కేసీఆర్ పై రాములమ్మ ఫైర్
posted on May 12, 2023 @ 11:21AM
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మరోసారి ఫైర్ అయ్యారు సీనియర్ బిజేపీ నేత విజయశాంతి. పూర్వాశ్రమంలో బీఆర్ఎస్ లో కేసీఆర్ వెంటే ఉన్న విజయశాంతి అదే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తో విభేధించి బయటకొచ్చారు. తల్లి తెలంగాణా పార్టీ స్థాపించి అప్పట్లో క్రియాశీల రాజకీయాల్లో చురుకు పాల్గొన్నారు. తర్వాత బిజేపీ సిద్దాంతాలకు ఆకర్షితులై ఆ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లో దూసుకొచ్చిన రాములమ్మ ఈ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ను ఓడించాలని కంకణం కట్టుకున్నట్టు కనబడుతోంది.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరుద్యోగ మార్చ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు విజయశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ ది అంతా దోపిడీ రాబడి అంటూ ఆరోపించారు. కేసీఆర్ మనసు క్రూరమైనదంటూ విమర్శించారు.
కేసీఆర్ ఎగ్జామ్ పేపర్లన్నీ అమ్ముకుంటున్నారని.. కేసీఆర్ నీకు సిగ్గుందా.. నిరుద్యోగులు ఉసురు పోసుకున్నాడంటూ ఆరోపించారు. నీ కూతురు లిక్కర్ స్కామ్.. నీ కొడుకు పేపర్ లీక్ వీరుడు.. నువ్ దేశంలో ప్రతిపక్షాలకు డబ్బులు ఇస్తున్నావ్.. అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు విజయశాంతి. బండి సంజయ్ ని అక్రమంగా జైలులో పెట్టారన్నారు. మనుగోడులో డబ్బు, మద్యంతో గెలిచారని దుయ్యబట్టారు.
ఒక్కో ఓటుకు రూ.5 వేలు ఇచ్చారని ఆరోపించారు. సచివాలయం ఆయన కోసమే కట్టారంటూ ఎద్దేవా చేశారు విజయశాంతి. ప్రతిపక్షాలకు అందులో అనుమతి లేదట అంటూ సెటైర్లు వేశారు. రూ.400 కోట్ల నుంచి రూ.1600 కోట్లకి సచివాలయం వ్యయం పెరిగిందన్నారు. 1200 కోట్లు ఎవరి ఇంట్లో నుంచి తెచ్చి కట్టారన్నారు. 6 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి.. నిర్ణయం మీదే రాములక్క చెప్పిన నిజాలు గమనించాలన్నారు.
ఆరు నెల్లోల కేసీఆర్ ని గద్దె దింపాలని సూచించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడు పార్టీలు తోడు దొంగలే అన్నారు. ఉమ్మడి మెదక్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాగా నొక్కుతున్నారని దుయ్యబట్టారు విజయశాంతి.
ప్రస్తుతం విజయశాంతి లోకసభ నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారు. మాజీ మెదక్ లోకసభ సభ్యురాలిగా పని చేసిన విజయశాంతికి బిజెపి నుంచి టికెట్ కన్ఫమ్ అయినట్లేనని తెలుస్తోంది. ప్రస్తుతం బిఆర్ఎస్ ఎంపీ ఈ నియోజకవర్గం నుంచి కొత్త కోట ప్రకాశ్ రెడ్డి ఉన్నారు. ఆయన దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నేపథ్యంలో విజయశాంతికి పోటీ మీద బిఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. విజయశాంతిని ఓడించడానికి బలమైన అభ్యర్థి కోసం బీఆర్ఎస్ కేసీఆర్ వెతుకుతున్నారు.