ఆ ఇద్దరు మంత్రులు ఏ పనీ చేయరా ?
posted on Jul 31, 2012 @ 12:00PM
విద్యాశాఖను పర్యవేక్షించే ఇద్దరు మంత్రులూ ఏమీ చేయట్లేదని విమర్శలు గుప్పుమంటున్నాయి. పాఠశాలలు, కాలేజీలు సమస్యలతో సతమతమవుతుంటే మంత్రులిద్దరూ మౌనంగా ఉన్నారు. ఈ మౌళికసమస్యలతో పాటు ఉద్యోగ సమస్యలూ శాఖాపరంగా పరిష్కారానికి నోచుకోవటం లేదని ఆరోపణలు ఎక్కువయ్యాయి. ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పార్థసారధి రాజీనామా చేయాలని డిమాండు వినిపిస్తోంది. ఈ డిమాండును రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పట్టించుకోవటం లేదని విమర్శలు వస్తున్నాయి. మంత్రి పార్థసారధి ఇటీవల ఫెరా చట్టం ఉల్లంఘన కింద నేరారోపణకు గురైనా ఎందుకు రాజీనామా చేయలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంటే తన సొంతవ్యాపారం కోసం చట్టాన్ని ఉల్లంఘించిన మంత్రి అవసరమా అని ఆందోళనకారులు ప్రశ్నిస్తున్నారు.
పైగా పాఠశాలల్లో పేరుకుపోయిన సమస్యలపై మంత్రి పార్థసారధి దృష్టి సారించలేదని, వాటికి అవసరమైన నిధులు మంజూరు చేయలేదని ఐక్య ఉపాథ్యాయఫెడరేషన్ అధ్యక్షుడు నారాయణ ఆరోపిస్తున్నారు. ప్రత్యేకించి మంత్రి రాజీనామా చేయాల్సిందేనని ఆయన డిమాండు చేస్తున్నారు. రెండు సార్లు విద్యాపక్షోత్సవాలు జరిపినా ప్రభుత్వం నుంచి అనుకున్నంత స్పందన లేదని ఆందోళన వ్యక్తం చేశారు. డిప్యూటీ,ఈవో, గెజిటెడ్ ప్రధానోపాథ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. సాక్షాత్తూ ఉపాథ్యాయులే రోడ్డుపైకి వచ్చి మంత్రుల పనితీరును చాటుతుంటే మరి వారేం పని చేస్తున్నారో ఆ మంత్రులకే తెలియాలి. ఎయిడెడ్‌పాఠశాలలకు పుస్తకాలను అందజేయలేదంటే మంత్రులు కనీసకర్తవ్యం, బాధ్యత ఫీలవ్వట్లేదని వేరేగా చెప్పాలా? మరి సిఎం నేరుగా ఈ సమస్యలను పరిష్కరించాలని ఉపాథ్యాయులు కోరుతున్నారు.