అటవీసిబ్బందిపై స్మగ్లర్లదాడులు?
posted on Jul 30, 2012 @ 12:48PM
తమ స్మగ్లింగ్‌కార్యాకలాపాలను అడ్డుకుంటున్నారని అటవీసిబ్బందిపై స్మగ్లర్లు నేరుగా దాడులకు దిగుతున్నారు. రాజకీయనాయకుల అండదండలు చూసుకుని స్మగ్లర్లు నేరుగా అటవీశాఖ సిబ్బందిని టార్గెట్ చేస్తున్నారని సమాచారం. ఏమైనా న్యాయపరమైన సమస్యలు వస్తే కాచుకునేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్న తరువాత స్మగ్లర్లు తెగిస్తున్నారని తెలుస్తోంది. పార్టీలకు ఫండ్ ఇచ్చే ఎవరినీ వదులుకోలేని నేతలు ఇచ్చే భరోసా తమ ప్రాణాల మీదకు తెస్తోందని, ఇటీవల తుపాకులతో స్మగ్లర్లు తిరగటానికి కారణం కూడా రాజకీయ నాయకులే అని అటవీసిబ్బంది వాపోతున్నారు.
కొత్తకొత్త వాహనాలలో తిరుగుతున్న స్మగ్లర్లు అటవీ సిబ్బంది వాడే జీపులకు అసలు దొరకటమే కష్టమవుతోంది. తమ వాహనాన్ని అటవీసిబ్బంది ఛేజింగ్ చేసేందుకు ప్రయత్నిస్తే స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఖమ్మంజిల్లా భద్రాచలం మండలం నెల్లిపాక అటవీప్రాంతంలో అటవీసిబ్బంది జీపును స్మగ్లర్ల కారు ఢీకొంది. దీంతో జీపు తిరగబడిరది. అందులో ప్రయాణిస్తున్న అటవీసిబ్బంది తీవ్రగాయాల పాలయ్యారు. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు అటవీసిబ్బందికి గాయాలయ్యాయి. అసలు అటవీసిబ్బందిపై కక్ష కట్టినట్లు స్మగ్లర్లు వ్యవహరిస్తున్నారు. క్షతగాత్రులను భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను చూసైనా అటవీసిబ్బంది జీపుల స్థానంలో కొత్తకార్లు, కొత్త ఆయుథాలు వినియోగించాలని పరిశీలకులు సూచిస్తున్నానరు.