ధర్మాన సిఫార్శులతో రాష్ట్రం దివాళా ఖాయం
posted on Jul 31, 2012 @ 11:47AM
రాష్ట్రంలో ఉపాధి, ఉత్పాధక శక్తి పెంచాల్సిన అవసరం ఎంతైన ఉందని ఆర్థిక శాస్త్రవేత్తలు అంటున్నారు. కాని మంత్రి ధర్మాన కమిటీ చేసిన సిఫార్సులన్నీ రాష్ట్రాన్ని దివాళా తీయించేవిగా ఉన్నాయని వారు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పధకాలకు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల జీతాలకే ఖజానా డబ్బులు చాలడంలేదు. దీనికి తోడు అదనంగా ఓటు బ్యాంకు రాజకీయాలకు ,తాళిబొట్టు పధకాలకు డబ్బు వెచ్చించడం మంచిది కాదని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాధాన్యతా రంగాలకు తక్షణమే గాడిలో పెట్టటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
సామాన్య ప్రజలకు ఊరట కలిగించే విధంగా ధరలను, నల్లబజారును వెంటనే అరికట్టాలని ఆర్ధిక నిపుణులు అన్నారు. అన్ని రంగాల్లోనూ సిండికేట్ల వ్యవహారాన్ని వెంటనే అడ్డుకట్టవేసి ప్రజలను దోపిడీనుండి బయటపడవేయవల్సిన అవసంరం ఎంతైనా ఉందని చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామిక స్తబ్దత తొలగించి మరిన్ని పెట్టుబడులకు అవకాశం ఇచ్చే మెరుగైన పరిస్థితులను నెలకొల్పాలని వారు సూచించారు. రాష్ట్రంలో సెజ్‌లు, పరిశ్రమలు, పార్కుల పేరుతో వేల ఎకరాల్లో బడా సంస్థలు పొందిన వేల ఎకరాలపై సమీక్షలు జరిపి భూనిర్వాసితులకు వెంటనే ప్రత్యామ్యాయాలను రాష్ట్ర ప్రభుత్వం చూపాలని వారు కోరుతున్నారు. దీనివల్ల పారిశ్రామిక వేత్తలకు, స్థానిక ప్రజలకు మేలు కలుగుతుందని ఆర్దిక నిపుణులు చెబుతున్నారు.
రాష్ట్రం సర్వతోముఖాభి వృద్ది జరగాలంటే నిర్ధిష్టమైన పద్దతులు పాటించాలని అలా కాకుండా పైపైన పూతలాంటి కార్యక్రమాలకు ప్రజాధనాన్ని వెచ్చిస్తే రాష్ట్రం దివాళాతీయటం తప్పదని తెలిపారు. రాష్ట్రం పురోభివృద్దికి చర్యలు చేపట్టే ఎటువంటి విషయాలు ధర్మాన కమిటి చేపట్టలేదని, దీనివల్ల ప్రభుత్వానికి ప్రజలపట్ల చిత్తశుద్దిలేదని తెలుస్తుందన్నారు. మౌలిక సమస్యలను పరిష్కరించకుండా ఇతరత్రా ఎజెండాలతో ఎంతకాలం ప్రజలను మభ్యపెడతారని రాష్ట్రంలోని మేధావులు, సీనియర్ ఐఏఎస్‌లు ప్రశ్నిస్తున్నారు. ఇకనైన ముందుచూపుతో వ్యవహరించాలని, గుజరాత్, బీహార్ రాష్ట్రాలను చూసైనా బుద్ది తెచ్చుకోవాలని వారు కోరుతున్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలతో కూడిన అభివృద్ది పధకాలకే పెద్దపీటవేయాలని అలాకాకుండా ధర్మాన కమిటీకి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తే రాష్ట్రం దివాళాతీయడం తథ్యమని ఆర్ధిక నిపుణులు, మేధావులు రాష్ట్రప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.