కిరణ్‌పై కృపారాణి కినుక ?
posted on Jul 30, 2012 @ 12:22PM
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై శ్రీకాకుళం ఎంపి కిల్లి కృపారాణి కినుక వహించారు. ఆమె అలక తీర్చాలంటే సిఎం స్వయంగా వెనక్కి వచ్చి ఇందిరమ్మబాటలో పాల్గొనమని కోరాలంటున్నారు. సిఎం కాన్వాయ్‌లోకి ఆహ్వానించలేదని అలిగిన ఆమె కారులోనే భర్తతోపాటు ఉండిపోయారు. తాను అసలు ఎక్కడికి కదలనని, సిఎం తనను చూసి కూడా వెళ్లిపోయారని, స్థానిక ఎంపి అంటే అంత చులకనగా చూస్తే ఎలా అని కృపారాణి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనను సిఎం ఆహ్వానించలేదు సరికదా! అసలు మాట్లాడలేదని కృపారాణి ఈ నిరసన చేపట్టారు.
దీనికి ముందు సిఎం కాన్వాయ్‌లోకి వెడుతుంటే ఈమెకు అనుమతి ఇవ్వలేదు. తనకు కాన్వాయ్‌లోకి ఎందుకు అనుమతి ఇవ్వలేదని ఆమె ఎస్పీని నిలదీశారు. ఆయన కూడా ఎంపికి నచ్చచెప్పేందుకు చూసినా ఆమె ససేమిరా అన్నారు. దీంతో చాలాసేపు మాట్లాడిన ఎస్పీ తిరిగివెళ్లిపోయారు. ఎంపి తన భర్తతో కారులోనే నిరసన తెలియజేస్తూ రోడ్డు మీదే ఉండిపోయారు. సి.ఎం. ఇందిరమ్మబాట కార్యక్రమం ముగిసిందని తెలిసిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోయినట్లు తెలిసింది.