 ఓట్లు వచ్చాయి. పోలింగ్ కు దూరంగా బిజెడి ఎంపీలు 11 మంది, తెలుగుదేశం ఎంపీలు 11, ఆరేస్పీ ఎంపీలు 2, యూపిఏ మిత్రపక్షాలకు చెందిన 6 ఎంపీలు, ఇద్దరు నామినేటేడ్ సభ్యులు, టి.ఆర్.ఎస్, కు చెందిన 2 ఎంపీలు, బీజేపీ 2 ఎంపీలు, ఏజీపీ 2 ఎంపీలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరికొంతమంది ఉన్నారు. సాయంత్రం ఏడు గంటలకు ఫలితాలను వేలువరించగానే యూపిఏ సభ్యులు అన్సారీని అభినందించారు. అన్సారీ తనను ఎన్నుకున్న ఎంపీలందరికీ తన ధన్యవాదాలు తెలిపారు.