రైతుకు బంధువేనా?
posted on May 11, 2023 @ 3:29PM
‘రైతు బంధుకు నేటితో ఐదేళ్లు.. సీఎం కేసీఆర్ ఆలోచనతో ప్రారంభించిన రైతు బంధు వివాదాస్పదమైంది. కౌలు రైతులకు రైతుబంధు వర్తించకపోవడం వివాదానికి కారణమైంది. ఎకరాకు ఏడాదికి 10 వేల చొప్పున ఇప్పటి వరకు 10 విడతలలో 65 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాలలో జమ చేసి, అద్భుతమైన రైతు సంక్షేమ పథకంగా దేశానికి రోల్ మోడల్ అయ్యిందని బీఆర్ ఎస్ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి.
అందుకే సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలు, ఎత్తుకున్న జాతీయ నినాదం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేసాయి అని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.
‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ అంటూ బీఆర్ఎస్ ను స్వాగతిస్తున్నాయి’… అంటూ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
అయితే కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తోన్న పీఎం కిసాన్ పథకంతో సంబంధం లేకుండా రైతుబంధు పథకాన్ని రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తోంది. కాగా, రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ఎకరానికి 5 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేస్తోంది. ఖరీఫ్,రబీ సీజన్ లకు ఎకరానికి 5 వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి పదివేల రూపాయలను పెట్టుబడిగా ఇస్తోంది. ఈ మొత్తాన్ని రైతులకు చెక్కుల రూపంలో అందజేస్తున్నారు.
రైతుబంధుకు వచ్చిన ఆదరణ చూసి జాతీయ స్థాయిలో ఈ స్కీం అమలు చేయడానికి బిజేపీ ప్రభుత్వం ఆలోచన చేసి పిఎం కిసాన్ స్కీం అమల్లోకి తెచ్చింది.
తెలంగాణ వ్యాప్తంగా 10 విడతలుగా చెల్లించిన రూ.65,000 కోట్లరూపాయలతో 70 లక్షల మంది రైతులు లబ్ది పొందారు.
రైతులు వడ్డీ వ్యాపారులపై ఆధారపడకుండా విముక్తి చేయడం ఈ పథక ముఖ్య ఉద్దేశ్యం.
ఫిబ్రవరి 25, 2018న ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన రైతు సమన్వయ సమితి సదస్సులో ముఖ్యమంత్రి కెసీఆర్ ఈ పథకాన్ని ప్రకటించారు. కరీంనగర్‌లోని ధర్మరాజ్‌పల్లి గ్రామంలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించే ముందు అదే సంవత్సరం బడ్జెట్‌లో రూ.12,000 కోట్ల రూపాయలను రైతుబంధు కోసం కేటాయించారు.
తెలంగాణా రాష్ట్రంలో రైతుబంధుకు స్పందన బాగా ఉండటంతో ను రైతు బంధు, జాతీయ స్థాయిలో బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే తరహాలో ఆలోచించేలా చేసింది. కేంద్రం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ పిఎంకిసాన్ యోజన ప్రారంభించారు. ఒడిశాలోని బిజెడి ప్రభుత్వం కాలియా పథకం రైతు బంధు నుండి ప్రేరణ పొందినవే.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఈ పథకం కింద ఇప్పటివరకు 10 విడతలుగా సహాయం అందించింది. ఈ ఏడాది యాసంగిలో 63.97 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చింది. 144.35 లక్షల ఎకరాలకు రూ.7,217.54 కోట్లు విడుదల చేసింది. అంతేకాకుండా ఈ పథకం దేశంలోని రైతు సంక్షేమం కోసం ప్రకటించిన టాప్ 20 పథకాలలో ఒకటిగా నిలిచింది. ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ చే ప్రశంసించబడింది.
రైతుబంధు పథకం తెలంగాణ వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. వ్యవసాయరంగ రూపురేఖల్ని మార్చేసింది. రైతుబంధుతో రైతుల్లో భరోసా పెరిగింది. పెట్టుబడి నష్టమనే భావన లేకుండా రైతులు ధైర్యంగా వ్యవసాయం చేస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల ఉచిత విద్యుత్తు, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా వంటి కార్యక్రమాలతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. తద్వారా 2014-15లో 1.31 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైతే, 2022-23లో ఇది 2.09 కోట్ల ఎకరాలకు పెరిగింది. ధాన్యం ఉత్పత్తిలో 15వ స్థానం రెండో స్థానానికి ఎగబాకింది.