ముందస్తు అయినా కాకున్నా మునక ఖాయం!
ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి .. ఎటూ పోలేని పరిస్థితిలో ఏపీ ప్రభుత్వం…కొట్టుమిట్టాడు తోందా అంటే,పబ్లిక్ టాక్ అవుననే అంటోంది. మేథావులు అయితే, మహా కవి శ్రీ శ్రీ సంధ్యా సమస్యలు గీతాన్ని గుర్తు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని కూడా అదిగో అలాంటి సంధ్యా సమస్యలే వెంటాడుతున్నాయి అంటున్నారు. అందుకే పరిస్థితి ఎటూ పాలుపోక గుడుగుడు గుంజం గుండేరాగం .. అన్నట్లు ముందస్తు ఎన్నికల చుట్టూ అక్కడక్కడే, గిరగిర తిరుగుతోందని, వైసీపీ నేతలు పిల్లి మొగ్గలు వేస్తున్నారని అంటున్నారు. నిజానికి, ఓటమి భయం తోనే వైసీపీ నేతలు ఏమి చేయడమో ... ఎటు పోవడమో పాలుపోని పరిస్థితిలో ఉన్నారని అంటున్నారు. ముందస్తు ఎన్నికలకు పోదామంటే, ముందుగానే ఇంటికి పోతామని సొంత పార్టీ ఎమ్మెల్యేలే హెచ్చరిస్తున్నారు. అలాగని అందాక అగుదామంటే..అసలుకే మోసం వచ్చేలా వుందన్న అనుమానం పీడిస్తోంది. అందుకే అధికార పార్టీ నేతలు ముందస్తు ఎన్నికల అట్టును, ఒక రోజు ఇటు ఒక రోజు అటు తిరగేస్తున్నారు.
నిజానికి, ముందస్తు ఎన్నికలను ముందుగా తెరపైకి తెచ్చిందే అధికార పార్టీ నాయకులు.. ఒకసారి కాదు ఒకటికి పదిసార్లు వైసీసీ పార్టీలో, జగన్ రెడ్డి ప్రభుత్వంలో ‘ఆల్ ఇన్ వన్’ గా చెలామణి అవుతున్న సజ్జల రామకృష్ణా రెడ్డి ముందస్తు ఉందనో లేదనో వాక్రుచ్చి, ఎప్పటికప్పుడు ముందస్తు చర్చను సజీవంగా ఉంచుతున్నారు. అలాగే ప్రజలు కూడా ముందస్తా వెనకస్తా అనేది పక్కన పెట్టి, ఎన్నికలు ఎప్పడు వచ్చినా, ఒక్క ఛాన్స్ మోసానికి గట్టిగా బుద్ధి చెప్పాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. అయితే, వైసీపీ నాయకులు మాత్రం ఇంకా తమను తాము మోసం చేసుకుంటూ, ప్రజలను మోసం చేసే విఫల ప్రయత్నం చేస్తున్నారు. అయినా అసలు ముందస్తు విషయంలో జగన్ ఏ ధైర్యంతో ముందడుగేస్తారన్న ప్రశ్న పరిశీలకులు వేస్తున్నారు.
ఆఖరు క్షణం వరకూ అధికారంలో ఉండేందుకే ఆయన చూస్తారని అంటున్నారు. అన్ని వైపుల నుంచీ వ్యతిరేక పవనాలు ప్రస్ఫుటంగా వీస్తున్న సంగతి తేటతెల్లంగా కనిపిస్తుంటే.. ముందస్తుడు అడుగు ముందుకేసే అవకాశమే లేదని అంటున్నారు. చివరి వరకూ అధికారంలో కొనసాగితే ప్రతిపక్షాన్ని దెబ్బతీయడానికి ఏదో ఒక అవకాశం దొరకదా అన్న దింపుడు కళ్లెం ఆశను సజీవంగా ఉంచుకోవడానికైనా జగన్ ముందస్తుకు అడుగు ముందుకు వేయరని చెబుతున్నారు.
అయితే ముందస్తు ముచ్చటను పదేపదే తెరమీదకు తీసుకురావడం ద్వారా విపక్షాలను కన్ష్యూజ్ చేయడం, వారి వ్యూహాలకు చెక్ పెట్టడం అనే విధానాన్ని జగన్ ఫాలో అవుతున్నారంటున్నారు. రాజకీయ పరిశీలకులు మాత్రం ఒకసారి ప్రజలు నిర్ణయానికి వచ్చిన తర్వాత, ముందస్తు వెనకస్తు తేడాలుండవంటున్నారు. అయినా జగన్ ముందస్తుకు వెళ్లాలంటే అందుకు ప్రజలకు కారణం చెప్పి తీరాలి. ఆర్థిక సంక్షోభమా, మూడు రాజధానులా, సంక్షేమానికి విపక్షాలు అడ్డుపడుతున్నాయనా, ఎందుకు ముందస్తుకు వెళుతున్నామన్న దానికి జగన్ జవాబు చెప్పాల్సి ఉందని అంటున్నారు.