కొండా కుటుంబానికి పవర్ పోయిందా?
posted on Jul 31, 2012 @ 12:26PM
పరకాల అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే కొండాసురేఖ ఓటమి పాలయ్యారు. తాజాగా ఆమె భర్త కొండా మురళి ఎమ్మెల్సీ పదవిపై అనర్హతా వేటు పడిరది. దీంతో ఒక్కసారిగా కొండా కుటుంబానికి పవర్‌పోయిందని తెలంగాణాప్రాంతంలో చర్చిస్తున్నారు. ఓడిపోయినా నిన్ను వదులుకోమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి, సురేఖకు హామీ ఇచ్చారు. కనీసం భర్తకు ఎమ్మెల్సీ ఉంది కాబట్టి నెట్టుకురావచ్చని అనుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్సీగా కొనసాగేందుకు ఎటువంటి అర్హత లేదని మండలి ఛైర్మన్ చక్రపాణి ప్రకటించారు. దీంతో పాటు అనర్హతావేటును అమలు చేశారు.
మొదటి నుంచి వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా మెలుగుతూ వచ్చిన కొండా కుటుంబం వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంది. కొండా సురేఖ పరకాల అసెంబ్లీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఎప్పటికైనా ఈ అనర్హతా వేటు ఖాయమని ముందుగానే అవగాహన ఉన్నందున మురళి దానిపై ఎటువంటి స్పందన వ్యక్తం చేయలేదు. భవిష్యత్తులో వైకాపాను బలోపేతం చేసుకుంటూ పోవచ్చనే లెక్కలో ఈ ఇద్దరు ఉన్నారు. అందుకే పవర్‌ను వదిలేసి ప్రజల బాట పట్టేందుకు కార్యక్రమాలు రూపొందించుకోవాలని చూస్తున్నారు. వాస్తవానికి సురేఖ అథికారం కూడా కాంగ్రెస్‌ను వదిలిరావటం వల్లే పోయిందనే అందరికీ తెలిసిన విషయమే. మొత్తానికి పవర్ వదులుకుని వైకాపానేతలుగా ఈ కుటుంబం స్థిరపడేందుకు కృషి ప్రారంభిస్తోంది.