కర్నాటక ఫలితాలపైనే కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణ
posted on May 12, 2023 @ 2:50PM
కర్నాటక ఎన్నికల ఫలితాలు వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఒక లిట్మస్ టెస్టుగా దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ భావిస్తున్నాయి. ఇందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ భావనలో కూడా మినహాయింపు లేదు. అందుకే కర్నాటకలో బీజేపీ సర్కార్ పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకతను గుర్తించిన కమలం పార్టీ సున్నత అంశాలను హైలైట్ చేస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో విజయం కోసం సర్వ శక్తులనూ ఓడ్డింది. పోలింగ్ పూర్తై ప్రజా తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. శనివారం (మే13) ఫలితాలు వెలువడుతాయి.
ఈ నేపథ్యంలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో ఏ మాత్రం సంబంధం లేని బీఆర్ఎస్ ఈ రాష్ట్ర ఫలితాలపై ఎనలేని ఆసక్తి చూపుతోంది. జాతీయ రాజకీయాలలో తన ప్రస్థానం ఎలా సాగించాలన్న దానికి ఈ ఫలితాలను గీటురాయిగా బీఆర్ఎస్ తీసుకుంటోంది. కర్నాటకలో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య హోరాహోరీగా పోరు జరిగిందన్న అంచనాల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న పార్టీ కొద్ది నెలలో ఎన్నికలు జరగనున్న తెలంగాణలో మరింత ఉత్సాహంతో దూసుకు వెళుతుంది. అప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ గట్టిగా ఎదుర్కొనవలసిన పార్టీ కూడా అదే అవుతుంది.
ఆ ఉద్దేశంతోనే కర్నాటక ఫలితాలపై బీఆర్ఎస్ అధినేత అమిత ఆసక్తి చూపుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా ఒక వేళ కర్నాటకలో హంగ్ అంటూ ఏర్పడితే.. అప్పుడు ఆ రాష్ట్రంలో ఎన్నికలలో పాల్గొనకపోయినా చక్రం తిప్పే అవకాశం దొరుకుతుందని కేసీఆర్ భావిస్తున్నారనీ, జేడీఎస్ ద్వారా కర్నాటక రాజకీయాలలో తానే కింగ్ మేకర్ గా అవతరించే అవకాశం లభిస్తుందన్నది కేసీఆర్ భావన.
అదే జరిగితే బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలలో మరింత ప్రభావమంతంగా వ్యవహరించేందుకు గట్టి పునాది ఏర్పడినట్లేనని కేసీఆర్ అంచనాగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ జాతీయ రాజకీయాలు సహా తెలంగాణలో మరో మారు అధికారాన్ని చేజిక్కించుకునేలా భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి కూడా కర్నాటక ఫలితాలు ఒక గ్రౌండ్ ను ప్రిపేర్ చేస్తాయని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు.