సిఎం సీటుపై కాపుల కోరిక తీరేదెన్నడు?
posted on Jul 30, 2012 @ 1:49PM
రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో తమ వాళ్లు కూర్చోవాలని పదేళ్ల నుంచి కాపుసామాజికవర్గం కలలు కంటోంది. దీనికి ప్రాతిపదిక పాతికేళ్ల క్రితమే పడినా అప్పటి రాజకీయవాతావరణానికి, ప్రస్తుత పరిస్థితులకూ పొంతన లేదు. అయితే గతంలో జరిగిన ఉద్యమాల తీవ్రతను బట్టి ఆ కోరిక మిగుల్చుకున్న ఈ సామాజికవర్గ నేతలు ఇప్పుడు మళ్లీ నానాటికీ మారుతున్న రాజకీయం తమకు అనుకూలమన్న నమ్మకంతో కాలం గడిపేస్తున్నారు.
అయితే ఈ సామాజికవర్గంలో ఉండే తొందరపాటు ఇంకెక్కడా కనిపించదు. అందుకే ఈ కోరికను దాచుకుని ఆ వాతావరణం వచ్చినప్పుడు చెప్పకుండా ముందే బయటపడిపోతున్నారు. దీంతో ఇతరకులస్తులు వీరిని అణిచివేయటానికి ఆ ఒక్కటి చాలు. ఆంథ్రరాష్ట్ర రాజకీయవాతావరణానికి దిక్సూచి తూర్పుగోదావరి జిల్లా. అటువంటి ఈ జిల్లా ఎవరి వైపు మొగ్గుతుందో రాష్ట్రంలో ఆ పార్టీ అథికారంలో ఉంటుంది. దీనికి తాజా ఉదాహరణ ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలన్నింటిలోనూ ఓటమి పాలైనా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒక్కసీటును గెలుపొందింది. అది చాలు ఆ పార్టీ ముందుకు వెళ్లటానికి అని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు.
గతంలో ఉత్తరకంచి ఉద్యమం ద్వారా తూర్పుగోదావరి జిల్లా నుంచి ముద్రగడపద్మనాభం రాష్ట్రంలో తమ కాపులే అథికారంలో ఉండాలని కృషి చేశారు. అయితే ఈయన చేసిన సామాజిక ఉద్యమానికి రాష్ట్రవ్యాప్తంగా మద్దతు లభించింది. అయినా ఆయన కోరుకున్నట్లు కాపుసామాజికవర్గ నేతలు సిఎం కాలేకపోయారు. తాజాగా మూడేళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి పీఆర్పీ పార్టీని పెట్టి దాదాపు సిఎం అయిపోయినంత హడావుడి చేశారు. దీన్ని రాష్ట్రప్రజలు అందరూ వ్యతిరేకించటం వల్ల ఆయన పరిమితస్థానాలు సాధించుకుని చివరికి కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేశారు. ఈయన సిఎం అయ్యే అవకాశాలున్నప్పుడు మిగతా సామాజికవర్గాలను వదులుకున్నారు.
దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారానే సిఎం కావాలని కలలు కంటున్నారు. ఇప్పుడు ఈయన సిఎం అయితే బాగుండుననబోయి అయిపోతారని ప్రకటించి మంత్రి సి.రామచంద్రయ్య ఇరకాటంలో పడ్డారు. అంతేకాకుండా మంత్రికి ఉన్న సామాజిక కుల అభిలాష బయటపడిరదని విమర్శలు చెలరేగుతున్నాయి. ఏదేమైనా ఈ మిగిలిన కల భవిష్యత్తులోనైనా తీరుతుందని ఈ సామాజికవర్గం ఆశతోనే బతుకుతోంది.