రీజెన్సీ పవర్‌టెక్‌పై కార్మికుల ఆగ్రహం
posted on Jul 30, 2012 @ 12:41PM
ఒక ఉద్యోగిని అన్యాయంగా పనిలో నుంచి తీసేశారని ఆగ్రహించిన 300మంది తమ ఐక్యతను నిరసనకార్యక్రమం ద్వారా చాటుకున్నారు. ఈ అరుదైన ఘటనకు నెల్లూరు జిల్లా మాంబట్టు పారిశ్రామికవాడలోని రీజెన్సీపవర్‌టెక్ పరిశ్రమ వేదికైంది. ఈ పరిశ్రమలో కార్మిక సంఘం ఏర్పాటు చేశావంటూ శివతేజ అనే కార్మికుడిని యాజమాన్యం పని నుంచి తొలగించింది. అసలు కార్మిక సంఘం ఏర్పాటు చేస్తే తాము సహించబోమని హెచ్చరికగా యాజమాన్యం ఈ తొలగింపు చేపట్టింది. దీన్ని గమనించిన పరిశ్రమలోని 300మంది కార్మికులు అతనితో పాటు చేతులు కలిపి యాజమాన్యవైఖరిపై నిరసన వ్యక్తం చేశారు.
360రోజులూ పని చేయాలన్నట్లు యాజమాన్యం వ్యవహరిస్తోందని ఇప్పటికే ఈ పరిశ్రమపై ఫిర్యాదులు ఉన్నాయి. కార్మికులు ఎంత అత్యవసరం వచ్చినా సెలవుపెట్టడానికి వీలులేదని యాజమాన్యం మౌఖికంగా హుకుం జారీ చేస్తోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇక్కడ కార్మికులు పని చేస్తున్నారని, యాజమాన్యం నిరంకుశవైఖరి వల్ల ఏనాడో మానేయాల్సి ఉన్నా తమ కుటుంబాల కోసం నెట్టుకువస్తున్నామని కార్మికులు బహిరంగంగానే చెబుతున్నారు. సెలవుల గురించి ఇబ్బందిపెడుతున్న ఈ పరిశ్రమపై లేబర్‌శాఖ ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం వెనుక యాజమాన్యం తనకు ఉన్న పలుకుబడిని చాటుకుందని కార్మికులు అంటున్నారు.