జైపాల్‌రెడ్డి రాష్ట్ర ప్రయోనాలు కాపాడలేని అసమర్ధుడా?

మనరాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రుల్లో మల్లిపూడి మంగపతి పళ్లంరాజు పేరు బాగా ప్రాచుర్యంలో ఉంటుంది. ఎందుకంటే ఆయన రక్షణ మంత్రిత్వ హోదాలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అందరినీ కలుపుకుంటూపోవటమే కాకుండా కీలకమైన సమస్యల్లో తన వంతు పాత్ర పోషించేందుకైనా ప్రయత్నిస్తారు కాబట్టి. కాకినాడ పార్లమెంటు సభ్యునిగా ఇంకా పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నానని ఆయన తరుచుగా ఆవేదన చెందుతుంటారు. ఇంకో మంత్రి గురించి చెప్పుకుంటే జైపాల్‌రెడ్డి.   ఈయన రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే నవ్వుతూ ఉండే పనికిమాలిన మంత్రి అని అన్నిపార్టీలు విమర్శిస్తున్నాయి. పైగా పెట్రోలియంశాఖ కేంద్ర మంత్రిగా ఉన్న జైపాల్‌రెడ్డి ఇప్పటి వరకూ ఎంపిగా తన సొంత ప్రాంతాన్నే అభివృద్థి చేయలేకపోయారన్న ఆరోపణలున్నాయి. అటువంటిది ఇక రాష్ట్రానికి ఆయన ఏమి చేస్తారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెజీబేసిన్‌లో ఉత్పత్తి అయ్యే గ్యాస్‌లో అధికభాగం గుజరాత్‌కు తరలివెళుతున్నందున మంత్రిగా కనీసం రిలయన్స్‌, గుజరాత్‌స్టేట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌తో ఆయన సమావేశమై విద్యుత్తు సమస్య పరిష్కారానికి తనవంతు కృషి చేయటానికి అవకాశం ఉంది. అయినా సరే జైపాల్‌రెడ్డి ఆ తరహా ప్రయత్నాలేవీ చేయలేదు. కేంద్రంలో తనకున్న పలుకుబడి ఉపయోగించి రాష్ట్రంలో గ్యాస్‌ కోసం పడుతున్న ఇబ్బందులు పరిష్కరించే దిశగా ఆయన ఇసుమంత ప్రయత్నమూ చేయలేదు. తెలంగాణా ప్రాంతానికి చెందిన జైపాల్‌రెడ్డి ఉన్నా లేనట్లే అని తెలంగాణావాదులు విమర్శించారు. దీన్ని బట్టి ఆయన పనితీరును విశ్లేషించవచ్చు. ఏమైనా కానీ, రాష్ట్రంలో పనికిమాలిన కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి అంటే కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా మద్దతుపలుకుతున్నాయి. ఈ విషయాన్ని ఆ మంత్రి ఇకనైనా గుర్తిస్తే మంచిది. అయితే ఈయన అవసరం లేకుండా నేరుగా ప్రధాని సహకారం పొందాలని సిఎం ప్రయత్నిస్తున్నారు. ఇది చాలు జైపాల్‌రెడ్డి పనితీరు ఎంత దారుణంగా ఉందో తెలియజేయటానికి!

టిడిపికి బై కొట్టి బైరెడ్డి కొత్తపార్టీ పెడతారా?

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసేస్తారా? త్వరలో కొత్తపార్టీ ప్రారంభించే ఆలోచనలో ఆయన ఉన్నారా? అన్న ప్రశ్నలు ఆయన పోకడను బట్టి ఉదయిస్తున్నాయి. ఎందుకంటే రాయలసీమ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసినప్పటి నుంచి అవసరమైతే తెలుగుదేశం పార్టీని వదిలేస్తాను అంటూ ఒకసారి కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద నోరుజారారు. ఆ తరువాత ప్రత్యేకరాయలసీమ కావాలన్న నినాదంతో  హైదరాబాదులోనూ ఇదే మాట అన్నారు. చివరికి 92గంటల నిరవధిక దీక్షలోనూ దీన్ని రిపీట్‌ చేశారు. అంటే మనస్సులో లేనిది నోటిలో నుంచి జారుతుందా? ఒకవేళ ఆయన సొంతపార్టీకి ప్లాన్‌ చేసుకున్నారేమో అన్నట్లుంది రాజశేఖరరెడ్డి పోకడ.   తెలుగుదేశం పార్టీ అథ్యక్షుడు చంద్రబాబునాయుడు మద్దతు కోరిన రాజశేఖరరెడ్డి స్వయంగా పిలిస్తే సరిపోయిది కదా అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వటం లేదు. ఆయన అంతరంగాన్ని బయట పెట్టకుండా ప్రత్యేకరాయలసీమ కోసం ఎందరు తన వెనుక నడుస్తారని అంచనాలు వేసుకుంటున్నారు. దీన్ని బట్టి కొత్తపార్టీ ప్రారంభిస్తే వీరందరినీ తన పార్టీలోనే చేర్చుకోవచ్చనే ఆలోచన ఆయనకు ఉందని అర్థమవుతోంది. అంతేకాకుండా సెంటిమెంటుగా తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన తెరాస అథ్యక్షుడు కె చంద్రశేఖరరావు బైరెడ్డికి ఆదర్శం. ఆయన కూడా పార్టీ నుంచి బయటకు వచ్చి తెలంగాణా ఉద్యమం చేస్తూ పార్టీని డిక్లేర్‌ చేసిన విషయం రాష్ట్రంలోని అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈయన కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి రాయలసీమ  పేరిట పార్టీ పెట్టడానికి అవకాశాలైతే మెండుగా ఉన్నాయి. అదును కోసమే బైరెడ్డి ఎదురుచూస్తున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. అయితే ఇంతవరకూ చంద్రబాబు నాయుడు అదే రాయలసీమలోని చిత్తూరు జిల్లా వాసి అయినా బైరెడ్డి ఉద్యమానికి మద్దతు పలకలేదు. తెలంగాణా ఇచ్చే ఆలోచనే ఉంటే దానితో పాటు రాయలసీమ ప్రత్యేకరాష్ట్రం ఇవ్వాలని బైరెడ్డి డిమాండు చేస్తున్నారు. కొత్తగా ఈ వ్యవహారంలో చంద్రబాబుపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణాకు మద్దతు ప్రకటించాలని టిఆర్‌ఎస్‌ కోరుతున్న నేపథ్యంలో ఇష్యూను డైవర్ట్‌ చేసేందుకు బాబే తన పార్టీ నేత అయిన బైరెడ్డిని రెచ్చగొట్టి ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు. దీనికి మద్దతు ప్రకటిస్తే ఒక ప్రాంతానికి తాను పరిమితమవుతామన్న భయంతోనే బాబు ఈ ఉద్యమం విషయంలో మౌనం పాటిస్తున్నారని అంటున్నారు. ఏమైనా నిప్పులేనిదే పొగరాదన్న చందంగా ఈ ఇద్దరి వైఖరి భవిష్యత్తులోనే బయటపడాలి.

ఇరకాటంలో జానారెడ్డి?

 రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖా మంత్రి జానారెడ్డి ఓ పెద్ద ఇరకాటంలో పడ్డారు. తెలంగాణా ప్రాంతానికి చెందిన ఈయన భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణాలో తన పట్టుపెంచుకోవాలని పిలిచినా, పిలవకపోయినా అన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇలానే ఎంపి వివేకానంద పిలిచాడు కదా అని తెలంగాణా ఎన్జీఓ సంఘ మాజీ అథ్యక్షుడు స్వామిగౌడ్‌ సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. సమావేశంలో పాల్గొంటూనే మంత్రి ముందస్తు జాగ్రత్త పాటించినట్లుంటుందని ఎవరూ కూడా ఇతర అంశాలు ఎత్తకుండా స్వామిగౌడ్‌ను అభినందించాలని కోరరారు.   దీంతో అప్పటివరకూ మౌనంగా ఉన్న టిఎన్జీఓ నేతలు మంత్రి వ్యాఖ్యానాలపై మండిపడ్డారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మంత్రి హతాశుడయ్యారు. ఆ తరువాత తనను ఎంపి వివేకానంద పిలిచారని తెలిపారు. అలాగే తెలంగాణా ఉద్యమం పేరు చెప్పి అరెస్టు అయినవారందరినీ విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. అసలు మంత్రులకు ఆహ్వానం లేదని టిఎన్జీఓ నేతలు హెచ్చరించటంతో మంత్రి తాను ఆత్మశుద్ధితో ప్రవర్తిస్తున్నానని, తాను ఎటువంటి మంత్రి హోదాతోనూ రాలేదని, తెలంగాణా కసమే తాను వచ్చానని ఈ విషయం తన అంతరాత్మకు తెలుసని  మంత్రి జానారెడ్డి స్పష్టం చేశారు. మొత్తం మీద సమావేశంలో మంత్రి జానారెడ్డి తనకు ఒకవేల ముఖ్యమంత్రి హోదా వచ్చినా వదిలేయాలని ఆ సమావేశంలో నేతలు డిమాండు చేశారు.

జానారెడ్డి కథలో తెలంగాణావాదే

కొందరు రచయితలు అప్పటికప్పుడు కథలను అల్లేస్తుంటారు. ఇది చేయితిరిగిన రచయిత చేసే పని. అలానే మంత్రులు, రాజకీయ నేతలు తమ ప్రసంగాల్లో పిట్టకథలు, పిల్లల కథలు, నేతల కథలు చేర్చి చెబుతుంటారు. అప్పటికప్పుడు అల్లే ఈ కథల్లో నీతి ఎప్పుడు రాజకీయ నాయకులు చెప్పే అంశం ఆధారంగానే ఉంటుంది. ఇలానే కథలు చెప్పటంలో అంతో ఇంతో అనుభవం గడిరచిన రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖామంత్రి జానారెడ్డి తాను తెలంగాణావాదినని చెప్పుకునేందుకు ఓ కథ అల్లేశారు. ఆ సమావేశం కూడా అచ్చ తెలంగాణావాదుల సమావేశం కావటంతో ఆయన కథ బాగా పండిరదనే అనుకోవాలి.   అయితే మంత్రుల మాటలు ఎవరూ నమ్మరు కాబట్టి చివరిలో ఆయనకు వ్యతిరేక నినాదాలు కూడా చేసేశారు. అసలు ఆయన అల్లిన కథ చూడండి. అది కూడా మంత్రికి రామాయణంపై ఉన్న పట్టును నిరూపిస్తోంది. ‘‘ రామాయణంలో రామ, రావణ యుద్ధం జరిగినప్పుడు మొత్తం కపిసేనను సమీకరించిన రాముడుకు రావణున్ని చంపేందుకు విభీషణుడు, ఇంకా  కొందరు సహకరించారు. ఆ దేవతలు, సేన మాట పక్కన ఉంచితే ఉడత కూడా వారధి నిర్మాణంలో సహకరించింది. ఎవరిపాత్ర ఏమిటో వారివారి అంతరాత్మలకు తెలుస్తాయి. మీకు చెప్పాల్సిన పని లేదు. తెలంగాణా ఉద్యమంలో అరెస్టు అయిన వారిని బయటకు  తీసుకువచ్చేందుకు నేనెంత శ్రమించానో నాకు తెలుసు. అలానే వారిపై కేసులు ఎత్తేసేందుకు నావంతు కృషి చేస్తానని మాట ఇస్తున్నాను.’’అని జానారెడ్డి తెలివిగా ఓ హామీ ఇచ్చి ప్రసంగాన్ని ఆపేశారు. అయినా సరే! జానారెడ్డిని తెలంగాణావాదులు నమ్మలేదు. మరి రాజకీయనాయకుడు కదా ఎలా నమ్ముతారు? మీరు చెప్పండి? అసలు గొడవ మరిచిపోకూడదు ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా జానారెడ్డిని ప్రకటిస్తే ఆయన పాలించాల్సింది సమైక్యాంథ్రానే అని తెలంగాణావాదులు అంటున్నారు. మరి అది నిజమే కదా

గ్యాస్‌సరఫరాలో కేంద్రమే ఆంధ్రాకు అన్యాయం చేసిందా?

ఎవరైనా ఒకరిని రక్షించాలంటే తాను సురక్షితంగా ఉండాలన్న సూత్రాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసిందంటున్నారని విశ్లేషకులు. రాష్ట్రంలో గ్యాస్‌ఆథారిత విద్యుత్తుప్లాంటులకు సరఫరా చేయాల్సిన గ్యాస్‌ను మహారాష్ట్రలోని రత్నగిరికి తరలించటం వెనుక తనను తాను కాపాడుకునే నైజం ఉందని వెలుగులోకి వచ్చింది. వాజ్‌పేయి అథికారంలో ఉన్నప్పుడు రత్నగిరి గ్యాస్‌ ఆథారిత విద్యుత్తు ఒప్పందం జరిగింది. అప్పుడు అంతర్జాతీయ ఒప్పందం కాబట్టి ఈ ప్లాంటుకు అవసరమైన గ్యాసు సరఫరా చేస్తామని, ఒక వేళ సరఫరా చేయలేకపోతే గ్యారెంటీ కోసం నష్టాలను సైతం భరిస్తామని కేంద్రం గ్యారెంటీ ఇచ్చింది. ఒకవేళ కోరిన గ్యాసు సరఫరా చేయకపోతే రత్నగిరి సంస్థ నష్టాలను కేంద్రం భుజాలపై మోయాల్సి ఉంటుంది. ఈ ఒప్పందం తరువాత 2008 నుంచి దాని ప్రభావం కేంద్రంపై పడిరది. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు మరో 7గురితో కలిసి కమిటీగా వెళ్లి అక్కడి పరిస్థితి సమీక్షించారు. దీంతో గ్యారెంటీ ప్రతిపాదన ఆథారంగా రత్నగిరి  విద్యుత్తుప్లాంటు ఏర్పాటైంది. ఆ సంస్థ కోరితే పూర్తిస్థాయి గ్యాస్‌ను సరఫరా చేస్తామని అప్పటి కేంద్ర మంత్రి మరళీదేవ్‌రా హామీ ఇచ్చారు. వాస్తవానికి కేజీబేసిన్‌ నుంచి ఆంథ్రప్రదేశ్‌లో విద్యుత్తు అవసరాలకు 3.48ఎంఎంఎస్‌సిఎండి గ్యాసు సరఫరా అవుతోంది. ఇప్పుడు దానిలో 2ఎంఎంఎస్‌సిఎండి గ్యాస్‌ మహారాష్ట్రకు సరఫరా చేయనున్నారు. అంటే 1.48ఎంఎంఎస్‌సిఎండి గ్యాస్‌ మాత్రం రాష్ట్రవాటాగా సరఫరా అవుతుంది. ఎలాగూ గ్యాస్‌ను సరఫరా చేస్తున్నారు కాబట్టి ఆంథ్రప్రదేశ్‌కు అవసరమైన విద్యుత్తును ఆ ప్లాంటు ద్వారా సరఫరా చేయాలని కోరితే బాగుంటుందని సూచనలు వస్తున్నాయి. ప్రథానిని కలిసిన ముఖ్యమంత్రి ఈ తరహా కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.

అలజడిలో ఇంజనీరింగు విద్యార్థులు?

ఇంజనీరింగు, మెడికల్‌ విద్య ఫీజులను యాజమాన్యాలు తమ నిర్వహణ ఆథారంగా నిర్ణయించుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో అథికారుల కమిటీ రాష్ట్రంలో 134రకాల ఫీజులను అమలు చేయాల్సి ఉంటుందని విశదీకరించింది. 133 ఇంజనీరింగుకళాశాలలకు ఒక తరహా ఫీజు, 569కాలేజీల్లో ఒకేరకమైన ఫీజు అమలు చేయాలని నిర్ణయించింది. అయితే ఇంజనీరింగు విద్యార్థి కనిష్టఫీజు 31వేల రూపాయలు, మెడికల్‌ విద్యార్థి కనిష్టఫీజు రూ.50వేలు అని ఈ కమిటీ వెల్లడి చేసిన సమాచారం ఆథారంగా అర్థమవుతోంది. తమ కళాశాలల్లో యూజిసి నిర్ణయించిన విధంగా లెక్చరర్లకు వేతనాలు ఇస్తున్నామని 133కాలేజీలు తెలియజేయటంతో సుప్రీంకోర్టు ఫీజుల విషయంలో నిర్ణయాథికారం ఆ సంస్థలకు ఇచ్చింది. దీంతో మరో రెండేళ్లలో ఫీజులు మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన బడ్జెట్‌లో మరో రెండేళ్లలో రూ.3,500కోట్ల నుంచి ఆరువేల కోట్ల రూపాయల వరకూ ఫీజు రీయంబర్స్‌మెంట్‌ చెల్లించాల్సి ఉంటుంది.  ఎపిఎఫ్‌ఆర్‌సికి వేతనాల అఫిడవిట్‌ ఇవ్వని 569కాలేజీల్లో ఒకేరకమైన ఉమ్మడి ఫీజులు అమలు చేస్తారు. మహారాష్ట్రలో వాతావరణం గమనిస్తే సంఘ్వి ఇంజనీరింగు కాలేజీలో ట్యూషన్‌ఫీజు 9,579రూపాయలు, షిండే ఇంజనీరింగు కాలేజీ ట్యూషన్‌ఫీజు రూ.28,037, సౌమ్య ఇంజనీరింగు కాలేజీలో 70,200రూపాయలు ట్యూషన్‌ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా కాలేజీని బట్టి ట్యూషన్‌ఫీజు మారుతోంది కాబట్టి ఆంథ్రప్రదేశ్‌లోని 569 ఇంజనీరింగ్‌కాలేజీల ఉమ్మడిఫీజు రూ.50,200గా నిర్ణయించాలని అథికారుల కమిటీని ఆ కాలేజీ యాజమాన్యాలు కోరుతున్నాయి. ఈ పరిస్థితి ఇలా ఉంటే ప్రస్తుతం ఇంజనీర్లుగా పని చేస్తున్న వారు కూడా తమ పిల్లలను భవిష్యత్తులో ఇంజనీరింగు చదివించలేమంటున్నారు. పెరిగే ట్యూషన్‌ఫీజులు సామాన్యులు, మథ్యతరగతి వర్గాలను ఇంజనీరింగు, వైద్యవిద్యకు దూరం చేస్తాయని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

బిసిలు కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేశారు?

ఆంథ్రప్రదేశ్‌లోని బిసిలందరూ కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేశారు? అన్న ప్రశ్న ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఎందుకంటే బిసిల అభ్యున్నతి కోసం తామెన్నో రకాల పథకాలు ప్రవేశపెట్టామని రాష్ట్రప్రభుత్వం చెప్పుకుంటోంది. అలానే తెలుగుదేశం పార్టీ అయితే బిసిల కోసం ప్రత్యేకమైన డిమాండ్లే చేస్తోంది. ఇటువంటి తరుణంలో బిసిలందరూ గతంలో కాంగ్రెస్‌కు ఓటేసింది ఎందుకంటే ఓన్లీ! ఫీజు రియంబర్స్‌మెంట్‌ కోసమే అని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అథ్యక్షుడు కృష్ణయ్య చెబుతున్నారు. అంటే వైఎస్‌ఆర్‌ హయాంలోనూ ఈ పథకం అమలు అయిందని ఆయన చెబుతూ కేవలం ఈ పథకం నచ్చే తాము ఓటేశామంటున్నారు.   అంటే కృష్ణయ్య ఎవరికి ఓటేస్తే వారికే యావత్తు రాష్ట్రంలోని బిసిలందరూ ఓటేశారా? లేక ఓటేస్తారని చెబుతున్నారా? వెనుకబడిన తరగతుల వారి చదువు కోసం ఒకవైపు కేంద్ర ప్రభుత్వ పథకాలు, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. వాటితో పాటు అదనంగానే ఈ ఫీజు రియంబర్స్‌మెంట్‌పథకం అమలు చేశారు. ఆ విషయాన్ని పూర్తిగా గమనించకుండానే బిసిలు ఈ పథకం కోసమే ఓటేశారని చెబుతున్నారు. అసలు ఏకతాటిపై ఉండని వర్గంగా బిసిలకు పేరుంది. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ అందరూ బిసిలు ఏకతాటిపై నిలబడటం జరగదు. దీనికి తాజా ఉదాహరణ రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ బిసి ప్రతినిథిగా మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ నిలబడితే ఆయనపై తోట త్రిమూర్తులు గెలుపొందారు. ఈ విజయం వెనుక బిసిల నిర్ణయమే కారణమని చెబుతున్నారు. మరి కృష్ణయ్య మాట ఆథారంగా ఎంతమంది ఈ ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు మొగ్గి కాంగ్రెస్‌కు ఓటేశారో ఆయనకే తెలియాలి.

ఎథిక్స్‌ కమిటీనుండి శాసనసభ్యులకు నోటీసులు

రాష్ట్రంలో ఇంకా 90 మంది శాసన సభ్యులు తమ ఆస్తుల విషయాలు వెల్లడిస్తూ పత్రాలు ఇంకా పంపలేదని, శాసనసభాద్యక్షులు నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ప్రస్తుతానిక  అందిన శాసనసభ్యుల వివరాల మేరకు శాసనసభ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అయితే  శాసనసభ సభ్యులు మాత్రం వెబ్‌సైట్‌లో పెట్టటమే తమకు తలనొప్పిగా మారిందని అఫడవిట్‌లు పంపిన వారు పంపని వారూ కూడా వాపోతున్నారు. ఇదివరలో అయితే  ఈ వివరాలు శాసనసభవరకే పరిమితమై ఉండేవన్నారు. అయితే అఫడవిట్లను తీసుకోవడం ఖచ్చింతంగా అమలు చేసేందుకు స్పీకర్‌ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. వివరాలు పంపని శాసనసభ్యులకు శాసనమండలి ఎధిక్స్‌ కమిటీ నుండి లేఖలు పంపాల్సిందిగా కమిటీ మెంబర్సును కోరారు. దీంతో లెక్కపత్రం లేని ఆస్తులను కలిగిఉన్న శాసనసభ్యులు అసహనంగా ఉన్నారు. ఏది ఏమైనాన శాసనసభ్యుల వివరాలను పారదర్శకంగా ఉంచడం హర్షించతగ్గ పరిణామం.

ఉపరాష్ట్రపతి ఎన్నికకు కూడా టి.ఆర్‌.ఎస్‌.దూరం?

భారత ఉపరాష్ట్రపతిగా కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన హమీద్‌ అన్సారీ గెలుపు నల్లేరుపై నడక అని రాజకీయవిశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల జరిగిన భారతరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ బలపరిచిన ప్రణబ్‌ముఖర్జీ విజయం సాధించిన విషయం అందరికే తెలిసిందే. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కూడా ఇదే తరహా వాతావరణం నెలకొంటోంది. దీంతో అన్సారీ గెలుపు కోసం కాంగ్రెస్‌ పెద్దలకు పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండా పోయింది. రాష్ట్రపతి ఎన్నికల సమయంలోనూ తెలుగుదేశం పార్టీ ఓటింగులో పాల్గొనరాదని నిర్ణయం తీసుకుంది. టిఆర్‌ఎస్‌ కూడా ఓటింగును బహిష్కరించింది. ఇప్పుడు కూడా అదే తరహాలో తెలుగుదేశం పార్టీ ఓటింగుకు దూరమవుతోంది. టిఆర్‌ఎస్‌ కూడా సరైన కారణం వెతుక్కుని ఓటింగ్‌లో పాల్గొనకపోవచ్చని తెలుస్తోంది. దీంతో ఈ రెండు పార్టీలు ఓటింగులో పాల్గొనకపోయినా కాంగ్రెస్‌ తన మద్దతుదారులు, పార్టీలోని నేతల సహాయంతో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకోవచ్చు.   ఈమేరకు ముందస్తుగా ఏర్పాటు చేసుకున్న ఆ పార్టీ అభ్యర్థి ప్రకటన కూడా తమ పార్టీ అథినేత సోనియాగాంధీతో చేయించి అప్పుడే సమీకరణలను పూర్తి చేశారు. అందువల్ల భారత ఉపరాష్ట్రపతిగా హమీద్‌ అన్సారీ గెలుపుఖాయమన్న సంకేతాలు వెలువడ్డాయి. సంఖ్యాబలం ప్రకారమూ అన్సారీ ముందంజలో ఉన్నారని పలు సర్వేలు తేల్చాయి.

నియంతలా వ్యవహరిస్తున్న ఎపిఎస్‌పి అధికారులు?

ఆంథ్రప్రదేశ్‌ స్పెషల్‌పోలీస్‌బెటాలియన్‌(ఎపిఎస్‌పి) ఉన్నతాధికారులు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు చెలరేగుతున్నాయి. నక్సల్‌ కూంబింగ్‌ వంటి స్పెషల్‌ ఆపరేషన్స్‌లో పాల్గొనే స్పెషల్‌పోలీసుల పని ఒత్తిడి గురించి ఎపిఎస్‌పి బెటాలియన్‌ ఉన్నతాథికారులు పట్టించు కోవటం లేదని ఆరోపణలు వచ్చాయి. వాతావరణం బాగోలేకపోయినా పోలీస్‌శాఖ ఇచ్చే ఆపరేషన్స్‌లో పాల్గొనే సిబ్బంది ఆరోగ్య ఇబ్బందులు అసలు పట్టించుకోవటం లేదని విమర్శలు ఎక్కువయ్యాయి. అత్యవసరమై నప్పుడు వైద్యసేవలు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని సిబ్బంది కుటుంబాల వారు వాపోతున్నారు. కుటుంబపరమైన అత్యవసర సమయం అవసరమై నప్పుడు సెలవు కోరితే ఉన్నతాథికారులు నిరాకరిస్తున్నారని స్పెషల్‌ పోలీసు సిబ్బంది భార్యలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగలలో అనారోగ్యంతో ఒకరు మరణించటం వెనుక ఎపిఎస్‌పి 8వబెటాలియన్‌ ఉన్నతాథికారుల నిర్లక్ష్యమే కారణమని పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   ఈ కోపంలోనే వీరు హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ధర్నా కూడా చేశారు. ఈ ధర్నా సమయంలో దృశ్యాలను వీడియో తీస్తున్న ఒకరిని స్పెషల్‌పోలీసులకు చెందిన మహిళలు చితకబాదారు. ఉన్నతాథికారుల ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సివిల్‌పోలీసులు, స్పెషల్‌పోలీసులు ఘర్షణకు దిగారు. ఒకరిని మరొకరు ముష్టిఘాతాలతోనూ కుమ్ముకుంటూ, పొర్లాడుకుంటూ కొట్టుకున్నారు. చూసిన వారందరూ పోలీసుఫైట్‌ ఇలా ఉంటుందన్న మాట అనుకునేలా ఈ ఘర్షణ జరుగుతుంటే పోలీసు సిపి రెండు వర్గాలనూ అదుపు చేశారు. అనంతరం కొందరు మహిళలను పోలీసు అథికారుల సంఘనాయకులు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్దకు తీసుకువెళ్లారు. అప్పుడు మహిళల వినతి విన్న మంత్రి తనకు పూర్తి సమాచారం అందిందని, ఎపిఎస్‌పి ఉన్నతాథికారులతో తాను మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఎపిఎస్‌పి ఉన్నతాథికారులు నియంతలా వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి స్పందించారు. తక్షణం వారి వైఖరిలో మార్పు వచ్చేలా చర్య తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు.

నాడు వర్షాభావం...నేడు వరద ప్రమాదం !

నిన్న మొన్నటి వరకూ నీళ్ళులేక వెలవెలబోయిన జలాశయా లన్నీ నేడు వరద నీటితో నిండుగా కనిపిస్తున్నాయి. సాగుకు అనుకూల వాతావరణం ఉంది కాబట్టి వరదకాలువలకు జలాశయాల్లోని గేట్లు ఎత్తివేయటం ద్వారా నీటిని వదులు తున్నారు. అయితే ఇంకా పూర్తి స్థాయిలో నీటిని వదలలేదని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో నీరు వదులుతామని ఇరిగేషన్‌ అథికారులు చెబుతున్నారు. విజయవాడ కృష్ణా బ్యారేజీలో 2200 క్యూసెక్కుల వరదనీరు చేరింది. బ్యారేజీలో 11 అడుగుల ఎత్తులో నీరు ఉంచి మిగతా నీటిని వరదకాలువల ద్వారా విడుదల చేస్తున్నారు.     కృష్ణాజిల్లాలో సాగునీటి విడుదల వ్యవసాయానికి ఉపయోగ పడుతుందని అధికారులు చెబుతున్నారు. సీలేరు వద్ద గోదావరి ఉధృతి ఎక్కువగా ఉంది.వరదనీటి ప్రవాహం పెరుగు తుండడంతో ఖమ్మం జిల్లా చింతూరు పల్లపుప్రాంతాల్లో ముందస్తుగా వరదనీటి ముంపును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. డొంకరాయి బాడవ నుంచి మూడు వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలేశారు. ఖమ్మం జిల్లా చర్ల వద్ద తాలిపేరు జలాశయంలో భారీగా వరదనీరు చేరింది. 18గేట్లు ఎత్తి 21వేల క్యూసెక్కల నీటిని గోదావరిలోకి వదిలారు. ఇలా వరద నీరు గోదావరిలోకి వదలటంతో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వద్ద గోదావరి నది వరదనీటితో ఉధృతంగా పెరుగుతోంది. దీంతో పల్లపుప్రాంతాల్లో వరదనీటి ఉధృతి ప్రభావం పడకుండా కాలువలకు నీరు వదులుతున్నారు. ఒకవైపు వర్షపునీరు, మరోవైపు వరదనీరు వల్ల సాగుకు ఇబ్బంది లేకపోయినా నీరెక్కువయ్యి పంటనీటమునిగే ప్రమాదం మాత్రం తప్పలేదని రైతులు గగ్గోలు పెడుతున్నాడు. వ్యవసాయాథికారులు మాత్రం ఈ సీజన్‌లో సాగుకు ఢోకా ఉండదని అంటున్నారు.

హాలీడేక్లబ్బుల్లో డబ్బులాటలు!

రాష్ట్రంలోని హాలీడేక్లబ్బుల్లోనూ, రీసార్ట్స్‌లోనూ పేకాట జోరుగా సాగుతోంది. ఆఫీసర్ల క్లబ్బులు కూడా ఈ పేకాటకు వేదికలవు తున్నాయి. దీంతో పేకాటరాయుళ్లు అందరూ క్లబ్బుల్లో సభ్యులుగా చెలామణి అవుతున్నారు. పోలీసులకు ఉన్న ఇతర భద్రత పరమైన కారణాల వల్ల ఈ క్లబ్బులపై పెద్దగా దృష్టిసారించటం లేదు. పైగా ఉన్నతస్థాయిలో ఉన్న వారందరూ ఈ పేకాటలో మంచి హ్యాండ్‌లుగా పేరుగడించటం వల్ల కూడా వీటిని పోలీసులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని టౌన్‌హాలు, ఆఫీసర్స్‌ క్లబ్బు కూడా పేకాట పాపారాయుళ్ల నెలవులుగా మారాయి.   దీనిపై ఎవరూ అంతగా దృష్టిసారించటం లేదు. కానీ, ఈ పేకాటతో పాటు తినటానికి తిండి, తాగటానికి మద్యం కూడా సరఫరా అవుతోంది. అందువల్ల మద్యం తాగే అలవాటున్న వారందరూ ఈ క్లబ్బుల చుట్టూ ఎక్కువగా తిరుగుతున్నారు. తూర్పుగోదావరి తరువాత దాని పక్కనే ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఈ తరహా చిత్రాలే కనిపిస్తున్నాయి. కృష్ణాజిల్లా కంచికచర్ల పరిటాల ఉమా హాలీడేక్లబ్బులో పేకాట మంచి జోరుగా ఉన్నప్పుడు పోలీసులు దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. ఇక్కడ భారీబెట్టింగులతో పేకాట జరుగుతోందని పోలీసులకు అందిన సమాచారం. దాని ప్రకారం దాడులు చేసిన పోలీసులు నిందితులను నందిగామకోర్టులో హాజరుపరిచే సమయంలో పేకాటరాయుళ్లు తప్పించుకున్నారు. దీనిపై ఆగ్రహించిన జిల్లా ఎస్పీ ఒక హెడ్‌కానిస్టేబుల్‌ను, తొమ్మిది మంది పోలీసులను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

కిరణ్‌కు కరెంట్‌ షాకివ్వబోతున్న బాబు

రాష్ట్రం విద్యుత్‌ అవసరాలను తీర్చే ప్రాజెక్టులున్నా చేతకాని తనం ప్రదర్శిస్తున్న ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. అధికార కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో తనకున్న పట్టును నిరూపించుకోవాల్సిన సమయంలో నిస్సహాయతగా కనిపిస్తోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌షిండేలా రాష్ట్ర అవసరాన్ని నొక్కిచెప్పలేకపోవటమే ప్రభుత్వవైఫల్యమని ప్రతిపక్షాలు గుర్తించాయి. ఆల్‌రెడీ మహారాష్ట్రకు గ్యాస్‌ మళ్లించేందుకు అంగీకరించిన తరువాత రాష్ట్రప్రభుత్వం తమ ఇబ్బందిని చెప్పుకోవటం వల్ల పెద్దగా ప్రయోజనముండక పోవచ్చని అవి ఓ అభిప్రాయానికి వచ్చాయి. ప్రత్యేకించి రాష్ట్రస్థాయిలో విద్యుత్తు సమస్య పరిష్కరించాలని ఏ పార్టీ ఉద్యమించినా మద్దతు ఇచ్చేందుకు యావత్తురాష్ట్రం సిద్ధంగా ఉంది. దీంతో దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. గతంలో విద్యుత్తు ఉద్యమం ద్వారానే కాంగ్రెస్‌పార్టీ అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ లోపాలను ఎత్తిచూపిన చరిత్ర టిడిపి గుర్తు చేసుకుంటోంది. ఆ పార్టీ అధిష్టానానికి ఇదే మంచి అవకాశమని రాష్ట్రంలోని పలుప్రాంతాల నుంచి జిల్లానేతలు సూచిస్తున్నారు. దీంతో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు విద్యుత్తు సమస్యపై రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతారని ఆ పార్టీశ్రేణులు చెబుతున్నాయి. ఇలానే సిపిఎం, సిపిఐ, వైకాపా కూడా ఈ ఉద్యమంలో పాల్గొనే అవకాశాలూ కనిపిస్తున్నాయి.   ఆంథ్రప్రదేశ్‌ రాష్ట్రం మొత్తం మీద 13,923మెగావాట్ల విద్యుత్తు ఉత్పాదనవుతుంది. అదీ అన్ని ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో పని చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. రాష్ట్ర డిమాండు 11,141 మెగావాట్లు. అంటే ఇంకా 2,782మెగావాట్ల విద్యుత్తు మిగిలిపోతుంది. థర్మల్‌ విద్యుత్తు సామర్థ్యం 6,167 మెగావాట్లు. ప్రస్తుత ఉత్పాదన 4,637మెగావాట్లు. ఇంకా థర్మల్‌ప్లాంటుల పరంగా 1.630మెగావాట్ల ఉత్పాదన కొరత ఏర్పడిరది. అలానే జలవిద్యుత్తు ఉత్పాదన సామర్థ్యం 3,936మెగావాట్లు. దీనిలో 217మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది. అంటే లోటు 3,719మెగావాట్లు. గ్యాస్‌, డీజిల్‌, నాఫ్తాల్‌ ఉపయోగించి 3,073మెగావాట్ల విద్యుత్తు ఉత్పాదన సామర్థ్యం ఉంది. అయితే ప్రస్తుతం 764 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. ఇంకా 2,109 మెగావాట్ల కొరత ఏర్పడిరది. ప్రస్తుతం రోజుకు 5,240మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. అంటే ఉత్పాదన సామర్థ్యంతో పోలిస్తే అది 47శాతం మాత్రమే. 2006`07లో గ్యాస్‌కు కొరత ఏర్పడిరది. విద్యుత్తుకేంద్రాలకు 1,293 ఎంఎంఎస్‌సిఎండి గ్యాస్‌ అవసరం. అయితే కేంద్రం రాష్ట్రానికి 4ఎంఎంఎస్‌సిఎండి గ్యాస్‌ సరఫరా చేస్తోంది. అవసరమైన గ్యాస్‌ అందిస్తాం పరిశ్రమలు పెట్టుకోవాలని కేంద్రం కోరటం వల్ల రాష్ట్రంలో గ్యాస్‌ ఆథారిత విద్యుత్తు ఉత్పత్తి పరిశ్రమలు ఏర్పాటు చేశారు. 2011`12లో గ్యాస్‌ సమస్యను తీరుస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. అయితే ఆ హామీని తుంగలోకి తొక్కింది. ఫలితంగా రోజుకు 16.67 ఎంఎంఎస్‌సిఎండి గ్యాస్‌ అవసరమవుతోంది.   డి`6 క్షేత్రం నుంచి 4.85ఎంఎంఎస్‌సిఎండి గ్యాస్‌ను కేంద్రం సరఫరా చేస్తోంది. ఇప్పుడు దీనిలో 2ఎంఎంఎస్‌సిఎండి గ్యాస్‌ మహారాష్ట్రకు తరలించినందున మిగిలిన గ్యాస్‌ను ఆంథ్రప్రదేశ్‌కు పంపిణీచేస్తుంది. అంటే 1.48ఎంఎంఎస్‌సిఎండి గ్యాస్‌ మాత్రమే సరఫరా అవుతోంది. దీని వల్ల 700మెగావాట్ల విద్యుత్తు కొరత తప్పదు.

విజయమ్మ దీక్ష ఓ ఎత్తుగడేనా?

వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మి అలియాస్‌ విజయమ్మ బోధనాఫీజులపై ఏలూరులో చేపట్టిన నిరాహారదీక్ష వెనుక ఏమైనా ఎత్తుగడ ఉందా? ఈ ప్రశ్న రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమవుతోంది. కేవలం ఎన్నికల సమయంలోనూ, అడపాదడపా ఆందోళనలు చేస్తున్న విజయమ్మ ఒక్కసారి విద్యార్థుల బోధనాఫీజుల గురించి ఆందోళన చేపట్టడం వెనుక బలీయమైన రాజకీయ కారణం ఉండే ఉంటుందని రాజకీయపరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పైగా రాష్ట్రప్రభుత్వం ఏకీకృత ఫీజుల విధానం గురించి తర్జనభర్జన పడుతున్న సమయంలో ఈ ఆందోళన చేపట్టడం పలువురి దృష్టిని ఆకర్షించటానికే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీలో విద్యార్థి విభాగం లేనందు వల్ల దాన్ని ఏర్పాటు చేసుకునేందుకు వైకాపా అథ్యక్షుడు జగన్మోహనరెడ్డి ఉస్మానియాయూనివర్సిటీని గతంలో టార్గెట్‌ చేశారు. ఇప్పుడు విజయమ్మ అన్ని జిల్లాలకు మధ్యస్తప్రాంతమైన ఏలూరులో దీక్ష చేపడుతున్నారు. ఇక్కడ దీక్ష చేపడితే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలను ఏర్పాటు చేయటం పెద్దపని కాదని ఆమె నమ్ముతున్నారు.  అందుకే ఈనెల 12,13తేదీల్లో దీక్ష చేస్తున్నామని ప్రకటించారు. వైఎస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన బోధనాఫీజుల పథకాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం నీరుకారుస్తోందని ఆమె విమర్శిస్తున్నారు. అర్హులైన పేదవిద్యార్థులకు ఫీజురీయంబర్స్‌మెంట్‌ వర్తింపజేయాలని డిమాండు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థుల మెస్‌ఛార్జీలు పెంచాలని డిమాండు చేశారు. ఈ డిమాండ్ల ఆధారంగా మైనార్టీ విద్యార్థులను, ఎస్సీ,ఎస్టీ విద్యార్థులను ఆకర్షించేందుకు వైకాపా ఎత్తుగడ వేసిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

బోర్డు తిప్పేస్తున్న సాఫ్ట్‌వేర్‌ సంస్థలు!

అమెరికాలో ఉన్న భారతసాఫ్ట్‌వేర్‌ సంస్థలు ఎలా మాంద్యంలో కొట్టుమిట్టాడు తున్నాయో రాష్ట్రపరిస్థితిని పరిశీలిస్తే అర్థమవుతోంది. ఇటీవల కాలంలో అనుకున్నంత స్పందన రాక, నష్టాలు భరించలేక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు తమ షేర్‌హోల్డర్స్‌కు కూడా చెప్పకుండానే బోర్డులు తిప్పేస్తున్నాయి. దీంతో హతాశులైన వాటాదారులు పోలీసులను ఆశ్రయించి తాము మోసపోయిన విధానాన్ని తెలియజేసి కేసులు పెడుతున్నారు. సాఫ్ట్‌వేర్‌ బూమ్‌ లేకపోవటం వల్ల ఇటీవల కాకినాడలో టెక్నికల్‌సెజ్‌లో ఎటువంటి నిర్మాణం జరగలేదు. అందుకే అక్కడ భూమి ఖాళీగానే ఉంది. ఇండస్ట్రీయల్‌ ఎస్టేట్‌కు దగ్గరలో ఉన్న ఈ సెజ్‌లో నిర్మాణానికి ఏ కంపెనీ కూడా ముందుకురావటం లేదని తెలుస్తోంది.   కేంద్ర మంత్రి పళ్లంరాజు విజ్ఞప్తి మేరకే ఈ సెజ్‌ను నెలకొల్పారే మినహా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్‌ రంగంతో భవిష్యత్తు ముడిపడి ఉన్నా ఆంధ్రప్రదేశ్‌లో అనుకున్నంత అభివృద్థి సాధించలేకపోతున్నామని ప్రపంచ సాఫ్ట్‌మార్కెట్‌ విజేత మైక్రోసాఫ్ట్‌ ఉన్నత ఉద్యోగి ఒకరు స్పష్టం చేశారు. అందుకే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు మూతపడుతున్నాయని ఆయన అభిప్రాయపడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌రోడ్డులో ఆర్చీస్‌ఐటీ ప్రాజెక్టు సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో ఆగ్రహించిన బాధితులు ఆ కంపెనీ యజమాని చిరునామా తెలుసుకుని ఆయన్ని నిలదీసిన తరువాత సరైన సమాధానం రాలేదని చితకబాదారు.పైగా, యజమానిని పోలీసులకు అప్పజెప్పారు. అన్ని ప్రాంతాల్లోనూ ఇదే తరహా స్ఫూర్తి ఉండదు కాబట్టి యజమానులు అన్నీ సర్దుకుని వెళ్లిపోతున్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుందని సాఫ్ట్‌వేర్‌ నిపుణులు ఆందోళనగా ఎదురుచూస్తున్నారు.

తూర్పు, విశాఖ ఏజెన్సీలను వీడని గంజాయిసాగు?

తూర్పుగోదావరి, విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాలు గంజాయి సాగుకు అడ్డాగా మారుతున్నాయి. దీనిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎక్సయిజ్‌శాఖ దాడులు చేయటం లేదు. అమాయక గిరిజనులను మాఫియాముఠాలు లొంగదీసుకుని మరీ ఈ సాగు చేయిస్తున్నాయని తెలుస్తోంది. పేదగిరిజనులు మాఫియా ముఠాల వలలో పడి గంజాయిసాగు చేస్తూ దాని రవాణా సమయంలో ఎవరైనా దాడి చేస్తే నిందితులుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కువ డబ్బు వస్తుందన్న సాకు చూపి మాఫియా వీరిని లొంగదీసుకుందని బాధితకుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా మన్యంతో పాటు సబ్‌ప్లాన్‌ ఏరియా కూడా గంజాయి సాగుకు అనుకూలంగా ఉంటుంది.     అందుకే ఈ సబ్‌ప్లాన్‌ఏజెన్సీలో కూడా సాగు చేస్తున్నారు. ఇటీవల కత్తిపూడి వద్ద సబ్‌ప్లాన్‌ ఏజెన్సీలో పండిన గంజాయి భారీస్థాయిలో దొరికింది. తాజాగా సబ్‌ప్లాన్‌ పరిధిలోని ఆంధ్రాశబరిమలై ప్రాంతంలో కూడా గంజాయి సాగు జరుగుతోందని వదంతులు వ్యాపించాయి. ఇక్కడ సాగు చేసిన గంజాయిని రహస్యంగా పొరుగురాష్ట్రాలకు రవాణా చేస్తున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. విశాఖ నగరంలోని పాడేరు వద్ద 50కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖజిల్లాలోని అరకులోయ, పాడేరు, గిరిజన లోతట్టు గ్రామాల్లో రహస్యంగా సాగు జరుగుతోందని స్పష్టమైన సమాచారం ఉన్నా రాజకీయప్రాబల్యం వల్ల ఆ ప్రాంతాలకు ఎవరూ వెళ్లటం లేదని తెలుస్తోంది. దీనిపై ఇకనైనా దృష్టి సారించి అమాయకగిరిజనులను గంజాయిసాగు నుంచి తప్పించాలని పలుగిరిజన, ఆదివాసీ సంఘాలు రాష్ట్రప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాయి.

రాష్ట్రంలో విచ్చల విడిగా కల్తీ కల్లు, సారా, మద్యం అమ్మకాలు

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ కల్తీ మద్యం, కల్తీసారా, కల్తీకల్లు అమ్మకాలు యథేశ్ఛగా సాగుతున్నాయని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఆబ్కారీ(ఎక్సయిజ్‌) శాఖ అసలు శాంపిల్స్‌ సేకరించకుండా వ్యాపారులకు మితిమీరిన స్వేచ్ఛ ఇవ్వటం వల్లే ఈ పరిస్ధితి ఏర్పడిరది. ఈ శాఖ తన ల్యాబ్‌లను విస్తరించినా దాడులు చేసి శ్యాంపిల్స్‌ సేకరణలో ఉదాసీనత చూపుతోందన్నది ప్రస్తుత పరిస్థితులను అథ్యయనం చేస్తే వెలుగులోకి వచ్చిన విషయం. ట్రైన్డ్‌ ల్యాబ్‌ సిబ్బంది ఉన్నా ఎందుకు ఈ శాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోందంటే పలురకాల అంశాలు తెరపైకి వచ్చాయి. మొదటి అంశంగా ఆమ్యామ్యాల పంపిణీ సక్రమంగా జరగలేదనిపిస్తేనే ఆబ్కారీసిబ్బంది దాడులతో విరుచుకుపడుతున్నారని తెలుస్తోంది. అప్పుడు కూడా బ్రాందీషాపుల్లో ఉన్న కల్తీ వదిలేసి సారాపైన నిఘా వేస్తున్నారట.   అదే సారా కల్తీపై కసరత్తు చేస్తే కల్లు గురించి అస్సలు పట్టించు కోవటం లేదట. కోట్లకు పడగలెత్తిన ధనవంతులైతే వారి జోలికి ఆబ్కారీ వెళ్లాల్సిన పని లేకుండా స్వచ్ఛమైన సరుకు శాంపిల్స్‌ శాఖే ముందుగా సిద్ధం చేస్తోందట. ఇలా తనకు వచ్చే లాభం ఆధారంగా దాడులు శ్యాంపిల్స్‌ సేకరిస్తున్నారని, ప్రత్యేకించి కేసులు పెట్టడమే టార్గెట్‌ అయ్యే సమయంలోనే దాడులపై దృష్టిసారిస్తున్నారని సమాచారం. ప్రత్యేకించి మద్యం, సారా, కల్లు మూడిరటిపైనా సమదృష్టితో కల్తీని నివారించేందుకు శాఖపరమైన కసరత్తులు ఏమీ చేయట్లేదన్నది జగమెరిగిన సత్యం. ఈ మూడిరటిపైనా స్పష్టమైన వైఖరితో ఆబ్కారీ వ్యవహరించినంతవరకూ కల్తీ తాగుబోతుల ప్రాణాలు తీస్తూనే ఉంటుంది. తాజాగా మెదక్‌జిల్లా మిరుదొడ్డి మండలం చేప్యాలలో కల్తీకల్లు తాగి 15మంది అస్వస్తతకు గురయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మూడు నెలల క్రితం కల్తీసారా తాగి తూర్పుగోదావరి జిల్లాలో పదిమంది అస్వస్థతకు గురయ్యారు. అలానే ఇక్కడ అన్ని బ్రాండ్‌ల మద్యం తాజాగా కల్తీ అయి అమ్మకం జరుగుతోందన్న ఆరోపణలూ ఎక్కువగా వినిపిస్తున్నాయి. రెండు నెలల క్రితం ప్రకాశం జిల్లాలోనూ కల్తీమద్యం, సారాల వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనలు వరుసగా వెలుగులోకి వచ్చాయి. ఏదేమైనా కల్తీల నివారణకు కఠినచర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆబ్కారీ గుర్తించాలని పలువురు కోరుతున్నారు.

పోలీసుశాఖను పీడిస్తున్న నకిలీల బెడద!

నకిలీ ఎస్‌ఐలు, సిఐలు పోలీసుశాఖను పీడిస్తున్నారు. రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో వీరి ఆగడాలు భరించలేక పోలీసుశాఖను కొందరు ఆశ్రయించినప్పుడే అసలు భాగోతం బయటపడుతోంది. దొంగడబ్బు సంపాదించే వారిని లక్ష్యంగా చేసుకుని పుట్టుకొచ్చిన ఈ నకిలీలు పొరపాటుగా సక్రమ సంపాదన ఉన్నవారిని వేధిస్తున్నపుడు మాత్రమే పోలీసుశాఖకు వీరి గురించి తెలుస్తోంది. లేకపోతే అసలు సమాచారమే దొరకటం లేదు. అంతేకాకుండా ఇటీవల చెక్‌పోస్టుల ముందు కూడా ఇటువంటి నకిలీల హంగామా పెరిగిందనీ, సినీఫక్కీలో వాహనాలను ఆపి డబ్బు దోచుకుని వెళ్లిపోతున్నారని పలురకాల కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు పోలీసు శాఖ ఇంత వరకూ ఐడెంటీకార్డుల ఆధారంగా పని చేయకపోవటమే సమస్యకు మూలమని కొందరు సీనియర్లు తేలుస్తున్నారు. పోలీసులే ఐడెంటీకార్డులు చూపించుకుంటూ తిరిగితే వారిపై ఉన్న రక్షణ, భద్రత అనే బాధ్యతలకు అర్థం లేకుండా పోతుందని కొందరు వాదిస్తున్నారు. వీరి వాదనలకు ప్రతిఫలంగా నకిలీభారం కూడా పోలీసుశాఖ మోయాల్సివస్తోంది.   హైదరాబాద్‌ హయత్‌నగర్‌లో సిఐని అని చెప్పుకుంటూ తిరుగుతున్న నకిలీ సిఐ శ్రీనివాసులు అలియాస్‌ ప్రశాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిఐ అనే పేరిట ప్రశాంత్‌ అనేకరకాల మోసాలకు పాల్పడ్డారని అనేక ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈయనలాగానే తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లోనూ నకిలీల సమస్యను ఎదుర్కొన్నారని సమాచారం. ఈ బెడద గురించి రాష్ట్రహోంశాఖ కానీ, మంత్రి కానీ దృష్టిసారించిన దాఖలాలు లేవు. ఒక్కసారి దృష్టిసారిస్తే ఇటువంటి మోసాలు అరికట్టడం ఎంతో కష్టమైతే కాదు. మరి పోలీసుశాఖ ప్రయత్నమైనా చేస్తే సామాన్యులు బాధపడనక్కర్లేదు.

కిరణ్‌ అసమర్ధత వల్లే రాష్ట్రం తరలిపోతున్న గ్యాస్‌

ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసి మహారాష్ట్ర పొట్టనింపారని కేంద్రం చేసిన గ్యాస్‌ కేటాయింపులపై దుమారం లేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌క అవసరమైన విద్యుత్తు తయారీకి గ్యాస్‌ను కేటాయించకుండానే కేంద్రం మహారాష్ట్ర సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించిందని విమర్శలు మిన్నంటుతున్నాయి. అసలు ఒక రాష్ట్రానికి అన్యాయం చేస్తూ పక్క రాష్ట్రానికి న్యాయం చేసే ఈ ఆలోచన వెనుక ఎవరి హస్తముందన్న దానిపై ఆంధ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.       కేంద్రస్థాయిలో తాము చేసింది అన్యాయమని గుర్తించినందునే వివరణలు ఇస్తూ మంత్రిత్వశాఖ ప్రకటనలు గుప్పిస్తోందని మేథావులు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్ర రత్నగిరి ప్లాంట్‌కు గ్యాస్‌ కేటాయింపు అనేది ఒక విధానం ప్రకారం జరిగిందేనని మంత్రిత్వశాఖ ప్రకటన జారీ చేసింది. 2008లో నిర్ణయించిన గ్యాస్‌ వినియోగ విధానం ప్రకారమే రత్నగిరికి కేటాయింపులు చేశామని స్పష్టంగా ప్రకటనలో తెలియజేసింది. ఎరువుల కర్మాగారానికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఈ గ్యాస్‌ ఇచ్చామని పెట్రోలియం మంత్రిత్వశాఖ తన ప్రకటనలో సరిపెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎరువుల కర్మాగారాలు, చిన్న పరిశ్రమలు, విద్యుత్తు ఆథారిత వ్యాపారాలు మూతపడుతున్నాయి. దీనికి కారణం విద్యుత్తు సరఫరాలో కోతను పెంచటం, తయారీ తగ్గటం అనే అంశాలే అని గుర్తించారు. ఇటీవల హైదరాబాద్‌ వచ్చిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్‌పవార్‌కు కూడా ఈ రెండు అంశాలపై రాష్ట్రప్రభుత్వం విన్నవించుకుంది.   ఈ సమస్యను ఖచ్చితంగా పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన పవార్‌ తన పవర్‌ను ఉపయోగించలేదని విమర్శలు మిన్నంటుతున్నాయి. ఇదేకాకుండా ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెడుతున్న గ్యాస్‌ను మళ్లించి విద్యుత్తు తయారీకి కేటాయింపులు చేయాలన్న సూచనలనూ కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ పక్కన పెట్టింది. అందుకే మహారాష్ట్ర రత్నగిరి ప్లాంట్‌కు గ్యాస్‌ కేటాయింపు చేసేసి ఇక్కడి సమస్యను మరిచిపోయింది. ఫలితంగా ఆంథ్రప్రదేశ్‌లో 400మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి గండిపడిరది. రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సామరస్యపూర్వకంగా విద్యుత్తు సమస్యను పరిష్కరిద్దామని కేంద్రంపై ఎటువంటి నిరసన గళం విప్పలేదు. అందుకే అంత యథేశ్ఛగా ఇక్కడి గ్యాస్‌ గుజరాత్‌కు చేరుతోందన్నది జగమెరిగిన సత్యం.   అతితక్కువ డిమాండు వ్యత్యాసం ఉన్నా రాష్ట్రం దాన్ని పూడ్చలేకపోవటం వెనుక సిఎం మెతకదనం ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన కేంద్ర నాయకత్వం దృష్టికి సమస్య తీసుకెళితే పరిష్కారం అవుతుందని సిఎం భావించారే కానీ, ఎటువంటి చొరవ తీసుకోలేదన్నది ప్రస్తుత వాతావరణం నిరూపిస్తోంది. కనీసం దీని కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి కేంద్రస్థాయిలో తీవ్రమైన కృషి ఈ నెలరోజుల్లో చేసి ఉంటే ఈపాటికి సమస్య పరిష్కారమయ్యేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా కెటిపిఎస్‌ విద్యుత్తు సాంకేతిక లోపం కూడా కోతల వేళలను పెంచేందుకు దోహదపడుతోందని సమాచారం. ఇలానే పరిస్థితి కొనసాగితే తెలుగుదేశంపై అథికారం కోసం కాంగ్రెస్‌ పార్టీ అప్పట్లో చేపట్టిన విద్యుత్తుదీక్షల యుద్ధం తిరిగి ప్రారంభమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. నిరసన గళాలు విప్పితేకానీ, విద్యుత్తు సమస్య పరిష్కారం కాదని ఇప్పటికే పలు పార్టీలు భావిస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం తప్పిదం వల్ల కోత వచ్చింది కాబట్టి ఇది చేతకాని ప్రభుత్వం అని ప్రతిపక్షాలు నిరూపించేందుకు తగిన వాతావరణం ఇప్పుడుంది. దీన్ని గుర్తించైనా సిఎం, రాష్ట్రప్రభుత్వం వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించాలని, పరిశ్రమలకు జరుగుతున్న వందల కోట్ల నష్టం భవిష్యత్తులో జరగకుండా చూడాలని రాజకీయపరిశీలకులు సూచిస్తున్నారు.