ప్రాణాలు తీస్తున్న రైలు ప్రమాదాలు
posted on Jul 31, 2012 @ 11:03AM
దేశంలో రైలు ప్రమాదాలు యేటేటా పెరుగుతున్నాయి. రైల్వే భద్రతకు అత్యధిక ప్రాధాన్యత నిస్తున్నామని రౖెెల్వే మంత్రి ఎప్పటి కప్పుడు చెబుతున్నా ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. డిల్లీనుండి బయలు దేరిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరు దగ్గర జరిగిన దారుణ అగ్నిప్రమాదంలోని మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ హృదయ విదారక సంఘటన నాలుగేళ్లక్రితం జరిగిన గౌతమీ ఎక్స్‌ప్రస్ ఘటనను గుర్తుకు తెచ్చింది. అప్పుడు కూడా అర్ధరాత్రి ప్రయాణీకులంతా నిద్రలో ఉన్న సమయంలోనే అనంతలోకాలకు ప్రయాణం కావాల్సివచ్చింది. ఆ సంఘటనలో 32 మంది చనిపోయారు. చనిపోయిన ప్రయాణీకులకు సంబంధించిన పూర్తిగా కాలిపోయిన మృతదేహాల ఎముకల పోగులై ట్రైను డోర్లు దగ్గర పడివుండటం చూపరులను కలచి వేసింది. కళ్ల ముందే కాలిపోతున్నా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి పోయామని అదే ట్రయిన్‌లో ప్రయాణిస్తున్న అప్పటి మంత్రి సూర్యారావు చెప్పిన విషయం తెలిసిందే.
గౌతమీ ఎక్స్‌ప్రెస్ సంఘటనకు కారణంగాని, సంస్థలు,వ్యక్తుల్ని గురించి గాని ప్రభుత్వం ఇంతవరకు ఏ ప్రకటనాచేయలేదు. దీనివల్ల ప్రభుత్వం గౌతమీ ఎక్స్‌ప్రెస్ దారుణ సంఘటనకు సంబంధించి ఎటువంటి దర్యాప్తు చేయించలేదని తెలుస్తోంది. ఆ సంఘటనతోనే రైల్వే అధికారులు,కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు స్పందించి సంఘటనకు బాధ్యులెవరో తెలుసుకుని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకొని వుంటే తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌కు ఈ ప్రమాదం వచ్చి ఉండేది కాదు. ఇప్పటికైనా రైల్వే శాఖ విచారణ జరిపించి బాధ్యులను శిక్షించి సురక్షకమైన ప్రయాణానికి ఏర్పాట్లు చేయాలని, రైల్వే లాభాలనే ఆర్జించేదే కాకుండా భద్రత కూడా కల్పించాలని ప్రయాణీకులు, ప్రజలు కోరుతున్నారు.