బీజేపీ కోర్టులో బంతి!
posted on May 12, 2023 @ 11:23AM
రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది నానుడి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మారుతున్న రాజకీయ సమీకరణాలు ఆ నానుడికి అద్దం పట్టేవిగానే ఉన్నాయి. నాలుగేళ్ల కిందట మైత్రీ బంధాన్ని తెంచుకున్న తెలుగుదేశం, జనసేనలు మళ్లీ దగ్గరయ్యాయి? ఏపీలో తెలుగుదేశంతో జనసేన మైత్రి విషయంలో నిన్న మొన్నటి దాకా ఉన్న అనుమానాలూ, సందేహాలను పవన్ కల్యాణ్ పటాపంచలు చేసేశారు.
అంతే కాదు.. తన మిత్రపక్షమైన బీజేపీని కూడా తమతో అడుగులు వేసేలా ఒప్పించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నానని కూడా చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ పొత్తుల విషయంలో క్లారిటీ యిచ్చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వబోమన్నతన మాటకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. అలాగే ఈ విషయంలో తనతో కలిసి రావాలని బీజేపీని కోరేందుకే ఢిల్లీ వెళ్లానని కూడా స్పష్టం చేశారు. బీజేపీతో జనసేన అధికారిక పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. తాము టీడీపీతో వెళ్తామని బీజేపీని కూడా కలిసి రావాలని కోరుతున్నానని కూడా పవన్ విస్పష్టంగా చెప్పారు.
ఓ వైపు పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి టీడీపీతో కలిసి పని చేయాలనే సంకేతాలు ఇవ్వడం.. మరో వైపు చంద్రబాబు కూడా రిపబ్లిక్ టీవీ చానల్‌తో మాట్లాడుతూ ..మోదీకి పూర్తి మద్దతు ప్రకటించడంతో ఏపీలో బీజేపీని కూడా తమతో కలుపుకునేందుకు యిటు తెలుగుదేశం, అటు జనసేనా కూడా ప్రయత్నాలు చేస్తున్నాయని తేటతెల్లమైపోయింది.
నిజానికి చంద్రబాబు ఎన్డీఏలో చేరుతారని గత ఏడాది నుంచి ప్రచారం జరుగుతోంది. రెండు సార్లు ఢిల్లీలో చంద్రబాబు మోదీని కలిశారు. ఇప్పుడు పవన్ ప్రకటనతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. పవన్ కల్యాణ్.. కలిసి వస్తే రావాలి లేకపోతే వైసీపీ విముక్త ఏపీ కోసం టీడీపీతో వెళ్తామని తేల్చేయడంతో యిక యిప్పుడు ఎటు వైపు వెళ్లాలన్న విషయంలో బంతి బీజేపీ కోర్టులోనే ఉంది. రాష్ట్రంలో కనీసంలో కనీసం ఒక్క శాతం ఓటు షేరు కూడా లేని బీజేపీ.. ఏం నిర్ణయించుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.