చిత్తూరును వణికిస్తున్న డెంగ్యూ?
చిత్తూరు జిల్లాను డెంగ్యూ జ్వరం వణికిస్తోంది. సుమారు వందమంది వరకూ ఈ జిల్లాలో డెంగ్యూబారిన పడ్డారని అథికారిక లెక్కలు తేలుస్తున్నాయి. జిల్లాలోని పడమటి ప్రాంతంలోనే ఎక్కువగా ఈ జ్వరపీడితులున్నారని తెలుస్తోంది. తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో డెంగ్యూ గుర్తింపు పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నారు. మదనపల్లె, గుర్రంకొండ, తంబెళ్లపల్లె, పీలేరు, పుంగనూరు, బి.కొత్తకోట, పీటీఎం, కురబలకోట తదితర ప్రాంతాల్లో జ్వరపీడితులున్నారని అథికారులు గుర్తించారు. జిల్లా కలెక్టరు సాల్మన్ ఆరోగ్యరాజ్ ఆదేశాల మేరకు బృందాలుగా విడిపోయి మరీ డెంగ్యూ జ్వరపీడితులకు చికిత్స అందిస్తున్నారు. ఇదే కాకుండా జిల్లాలో 130 మలేరియా కేసులు నమోదయ్యాయి. వీటిలో పీవీ107కేసులు, పీఎఫ్23కేసులు నమోదయ్యాయని వైద్యనిపుణులు తేలుస్తున్నారు. ఈ జ్వరాలకు దోమలే కారణమని, పరిసరాల పరిశుభ్రత పాటించటం ద్వారా జ్వరాలకు దూరంగా ఉండొచ్చని వైద్యులు తెలిపారు. పెరిత్రయంలో కిరోసిన్ కలపటం వల్ల దోమలను నివారించవచ్చన్న నిపుణుల హెచ్చరికల మేరకు స్ప్రే చేసేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. అయినా పరిసరాల పరిశుభ్రత పాటించేందుకు గ్రామీణులు సిద్ధం కావాలని జిల్లా వైద్య అధికారులు పిలుపు ఇచ్చారు.