కోర్టును తప్పుదోవ పట్టించారా? ..కోర్టులే తప్పుదోవ పడుతున్నాయా?
posted on Aug 1, 2012 @ 9:52AM
పదిమంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కాని ఒక్క నిర్ధోషికి కూడా శిక్ష పడకూడదనే కాన్సెప్ట్‌తో పని చేస్తున్న ఇండియన్ కోర్టుల్లో లక్ష ల కొద్దీ పేరుకుపోయిన కేసులు జాతిని భయపెడుతున్నాయి. జడ్జిల కొరత ఈ సమస్యకు మూలకారణం. సివిల్‌కేసుల విషయంలో తీర్పుకోసం చూడాలంటే కనీసం రెండు తరాలు పడుతుంది. క్రిమినల్ కేసులయితే 20 నుండి 30 సంవత్సరాలు పడుతుంది. అతిపెద్ద క్రిమినల్ కేసయిన దివంగత ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ కేసులో నిందుతులకు శిక్ష ఖరారు కావడానికే పదేళ్ల సుదీర్ఘ కాలం వెచ్చించిన దేశం మనది. ఇలాంటి దౌర్బాగ్యం మరే దేశంలోనూ కనిపించదు. అందుకే సామాన్యమానవుడు కోర్టుకెళ్లాలంటేనే భయపడుతుంటారు.
ఇటువంటి పరిస్థితుల్లో దేశంలోనూ, రాష్ట్రంలోనూ గాలిజనార్దన్ రెడ్డి బెయిల్ కేసులో రోజుకొక న్యాయమూర్తి కటకటాలపాలవుతుంటే కోర్టులంటే సామాన్య ప్రజలకు ఏవగింపు కలుగతోంది.ఈ సంఘటన తర్వాత న్యాయమూర్తులంటే గౌరవం పోయింది. కాస్తో కూస్తో కోర్టుల మీద పాజిటివ్ థింకింగ్ ఉన్న వారంతా ప్రజాప్రయోజనాలకోసం ఎవరిమీదైనా కేసువేస్తే వచ్చే లేటెస్టు తీర్పు.... కోర్టును తప్పుదోవ పట్టించారని లేదా కోర్టు సమయాన్ని పాడుచేశారని ఫైన్ వేయటం లేటెస్ట్ ట్రెండ్ అయ్యింది. కోర్టుకు ఇప్పుడు న్యాయాన్యాయాలను బేరీజు వేసి సామాన్యుడికి నిజాలు చెప్పే టైమ్ లేకపోవడమే దీనికి కారణం. కోర్టులకు ఇష్టమయితే ఎవరిమీదయినా ఏదైనా విమర్శ చేసి , అత్యుత్సాహం ప్రదర్శించి సుమోటోగా తీసుకుంటుంది. ఇష్టం లేకపోతే ఒకే రకమైన కేసులపై పరస్పర నిర్ణయాలు తీసుకుంటుంది. ఇలా చేయడం వల్ల కోర్టు తీర్పులు వివాదాస్పదమవుతున్నాయి.