గాజు గ్లాసు పవన్ చేజారిందా?

జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. 2019లో ఆ పార్టీకి అధికారికంగా కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఉపసంహరించుకుంది. ఈ సారి గాజు గ్లాస్ చిహ్నాన్ని ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చడం ద్వారా జనసేనకు ఈసీ షాక్ ఇచ్చింది. ఏపీ నుంచి రెండు పార్టీలు మాత్రమే రాష్ట్ర స్థాయిలో అధికారికంగా గుర్తింపు పొందిన పార్టీలుగా ఈసీ పేర్కొన్న సంగతి తెలిసిందే. అవి అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం పార్టీలు. దీంతో ఆ రెండు పార్టీల ఎన్నికల చిహ్నాలైన ఫ్యాన్, సైకిల్ గుర్తులను ఈసీ రిజర్వ్ చేసింది. అదే సమయంలో అధికారిక గుర్తింపు పొందని జనసేనకు గత ఎన్నికల సమయంలో కేటాయించిన గ్లాసు చిహ్నాన్ని ఈ సారి ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చింది.  2019 ఎన్నికలలో గుర్తింపు కోసం అవసరమైనన్ని ఓట్లు జనసేనకు రాకపోవడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. కానీ జనసేనకు తమ పార్టీకే గాజు గ్లాసు గుర్తు కేటాయించాలని ఈసీని కోరే అవకాశం మాత్రం ఉంది.  గత ఎన్నికల్లో జనసేన పార్టీ మొత్తం గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేసినందున ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత తమ పార్టీ అభ్యర్థులందరికీ అదే గుర్తు కేటాయించాలని జనసేన కోరుకునేందుకు వెసులుబాటు ఉంది. అందుకు ఈసీ ఆమోదం తెలిపే అవకాశాలు కూడా ఉన్నాయి.  అయితే.. ఇక్కడో చిక్కు ఉంది. అలా కోరాలంటే జనసేన రాష్ట్రంలోని 175 స్థానాలలోనూ పోటీలో ఉండాల్సి ఉంటుంది. అయితే జనసేన, తెలుగుదేశంతో పొత్తులో భాగంగా కొన్ని స్థానాలలోనే పోటీ చేసే అవకాశాలు ఉండటంతో.. జనసేన పోటీలో లేని నియోజకవర్గాలలో గాజు గ్లాసు సింబల్ ను స్వతంత్రులెవరైనా కోరితే.. అక్కడ వారి విజ్ణప్తిని ఈసీ తిరస్కరించే అవకాశం ఉండదు. అంటే జనసేన పోటీ చేసే స్థానాలలో ఈ పార్టీకి గాజు గ్లాసు గుర్తును ఈసీ కేటాయించినా, ఆ పార్టీ పోటీలేని నియోజకవర్గాలలో ఎవరైనా ఇండిపెండెంట్ అభ్యర్థికి ఆ గుర్తు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఓటర్లలో ఒకింత అయోమయం ఏర్పడేందుకు వీలుంటుంది. అంటే తెలుగుదేశం పోటీ చేసే నియోజకవర్గాలలో ఇండిపెండెంట్ కు గాజు గ్లాసు గుర్తు కేటాయించిన సందర్భం ఉంటే ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది అంతిమంగా తెలుగుదేశం, జనసేనకు నష్టం చేకూరుస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

వివేకా హత్యకేసు.. సీబీఐ దర్యాప్తులో వేగం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్ రెడ్డి సొంత బబాయ్ వివేకా హత్య కేసు దర్యాప్తులో గత కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్నట్లు కనిపించిన సీబీఐ అధికారులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఆ క్రమంలో మంగళవారం పులివెందుల్లోని కడప ఎంపీ  అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి.. ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డి కారు డ్రైవర్‌కు నోటీసులు అందించినట్లు సమచారం.  మరో వైపు మే 16వ తేదీ హైదరాబాద్‌ కోఠిలోని తమ కార్యాలయానికి రావాలని సోమవారం  అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు వాట్సప్‌లో నోటీసులు పంపారు.  దీంతో మంగళవారం సీబీఐ విచారణకు ఆయన హాజరవుతారని అంతా భావించారు. కానీ తనకు ముందుగా షెడ్యూల్ చేసుకున్న పార్టీ కార్యక్రమాలు ఉన్నాయని..   తనకు విచారణకు హాజరయ్యేందుకు నాలుగు రోజుల గడువు కావాలని సీబీఐ అధికారులను ఆయన కోరారు. తొలుత అందుకు నిరాకరించిన సీబీఐ మళ్లీ ఏమనుకుందో ఏమో మే 19న  గంటలకు విచారణకు హాజరుకావాలంటూ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. కానీ అంతలోనే మళ్లీ సీబీఐ అధికారులు .. పులివెందుల్లోని అవినాష్ రెడ్డి నివాసానికి వెళ్లి నోటీసులు ఇవ్వడంపై ఉమ్మడి కడప జిల్లా వాసుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.   మరోవైపు  వివేకా హత్య కేసులో వైయస్ అవినాష్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ... వివేకా రాసినట్లుగా చెబుతున్న  లేఖను ఆయన అల్లుడు రాజశేఖరరెడ్డి దాచిపెట్టమన్నారంటూ పలు సందేహాలు వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లో సదరు లేఖపై సీబీఐ ప్రస్తుతం దృష్టి సారించింది. ఆ క్రమంలో సదరు లేఖపై వేలిముద్రలు ఎవరెవరివో శోధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులోభాగంగా ఆ వేలి ముద్రలు ఎవరివో గుర్తించేందుకు నిన్ హైడ్రేట్ పరీక్షకు అనుమతి ఇవ్వాలని కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు, నిందితుల అభిప్రాయాలను కోరింది. దీంతో జూన్ 2వ తేదీన ఈ అంశంపై విచారించే అవకాశం ఉందని సమాచారం.   అయితే వైయస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ ఇక అనివార్యమనే  ఓ చర్చ సైతం ఉమ్మడి కడప జిల్లాలో నడుస్తోంది.  ఎందుకంటే  ఇప్పటికే ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆ వెంటనే వైయస్ అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ అయిపోతారని అంతా భావించారు. చివరకు తాను కూడా అరెస్ట్ అయిపోతానని గ్రహించిన అవినాష్ రెడ్డి.. ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే.   అలాంటి పరిస్థితుల్లో   అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసి.. తమదైన శైలిలో అటు అవినాష్ రెడ్డి, ఇటు ఆయన తండ్రి వైయస్ భాసరరెడ్డి, ఇంకోవైపు ఈ హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న పాత్రధారులందరినీ విచారించి.. ఈ హత్య కేసు విచారణకు ముగింపు పలికే దిశగా సీబీఐ అడుగులు వేస్తోందనే చర్చ సైతం ఉమ్మడి కడప జిల్లాలో కొన... సాగుతోంది.

మేం నిషేధించలేదు.. వాళ్లే ఎత్తేశారు!

దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న ది కేరళ స్టోరీ చిత్రాన్ని పలు రాష్ట్రాలు ప్రదర్శించనీయకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపిస్తూ నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా తమిళనాడు, బెంగాల్ ప్రభుత్వాలు తమ చిత్రాన్ని నిషేధించడాన్ని వారు సవాల్ చేశారు. అయితే దీనిపై స్పందిస్తూ సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం చేసిన వాదన ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రాన్ని తాము నిషేధించలేదని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ది కేరళ స్టోరీ చిత్రాన్ని తాము తమిళనాడులో నిషేధించలేదని, పేలవ స్పందన కారణంగా థియేటర్లు, మల్టీప్లెక్స్ లు  ఆ సినిమాను ప్రదర్శించకుండా ఎత్తేశాయని స్టాలిన్ సర్కార్ సుప్రీంకోర్టుకు తెలిపింది. సినిమాలో పెద్ద స్టార్లెవరూ లేకపోవడం, పేలవ స్పందన కారణంగా థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదని వెల్లడించింది. బాక్సాఫీస్ కలెక్షన్లు లేకుండా సినిమాను థియేటర్లు మాత్రం ఎలా ఆడిస్తాయని ప్రభుత్వం ప్రశ్నించింది. ది కేరళ స్టోరీ సినిమా విడుదలైన రెండు రోజుల్లో ప్రేక్షకుల స్పందన సరిగా లేకపోవడంతో ఆ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని రాష్ట్రవ్యాప్తంగా థియేటర్ల యజమానులు నిర్ణయించుకుంటే తాము మాత్రం ఏం చేస్తామని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. మల్టీప్లెక్స్ యజమానులు సినిమాపై వచ్చిన విమర్శలు, ప్రముఖ నటులు లేకపోవడంతో కలెక్షన్లు లేక మే 7 నుండి సినిమా ప్రదర్శనను నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. తమిళనాడులో హిందీలో ఈ చిత్రం 19 మల్టీప్లెక్స్‌లలో మే 5న విడుదలైంది. సినిమాను ఉపసంహరించుకోవాలన్న థియేటర్ల యాజమాన్యాల నిర్ణయంపై ఎలాంటి నియంత్రణ లేదని తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. మే 5న సినిమా విడుదలపై ప్రభుత్వం అప్రకటిత నిషేధం విధిస్తోందని ఆరోపిస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ద్వారా చిత్రనిర్మాతలు సినిమాకు ప్రచారం కోసం ప్రయత్నిస్తున్నారని స్టాలిన్ సర్కార్ ఆరోపించింది. తద్వారా సుప్రీంకోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించింది. తమిళనాడు ప్రభుత్వం సినిమాని నిషేధించిందన్న ఆరోపణకు మద్దతుగా నిర్మాతలు ఒక్క చిన్న రుజువును కూడా సమర్పించలేదని అదనపు డీజీ గుర్తుచేశారు. ది కేరళ స్టోరీ ని విదేశాలలో నిషేధించారు. ఇది ఫేక్ స్టోరీ అని, గొడవలకు దారి తీసేదిగా ఉందంటూ పలు దేశాలు సిన్మాను తమ దేశంలో విడుదల కాకుండా నిషేధించాయి.  ఒక వర్గాన్ని కించపరిచే విధంగా సిన్మా ఉందని.. ఈ సిన్మాతో బీజేపీ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఆ 40 మంది జడ్జీల పదోన్నతులను రద్దు!

గుజరాత్ లో వివాదానికి దారితీసిన దిగువ కోర్టు జడ్జీల పదోన్నతుల వ్యవ హారంలో ఆ రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 68 మంది జడ్జీలకు ఇచ్చిన పదో న్నతుల్లో 40 మంది పదోన్నతులను రద్దు చేసింది. మరో 21 మందికిచ్చిన పదోన్నతులను కొనసాగిస్తూనే వారికి స్థాన చలనం కల్పించింది. ఈ మేరకు రెండు నోటిఫికేషన్లను హైకోర్టు విడుదల చేసింది. మిగిలిన ఏడుగురు న్యాయమూర్తుల విషయాన్ని వెల్లడించలేదు. ఈ నెల 12న జస్టిస్ ఎం.ఆర్.షా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ప్రక్రియపై  స్టే విధించిన నేపథ్యంలో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హరీశ్ హస్ముఖ్ భాయ్ వర్మకు ఇచ్చిన పదోన్నతిని మాత్రం హైకోర్టు కొనసాగించింది. అయితే, తొలుత ఆయనకు రాజ్కోట్ లోని 16వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా పోస్టింగ్ ఇవ్వగా ఇప్పుడు 12వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా నియమించింది. సుప్రీంకోర్టు గుజరాత్ లో వివాదాస్పదమైన దిగువ కోర్టు జడ్జీల పదోన్నతుల వ్యవహారంపై జులైలో విచా రణ జరిపేందుకు అంగీకరించింది. వేసవి సెలవుల తర్వాత ఈ అంశాన్ని చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ పి. ఎస్. నర సింహ, జస్టిస్ జె. బి. పార్దీవాలతో కూడిన ధర్మా సనం తెలిపింది. ప్రతిభ, సీనియారిటీ ఆధారం గానే పదోన్నతి కల్పించా లన్న సర్వీసు నిబంధన లను గుజరాత్ ప్రభుత్వం ఉల్లంఘించిందని పేర్కొంటూ జస్టిస్ ఎం. ఆర్.షా నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 12న జడ్డీల పదోన్నతలుపై స్టే విధించిన సంగతి తెలిసింేద. ప్రమోషన్లు పొందిన వారంతా తమ పాత స్థానాలకు తిరిగి వెళ్లాలని ఆదేశించింది.   జస్టిస్ ఎం.ఆర్. షా ఇటీవలే పదవీ విరమణ చేశారు. అయితే, పదోన్నతుల వ్యవహారంలో తమ తప్పిదమేమీ లేకున్నా అవమానాలకు గురి కావాల్సి వచ్చిందంటూ కొందరు జడ్జీలు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఈ కేసును జులైలో విచారణకు చేపడతామని సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ తెలిపారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రెండేళ్లు శిక్ష విధించిన న్యాయమూర్తికి పదోన్నతి కలిపించడం  ఇప్పటికే వివాదాస్పద అంశంగా మారిన నేపథ్యంలో.. ఆయనకు పదోన్నతి స్తంభన విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలతో పాటు న్యాయస్థానాలు కూడా ప్రభావితం అవుతున్నాయనే విమర్శలు వస్తున్న తరుణంలో... తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలమేర గుజరాత్ హైకోర్టు నిర్ణయం హర్షించదగినదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పరిధిమీరొద్దు.. అనుచిత దూకుడు వద్దు.. ఈడీకి సుప్రీం సూచన

రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న దురుద్దేశంతో పాటు రాజ కీయ ప్రేరేపిత కుట్రలో భాగంగా మనీలాండరింగ్ చట్టాన్ని అడ్డు పెట్టుకుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారంటూ ఛత్తీస్ గఢ్  ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై  సుప్రీంకోర్టు స్పందించింది. భయోత్పాత వాతావరణాన్ని సృష్టించకండి. మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే నిజాయితీగా జరిగిన లావాదేవీలపై కూడా అనుమా నాలు తలెత్తుతాయంటూ జస్టిస్ ఎస్. కె. కౌల్, జస్టిస్ ఎ. అమానుల్లా ధర్మాసనం ఈడీ అధికారులకు సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు విని పిస్తూ.. ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభు త్వాన్ని మద్యం కుంభకోణం కేసులో ఇబ్బందులకు గురిచేయాలనే ఉద్దే శంతో రాష్ట్ర అధికారులపై ఈడీ తీవ్ర ఒత్తిడి తెస్తోందన్నారు. వారి కుటుంబ సభ్యులను కూడా బెదిరించి తాము చెప్పిన విధంగా వాంగ్మూలం ఇవ్వా లంటోందని, దీంతో అధికారులు ఛత్తీస్ గఢ్ ఎక్సైజ్ శాఖలో పనిచేయబోమని ప్రభుత్వానికి చెబుతున్నారని ధర్మాసనానికి విన్నవించారు. అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఈడీ దూకుడు పెంచిందని ఆయన ఆరోపించారు. ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్. వి. రాజు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. 2019-2022 మధ్య కాలంలో మద్యం వ్యాపారంలో రూ.2వేల కోట్ల మేర అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోందని ధర్మాసనానికి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన అధీనంలోని దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తూ బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ప్రభుత్వాలపై కేసులు నమోదు చేయడంతో పాటు వేధింపులకు గురిచేస్తోందని గత నెలలో సుప్రీంకోర్టును ఛత్తీస్ గఢ్    ఆశ్రయించిన సంగతి విదితమే. మనీలాండరింగ్ చట్టంలోని పలు నిబంధనల చెల్లుబాటును ఆ పిటిషన్ లో సవాల్ చేసింది. కేంద్రం కనుసన్నలలో దర్యాప్తు సంస్థలు పని చేస్తున్నాయనీ,  బీజేపీయేతర ప్రభుత్వాలను, ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తూ.. వేధింపులకు గురిచేస్తున్నాయని గత కొంత కాలంగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్య ప్రాధాన్యత సంతరించుకుంది.

ఉత్తరాంద్రలో చంద్రబాబు

వైయస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో తమదైన శైలిలో పోరాడుతోంది. ఆ క్రమంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, బాదుడే బాదుడు తదితర కార్యక్రమాలను చేపట్టింది. ఈ కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్న సంగతి తెలిసిందే.  ఆ క్రమంలో తాజాగా అంటే బుధవారం (మే 17) నుంచి శుక్రవారం (మే19)  వరకు చంద్రబాబు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. అందులోభాగంగా బుధవారం పెందుర్తి.. గురువారం శృంగవరపు కోట.. శుక్రవారం అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొనున్నారు. అలాగే రోడ్ షోలు, బహిరంగ సభల్లో ఆయన పాల్గొని.. ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.   అందుకోసం చంద్రబాబు నాయుడు బుధవారం (మే17) మద్యాహ్నం విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకొంటారు. అక్కడి నుంచి సాయంత్రం పెందుర్తి సమీపంలోని మహిళా ప్రాంగణానికి చేరుకొని పంచ గ్రామాల సమస్యపై వినతి పత్రాలు స్వీకరిస్తారు. అనంతరం రోడ్డ్ షో ప్రారంభమవుతోంది... ఆ క్రమంలో పెందుర్తి జంక్షన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు  ప్రసంగిస్తారు. ఇక గురువారం (మే 18) ఉదయం టిడ్కో ఇళ్ల లబ్దిదారుల నుంచి ఆయన వినతులు స్వీకరించి... ఆ తర్వాత స్థానిక నేతలతో ఆయన సమావేశం అవుతారు. అనంతరం మత్స్యకారులతో భేటీ అవుతారు. ఆ తర్వాత శృంగవరపు కోటకు చంద్రబాబు పయనమై.. అక్కడ రోడ్డు షో నిర్వహించి   స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగిస్తారు.    అలాగే శుక్రవారం (మే 19)  అనకాపల్లిలో నల్లబెల్లం రైతుల నుంచి చంద్రబాబు వినతులు స్వీకరిస్తారు. అనంతంర రోడ్ షో నిర్వహించిన ఆ తర్వాత స్థానిక నెహ్రూ చౌక్‌కు చేరుకొని.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం చంద్రబాబు విశాఖపట్నం నుంచి విజయవాడ చేరుకుంటారు.

నెల్లూరు వైసీపీలో మళ్లీ మొదలైంది!

ఏమిటో... అదేమిటో ఈ అధికార ఫ్యాన్ పార్టీలో బాబాయి.. అబ్బాయిల గోల అలా ఇలా కాదు.. ఓ రేంజ్‌లో ఉందని.. ఇలా అయితే పార్టీ పరిస్థితి గాలిలో దీపంలా తయారవుతోందని అధికార వైసీపీలోని ఓ వర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా నెల్లూరు నగర ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఆయన బాబాయి నెల్లూరు నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మధ్య విబేధాలు తలెత్తి... అవి తార స్థాయికి చేరడం... దీంతో ఈ పంచాయతీ కూడా ముఖ్యమంత్రి  జగన్ వద్దకు చేరడం.. రెండు రోజుల క్రితం ఆ బాబాయి, అబ్బాయిలను.. తన వద్దకు పిలుపించుకొని... ఇద్దరి చేతులు కలిపి... విబేధాలు వదిలేయాలి.. పార్టీ గెలుపు కోసం కష్టపడాలని సూచించినట్లు ఓ టాక్  వైరల్ అవుతోంది.    అయితే నెల్లూరు నగర ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ ఎన్నికైనా..  మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టినా.. నియోజవర్గంలో పార్టీ పరంగా అబ్బాయి అనిల్ తరఫున అన్నీ బాబాయి రూప్ కుమార్ యాదవే చక్కదిద్దే వారని.. కానీ ఆయన నెల్లూరు నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలిచి.. డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆయనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడాన్ని గమనించి.. బాబాయిని దూరంగా ఉంచే ప్రయత్నాలు అబ్బాయి చేశారని.. అయితే తాజాగా రూప్‌కుమార్ కొత్త కార్యాలయం ఏర్పాటు చేసుకొని.. రాజకీయం చేయడంతో... ఈ బాబాయి అబ్బాయిల మధ్య పచ్చ గడ్డి వేయకుండానే భగ్గుమనే పరిస్థితి నెలకొందని పార్టీ వర్గాలే అంటున్నాయి. అంతేకాదు బాబాయితో కలిసేదే లేదు.. కావాలంటే పార్టీకి రాజీనామా చేయడానికైనా సిద్దమని సాక్షాత్తూ అబ్బాయి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించినట్లు ఓ వార్త అయితే అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో పెన్నా నదీ తీర నగరంలో మళ్లీ గోల మొదలనే   చర్చ పార్టీలో జోరందుకుంది.   మరోవైపు ఇప్పటికే నెల్లూరు జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సాగనంపి.. ఆ నియోజకవర్గంలో కొత్త ఇన్ చార్జ్‌లను నియమించి.. పార్టీ పరిస్థితిని స్థానికంగా చక్కదిద్దే కార్యక్రమానికి పార్టీ అధిష్ఠానం శ్రీకారం చుట్టిందని... అంతలోనే మళ్లీ అదే జిల్లాలో మరో పితలాటకం   చోటు చేసుకోవడం చూస్తుంటే.. ఈ సారి జిల్లాలో పార్టీకి గట్టి దెబ్బ తప్పదనే అభిప్రాయాం పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతోంది. ఇంకో వైపు ముఖ్యమంత్రి  జగన్ సొంత బాబాయి  వివేకా హత్య కేసులో అబ్బాయి పాత్రపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఆ క్రమంలో ఇప్పటికే కడప ఎంపీ, సీఎం   జగన్ సోదరుడు  అవినాష్ రెడ్డితోపాటు ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డిలు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారని..  ఇప్పటికే వైయస్ భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసి.. చంచల్‌గూడ జైలుకు తరలించిందని.. అయితే ఈ కేసులో రేపో మాపో కడప ఎంపీ   అవినాష్ రెడ్డిని సైతం సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం ఉందనే అభిప్రాయం బలంగా వ్యక్తమౌతోంది. ఆ తర్వాత ఈ హత్య కేసులో అసలు సిసలు సూత్రధారులు కూడా బయటకు వచ్చే అవకాశాలు లేకపోలేదనే చర్చ సైతం పార్టీ వర్గాల్లోనే నడుస్తోంది. అదీకాక ఎన్నికల సమీపిస్తున్నాయి.ప్రజల్లోకి వెళ్లాల్సిన సమయం అసన్నమైంది. అలాంటి వేళ ఈ బాబాయి అబ్బాయిల గోల.. పార్టీ పుట్టి ముంచే అవకాశాలు మెండుగా ఉన్నాయని... చర్చ   వాడి వేడిగా సాగుతోంది.

వివేకా హత్య కేసులో మళ్లీ అదే వరస

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలక అంశంగా మారిన వివేకా హత్య కేసు నాలుగేళ్లుగా నలభై మలుపులు తిరిగింది. ఇంకా తిరుగుతూనే ఉంది. విచారణ ఏ రాష్ట్రంలో జరగాలి, ఎవరు విచారణాధికారిగా ఉండాలి, ఎప్పుడు ఎవరిని అరెస్టు చేయాలి, ఎవరిని విచారించాలి, ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఎన్నో అంశాలు ఈ కేసులో చోటు చేసుకున్నాయి.   తెలంగాణ హై కోర్టు, సుప్రీం కోర్టులు కలగజేసుకోవాల్సి వచ్చింది.  ఇంత ప్రాముఖ్యత ఉన్న  కేసు ఇటీవలి కాలంలో లేదనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఇంతగా ప్రభావితం చేస్తున్న వివేకా కేసు కర్నాటక ఎన్నికల తరువాత కొత్త కోణం తీసుకోనుందని తెలుస్తోంది. న్యాయస్థానాలు విధించిన గడువు జూన్ 30వ తేదీతో ముగియనుండడంతో సీబీఐ దూకుడు పెంచింది. ఈ సారి విచారణను సమగ్రంగా నిర్వహించేందుకు అదనపు సిబ్బందిని రంగంలోకి దించింది. కడప జిల్లాలో, పులివెందుల పట్టణంలో దాదాపు ప్రతి వ్యక్తిని సీబీఐ పలకరించింది. 2019 మార్చి4 15వ తేదీ జరిగిన వివేకా హత్యపై స్థానికులు అందించిన సమాచారాన్ని సీబీఐ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. వివేకా వాచ్ మెన్ నుండి, అవినాష్ రెడ్డి వ రకూ ఎవరినీ వదలకుండా సాక్ష్యాలు సేకరిస్తోంది.  తాజాగా విచారణకు హాజరు కావాలన్న నోటీసుపై అవినాష్ రెడ్డి వాయిదా కోరడంతో తిరిగిా 19వ తేదీన హాజరు కావాల్సిందిగా తిరిగి నోటీసులు జారీ చేసింది. గతంలో వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ ను సీబీఐ విచారించింది. తాజాగా అవినాష్ విచారణకు గడువు కోరడంతో సీబీఐ మరోసారి సునీత, రాజశేఖర్ లను విచారణకు రావాల్సిందిగా పిలిచింది. వివేకా హత్య కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని విచారించేందుకు కేసుకు  సంబంధించిన ఏ చిన్న క్లూను కూడా సీబీఐ వదలడం లేదనే చెప్పాలి. రాజకీయంగా  అత్యంత ప్రాధాన్యత ఉండటంతో  అవినాష్ ను అరెస్టు చేస్తే జరిగే పరిణామాలను కూడా సీబీఐ పరిశీలిస్తోంది. ఇప్పుడు అవినాష్ ను అరెస్టు చేసేందుకు న్యాయ సంబంధమైన అవరోధాలు లేకపోయినప్పటికీ కేసు ప్రాధాన్యత దృష్ట్యా పకడ్బందీగా వ్యవహరించాలని సీబీఐ భావిస్తోందని తెలుస్తోంది.  ఏది ఏమైనా రానున్న రోజులు అవినాష్ రెడ్డికి కొంత ఇబ్బంది కలిగిస్తాయని కడప వాసులు గుసగుసలాడుకుంటున్నారు. 

రాజమండ్రి@ 49 డిగ్రీల ఉష్ణోగ్రత.. నిప్పుల కొలిమిలా ఏపీ

ఏపీలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. నడి వేసవిలో అకాల వర్షాలతో చల్లబడిన వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. గత నాలుగు రోజులుగా ఏపీ నిప్పుల కుంపటిని తలపిస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. మంగళవారం అయితే ఏపీయా ఎడారా అనిపించేలా ఎండ మండిపోయింది. ముఖ్యంగా రాజమహేంద్రవరంలో అత్యథికంగా 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇటీవలి కాలంలో ఏపీలో ఈ స్థాయిలో ఉష్ట్రగ్రతలు నమోదైన సందర్భం లేదని స్థానికులు చెబుతున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఎండలకు  వడగాల్పులు తోడకావడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలలో 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే  ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, ఎస్ పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 47 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ హీట్ వేవ్ మరో నాలుగు రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. సాధ్యమైనంత వరకూ అత్యవసర పని ఉంటే తప్ప ఎండ సమయంలో బయటకు రావద్దని ప్రజలను హెచ్చరించింది. 

ఇక్కడ స్విచ్.. అక్కడ లైటు!

ఇక్కడ స్విచ్ వేస్తే అక్కడ లైట్ వెలుగుతుందన్నట్లు వివేకా హత్య కేసులో  కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు వస్తే.. జగన్ లో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరుకుంటుంది. అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు రావడానికీ జగన్  ఫ్రస్ట్రేషన్ కీ సంబంధం ఏమిటన్న లాజిక్కులు వెతకడం అనవసరం.  ఎందుకంటే ఆ సంబంధం ఏమిటన్నది గూగుల్  లుక్ ఔట్ ద్వారా సీబీఐ ఎప్పుడో బయటపెట్టేసింది. వివేకా హత్య జరిగిన తరువాత అవినాష్ ఎవరెవరికి ఎన్నెన్ని సార్లు ఫోన్ చేశారన్న విషయాన్ని సీబీఐ తన దర్యాప్తు ద్వారా బట్టబయలు చేసేసింది.  అవినాష్ రెడ్డికి సీబీఐ ఈ ఏడాది జనవరి చివరిలో విచారణకు హాజరు కావాలంటూ తొలి సారి నోటీసులు జారీ చేసినప్పుడు జగన్ తన అధికారిక కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసుకుని తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యారు. అవినాష్ సీబీఐ విచారణకు హాజరు కావడానికి ఒక రోజు ముందు ఆయన సిరికిం చెప్పడు.. అన్న చందంగా హుటాహుటిన హస్తినకేగారు. అర్ధరాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏం మంతనాలు జరిపారన్నది షరామూమూలుగానే ఎవరికీ చెప్పరు. రాష్ట్ర సమస్యలపై చర్చించామని ఫొటో స్టాట్ కాపీలాంటి ప్రకటన ఒకటి సీఎంవో నుంచి విడుదల అవుతుంది. అంతే. అటు నుంచి సానుకూల స్పందన అన్న ముక్తాయింపు యథాప్రకారంగా ఉంటుంది.   సరే అదలా ఉంచితే.. జగన్ పర్యటన తరువాత వివేకా హత్య కేసులో  సీబీఐ దర్యాప్తు వేగం మందగించింది. అంతేనా.. అప్పటి వరకూ వివేకా హత్య కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న రామ్ సింగ్ ను సీబీఐ తప్పించింది. ఆయన స్థానంలో కొత్త దర్యాప్తు అధికారి వచ్చారు. ఇక ఆ తరువాత కూడా అవినాష్ కు మరో మూడు సార్లు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. అవినాష్ ముందస్తు బెయిలు కోసం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అరెస్టు నుంచి రక్షణ పొందారు. అయితే వివేకా కుమార్తె తెలంగాణ హైకోర్టు అవినాష్ కు బెయిలిస్తూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీం కోర్టు తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేసింది. ఆ తరువాత ముందస్తు బెయిలు పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కూడా బెయిలు పిటిషన్ పై తీర్పును వాయిదా వేస్తూ అవినాష్ ను అరెస్టు చేయడానికి ఎటువంటి అడ్డంకులూ లేవనీ, అరెస్టు చేసి విచారించాలనుకుంటూ నిరభ్యంతరంగా ఆ పని చేయవచ్చనీ  విస్పష్టంగా చెప్పింది. దీంతో వివేకా హత్య కేసులో అవినాష్ అరెస్టుకు చట్ట పరంగా ఎటువంటి రక్షణ కవచాలూ లేవు అయినా  సీబీఐ అవినాష్ అరెస్టు దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఇక ఈ మధ్యలో అవినాష్ కు సీబీఐ నుంచి తాఖీదులు వచ్చిన ప్రతిసారీ జగన్ విపక్షాలపై విమర్శల దాడిని తీవ్రం చేయడం అన్నది ఒక ఆనవాయితీగా మారిపోయింది. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగం మందగిస్తే జగన్ మౌనమునిలా మారిపోవడం.. అవినాష్ వైపు సీబీఐ ఒక అడుగు వేస్తే.. జగన్  విపక్షాలపై విమర్శలతో విరుచుకు పడటం ఈ మూడు నెలల కాలంలో ఒక ఆనవాయితీగా మారిపోయింది. తాజాగా అవినాష్ ను విచారణ రావాల్సిందిగా ఆదేశిస్తూ సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల మేరకు మంగళవారం (మే16) అవినాష్ హైదరాబాద్ లోకి సీబీఐ కార్యాలయంలో హాజరు కావాల్సి ఉంది. అయితే అవినాష్ హాజరు కాలేనంటే లేఖ రాస్తే అందుకు సీబీఐ సమ్మతించిందనుకోండి అది వేరే సంగతి. కానీ.. జగన్ అదే రోజు అంటే మంగళవారం (మే16) బాపట్లలోని నిజాంపట్నంలో సీఎం జగన్ వైఎస్సార్‌ మత్స్యాకార భరోసా నిధులను మత్స్యకారుల ఖాతాల్లో జమ చేశారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. అది ప్రభుత్వ కార్యక్రమం అయినా ఆయన దానికి పార్టీ ప్రచార సభగా మార్చేసి విపక్షాల మీద విమర్శల దాడికి ఉపయోగించుకున్నారు. దత్తపుత్రుడు అంటూ పవన్ పై పాత విమర్శనే మళ్లీ కొత్తగా చేశారు. చంద్రబాబు చెప్పిన దానికి తలవూపడడే పవన్ పని అని ఎద్దేవా చేశారు. పొత్తులు, విడిపోవడాలు, విడాకులు అంటూ చాలా చాలా మాటలు మాట్లాడారు. మొత్తంగా అవినాష్ సీబీఐ విచారణ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసమే తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. గతంలో కూడా వివేకా హత్య కేసులో సీబీఐ స్పీడు పెరిగిన ప్రతి సారీ జగన్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ చేరిందని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. 

అవినాష్ కు చెలగాటం.. సీబీఐకి ప్రాణ సంకటం!

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయడం ఆయన వ్యవధి కావాలని కోరడం.. సీబీఐ అవినాష్ కోరినట్లుగా వ్యవధి ఇవ్వడం గత కొన్ని నెలలుగా నిరాటంకంగా సాగుతోంది. ఈ వ్యవహారం మొత్తం పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం అన్న సామెత గుర్తుకు వస్తోంది. అయితే ఇక్కడ పిల్లి అవినాష్ అయితే సీబీఐ ఎలుక అన్నట్లుగా ఉంది.  సీబీఐ నిస్సహాయతను ఆసరాగా చేసుకుని అవినాష్ రెడ్డి ఆ దర్యాప్తు సంస్థతో తన ఇష్టారీతిగా ఆటలాడుకుంటున్నారు. ఈ తతంగం గత  జనవరి నుంచి ప్రారంభమైంది. గత జనవరి నుంచి ఇప్పటి వరకూ సీబీఐ నాలుగు మార్లు అవినాష్ ను విచారించింది. ముందస్తు బెయిలు కోసం అవినాష్ దాఖలు చేసుకున్న పిటిషన్ పై దాఖలు చేసిన కౌంటర్ లో అవినాష్ ను అరెస్టు చేస్తామని విస్పష్టంగా చెప్పింది. కోర్టులు అవినాష్ కు ఇచ్చిన బెయిలు రక్షణను తొలగించేసినా.. కేంద్ర దర్యాప్తు సంస్థ ఆయనను అరెస్టు చేయడానికి ముందుకు రావడం లేదు. తాజాగా  సీబీఐ జారీ చేసిన నోటీసుకు ప్రతిగా అవినాష్ రెడ్డి నాలుగు రోజులు గడువు కావాలంటూ లేఖ రాసి దర్జాగా పులివెందులకు బయలుదేరి వెళ్లిపోయారు. ఆ తరువాత అవినాష్ కోరిన వ్యవధి ఇచ్చేది లేదు.. వెంటనే హాజరు కావాల్సిందేఅంటూ సీబీఐ హుకుం జారీ చేసింది. అంతలో ఏమైందో ఏమో గంట వ్యవధిలోనే అవినాష్ కోరినట్లు నాలుగురోజులు కాకుండా మూడు రోజులు గడువు ఇచ్చి ఈ నెల 19న హాజరు కావాల్సిందిగా మరో నోటీసు ఇచ్చింది.   అసలు సీబీఐ విషయంలో  మొదటి నుంచీ కూడా అవినాష్ రెడ్డి ఆడింది ఆట పాడింది పాటగా నడుస్తోంది. సీబీఐ కార్యాలయంలో విచారణను ఎదుర్కొని బయటక వచ్చి అదే దర్యాప్తు సంస్థపై ఇష్టారీతిన ఆరోపణలు చేసినా సీబీఐకి చీమ కుట్టినట్టు ఉండదు. పార్టీ కార్యక్రమాలు ఉన్నాయి.. మీరు కోరినట్లు విచారణకు హాజరు కావడానికి కుదరదంటూ అవినాష్ పదే పదే విచారణకు హాజరు కాకుండా అవాయిడ్ చేస్తున్నా.. సీబీఐ మాత్రం జీహుజూర్ మీకు కుదిరినప్పుడే రండి అన్నట్లు గడువు ఇస్తూ వస్తోంది.  ఈ వ్యవహారమంతా సీబీఐ ప్రతిష్టను మంటగలపుతోంది, పరువును గంగలో కలిపేస్తోంది. సీబీఐ స్వతంత్రంగా వ్యవహరించడం లేదన్న అనుమానాలకు తావిస్తోంది. ఆ దర్యాప్తు సంస్థ విశ్వసనీయతనే దెబ్బతీస్తోందని పరిశీలకులు అంటున్నారు. 

అయినను వెళ్లి రావలె హస్తినకు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళుతున్నారు. గత పర్యటనలలా ఇదేమీ సిరికిం చెప్పడు అన్నట్లుగా హఠాత్తుగా, రహస్యంగా ఖరారు చేసుకున్న పర్యటన కాదు.  ఈ నెల 27న జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన హస్తిన వెళుతున్నారు. అయితే ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే.. స్వకార్యం కాకపోతే ఆయన ప్రపంచం తల్లకిందులైనా తాడేపల్లి ప్యాలెస్ దాటి అడుగు బయటపెట్టరు.  గత నీతి ఆయోగ్ సమావేశాలకు జగన్  హాజరు కాలేదు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెళ్లే వారు. కానీ ఈ సారి మాత్రం జగన్ స్వయంగా ఆ సమావేశానికి హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ సమావేశానికి హాజరు కావడానికి 27వ తేదీ ఉదయం ప్రత్యేక విమానం ఎక్కినా సరిపోతుంది. కాకుంటే 26 రాత్రి బయలు దేరినా సరిపోతుంది. కానీ జగన్ మాత్రం 26వ తేదీ ఉదయానికే హస్తినలో వాలిపోతున్నారు. ఆయన పర్యటనకు నీతి ఆయోగ్ సమావేశం ఒక సాకు మాత్రమేననీ, అంతకు మించిన రాచకార్యం ఏదో వెలగబెట్టేందుకే ఆయన బగ్గనను పక్కన పెట్టి మరీ హస్తిన ప్రయాణం పెట్టుకున్నారనీ అంటున్నారు. కర్నాటక ఎన్నికల ఫలితం తరువాత బీజేపీ అగ్రనాయకత్వం జగన్ కి గతంలోలా  అండగా నిలిచే అవకాశాలు దాదాపు మృగ్యం అని బీజేపీ వర్గాలే చెబుతున్నాయి. అయిననూ వెళ్లి రావలె హస్తినకు అన్నట్లుగా జగన్ ఏదో విధంగా బీజేపీ అగ్రనాయకత్వాన్ని ప్రసన్నం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నారని అంటున్నారు.  జగన్ అధికార పగ్గాలు చేపట్టి నాలుగేళ్లయ్యింది. ఈ నాలుగేళ్లలో పలుమార్లు హస్తిన వెళ్లారు. కేంద్రంలోని పెద్దలందరినీ కలిశారు. కానీ అలా కలిసిన ఏ సారీ కూడా రాష్ట్ర ప్రయోజనాలు, విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీసిన దాఖలాలు లేవు.  ఆయన హస్తిన యాత్రలన్నీ పూర్తిగా వ్యక్తిగత అజెండాతోనే సాగాయన్న విమర్శలు ఉన్నాయి.  ఇక ఇప్పుడు ఎన్నికల ఏడాది.  ప్రభుత్వంపై రాష్ట్రంలో సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమౌతోంది. అన్ని వర్గాలూ ప్రభుత్వ తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు ఆందోళన బాటలో ఉన్నారు. వైసీపీ గడపగడపకు, మా నమ్మకం నువ్వే జగన్ వంటి కార్యక్రమాల సందర్భంగా ప్రజల ముందుకు వెళ్లిన ప్రజా ప్రతినిథులకు వారి నుంచి నిరసనలు వ్యక్తమౌతున్నాయి. ఎమ్మెల్యేలూ, మంత్రులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో తెలియడానికి ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడుకు మూడు స్థానాలనూ తెలుగుదేశం కైవశం చేసుకుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటంతో  వైసీపీ గెలుపొందింది. ఆ తరువాత ఓ నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుండి సస్పెండ్ చేసి చర్యలు తీసుకున్నామని వైసీసీ చెప్పుకుంది కానీ, అసంతృప్త ఎమ్మెల్యేల సంఖ్య పదుల సంఖ్యలోనే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణలను పక్కన పెడితే స్వయంగా వైసీపీ నాయకులే అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉందని అంగీకరిస్తున్నారు. గతంలోలా ప్రభుత్వంలో పార్టీలో జగన్ మాటే శాసనం అన్న పరిస్థితి కనిపించడం లేదు. గతంలో ఉన్న ధీ మా ఇప్పుడు సీఎం జగన్ లో ఏ మాత్రం కనిపించడం లేదు.  గతంలోలా పార్టీ ఎమ్మెల్యేలు జగన్ ఏది చెబితే దానికి జీహుజూర్ అనే పరిస్థితి కూడా పూర్తిగా మారిపోయింది. జగన్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో భేటీలో అసంతృప్తులను బుజ్జగించడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. వైనాట్ 175 అన్నజగన్  ఇప్పుడు అధికారంలోకి వస్తే చాలన్నట్లుగా మాట్లాడుతున్నారు. విపక్షం అధికారంలోకి వస్తే సంక్షేమం ఆగిపోతుందంటే ప్రజలను బ్లాక్ మెయిల్ చేయడానికి సైతం వెనుకాడటం లేదు. ఎన్ని చేసిన ప్రజా వ్యతిరేక పవనాల ఉధృతి రోజు రోజుకూ పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తుండటంతో ఇక నాలుగేళ్లుగా ఎన్నడూ రాష్ట్ర ప్రయోజనాల గురించి పట్టించుకోని, విభజన హామీల గురించి కేంద్రాన్ని నిలదీయని జగన్ ఇప్పుడు నీతి ఆయోగ్ సమావేశం పేరుతో హస్తిన యాత్ర పెట్టుకుని.. అదీ ఒక రోజు ముందు ఢిల్లీలో వాలి.. ప్రధాని, మోడీలను కలిసి విభజన హామీలపై ఏదో ఒక ప్రకటన చేయమని బతిమాలుకునే అవకాశం ఉందన్నది పరిశీలకుల విశ్లేషణ. అలా ఏమైనా  ప్రకటన చేయించుకుంటే.. అది ఎన్నికల ప్రచారంలో బ్రహ్మాండం బద్దలు కొట్టేశామని ప్రచారం చేసుకోవడానికి ఉపయోగిస్తుందన్నది జగన్ భావనగా చెబుతున్నారు. ఎందుకంటే.. నాలుగేళ్ల పాలనలో ఇది సాధించాం అని చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడం తో ఏం చెప్పి ఓట్లు అడగాలన్న ఇబ్బందిని అధిగమించడానికి ఇదే మార్గంగా  వైసీపీ అధినేత భావిస్తున్నారని అంటున్నారు. ఇక  వివేకా హత్య కేసులో అవినాష్ ను సీబీఐ మరోసారి విచారణకు పిలిచింది. వాస్తవానికి ఆయన ఈ రోజు విచారణకు హాజరు కావాల్సి ఉండగా ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం ఉన్న కార్యక్రమాల కారణంగా రాలేనని లేఖ రాసి నాలుగు రోజులు వ్యవధి కోరారు. జగన్ హస్తిన వెళ్లే వరకూ ఆయన వాయిదాల మీద వాయిదాలు కోరే అవకాశం ఉందనీ, అరెస్టును తప్పించుకోవడానికి ఆయన పూర్తిగా జగన్ మీదే ఆధారపడ్డారనీ అంటున్నారు.  గత జనవరిలో కూడా వివేకా హత్య కేసులో అవినాష్ కు సీబీఐ సమన్లు జారీ చేయగానే జగన్ హస్తిన వెళ్లి వచ్చారు. ఆ తరువాత ఈ కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు తగ్గింది. కర్నాటక ఎన్నికల ఫలితం వెలువడిన రెండో రోజునే సీబీఐ అవినాష్ కు మరోసారి నోటీసులు జారీ చేసింది. మళ్లీ జగన్ హస్తిన పర్యటన పెట్టుకున్నారు. ఈ సారి ఏం జరుగుతుందో చూడాల్సిందే మరి అంటున్నారు పరిశీలకులు.  

మాకు హెల్త్ టీచరే కావాలి: చిక్ మగళూరు ప్రజలు

 పేరు ప్రదీప్ ఈశ్వర్.. కర్ణాటకలో చిక్ మగళూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున విజయం సాధించారు.. అతనికి తల్లి లేదు.తండ్రి లేదు.కుటుంబం లేదు.. ఫైనాన్షియల్ గా  జీరో..వృత్తి రీత్యా హెల్త్ టీచర్.. బీజేపీ ఒకానొక సమయాన అతన్ని బాగా ఇబ్బంది పెట్టింది..దాదాపు 20 కేసులు పెట్టి జైల్లో పెట్టింది.అప్పుడు కాంగ్రెస్ నాయకులు సిద్ధరామయ్య గారు సపోర్ట్ చేసి బయటకి తీసుకురావడంలో ప్రత్యేక పాత్ర పోషించాడు.. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానని, తనకు సీటు కావాలని అడిగాడు.. రాహుల్ గాంధీ ఒక్క క్షణం అతని వైపు చూస్తూ, పార్టీ నాయకత్వంతో మాట్లాడాడు అతనికి సీటు వచ్చింది.. అటు సైడ్ బీజేపీ తరుపు నిలబడింది కర్ణాటక హెల్త్ మినిస్టర్.. పేరు డాక్టర్ సుధాకర్ రెడ్డి..ఇద్దరిది కూడ ఒక్కటే గ్రామం.ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి..ఎంతోమందిని సిని నటులను ప్రచారాన్ని కూడా పిలిపించుకున్నాడు.. అందులో మన బ్రహ్మానందం గారు కూడా ఒకరు..ఒక ఓటుకి 2000 రూపాయలు పంచారు అయినప్పటికీ చిక్ మగళూరు ప్రజలకు సుధాకర్ ని ఓడించి ఉపాద్యాయుడు అయిన ప్రదీప్ ఈశ్వరుని గెలిపించుకున్నారు కారణం ప్రదీప్ ను అక్రమంగా జైలుకు పంపించడమే బిజెపి చేసిన అతిపెద్ద తప్పు.. ప్రదీప్ ఈశ్వర్ ఒక రూపాయి కూడా పంచలేదు.. చిక్ మగళూరు   ప్రజలు హెల్త్ మినిస్టర్ కావాలా,హెల్త్ టీచర్ కావాలా అంటే హెల్త్ టీచరే కావాలి అన్నారు  చిక్ మగళూరు ప్రజలు.. కర్ణాటకలో సామాన్య వ్యక్తులను సైతం ఎమ్మెల్యే చేయాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని నిరూపించారు..

అమ్మ భువనేశ్వరి!

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్బంగా ఆయన తల్లి భువనేశ్వరి సోమవారం కుమారుడితో అడుగు కలిపి నడిచారు. అంతకు ముందు  రోజు మాతృ దినోత్సవం సందర్భంగా  ఆదివారం లోకేష్ క్యాంప్ సైట్ వద్ద లోకేష్ తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. కుమారుడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.   అంతే కాకుండా పాదయాత్రలో లోకేష్‌కు  వెన్నుదన్నుగా నిలుస్తున్న యువగళం దళాన్ని భువనేశ్వరి పేరుపేరునా పలకరించి, వారికి కృతజ్ఞతలు చెప్పారు.  భోజన విరామ సమయంలో భువనేశ్వరి యువదళం సభ్యులకు స్వయంగా వడ్డించారు. ఆ సందర్భంగా  లోకేష్ పాదయాత్రలో పాల్గొనేందుకు నెలల తరబడి కుటుంబాలను విడిచి  రావడం ఎంతో గొప్ప విషయమనీ,  మీకూ, మిమ్మల్ని పంపించినందుకు మీ కుటుంబాలకు కృతజ్ఞతలు అంటూ ఉద్వేగంగా మాట్లాడారు.  మీ ప్రేమ లోకేష్‌కు ఉండాలి. మీ సేవలు అమూల్యం. మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్ధం కావడం లేదు. ఇంతమంది అభిమానులను సంపాదించుకున్నందుకు లోకేష్ అదృష్టవంతుడని పేర్కొన్నారు.  సహజంగా ఎప్పుడూ తెరపైకి రాని భువనేశ్వరి, తన కుమారుడు లోకేష్ పాదయాత్ర వందరోజుల సందర్భంగా బయటకు వచ్చి, పాదయాత్రలో పాల్గొని, వాలంటీర్లు, లోకేష్ బృందానికి స్వయంగా భోజనం వడ్డించడం అందరినీ ఆకర్షించింది.  

ఓడలు బళ్లయ్యాయా?..

ఒకే ఒక్క ఫలితం దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తోందా?  బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటిపైకి వచ్చేందుకు కర్నాటక ఫలితం దోహదం చేసిందా? మరీ ముఖ్యంగా ఏ మాత్రం స్టేక్ లేని ఏపీలో  నిన్న మొన్నటి వరకూ అంతా మేమే, అన్నీ మేమే అన్నట్లుగా వ్యవహరించిన బీజేపీ ఇప్పుడు అంతా మీరే, అన్నీ మీరే అన్నట్లుగా తెలుగుదేశంవైపు జాలి చూపులు చూస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న ధీమాతో.. దర్యాప్తు సంస్థలు చేతిలో ఉన్నాయన్న ధైర్యంతో తెలుగుదేశం పార్టీని అన్ని విధాలుగా ఇరుకున పెట్టేందుకు విశ్వయత్నం చేసిన బీజేపీ ఇప్పుడు త్వమేవ శరణం నాస్తి అన్నట్లుగా కాపాడాలంటూ బేల మాటలు మాట్లాడుతోందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. నిన్న మొన్నటి వరకూ తెలంగాణలో అధికారం ఖాయం.. ఏపీలో మేం సహకరిస్తేనే తెలుగుదేశం పార్టీకి అధికారం అన్న ధోరణితో వ్యవహరించిన బీజేపీ ఇప్పుడు తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలంటే తెలుగుదేశం సహకారం అనివార్యం అన్న పరిస్థితిలో పడింది. అలాగే కేంద్రంలో మోడీ నాయకత్వంలో ముచ్చటగా మూడో సారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే.. దక్షిణాది నుంచి కొన్ని పార్లమెంటు స్థానాలు తప్పని సరిగా గెలుచుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించింది. అందుకే ఏపీలో తెలుగుదేశంతో పొత్తు కోసం తహతహలాడుతోంది. నిన్న  మొన్నటి వరకూ తెలంగాణలో ఎవరి మద్దతు అవసరం లేదు..ఒంటరిగానే వంద స్థానాల్లో  గెలుస్తామంటూ విర్రవీగిన బీజేపీ.. ఇప్పుడు తెలంగాణలో అధికారం దక్కాలంటే.. ఆ రాష్ట్రంలో  బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మద్దతు అవసరం అని భావిస్తోంది. తెలంగాణలో సహకారం అందిస్తే.. ఏపీలో అండగా ఉంటామని నేరుగా కాకపోయినా ప్రతిపాదనలు పంపుతోంది. అయితే ఏపీలో తెలుగుదేశం పార్టీకి బీజేపీ మద్దతు అవసరమా? అన్న ప్రశ్నకు మాత్రం ఆ పార్టీ నేతల వద్ద సమాధానం లేకుండా పోయింది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ బీజేపీకి తెలుగుదేశం మద్దతు, ఆసరా అవసరమని ఆ పార్టీ హైకమాండ్ గుర్తించింది. అందుకే నేరుగా కాకపోయినా పరోక్షంగానైనా తెలుగుదేశంతో పొత్తు విషయాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నామంటూ ఫీలర్స్ పంపుతోంది. సార్వత్రిక ఎన్నికల ముందు కర్నాటక లో తగిలిన ఎదురు దెబ్బ బీజేపీ ఆత్మ విశ్వాసాన్ని గట్టిగానే దెబ్బతీసిందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అంతే కాకుండా.. వరుస పరాజయాలతో డీలా పడిన కాంగ్రెస్ కు కర్నాటక విజయం ఒక జీవన్ టోన్ టానిక్ లా పని చేస్తోందని అంటున్నారు. బీజేపీయేతర పార్టీలన్నీ కాంగ్రెస్ నాయకత్వంలో  ఐక్యంగా వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలన్న దిశగా అడుగులు వేస్తున్నాయి. దేశంలోని ప్రాంతీయ పార్టీలను కబలించడమే ధ్యేయంగా గత ఎనిమిదేళ్లుగా సాగిన బీజేపీ మనుగడ ఇప్పుడు ఆ ప్రాంతీయ పార్టీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన పరిస్థితి వచ్చింది. 

తెలుగుదేశంతో పొత్తు.. ఇప్పుడు బీజేపీ అవసరం!

కర్నాటక పరాజయంతో బీజేపీకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందని పరిశీలకుల విశ్లేషణ. అందుకే  ఏపీలో ఆ పార్టీ కొత్త పల్లవి అందుకుంది. తెలుగుదేశంతో కలిసి ఎన్నికల బరిలోకి దిగాలన్న తమ మిత్రుడు పవన్ కల్యాణ్ ప్రతిపాదనను హైకమాండ్ పరిశీలిస్తోందంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు బీజేపీ ఏపీ నాయకులు. మరీ ముఖ్యంగా ఇంత కాలం బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీతో అంటకాగుతోందన్న అభిప్రాయం బలంగా ఏర్పడేందుకు దోహదపడిన జీవీఎస్ నరసింహం, సోము వీర్రాజులే కొత్త పల్లవి అందుకున్నారు. కర్నాటకలో బీజేపీ పరాజయానికి ముందు వరకూ వీరి వాణి, బాణి ఇలా లేదు. కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలతో పొత్తుకు నో అంటూ వచ్చారు.  కర్నాటకలో బీజేపీ ఘోర పరాజయంతో వారికి వాస్తవం తెలిసి వచ్చి తెలుగుదేశం పార్టీతో పొత్తు గురించి మాట్లాడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసలు వాస్తవం ఏమిటంటే.. ఏపీలో బీజేపీతో పొత్తు ఇటు తెలుగుదేశంకైనా అటు జనసేనకైనా తెల్ల ఏనుగు లాంటిదే. ఒక గుది బండ లాంటిదే. పొత్తులో భాగంగా ఆ పార్టీకి రెండో మూడో సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. బీజేపీకి రాష్ట్రంలో  కనీసం ఒక శాతం ఓటు స్టేక్ కూడా లేని పరిస్థితుల్లో ఆ పార్టీకి ఒక సీటు కేటాయించడం కూడా  జనసేన, తెలుగుదేశం పార్టీలకు ఏ మంత ప్రయోజనం చేకూర్చే అంశం కాదు. అయినా కేంద్రంలో అధికారంలో ఉందన్న ఒకే ఒక కారణంతో ఆ పార్టీని జట్టులో చేర్చుకున్నా.. ముందుగా బీజేపీ రాష్ట్రంలో వైసీపీతో అంటకాగడం లేదన్న విషయాన్ని నిరూపించుకోవలసి ఉంటుంది. నేరుగా చెప్పకపోయినా తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు ఆ మాట అనేశారు. వైసీపీతో బీజేపీ అంటకాగుతోందన్న మాట మేం అనడం లేదు.. జనం అంటున్నారు అన్న అచ్చెన్నాయుడు, బీజేపీ వైసీపీకి దగ్గరగా ఉందన్న భావన జనంలోంచి పోగొట్టుకోవలసి బాధ్యత బీజేపీదే అని కూడా అన్నారు. వాస్తవానికి రాష్ట్రంలో జనం దృష్టిలో బీజేపీ పలుచన కావడానికి ఉన్న కారణాలలో వైసీపీ అక్రమాలు, అన్యాయాలు, అస్తవ్యస్త నిర్ణయాలు ఇలాఅన్నిటికీ, అన్ని విధాలుగా కేంద్రంలోని మోడీ సర్కార్ సహాయ సహకారాలు అందిస్తోందన్న భావన జనంలో ఏర్పడటానికి తమ పార్టీ తీరే కారణమన్న బాధ ఏపీ బీజేపీలోని ఒక వర్గంలో  బలంగా ఉంది. అందుకే పలు సందర్బాలలో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదులు కూడా చేసింది. అయినా అధిష్ఠానం వైఖరిలో మార్పు రాకపోవడంతో కొందరు బహిరంగంగానే పార్టీ హైకమాండ్ తీరును విమర్శిస్తుంటే.. కన్నా వంటి వారు ఏకంగా పార్టీకి గుడ్ బై చెప్పేసి  తమ దారి తాము చూసుకున్నారు. తాజాగా విష్ణుకుమార్ రాజు ఒక చానెల్ తో మాట్లాడుతూ పార్టీ తీరును ఎలాంటి శషబిషలూ లేకుండా ఎండగట్టి.. హై కమాండ్ నుంచి నోటీసులు కూడా అందుకున్నారు. పార్టికీ రాష్ట్రంలో బలం లేదన్న విషయం అందరికీ తెలిసినా, నిన్న మొన్నటి వరకూ సైద్ధాంతిక నిబద్ధత ఉన్న పార్టీగా ప్రజలలో ఏదో మేరకు కొద్ది పాటి గౌరవమైనా ఉండేది. కానీ జగన్ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్ర బీజేపీ తీరుతో జనంలో ఆ కొద్ది పాటి గౌరవం కూడా సన్నగిల్లింది. సైద్ధాంతిక నిబద్ధతను బీజేపీ రాష్ట్ర నాయకత్వం గాలికొదిలేసిందనీ.. జగన్ భజనలో తరించి సొంత లాభం కొంత చూసుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ అడ్డగోలు రుణాలకు కేంద్రం నిబంధనలకు తిలోదకాలిచ్చేసి మరీ పచ్చజెండా ఊపడం, అలాగే వైసీపీ సర్కార్ రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా తీసుకుంటున్న చర్యలకు వత్తాసు పలకడం వంటి చర్యలతో కేంద్రంలోని మోడీ సర్కార్  జగన్ కు అండగా నిలుస్తోందన్నది జనం అభిప్రాయం. జనం ఇంతగా వ్యతిరేకిస్తున్న జగన్ సర్కార్ భుజాన మోస్తున్నదని జనం భావిస్తుంటే.. అటువంటి బీజేపీతో పొత్తుకు తెలుగుదేశం పార్టీ  ఏలా ముందుకు వస్తుందన్నది ఆ పార్టీ నాయకులు అంటున్న మాట. జగన్ ప్రభుత్వంపై తమకు ఎలాంటి ప్రత్యేక ప్రేమ, అపేక్ష లేదని ప్రజలకు అర్దమయ్యేలా బీజేపీ ఇప్పటికైనా చర్యలకు ఉపక్రమిస్తే.. అప్పుడు పొత్తు విషయం ఆలోచిస్తామని తెలుగుదేశం నాయకులు పరోక్షంగానైనా విస్పష్టంగా చెబుతున్నారు. బీజేపీ వైసీపీతో అంటకాగుతోందన్నది ప్రజాభిప్రాయం అని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అనడం వెనుక అర్దం అదేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం, జనసేనతో కలవాలన్నది బీజేపీ ఛాయిస్ గా ఎంత మాత్రం  లేదు. ఆ పార్టీకి నెససిటీ అంటే అవసరం. బీజేపీని కలుపుకోవాలా వద్దా అన్నది తెలుగుదేశం ఛాయిస్. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రంలోని మోడీ సర్కార్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలూ అందడం లేదనీ, అందవని నిర్ధారణ అయ్యేలా బీజేపీ తీరు మారడాన్ని బట్టే ఆ పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకోవాలా వద్దా అన్న విషయంలో తెలుగుదేశం నిర్ణయం ఉంటుందని అంటున్నారు. 

ఒంగోలుపై బాలినేని పట్టు!?

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వచ్చే ఎన్నికల్లో తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. ప్రకాశం జిల్లాపై పట్టు కోసం వైవీ సుబ్బారెడ్డి, బాలినేని మధ్య పోరు నడుస్తున్న సంగతి విదితమే. ఇటీవలి కాలంలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలకు వైవీ సుబ్బారెడ్డి కారణమనే అనుమానం కూడా బాలినేనిలో ఉంది. ఆ అభిప్రాయాన్నీ, అనుమానాన్నీ బాలినేని ఏమీ దాచుకోవడం లేదు. కొద్ది రోజుల కిందట ప్రాంతీయ కన్వీనర్ పదవికి బాలినేని రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో పార్టీ బాధ్యతలు నిర్వహించలేకపోతున్నానని, సొంత జిల్లా బాధ్యత అప్పగించాలని ముఖ్యమంత్రిని కోరినా,  జగన్  అందుకు సుతరామూ అంగీకరించలేదు. పార్టీలో అందరికీ ఒకటే నిబంధన ఉంటుందని తేల్చేశారు. ఇక చేసేది ఏమీ లేక..బాలినేని మిన్నకుండిపోయారు. బాలినేని పార్టీ పదవికి రాజీనామా చేసిన తర్వాత పరిణామాల నేపథ్యంలో వైసీపీ సానుభూతిపరుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో బాలినేనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ట్రోల్స్ నడిచాయి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో బాలినేని ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ కూడా తెరపైకి వచ్చింది. ప్రకాశం జిల్లా నుంచి పోటీ చేయడానికి ముఖ్యమంత్రి చిన్నాన్న, ఉత్తరాంధ్ర ఇన్ చార్జి వైవీసుబ్బారెడ్డి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. వైవీ పార్లమెంటుకు పోటీ చేస్తారా అసెంబ్లీకి పోటీ చేస్తారా అనే విషయంలో ఇప్పటి వరకూ అయితే క్లారిటీ లేదు. 2019లో వైవీ సుబ్బారెడ్డికి టిక్కెట్ దక్కకపోవడంతో రెండు విడతల్లో టీటీడీ ఛైర్మన్  పదవిని ఇచ్చి జగన్ కాంపన్ సేట్ చేశారు. ఆయన ఎమ్మెల్సీ పదవిని, మంత్రి వర్గంలో చోటును ఆశించినా సిఎం మాత్రం దానిని నెరవేర్చలేదు. అయితే ఇటీవలి కాలంలో మాత్రం  వైవీ సుబ్బారెడ్డి మాట జగన్ వద్ద చెల్లుబాటు అవుతోందని అంటున్నారు.  ఈ నేపథ్యంలోనే ఒంగోలు నుంచి బాలినేనికి బదులుగా వైవీకి వైసీపీ టికెట్ దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే బాలినేని ఒంగోలు నుంచే తాను పోటీ అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా, బాలినేని వైసీపీలో కొనసాగుతారా అన్న చర్చకు తెరతీసింది.  అంతే కాకుండా నేరుగా సీఎంపైనే విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రడ్డి బటన్ నొక్కి ప్రజలకు మేలు చేస్తున్నారని, అదే సమయంలో నాయకులు కార్యకర్తలను పట్టించుకోవడం లేదనే అసంతృప్తి ఉందని బాలినేని అన్నారు. ఈ వైఖరిని జగన్ మార్చుకోకపోతే గడ్డు పరిస్థితులను ఎదుర్కొనాల్సి వస్తుందనడంలో సందేహం లేదని బాలినేని కుండబద్దలు కొట్టేశారు.  వారిని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇక ఒంగోలు నుంచే తన పోటీపై మరింత స్పష్టత ఇచ్చారు. తనకు రాజకీయంగా జీవితావన్ని ఇచ్చిన ఒంగోలును వదిలిపెట్టే ప్రశ్నేలేదని కుండబద్దలు కొట్టేశారు.   తనను నమ్ముకున్న వారిని, తమ పార్టీ అధినేత  జగన్ ను తప్ప ఎవరినీ లెక్క చేయనని పరోక్షంగా ప్రత్యర్థుల గట్టి హెచ్చరిక చేశారు.  మార్కాపురం, గిద్దలూరు, దర్శి లలో ఏదో ఓ చోటు నుంచి పోటీలో ఉంటానంటూ ఇటీవల వస్తున్న ప్రచారాన్ని బాలినేకి కొట్టి పారేశారు.  సొంత పార్టీలోని వారే ఇటువంటి  ప్రచారాన్ని చేస్తున్నారనీ, తనకు వ్యతిరేకంగా  కుట్రలు చేసి ఇబ్బంది పెడుతున్నారనీ బాలినేని చెప్పారు.  అటువంటి వారిని లెక్క చేయాల్సిన అవసరం లేదనిపించిందని కార్యకర్తలు తనను ఇప్పటికి అయిదుసార్లు గెలిపించారని వారి రుణం తీర్చుకుంటానని వ్యాఖ్యానించారు.  ఇలా ఉండగా పార్టీలో తనకు వ్యతిరేకంగా కొందరు కుట్ర చేస్తున్నారంటూ బాలినేని చేసిన వ్యాఖ్యలు టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డిని ఉద్దేశించి చేసినవేనని వైసీపీ శ్రేణులు బాహాటంగానే చెబుతున్నాయి. ఒంగోలు నంచి పోటీ చేస్తాననంటూ బాలినేని చేసిన వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి  స్పందన ఎలా ఉంటుందనే  దానిపై అందరూ ఆసక్తి తో చూస్తున్నారు.