స్ధానిక సమరానికి సిద్దమవుతున్న మంత్రి గంటా
posted on Jul 31, 2012 @ 12:12PM
ఇటీవల ఒక్కసారిగా అనకాపల్లి కాంగ్రెస్ పార్టీ ఐక్యతారాగం ఆలపిస్తున్నది. అయితే ఇందులో తేల్చాల్సిన సమస్య నూకాంబికా ఆలయకమిటీ నియామకం ఒక్కటే. దీనిపై మాత్రం భిన్నాభిప్రాయాలున్నాయి. అందువల్ల ఈ ఆలయకమిటీ నియామకం ఎలా జరుగుతుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మంత్రి గంటా శ్రీనివాసరావు, కాంగ్రెస్‌పార్టీ నాయకుడు కొణతాల రఘనాథ్ మథ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఇటీవల వీరిద్దరి మథ్య సయోథ్య కుదిరింది. వీరిద్దరూ కలిసి ఒకచోట సమావేశమయ్యారు. అలానే మంత్రి గంటా ఇంటికి రఘనాథ్ వెళ్లి పలకరించారు. అంతేకాకుండా రఘనాథ్ చెప్పిన మాటలు మంత్రి శ్రీనివాస్ వింటున్నారు. ఇప్పటి వరకూ వీరిద్దరూ దూరంగా ఉన్నప్పుడు చాలా నష్టపోయామని, ఇప్పుడు బాగా కలిసివస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు.
అయితే నాలుగైదు రోజుల్లో బహిరంగసభ ద్వారా వీరిద్దరి ఐక్యతా ప్రకటించనున్నారు. తెలుగుదేశం, వైకాపాలకు హెచ్చరికగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ తరుపున ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా ప్రకటించనున్న స్థానిక ఎన్నికల్లో విజయభేరి మోగించాలని ఆ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. అయితే దాని పరిథిలోకి వచ్చే నూకాంబికా ఆలయకమిటీ ఛైర్మను పదవి గురించి మంత్రి గంటాశ్రీనివాసరావు, రఘనాథ్‌ల మథ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ఇప్పటి వరకూ మంత్రి శ్రీనివాసరావు ఆ ఛైర్మను పదవిని యువజన నాయకుడు బేశెట్టి సుథాకర్‌కు కట్టబెట్టాలని ప్రయత్నించారు. రఘనాథ్ కూడా ఆ కమిటీ ఛైర్మను పదవి మాజీ కౌన్సిలర్ బిఎస్‌ఎంకె జోగినాయుడుకు ఇవ్వాలని సిఫార్సు చేస్తూ అథిష్టానానికి లేఖ రాశారు. ఈ ఛైర్మను పదవి వీరిద్దరి మథ్య తిరిగి పాతపరిస్థితి తెస్తుందా? లేక వీరిద్దరూ కలిసే ఉంటారా? అన్న భవిష్యత్తులోనే తేలాలి. ఈ అంశంపై వీరిద్దరి రియాక్షన్ ఎలా ఉంటుందని విశాఖజిల్లాలోని కాంగ్రెస్‌నేతలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.